Pages

Monday, February 4, 2013

శ్రీ సాయి సత్ చరిత్రము నలుబదియవ అధ్యాయము


ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

నలుబదియవ అధ్యాయము

బాబా కథలు

1. దేవుగారి యింటిలో ఉద్యాపనకు బాబా సన్యాసి వేషముతో మరి యిద్దరిని తోడ్కోని పోవుట. 2. హేమాడ్ పంతు ఇంటికి ఫోటో రూపములో పోవుట.

ఈ యధ్యాయములో రెండు కథలు చెప్పుదుము. 1. దహనులో బి.వి. దేవుగారింటికి వారి తల్లి యాచరించిన ఉద్యాపనపత్రమునకు బాబా వెళ్ళుట. 2. బాంద్రాలోని హేమాడ్ పంతు ఇంటికి హోళీ పండుగనాడు భోజనమునుకు పోవుట.

తొలిపలుకు

శ్రీ సాయిసమర్ధుడు, పావనమూర్తి. తన భక్తుల కిహపర విషయములందు తగిన సలహాల నిచ్చి జీవితపరమావధిని పొందునట్లు చేసి వారిని సంతోషపెట్టును. సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి తమ శక్తులను వారిలోనికి పంపించి భేదభావమును నశింపజేసి, అప్రాప్యమును ప్రాప్తింపజేయును. వారు తమ భక్తులయెడ భేదము లేక నమస్కరించిన వారిని కౌగిలించుకొనువారు. వర్షాకాలములో నదులు కలియు సముద్రమువలె బాబా భక్తులతో కలసి తమ శక్తిని స్థాయిని శిష్యులకిచ్చును. దీనినిబట్టి, యెవరయితే భగవద్ భక్తుల లీలలను పాడెదరో వారు భగవంతుని లీలలను పాడిన వారికంటెగాని, యంతకంటె యెక్కువ గాని దేవుని ప్రేమకు పాత్రులగుదురని తెలియవలెను. ఇక ఈ అధ్యాయములోని కథల వైపు మరలుదుము.

దేవుగారింట ఉద్యాపనపత్రము

దహనులో బి.వి. దేవుగారు మామలతదారుగా నుండెను. వారి తల్లి 25, 90 నోములు నోచెను. వాని ఉద్యాపన చేయవలసి యుండెను. ఈ కార్యములో 100, 200 బ్రాహ్మణులకు భోజనము పెట్టవలసి యుండెను. ఈ శుభకార్యమునకు ముహూర్తము నిశ్చయమయ్యెను. దేవుగారు బాపు సాహెబుజోగ్ గారికి కొక లేఖ వ్రాసిరి. అందులో బాబా ఈ శుభకార్యమునకు దయచేయ వలయుననియు, వారు రాకున్నచో అసంతృప్తికరముగా నుండుననియు వ్రాసెను. జోగ్ ఆ యుత్తరము చదివి బాబాకు వినిపించెను. మనః పూర్వకమయిన విజ్ఞాపనను విని బాబా యిట్లనియె. “నన్నే గురుతుంచుకొను వారిని నేను మరువను. నాకు బండిగాని, టాంగాగాని, రైలుగాని, విమానముగాని యవసరములేదు. నన్ను ప్రేమతో బిలచువారియొద్దకు నేను పరుగెత్తిపోయి ప్రత్యక్ష్యమయ్యెదను. అతనికి సంతోషమయిన జవాబు వ్రాయుము. నీవు, నేను, ఇంకొకరు సంతర్పణకు వచ్చెదమని వ్రాయుము.” జోగ్ బాబా చెప్పినది దేవుకు వ్రాసెను. దేవుగా రెంతో సంతసించిరి. కాని బాబా రాహాతా, రుయి, నీమగాం దాటి ప్రత్యక్షముగా ఎక్కడికి పోరని ఆయనకు తెలియును. బాబాకు అశక్యమైన దేమియు లేదు. వారు సర్వాంతర్యామి యగుటచే హఠాత్తుగా నేరూపమున నయిన వచ్చి, తమ వాగ్ధానమును పాలించ వచ్చు ననుకొనెను.

ఉద్యాపనకు కొద్దిరోజులు ముందుగా, బెంగాలీ దుస్తులను ధరించిన సన్యాసి యొకడు గోసంరక్షణకయి సేవచేయుచు దహను స్టేషన్ మాస్టరు వద్దకు చందాలు వసూలుచేయు మిషతో వచ్చెను. స్టేషన్ మాస్టరు, ఊరి లోనికి పోయి మామలతదారుని కలిసికొని వారి సహాయముతో చందాలు వసూలు చేయుమనెను. అంతలో మామలతదారే యచ్చటికి వచ్చెను. స్టేషను మాస్టరు సన్యాసిని దేవుగారికి పరిచయమొనర్చెను. ఇద్దరు ప్లాట్ ఫారమ్ మీద కూర్చుండి మాట్లాడిరి. దేవు, ఊరిలో నేదో మరొక చందాపట్టి రావుసాహెబు నరోత్తమ శెట్టి నడుపుచుండుటచే, నింకొకటి యిప్పుడే తయారుచేయుట బాగుండదని చెప్పి 2 లేదా 4 మాసముల పిమ్మట రమ్మనెను. ఈ మాటలు విని సన్యాసి యచటనుండి పోయెను. ఒకనెల పిమ్మట యా సన్యాసి యొక టాంగాలో వచ్చి, 10 గంటలకు దేవుగారి యింటిముందర ఆగెను. చందాల కొరకు వచ్చెనేమోయని దేవు అనుకొనెను. ఉద్యాపనకు కావలసిన పనులలో దేవుగారు నిమగ్నులై యుండుట జూచి, తాను చందాలకొరకు రాలేదనియు భోజనమునకై వచ్చితిననియు సన్యాసి చెప్పెను. అందుకు దేవు “మంచిది; చాల మంచిది, మీకు స్వాగతము. ఈ గృహము మీదే” యనెను. అప్పుడు సన్యాసి “ఇద్దరు కుర్రవాళ్ళు నాతో నున్నారు.” యనెను. దేవు: “మంచిదే, వారితో కూడ రండు,” అనెను. ఇంకా రెండుగంటల కాలపరిమితి యుండుటచే, వారికొరకు ఎచ్చటికి పంపవలెనని యడిగెను. సన్యాసి ఎవరిని బంపనవసరము లేదనియు తామే స్వయముగా వచ్చెదమనియు చెప్పెను. సరిగా 12 గంటలకు రమ్మని దేవు చెప్పెను. సరిగా 12 గంటలకు ముగ్గురు వచ్చి సంతర్పణలో భోజనము చేసిన పిమ్మట వెడలిపోయిరి. 

ఉద్యాపన పూర్తికాగానే దేవుగారు బాపుసాహెబు జోగుకు ఉత్తరము వ్రాసెను. అందులో బాబా తన మాట తప్పెనని వ్రాసెను. జోగు ఉత్తరము తీసికొని బాబావద్దకు వెళ్ళెను. దానిని తెరువక మునుపే బాబా యిట్లనెను. “హా! వాగ్దానము చేసి, దగా చేసితిననుచున్నాడు. ఇద్దరితో కూడ నేను సంతర్పణకు హాజరయితిని, కాని నన్ను పోల్చుకొనలేకపోయెనని వ్రాయుము. అట్టివాడు నన్ను పిలువనేల? సన్యాసి చందాల కొరకు వచ్చెనని యనుకొనెను. అతని సంశయమును తొలగించుటకే మరిద్దరితో వచ్చెదనంటిని. ముగ్గురు సరిగా భోజనము వేళకు వచ్చి యారగించలేదా? నామాట నిలబెట్టుకొనుటకు ప్రాణములనైన విడిచెదను. నామాటలను నేనెప్పుడు పొల్లు చేయను.” ఈ జవాబు జోగ్ హృదయంలో నానందము కలుగ జేసెను. బాబా సమాధానమంతయు దేవుగారికి వ్రాసెను. దానిని చదువగనే దేవుకు ఆనందబాష్పములు దొరలెను. అనవసరముగా బాబాను నిందించినందులకు పశ్చాత్తాపపడెను. సన్యాసి మొదటిరాకచే తానెట్లు మోసపోయెనో; సన్యాసి చందాలకు వచ్చుట, మరిద్దరితో కలసి భోజనమునకు వచ్చెదనను అతని మాటలు తాను గ్రహింపలేక మోసపోవుట – మొదలైనవి అతనికి ఆశ్చర్యము కలుగజేసెను.

భక్తులు పూర్ణముగా సద్గురువును శరణు వేడినచో, వారు తమ భక్తుల యిండ్లలో శుభకార్యములను సవ్యముగా నెరవేరునట్లు జూచెదరు అనునది యీ కథవల్ల స్పష్టపడుచున్నది.

హేమాడ్ పంతు ఇంట హోళీపండుగ భోజనము

ఇక బాబా తన ఫోటో రూపమున సాక్షాత్కరించి భక్తుని కోరిక నెరవేర్చిన మరొక కథను చెప్పెదము.

1917వ సంవత్సరము హోళీ పండుగనాడు వేకువజామున హేమాడ్ పంతు కొక దృశ్యము కనిపించెను. చక్కని దుస్తులు ధరించిన సన్యాసివలె బాబా గాన్పించి, నిద్రనుండి లేపి ఆనాడు భోజనమునకు వారింటికి వచ్చెదనని చెప్పెను. ఇట్లు తనను నిద్రనుండి లేపినది కూడ కలలోని భాగమే. నిజముగా లేచి చూచుసరికి సన్యాసిగాని, బాబా గాని కనిపించలేదు. స్వప్నమును బాగుగా గుర్తుకు దెచ్చుకొనగా సన్యాసి చెప్పిన ప్రతిమాట జ్ఞాపకమునకు వచ్చెను. బాబాగారి సహవాసము ఏడు సంవత్సరములనుండి యున్నప్పటికి, బాబా ధ్యానము నెల్లప్పుడు చేయుచున్నప్పటికి, బాబా తన యింటికి వచ్చి భోజనము చేయునని అతడనుకొనలేదు. బాబా మాటలకు మిగుల సంతసించి తన భార్యవద్దకు బోయి ఒకసన్యాసి భోజనమునకు వచ్చును గాన, కొంచెము బియ్యము ఎక్కువ పోయవలెనని చెప్పెను. ఆది హోళీ పండుగదినము. వచ్చువారెవరని, ఎక్కడనుండి వచ్చుచున్నారని యామె యడిగెను. ఆమె ననవసరముగా పెడదారి పట్టించక ఆమె యింకొక విధముగా భావింపకుండునట్లు, జరిగినది జరిగినట్లుగా చెప్ప నెంచి, తాను గాంచిన స్వప్నమును తెలియజేసెను. షిరిడీలో మంచి మంచి పిండివంటలను విడిచి బాబా తనవంటివా రింటికి బాంద్రాకు వచ్చునాయని, యామెకు సంశయము కలిగెను. అందులకు హేమాడ్ పంతు బాబా స్వయముగా రాకపోవచ్చు, కాని ఎవరినైన బంపవచ్చును కనుక కొంచెము బియ్యము ఎక్కువ పోసినచో నష్టము లేదనెను.

మధ్యాహ్నభోజనమునకై ప్రయత్నము లన్నియు చేసిరి. మిట్టమధ్యాహ్నమునకు సర్వము సిద్ధమయ్యెను. హోళీ పూజ ముగిసెను. విస్తళ్ళు వేసిరి. ముగ్గులు పెట్టిరి. భోజనమునకు రెండు పంక్తులు తీర్చిరి, రెండింటిమధ్య నొక పీట బాబాకొరకమర్చిరి, గృహములోని వారందరు కొడుకులు, మనుమలు, కొమార్తెలు, అల్లుళ్ళు మొదలగువారందరు వచ్చి వారి వారి స్థలముల నలంకరించిరి. వండిన పదార్థములు వడ్డించిరి. అందరు అతిథికొరకు కనిపెట్టుకొనియుండిరి. 12 గంటలు దాటినప్పటికి ఎవరు రాలేదు. తలుపు వేసి గొండ్లెము పెట్టిరి. అన్నశుద్ధి యయ్యెను, అనగా నెయ్యి వడ్డించిరి. భోజనము ప్రారంభించుట కిది యొక గుర్తు; అగ్నిహోత్రునకు శ్రీకృష్ణునకు నైవేద్యము సమర్పించిరి. అందరు భోజనము ప్రారంభింపబోవుచుండగా, మేడ మెట్లపై చప్పుడు వినిపించెను. హేమాడ్ పంతు వెంటనే పోయి తలుపుతీయగా ఇద్దరు మనుష్యులచట నుండిరి. 1. అలీమహమ్మద్, 2. మౌలానా ఇస్ముముజాఫర్. ఆ యిరువురు, వడ్డన మంతయు పూర్తియై అందరును భోజనము చేయుటకు సిద్ధముగా నుండుటను గమనించి హేమాడ్ పంతును క్షమించుమని కోరియిట్లు చెప్పిరి. “భోజన స్థలము విడిచిపెట్టి మా వద్దకు పరుగెత్తుకొని వచ్చితివి. తక్కినవారు నీ కొరకు చూచుచున్నారు. కావున, ఇదిగో నీ వస్తువును నీవు తీసుకొనుము. తరువాత తీరుబడిగా వృత్తాంతమంతయు దెలిపెదము.” అట్లనుచు తమ చంకలోనుంచి ఒక పాత వార్తాపత్రికలో కట్టిన పటమును విప్పి టేబిల్ పైన బెట్టిరి. హేమాడ్ పంతు కాగితము విప్పి చూచుసరికి అందులో పెద్దది యగు చక్కని సాయిబాబా పటముండెను. అతడు మిగుల ఆశ్చర్యపడెను. అతని మనస్సు కరగెను, కండ్లనుండి నీరు కారెను, శరీరము గగుర్పాటు చెందెను. అతడు వంగి పటములోనున్న బాబా పాదములకు నమస్కరించెను. బాబా యీ విధముగా తన లీలచే ఆశీర్వదించెనని యనుకొనెను. గొప్ప యాసక్తితో నీకా పటమెట్లు వచ్చెనని అలీమహమ్మద్ ను అడిగెను. అతడా పటమొక యంగడిలో కొంటిననియు, దానికి సంబంధించిన వివరము లన్నియు తరువాత తెలియజేసెద ననెను. తక్కిన వారు భోజనమునకు కనిపెట్టుకొని యుండుటచే త్వరగా పొమ్మని యనెను. హేమాడ్ పంతు వారికి అభినందనలు తెల్పి భోజనశాలలోనికి బోయెను. ఆ పటము బాబా కొరకు వేసిన పీటపయి బెట్టి వండిన పదార్థములన్నియు వడ్డించి, నైవేద్యము పెట్టినపిమ్మట అందరు భుజించి, సకాలమున పూర్తి చేసిరి. పటములో నున్న బాబా యొక్క చక్కని రూపును జూచి యందరు అమితానందభరితు లయిరి. ఇదంతయు నెట్లు జరిగెనని యాశ్చర్యపడిరి.

ఈ విధముగా బాబా హేమాడ్ పంతుకు స్వప్నములో జెప్పినమాటలను నెరవేర్చి తన వాగ్దానమును పాలించుకొనెను. ఆ ఫోటో వివరములు అనగా నది అలీమహమ్మదు కెట్లుదొరికెను? అత డెందుకు తెచ్చెను? దానిని హేమాడ్ పంతు కెందు కిచ్చెను? అనునవి వచ్చే అధ్యాయములో చెప్పుకొందుము.
ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
నలుబదియవ అధ్యాయము సంపూర్ణము.

।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు। 

శ్రీ సాయి సత్ చరిత్రము ముప్పదితొమ్మిదవ అధ్యాయము


ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

ముప్పదితొమ్మిదవ అధ్యాయము

బాబాగారి సంస్కృత పరిజ్ఞానము

1. భగవద్గీత శ్లోకమునకు బాబాగారి యర్ధము. 2. మహాసమాధి మందిర నిర్మాణము

ఈ యధ్యాయములో భగవద్గీతయందుగల ఒక శ్లోకమునకు బాబా చెప్పిన యర్ధమున్నది. కొందరు బాబాకు సంస్కృతము తెలియదనియు అది నానాసాహెబు చాందోర్కర్ యనువారిదనియు ననుటచే హేమాడ్ పంతు 50వ అధ్యాయములో ఈ సంగతిని విశదీకరించెను. రెండధ్యాయములలోను నొకే విషయ ముండుటచే రెండును నిందులో పొందుపరచనైనవి.

తొలిపలుకు

షిరిడీ పవిత్రమైనది, ద్వారకామాయి గూడ పావనమైనదే. ఏలన శ్రీసాయి యచటనే నివసించుచు, తిరుగుచు, మసలుచు తుదకు అక్కడనే మహాసమాధి పొందిరి. షిరిడీ గ్రామప్రజలు ధన్యులు. వారి సర్వకార్యములను బాబా నెరవేర్చుచుండెను. వారికొరకే చాలాదూరము నుండి యచటకు వచ్చెను. మొదట షిరిడీ చాల చిన్నగ్రామము, సాయిబాబా యచట నివసించుటచే దానికి గొప్ప ప్రాముఖ్యము వచ్చెను. తుదకది పవిత్రమైన యాత్రాస్థల మాయెను. అచటనుండు స్త్రీలుకూడ ధన్యులు. బాబాయందు వారిభక్తి నిస్సంశయముగా పరిపూర్ణమైనది. బాబా మహిమను వారు స్నానము చేయునప్పుడు, విసరునప్పుడు, రుబ్బునప్పుడు, ధాన్యము దంచునప్పుడు, తదితర గృహకృత్యములు చేయునప్పుడు పాడుచుండెడివారు. అవి పాడిన వారికి, విన్న వారికి మనశ్శాంతి కలుగజేయుచుండెను.

బాబా చెప్పిన యర్థము

బాబాకు సంస్కృతము వచ్చునని నమ్మువారుండరు. ఒకనాడు భగవద్గీతలోని ఒక శ్లోకమునకు బాబా చక్కని యర్థమును నానా సాహెబు చాందోర్కరుకు బోధించి ఆశ్చర్యము కలుగజేసెను. ఈ విషయమును గూర్చి బి.వి.దేవుగారు (శ్రీ సాయి లీల సంపుటి 4, పుట 563 – స్ఫుట విషయ) వ్రాసినారు. వారు స్వయముగా నానాసాహెబు చాందోర్కర్ వద్దనుంచి కొన్ని సంగతులు తేలిసికొనుటచే ఆ వృత్తాంతము ఈ దిగువ నివ్వబడెను.

నానాసాహెబు చాందోర్కర్ వేదాంతమును బాగా చదివినవారు. ఆయన భగవద్గీతను వివిధవ్యాఖ్యానములతో చదివియున్నందున తన పాండిత్యమునకు గర్వించుచుండెను. బాబాకీ విషయముగాని, సంస్కృతముగాని తెలియదని ఆయన అభిప్రాయము. అందుచే ఒకనాడు బాబా యతని గర్వమణచెను. ఆ తొలిరోజులలో భక్తులు గుంపులుగుంపులుగా రానప్పుడు బాబా భక్తుల సంశయముల దీర్చుటకు నొంటరిగా వారితో మసీదులో మాట్లాడుచుండెను. బాబా దగ్గర నానా కూర్చొని వారి కాళ్ళనొత్తుచు నోటిలో ఏదో గొణుగుకొనుచుండెను.

బాబా : నానా ! యేమి గొణుగుచున్నావు?
నానా : సంస్కృత శ్లోకమును వల్లించుచున్నాను.
బాబా : ఏ శ్లోకము?
నానా : భగవద్గీతలోనిది.
బాబా : గట్టిగా చదువుము.
నానా : (భగవద్గీత 4వ అధ్యాయము, 34వ శ్లోకము ఈ క్రింది విధముగా చదివెను.)
“తద్వద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన స్తత్త్వదర్శినః”
బాబా : నానా! అది నీకు బోధపడినదా?
నానా : అవును.
బాబా : నీకు తెలిసినచో నాకు చెప్పుము.
నానా : దాని తాత్పర్యమిది. సాష్టాంగనమస్కారము చేయుట అనగా పాదములపై బడుట, గురుని ప్రశ్నించుట, వారి సేవచేయుట ద్వారా ఈ జ్ఞానమును తెలిసికొనెదము. అప్పుడు మోక్షమును పొందు జ్ఞానముగలవారు అనగా, పరబ్రహ్మమును దెలిసినవారు ఆ జ్ఞానము నుపదేశించెదరు.
బాబా : నానా! శ్లోకముయొక్క తాత్పర్యమక్కరలేదు. ప్రతిపదార్థము వ్యాకరణము, మరియు దాని యర్థము చెప్పుము.

అప్పుడు నానా ప్రతి పదమున కర్థము చెప్పెను.

బాబా : నానా! ఉత్త సాష్టాంగనమస్కారము చేసినచో చాలునా?
నానా : ప్రణిపాత యను పదమున కింకొక యర్థము నాకు తెలియదు. ప్రణిపాత యనగా సాష్టాంగనమస్కారమని నాకు తెలియును.
బాబా : పరిప్రశ్న యనగా నేమి?
నానా : ప్రశ్నించుట.
బాబా : ప్రశ్న యనగా నేమి?
నానా : అదే, అనగా ప్రశ్నించుట.
బాబా : పరిప్రశ్న యన్నను ప్రశ్న యన్నను ఒక్కటే యయినచో, వ్యాసుడు ‘పరి’ యను ప్రత్యయమును ప్రశ్నకు ముందేల యుపయోగించెను? వ్యాసుడు తెలివి తక్కువవాడా?
నానా : పరిప్రశ్న యను మాటకు నా కితరయర్థ మేమియు తెలియదు
బాబా : సేవ యనగా నెట్టిది?
నానా : ప్రతిరోజు మేము చేయుచున్నట్టిది.
బాబా : అట్టి సేవ చేసిన చాలునా?
నానా : సేవ యను పదమున కింకను వేరే యర్థమేమి గలదో నాకు తోచుట లేదు.
బాబా : రెండవ పంక్తిలోని “ఉపదేక్ష్యంతి తే జ్ఞానం” అను దానిలో జ్ఞానమను పదముపయోగించకుండ యింకొకపదము ఉపయోగించ గలవా?
నానా : అవును.
బాబా : ఏ పదము
నానా : అజ్ఞానము.
బాబా : జ్ఞానమునకు బదులు అజ్ఞానము ఉపయోగించినచో, ఈ శ్లోకములో నేమైనా అర్థము గలదా?
నానా : లేదు. శంకరభాష్యమావిధముగా చెప్పుట లేదు.
బాబా : వారు చెప్పనిచో పోనిమ్ము. అజ్ఞానము అనుపదము నుపయోగించిన యెడల తగిన యర్థము వచ్చునప్పుడు దాని నుపయోగించుట కేమైన ఆక్షేపణ కలదా?
నానా : అజ్ఞానమను పదమును చేర్చి దాని యర్థమును విశదపరచుట నాకు తెలియదు.
బాబా : కృష్ణుడు అర్జునుని జ్ఞానులకు తత్వదర్శులకు నమస్కారము, ప్రశ్నించుట, సేవ చేయుమని చెప్పనేల? స్వయముగా కృష్ణుడు తత్త్వదర్శికాడా? వారు నిజముగా జ్ఞానమూర్తియే కదా!
నానా : అవును, అతడు తత్వదర్శియే, కాని అర్జును నితర జ్ఞానుల నేల సేవించుమనెనో నాకు తోచుటలేదు.
బాబా : నీకిది బోధపడలేదా?

నానా సిగ్గుపడెను. అతని గర్వమణగెను. అప్పుడు బాబా ఇట్లు వ్యాఖ్యానించెను.

1. జ్ఞానులముందు ఉత్త సాష్టాంగము చేసినచో సరిపోదు. మనము సద్గురువునకు సర్వస్యశరణాగతి చేయవలెను.

2. ఊరక ప్రశ్నించుట చాలదు. దుర్బుద్ధితో గాని, దొంగయెత్తుతో గాని, వారిని బుట్టలో వేయుటకుగాని, వారి తప్పులను పట్టుటకు గాని, పనికిమాలిన యాసక్తితో యడుగకూడదు. నిజముగా తెలిసి దానిచే మోక్షము పొందుటకుగాని, ఆధ్యాత్మికాభివృద్ధికిగాని యడుగవలెను.

3. సేవ యనగా ఇష్టమున్నచో చేయవచ్చును లేనిచో మానవచ్చుననే యభిప్రాయముతో చేయునది సేవకాదు. శరీరము తనదికాదనియు, దానికి తాను యజమాని కాదనియు, శరీరము గురువుగారి దనియు, వారిసేవకొరకే శరీరమున్నదనియు భావింపవలెను. ఇట్లు చేసినచో సద్గురువు శ్లోకములో చెప్పబడిన జ్ఞానము బోధించును.

గురు వజ్ఞానమును బోధించుననగా, నానాకు అర్థముకాలేదు.

బాబా: జ్ఞానము ఉపదేశ మెట్లగును? అనగా సాక్షాత్కారము బోధించుట యెట్లు? అజ్ఞానమును నశింపజేయుటయే జ్ఞానము.

జ్ఞానేశ్వరమహారాజు ఇట్లు చెప్పియున్నారు. ‘అజ్ఞానమును తొలగించుట ఇట్లు. ఓ అర్జునా! స్వప్నము, నిద్ర తొలగిపోయినచో మిగులునది నీవుగా గ్రహింపుము. జ్ఞానమనగా నజ్ఞానమును నశింప జేయుటయే. చీకటిని తరుముటయే వెలుతురు. ద్వైతమును నశింపజేయుటయే అద్వైతము. ద్వైతమును నశింపజేసెద మనగా, అద్వైతమును గూర్చిచెప్పుట. చీకటిని నశింపజేసెద మనినచో, వెలుతురు గూర్చి చెప్పుట. అద్వైతమును పొందవలెననినచో, ద్వైతమను భావమును మనసులోనుంచి తీసివేయవలెను. అదియే అద్వైతమును పొందుజ్ఞానము. ద్వైతములోనే యుండి అద్వైతముగూర్చి మాట్లాడగలవారెవ్వరు? ఎవరైన నట్లు చేసినచో నా స్థితిలోనికి వారు రానిదే వారికి అది యెట్లుతెలియును? దాని నెట్లు పొందెదరు? శిష్యుడు గురువువలె జ్ఞానమూర్తియే. వీరిద్దరికి భేదమేమనగా గ్రహించు తీరు, గొప్ప సాక్షాత్కారము, ఆశ్చర్యకరమైన మానవాతీత సత్యము, మహాశక్తిమత్వము, మరియు ఐశ్వర్యయోగము. సద్గురువు నిర్గుణుడు, సత్చిదానందుడు. వారు మానవాకారమున నవతరించుట, మానవులను లేవనెత్తుటకును ప్రపంచము నుద్ధరించుటకు మాత్రమే. దాని వలన వారి యసలయిన నిర్గునస్వభావము కొంచెము గూడ చెడిపోదు. వారి సత్యస్వరూపము, దైవికశక్తి, జ్ఞానము తరుగకుండ నుండును. శిష్యుడు కూడ నట్టిస్వరూపము కలవాడే. కాని యతని అనేకజన్మల యజ్ఞానము యతని శుద్ధచైతన్యమను సంగతిని కప్పివేయును. అతడు “నేను సామాన్య నికృష్ట జీవుడను.” అనుకొనెను. గురువు యజ్ఞానమును మూలముతో తీసివేయవలెను. తగిన యుపదేశము నివ్వవలెను. లెక్కలేనన్ని జన్మలనుంచి సంపాదించిన యజ్ఞానమును గురువు నిర్మూలించి యుపదేశించవలెను. ఎన్నోజన్మలనుంచి తాను నికృష్టజీవుడ ననుకొను శిష్యుని గురువు “నీవే దైవము, శక్తియుతడవు, ఐశ్వర్యశాలివి” అని బోధించును. అప్పుడు శిష్యుడు కొంచెము కొంచెముగా తానే దైవమని గ్రహించును. తాను శరీరమనియు, తానొక జీవిననియు లేదా యహంకారమనియు, దేవుడు, లోకము తనకంటె వేరనియు తలంచు నిత్యాంతభ్రమ అనేక జన్మలనుంచి వచ్చుచున్న దోషము. దానిపై నాధారపడి చేసిన కర్మలనుండి వానికి సంతోషము, విచారము, ఈ రెంటియొక్క మిశ్రమము కలుగును. ఈ భ్రమను, ఈ దోషమును, ఈ మూల అజ్ఞానమునుగూర్చి అతడు విచారమారంభించవలెను. ఈ ఆజ్ఞానమెట్లు అంకురించినది? అది యెక్కడ నున్నది? అను దానిని చూపుటయే గురుపదేశమందురు. ఈ దిగువ వివరించినవి యజ్ఞానలక్షణములు

1. నేను జీవిని (ప్రాణిని).
2. శరీరమే యాత్మ (నేను శరీరమును).
3. భగవంతుడు, ప్రపంచము, జీవుడు వేర్వేరు.
4. నేను దేవుడను కాను.
5. శరీర మాత్మకాదని తెలిసికొనకుండుట.
6. దేవుడు, జీవుడు ప్రపంచము ఒకటేయని తెలియకుండుట.


ఈ తప్పులన్నియు చూపించనిదే, శిష్యుడు దేవుడనగా, ప్రపంచమనగా, శరీరమనగానేమో తెలియజాలడు. వానిలో వానికి ఎట్టి సంబంధము కలదో, ఒకటి యింకొకటికంటె వేరైనదా లేక రెండును ఒకటేనా యను సంగతి గ్రహింపజాలడు. ఈ సంగతులను బోధించుటకు వాని యజ్ఞానము నశింపజేయుటకు చెప్పునది జ్ఞానమా? అజ్ఞానమా? జ్ఞానమూర్తియైన జీవునకు జ్ఞానోపదేశము చేయనేల? ఉపదేశమనునది వాని తప్పును వానికి చూపి వాని యజ్ఞానమును సశింపజేయుటకొరకే’ బాబా యింకను ఇట్లనెను.

1. ప్రణిపాత మనగా శరణాగతిచేయుట, 2. శరణాగతి యనగా తను (శరీరము), మన (మనస్సు), ధనముల (ఐశ్వర్యము) నర్పించుట, 3. శ్రీ కృష్ణుడు అర్జునుని ఇతరజ్ఞానుల నాశ్రయించు మననేల?

సద్భక్తుడు సర్వము వాసుదేవమయముగా భావించును. భక్తుడు ఏ గురువునైన శ్రీకృష్ణునిగానే భావించును. గురువు శిష్యుని వాసుదేవుడుగాను, శ్రీ కృష్ణుడు ఇద్దరిని తన ప్రాణము, ఆత్మలు గాను భావించును. అటువంటి భక్తులు గురువులు గలరని శ్రీ కృష్ణునికి తేలిసి యుండుటచే, వారినిగూర్చి అర్జునునికి చెప్పెను. అట్టివారి గొప్పతనము హెచ్చియందరికి తెలియవలెననియే కృష్ణుడట్లు పేర్కొనెను.

సమాధిమందిర నిర్మాణము

బాబా తాను చేయ నిశ్చయించుకొనిన పనులగూర్చి ఎప్పుడును మాట్లాడువారు కారు. ఏమియు సందడి చేయువారు కారు. సంగతి సందర్భములను వాతావరణమును మిక్కిలి యుక్తిగా నేర్పరిచి తప్పనిసరి ఫలితములు కలిగించుచుండువారు. అందుకు సమాధిమందిర నిర్మాణము ఒక ఉదాహరణము. నాగపూరు కోటీశ్వరుడు, శ్రీమాన్ బాపుసాహెబు బుట్టీ, షిరిడీలో సకుటుంబముగా నుండెడివారు. అతనికి అచట సొంత భవనముండిన బాగుండునని యాలోచన కలిగెను. కొన్నాళ్ళ పిదప దీక్షిత్ వాడాలో నిద్రించుచుండగా అతనికొక దృశ్యము కనిపించెను. బాబా స్వప్నములో నగుపడి యొక వాడాను మందిరముతో సహ నిర్మించుమనెను. బాపుసాహెబు లేచి శ్యామా యేడ్చుచుండుట చూచి కారణమడిగెను. శ్యామా యిట్లు చెప్పెను. “బాబా నా దగ్గరకు వచ్చి మందిరముతో వాడాను నిర్మింపుము. నేను అందరి కోరికలను నెరవేర్చెద ననెను. బాబా ప్రేమ మధురమైన పలుకులు విని, నేను భావావేశమున మైమరచితిని; నా గొంతుక యార్చుకొనిపోయెను. నా కండ్ల నీరు కారుచుండెను. నేను ఏడ్చుట మొదలిడితిని.” వారిద్దరి దృశ్యములు ఒకటే యయినందులకు బాపుసాహెబు బుట్టీ విస్మయమందెను. ధనవంతుడగుటచేతను, చేతనయినవా డగుటచేతను, అచ్చటొక వాడాను నిర్మించుటకు నిశ్చయించుకొని మాధవరావు (శ్యామా) సహాయముతో ఒక ప్లాను వ్రాసెను. కాకాసాహెబు దీక్షిత్ దాని నామోదించెను. కట్టుట ప్రారంభించిరి. శ్యామా పర్యవేక్షణ చేయుచుండెను. భూమ్యుపరి గృహము, భూగృహము, బావి పూర్తియయ్యెను. బాబాకూడ లెండీకి పోవునప్పుడు, తిరిగి వచ్చునపుడు కొన్ని మార్పులను సలహాలను ఇచ్చుచుండెను. మిగిలిన పనియంతయు బాపుసాహెబు జోగును చూడుమనిరి. అది నిర్మించునపుడు, బాపుసాహెబు బుట్టీకి ఒక యాలోచన కలిగెను. చుట్టు గదులుండి, దాని మధ్యనొక విశాలమైన హాలులో మురళీధరుని (శ్రీ కృష్ణుని) ప్రతిమ ప్రతిష్ఠ చేయవలెనని శ్యామాకు చెప్పెను. వాడా ప్రక్కనుంచి బాబా పోవుచుండగా వారిని శ్యామా యీ విషయము నడుగగా బాబా యందులకు సమ్మతించి “దేవాలయము పూర్తి కాగానే నేనే యచ్చట నివసించుటకు వచ్చెదను” అని వాడా వయిపు జూచుచు “వాడా పూర్తియయిన పిమ్మట మనమే దానిని ఉపయోగించు కొనవలెను. మనమందరమచ్చట నుందుము. అందరు కలసిమెలసి యాడుకొందుము. ఒకరి నొకరు కౌగిలించుకొని సంతోషముగా నుండవచ్చును.” అనెను. దేవస్థాన మధ్యమందిరము కట్టుట కది తగిన శుభసమయమా యని శ్యామా యడుగగా, బాబా సమ్మతించుటచే శ్యామా కొబ్బరికాయ తెచ్చి పగులగొట్టి పనిని ప్రారంభించిరి. కొద్ది కాలములో పని పూర్తి యాయెను. మురళీథర్ విగ్రహము తయారు చేయుట కాజ్ఞాపించిరి. అది తయారు కాకమునుపే క్రొత్త సంగతి జరిగెను. బాబాకు తీవ్రమైన జ్వరము వచ్చెను. వారు కాయమును విడుచుటకు సిద్ధముగా నుండిరి. బాపుసాహెబు మిక్కిలి విచారగ్రస్తుడాయెను; నిరాశపడెను. బాబా సమాధి చెందినచో, తన వాడా బాబా పాదములచే పవిత్రము కాదనియు, తాను మదుపు పెట్టిన లక్షరూపాయలు వ్యర్థమగుననియు చింతించెను. కాని బాబా సమాధి చెందకముందు “నన్ను రాతి మందిరములో నుంచుడు.” అన్నట్టి పలుకు బాపుసాహెబు కేగాక యందరికీ ఊరట కలిగించెను. సకాలమున బాబా పవిత్ర శరీరము మధ్యమందిరములో బెట్టి సమాధి చేసిరి. ఇట్లు మురళీధర్ కొరకు నిర్ణయించిన స్థలమునందు బాబాను సమాధిచేయుటచే బాబాయే మురళీధరుడనియు, బుట్టీ వాడాయే సమాధి మందిరమనియు అర్థము గ్రహించవలెను. వారి విచత్రజీవితము లోతును కనుగొన శక్యము గాదు. తాను కట్టించిన వాడాలో బాబా పవిత్రశరీరము సమాధి యగుటచే బాపుసాహెబ్ బుట్టీ మిగుల ధన్యుడు, అదృష్టశాలి.
ఓం నమోః శ్రీ సాయినాథాయ
శాంతిః శాంతిః శాంతిః
ముప్పదితొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము.

|సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు|
|శుభం భవతు|

శ్రీ సాయి సత్ చరిత్రము ముప్పదియెనిమిదవ అధ్యాయము


ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

ముప్పదియెనిమిదవ అధ్యాయము

(ఆరవదినము పారాయణము – మంగళవారము)

1. బాబా వంటపాత్ర, 2. దేవాలయమును గౌరవించుట, 3. కాలా లేదా మిశ్రమము, 4. మజ్జిగ

గత అధ్యాయములో బాబాగారి చావడి యుత్సవము వర్ణించితిమి. ఈ యధ్యాయములో మనము బాబా వంటపాత్ర మొదలగువానిని గుర్చి చదివెదము.

తొలిపలుకు

ఓ సద్గురుసాయీ! నీవు పావనమూర్తివి, ప్రపంచమంతటికి ఆనందము కలుగజేసితివి, భక్తులకు మేలు కలుగజేసితివి. నీ పాదముల నాశ్రయించినవారి బాధలను తొలగించితివి. నిన్ను శరణు జొచ్చిన వారిని ఉదారస్వభావుడవగుటచే వారిని పోషించి రక్షించెదవు. నీ భక్తుల కోరికలు నెరవేర్చుటకు, వారికి మేలు చేయుటకొరకు నీవవతరించెదవు. పవిత్రాత్మయగు ద్రవసారము బ్రహ్మమనెడి యచ్చులో పోయగా దానినుండి యోగులలో నలంకారమగు సాయి వెడలెను. ఈ సాయి యాత్మారాముడే, స్వచ్ఛమైన దైనికానందమునకు వారు పుట్టినిల్లు. జీవితేచ్చ లన్నియు పొందినవారై, వారు భక్తులను నిష్కాములను జేసి విముక్తుల జేసిరి.

బాబా వంటపాత్ర

యుగయుగములకు శాస్త్రములు వేర్వేరు సాధనములను ఏర్పాటు చేసియున్నవి. కృతయుగములో తపస్సు, త్రేతాయుగములో జ్ఞానము, ద్వాపరముగములో యజ్ఞము, కలియుగములో దానము చేయవలెనని శాస్త్రములు ఘోషించుచున్నవి. దానము లన్నింటిలో అన్నదానమే శ్రేష్ఠమయినది. మధ్యాహ్నము 12 గంటలకు భోజనము దొరకనిచో మనము చాల బాధపడెదము. అట్టి పరిస్థితులలో నితర జీవులుకూడ నట్లే బాధ పడును. ఈ విషయము తెలిసి యెవరయితే బీదలకు, ఆకలితో నున్న వారికి, భోజనము పెట్టెదరో వారే గొప్ప దాతలు. తైత్తరీయోపనిషత్తు ఇట్లు చెప్పుచున్నది. “ఆహారమే పరబ్రహ్మస్వరూపము, ఆహారమునుండియే సమస్తజీవులు ఊద్భవించినవి. చచ్చిన పిమ్మట నవి తిరిగి ఆహారములో ప్రవేశించును. ” మిట్టమధ్యాహ్నము మన యింటికెవరైన అతిథి వచ్చినచో, వారి నాహ్వానించి భోజనము పెట్టుట మన విధి. ఇతరదానములు అనగా ధనము, బట్టలు మొదలగునవి యిచ్చు నపుడు కొంత విచక్షణ కావలెను. కాని యాహారవిషయములో నట్టి యాలోచన యనవసరము. మన యింటికి మిట్టమధ్యాహ్న మెవరువచ్చినను వారికి మొట్టమొదట భోజనము పెట్టవలెను. కుంటి, గ్రుడ్డి, రోగిష్ఠులు వచ్చినచో వారికి మొట్టమొదట భోజనము పెట్టిన పిమ్మట ఆరోగ్యవంతులకు, అటుపిమ్మట మన బంధువులకు పెట్టవలెను. మంచి యెంతో శ్రేయస్కరము. అన్నదానము లేకున్నచో నితరదానములు ప్రకాశించవు. ఎట్లన చంద్రుడు లేని నక్షత్రములవలె, పతకములేని కంఠాహారమువలె, పింఛము లేని కిరీటమువలె, కమలము లేని చెఱువువలె, భక్తి లేని భజనవలె, కుంకుమబొట్టు లేని పుణ్యస్త్రీ వలె, బొంగురు కంఠముగలవాని పాటవలె, ఉప్పు లేని మజ్జిగవలె రుచించవు. అన్ని వ్యంజనములకంటె పప్పుచారు ఎట్లు ఎక్కువో అట్లే అన్ని పుణ్యములలో అన్నదాన మెక్కువ. బాబా ఆహారము నెట్లు తయారుచేసి పంచి పెట్టుచుండెనో చూచెదము.

బాబాకొరకు చాలా తక్కువభోజనము కావలసియుండెను. అదియు కొన్ని యిండ్లనుండి భిక్షాటనము చేసి తెచ్చుకొనెడివారని యిదివరకే తెలిసికొంటిమి. ఏనాడైన అందరికి భోజనము పెట్టవలెనని బాబా నిశ్చయించుకొన్నచో మొదటనుండి చివరవరకు కావలసిన యేర్పాటు లన్నియు వారే స్వయముగా చేసికొనెడివారు. ఈ విషయమై ఇతరులపై ఆధారపడలేదు; ఎవరికిని బాధ కలుగజేయలేదు. మొట్టమొదట బజారుకు వెళ్ళి ధాన్యము, పిండి, మసాలాదినుసులు మొదలగువని యన్నియు నగదు నిచ్చికొనెడివారు. వారే విసరుచుండెడి వారు. మసీదు ముందున్న ఖాళీస్థలములో మధ్యన పొయ్యిబెట్టి దానిపై పెద్ద వంటపాత్రలో కొలతప్రకారము నీళ్ళుపోసి పెట్టెడివారు. వారివద్ద వంటపాత్రలు రెండు గలవు. ఒకటి పెద్దది వందమందకి సరిపోవునది. రెండవది చిన్నది 50 మందికి మాత్రము సరిపోవునది. ఒక్కొక్కప్పుడు చక్కెరపొంగలి వండేవారు. మరొకప్పుడు మాంసపు పొలావ్ వండెడివారు. ఒక్కొక్కప్పుడు పప్పుచా రుడుకునప్పుడు గోధుమపిండి బిళ్ళల నందులోనికి వదిలేవారు. మసాలా వస్తువులను చక్కగా నూరి దానిని వంటపాత్రలో వేసేవారు. పదార్థములు చాలా రుచిగా నుండుట కెంత శ్రమ తీసికొనవలెనో అంత శ్రమను పడుచుండెడివారు. అప్పుడప్పుడు అంబలి వండెడివారు. అనగా జొన్నపిండిని నీళ్ళలో నుడకబెట్టి దానిని మజ్జిగలో కలుపుచుండెడివారు. భోజనపదార్థములతో ఈ అంబలినికూడ అందరికి కొంచెము కొంచెముగా పెట్టెడివారు. అన్నము సరిగా నుడికినదో లేదో యని పరీక్షించుటకు బాబా తన కఫినీ పైకెత్తి చేతిని నిర్భయముగా మరుగుచున్న దేకిసాలో బెట్టి కలుపుచుండేవారు. వారి ముఖమునందు భయచిహ్నములు గాని చేయి కాలునట్లుగాని కనిపించెడిది కాదు. వంట పూర్తి కాగానే, బాబా ఆ పాత్రలను మసీదులోనికి దెచ్చి, మౌల్వీచే ఆరగింపు పెట్టించేవారు. మొట్టమొదట కొంత మహళ్సాపతికి, తాత్యాకు ప్రసాదరూపముగ పంపించిన పిమ్మట మిగతదానిని బీదవాండ్రకు దిక్కులేనివారికి సంతృప్తిగా బెట్టుచుండిరి. బాబా స్వయముగా తన చేతులతో తయారుచేసి స్వయముగా వడ్డించగా భోజనము చేసినవారు నిజముగా ఎంతో పుణ్యాత్ములు, అదృష్టవంతులయి యుండవలెను. 

బాబా తన భక్తులందరికి శాకాహారము మాంసాహార మొకేరీతిగా బెట్టుచుండెనా యని ఎవరికైన సందేహము కలుగవచ్చును. దీని జవాబు సులభము, సామాన్యమైనది. ఎవరు మాంసాహారులో అట్టివారకే ఆ వంట పాత్రలోనిది పెట్టెడివారు. మాంసాహారులు కానివారి నా పాత్రను గూడ ముట్టనీయలేదు. వారి మనసులో దీనిని తినుటకు కోరిక కూడ కలుగ నిచ్చెడివారు కారు. గురువుగారేదైనా ఇచ్చినప్పుడు దానిని తినవచ్చునా లేదా యని యోచించు శిష్యుడు నరకమునకు పోవునను రూఢి కలదు. దీనిని శిష్యులు బాగా గ్రహించి నెరవేర్చుచుండిరో లేదో చూచూటకు బాబా యెక్కొక్కప్పుడు పరీక్షించుచుండెడివారు. దీనికొక ఉదాహరణము. ఒక ఏకాదశినాడు దాదా కేల్కరుకు కొన్ని రూపాయలిచ్చి కొరాల్బాకు పోయి మాంసమును కొని తెమ్మనెను. ఇతడు సనాతనాచార పరాయణుడగు బ్రాహ్మణుడును ఆచారవంతుడును. సద్గురువుకు ధనము, ధాన్యము, వస్త్రములు మొదలగునవి ఇచ్చుట చాలదనియు, కావలసినది అక్షరాల గురువు ఆజ్ఞను పాటించుటే యనియు గురువు ఆజ్ఞానుసారము నెరవేర్చుటయే యనియు, ఇదియే నిజమైన దక్షిణ యనియు, దీనివల్లనే గురువు సంతుష్టి చెందెదరనియు అతనికి తెలియును. కనుక దాదా కేల్కరు దుస్తులు ధరించి బజారుకు బయలుదేరెను. కాని బాబా అతనిని వెంటనే పిలచి తానే స్వయముగా పోవలదనియు నింకెవరినైన పంపుమనెను. అతడు పాండువను నౌకరును బంపెను. వాడు బయలుదేరుట చూచి బాబా వానినికూడ వెనుకకు బిలిపించి యానాడు మాంసము వండుట మానుకొనిరి. ఇంకొకసారి బాబా దాదాకేల్కరును బిలచి పొయ్యిమీదనున్న పొలావ్ ఉడికినదో లేదో చూడుమనెను. కేల్కర్ దానిని పరీక్షించకయే సరిగా నున్నదని జవాబిచ్చెను. అప్పుడు బాబా “నీవు కండ్లతో దానిని చూడలేదు, నాలుకతో రుచి చూడలేదు, రుచిగానున్న దని ఎట్లు చెప్పితివి. మూత తీసి చూడుము. ” అనుచు బాబా యతని చేతిని బట్టుకొని మరుగుచున్న దేకిసాలో బెట్టెను. ఇంకను నిట్లునెను. నీ చేయిని తీయుము. “నీ ఆచారము నొక ప్రక్కకు బెట్టి తెడ్డుతో దీసి, కొంచెము ప్లేటులో వేసి సరిగా ఉడికినది లేనిది తెలిసికొనుము. ” తల్లి మనస్సున నిజమైన ప్రేమ జనించునప్పుడు ఆమె తన బిడ్డను గిల్లి ఆ బిడ్డ యేడ్చునపుడు దానిని కౌగిలించి ముద్దుబెట్టుకొనును. అట్లనే బాబా కూడ కన్నతల్లివలె దాదా కేల్కరును ఈ విధముగా గిల్లెను. నిజముగా ఏ యోగిగాని, గురువుగాని తన శిష్యునకు నిషేధాహారమును తిని చెడిపొమ్మని చెప్పడు.

ఈ వంటపాత్రలో వండుట 1910వ సంవత్సరము వరకు జరిగిన పిమ్మట ఆగిపోయెను. పూర్వము చెప్పిన రీతిగా దాసుగణు బాబా కీర్తిని తన హరికథలద్వారా బొంబాయి రాష్ట్రములో వెల్లడి చేసెను. ఆ ప్రాంతమునుండి ప్రజలు తండోపతండములుగా షిరిడీకి వచ్చుచుండిరి. కొలది దినములలో షిరిడీ యొక పుణ్యక్షేత్రమాయెను. భక్తులనేక రకముల యాహారములను బాబాకు నైవేద్యము పెట్టుచుండిరి. వారు తెచ్చిన పదార్థములు ఫకీరులు, బీదలు తినగా నింకను మిగులుచుండెను. నైవేద్యమునెట్లు పంచిపెట్టెడివారో చెప్పుటకు ముందు బాబాకు షిరిడీ లోని దేవాలయములందును, నందుండు దేవతలయందును గల గౌరవమును చాటెడు నానాసాహెబు చాందోర్కరు కథ తెలిసికొందుము.

నానాసాహెబు దేవాలయమును అగౌరవించుట

ఎవరికి తోచినట్లు వారాలోచించి ఊహించి బాబా బ్రాహ్మణుడని కొందరు, మహమ్మదీయుడని మరికొందరు చెప్పుచుండిరి. నిజముగా బాబా యేజాతికి చెందినవారు కారు. వారెప్పుడు పుట్టిరో, ఏజాతి యందు పుట్టిరో, వారి తల్లిదండ్రు లెవరో యెవరికిని తెలియదు. కనుక వారు బ్రాహ్మణుడు గాని, మహమ్మదీయుడుగాని యెట్లు కాగలరు? వారు మహమ్మదీయు లయినచో మసీదులో నెప్పుడు ధుని నెట్లు మండనిత్తురు? అచ్చోట తులసీబృందావన మెట్లుండును? శంఖము లూదుట కెట్లు ఒప్పుకుందురు? గంటలను మ్రోయించుట కెట్లు సమ్మతింతురు? సంగీతవాద్యముల నెటుల వాయించనిత్తురు? వారు మహమ్మదీయులయినచో చెవులకు కుట్లు (రంధ్రము) ఎటు లుండును? గ్రామములోని హిందుదేవాలయములను దేవతలను ఏమాత్రము అగౌరవించినను ఊరకొనెడివారు కారు.

ఒకనాడు నానాసాహెబు చాందోర్కర్ తన షడ్డకుడగు బినివల్లెతో షిరిడీకి వచ్చెను. బాబావద్ద కూర్చొని మాట్లాడుచుండగా నానామీద బాబా హఠాత్తుగా కోపగించి, “నా సహవాసము ఇన్నాళ్ళు చేసియు నిట్లేల చేసితివి?” అనెను. నానాసాహెబు మొదట దీనిని గ్రహించలేకపోయెను. కనుక అదేమిటో వివరింపవలసినదిగా ప్రార్థించెను. కోపర్ గాం నుండి షిరిడీకి ఎట్లు వచ్చితివని బాబా యతని నడిగెను. నానాసాహెబ్ వెంటనే తన తప్పును గ్రహించెను. సాధారణముగా షిరిడీకి పోవునపుడెల్ల నానాసాహెబ్ కోపర్ గాం లో దిగి దత్తదర్శనము చేసికొనెడివారు. కాని, ఈసారి తన బంధువు దత్తభక్తుడయినప్పటికి అతనినిగూడ వెళ్ళనీయక, యాలస్యమయిపోవునని చెప్పుచు తిన్నగా షిరిడీకి చేర్చెను. ఇదంతయు బాబాకు తెలియజేయుచు, తాను గోదావరిలో స్నానము చేయునప్పుడొక ముల్లు పాదములో గ్రుచ్చుకొని తనను చాల బాధ పెట్టెనని చెప్పెను. బాబా యది కొంతవరకు ప్రాయశ్చిత్తమే యనుచు నికమీదట జాగ్రత్తయని హెచ్చరించెను.

కాలా (మిశ్రమము)

ఇక నైవేద్యమెటుల పంచిపెట్టెడువారో చూచెదము. హారతి పిమ్మట, భక్తులందరికి ఊదీతో తమ ఆశీర్వాదములు ఇచ్చి పంపివేసిన పిమ్మట బాబా మసీదులోనికి బోయి నీంబారువైపు వీపుపెట్టి కూర్చొనుచుండెను. కుడివైపు నెడమవైపు భక్తులు పంక్తులలో కూర్చొనుచుండిరి. నైవేద్యము తెచ్చిన భక్తులు పళ్ళెములను మసీదులో బెట్టి బాబా యాశీర్వాదములకై ఊదీకై కని పెట్టుకొని బయట నిలుచుచుండిరి. అన్ని రకముల ప్రసాదములు, బాబాకు వచ్చుచుండెడివి. పూరీలు, మండెగలు, బొబ్బట్లు, బాసుంది, సాంజా, పరమాన్నము మొదలగునవన్నియు ఒక్కదానిలో వేసి బాబా ముందుంచువారు. బాబా దీనిని దేవునకు సమర్పించి, పావన మొనర్చుచుండెను. అందులో కొంతభాగము బయట కనిపెట్టుకొని యున్న వారికి పంచి తక్కినది బాబాకు అటునిటు రెండు వరుసలలో కూర్చుండిన భక్తులు సంతృప్తిగా తినుచుండిరి. శ్యామ, నానాసాహెబు నిమొంకర్ వడ్డించువారు. వచ్చినవారి సౌకర్యములను వీరు చూచువారు. వారాపని అతిజాగ్రత్తగాను, ఇష్టముగాను చేయుచుండిరి. తిను ప్రతిరేణువు కూడ తృప్తియు, సత్తువయు కలుగజేయుచుండెను. అది యట్టి రుచి, ప్రేమ, శక్తి గలిగిన యాహారము. అది సదా శుభ్రమైనది, పవిత్రమైనది.

ఒక గిన్నెడు మజ్జిగ

ఒకనాడు హేమాడ్ పంతు మసీదులో నందరితో కడుపునిండ తినెను. అట్టిసమయమున బాబా అతనికొక గిన్నెడు మజ్జిగ త్రాగుమని యిచ్చెను. అది తెల్లగా చూచట కింపుగా నుండెను. కాని యతని కడుపులో ఖాళీ లేనట్లుండెను. కొంచెము పీల్చగా అది మిక్కిలి రుచిగానుండెను. అతని గుంజాటనము గనిపెట్టి బాబా యతనితో నిట్లనెను. “దాని నంతయు త్రాగుము. నీకికమీదట ఇట్టి యవకాశము దొరకదు”. అతడు వెంటనే దాని నంతయు త్రాగెను. బాబా పలుకులు సత్యమయ్యెను. ఏలన త్వరలో బాబా సమాధి చెందిరి.

చదువరులారా! హేమాడ్ పంతుకు మనము నిజముగా నమస్కరించవలెను. అతడు గిన్నెడు మజ్జిగను ప్రసాదముగా త్రాగెను. కాని మనకు కావలసినంత యమృతమును బాబా లీలల రూపముగా నిచ్చెను. మనము ఈ యమృతము గిన్నెలతో త్రాగి సంతుష్టిచెంది యానందించెదముగాక.
ఓం నమోః శ్రీ సాయినాథాయ
శాంతిః శాంతిః శాంతిః
ముప్పదియెనిమిదవ అధ్యాయము సంపూర్ణము.

|సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు|
|శుభం భవతు|


Brahma is my father, and Maya is my mother. As they interlocked I got this body. I am Parvardigar (GOD). I live at Shirdi and everywhere.


Brahma is my father, and Maya is my mother. 
As they interlocked I got this body.
I am Parvardigar (GOD).
I live at Shirdi and everywhere.

శ్రీ సాయి సత్ చరిత్రము ముప్పదినాలుగవ అధ్యాయము


ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

ముప్పదినాలుగవ అధ్యాయము

ఊదీ మహిమ

1. డాక్టరు మేనల్లుడు, 2. డాక్టరు పిళ్ళే, 3. శ్యామా మరదలు, 4. ఇరాని పిల్ల, 5. కూర్దా పెద్దమనిషి, 6. బొంబాయి స్త్రీ - కథలు.

ఈ అధ్యాయములో కూడ ఊదీ మహిమ వర్ణితము. ఊదీ ధరించి నంత మాత్రమున నెట్టి ఫలములు కలిగెనో చూతము.

డాక్టరుగారి మేనల్లుడు

నాసిక్ జిల్లాలోని మాలెగాంలో ఒక డాక్టరుండెను. ఆయన వైద్యములో పట్టభద్రులు. వారి మేనల్లుడు నయముకానట్టి రాచ కురుపుతో బాధ పడుచుండెను. డాక్టరుగారితోపాటు ఇతర డాక్టర్లుకూడ నయముచేయ ప్రయత్నించిరి. ఆపరేషను చేసిరి. కాని ఏమాత్రము మేలు జరుగ లేదు. కుర్రవాడు మిగుల బాధపడుచుండెను. బంధువులు, స్నేహితులు తల్లిదండ్రులను దైవసహాయము కోరుమనిరి. షిరిడీ సాయిబాబాను చూడుమనిరి. వారి దృష్టిచే అనేక కఠినరోగములు నయమయ్యెనని బోధించిరి. తల్లిదండ్రులు షిరిడీకి వచ్చిరి. బాబా పాదములకు సాష్టాంగనమస్కారము చేసిరి. కుర్రవానిని బాబా ముందు బెట్టిరి. తమ బిడ్డను కాపాడుమని అధికవినయ గౌరవములతో వేడుకొనిరి. దయార్దృడగు బాబా వారిని ఓదార్చి యిట్లనెను. "ఎవరయితే ఈ మసీదుకు వచ్చెదరో వారెన్నడు ఈ జన్మలో ఏ వ్యాధిచేతను బాదపడరు. కనుక హాయిగ నుండుడు. కురుపుపై ఊదీని పూయుడు. ఒక వారము రోజులలో నయమగును. దేవునియందు నమ్మకముంచుడు. ఇది మసీదు కాదు, ఇది ద్వారవతి. ఎవరయితే యిందు కాలు మోపెదరో వారు ఆరోగ్యమును ఆనందమును సంపాదించెదరు. వారి కష్టములు గట్టెక్కును." వారు కుర్రవానిని బాబా ముందు కూర్చుండబెట్టిరి. బాబా యా కురుపుమీద తమ చేతిని త్రిప్పెను, ప్రేమాస్పదమైన చూపులను ప్రసరింపజేసెను. రోగి సంతుష్టి చెందెను. ఊదీ రాయగా కురుపు నెమ్మదించెను. కొద్దిరోజుల పిమ్మట పూర్తిగా మానిపోయెను. తల్లిదండ్రులు కుర్రవానితో గూడ బాబాకు కృతజ్ఞతలు తెలిపి షిరిడీ విడచిరి. బాబా ఊదీప్రసాదములవల్లన వారి దయాదృష్టివల్లను రాచకురుపు మానిపోయి నందులకు మిగుల సంతసించిరి.

ఈ సంగతి విని కుర్రవాని మామయగు డాక్టరు ఆశ్చర్యపడి బొంబాయి పోవుచు మార్గమున బాబాను చూడగోరెను. కాని మాలేగాంలోను మన్ మాడ్ లోను ఎవరో బాబాకు వ్యతిరేకముగ చెప్పి అతని మనస్సును విరిచిరి. కావున నతడు షిరిడీకి పోవుట మానుకొని తిన్నగా బొంబాయి చేరెను. తనకు మిగిలియున్న సెలవులు అలిబాగులో గడుపవలె ననుకొనెను. బొంబాయిలో మూడురాత్రులు వరుసగా నొక కంఠధ్వని "ఇంకను నన్ను నమ్మవా?" యని వినిపించెను. వెంటనే డాక్టరు తన మనస్సును మార్చుకొని షిరిడీకి పోవ నిశ్చయించుకొనెను. అతడు బొంబాయిలో నొక రోగికి అంటుజ్వరమునకు చికిత్స చేయుచుండెను. రోగికి నయము కాకుండెను. కనుక షిరిడీ ప్రయాణము వాయిదాపడుననుకొనెను. కాని, తన మనస్సులో బాబాను పరీక్షింపదలచి "రోగియొక్క వ్యాధి యీనడు కుదిరినచో, రేపే షిరిడీకి పోయెదను" అని యనుకొనెను. జరిగిన చిత్రమేమన సరిగా మనోనిశ్చయము చేసినప్పటి నుంచి, జ్వరము తగ్గుటకు ప్రారంభించి త్వరలో సామాన్య ఉష్ణతకు దిగెను. డాక్టరు తన మనోనిశ్చయము ప్రకారము షిరిడీకి వెళ్ళెను. బాబా దర్శనము చేసి వారి పాదములకు సాష్టాంగనమస్కార మొనర్చెను. బాబా అతనికి గొప్ప యనుభవము కలుగజేయుటచే అతడు బాబా భక్తుడయ్యెను. అక్కడ 4 రోజులుండి, బాబా ఊదీతోను, ఆశీర్వచనములతోను ఇంటికి వచ్చెను. ఒక పక్షము రోజులలో అతనిని బిజాపురుకు హెచ్చు జీతముపై బదిలీ చేసిరి. అతని మేనల్లుని రోగము బాబా దర్శనమునకు తోడ్పడెను. అప్పటినుంచి అతనికి బాబాయందు భక్తికుదిరెను.

డాక్టరు పిళ్ళే

డాక్టరు పిళ్ళేయనునాతడు బాబాకు ప్రియభక్తుడు. అతని యందు బాబాకు మిగుల ప్రేమ. బాబా అతనిని భాఉ (అన్నా) అని పిలుచువారు. బాబా యతనితో ప్రతివిషయము సంప్రదించువారు. అతని నెల్లప్పుడు చెంత నుంచుకొనువారు. ఒకప్పుడు ఈ డాక్టరు గినియా పురుగులచే (నారిపుండు) బాధపడెను. అతడు కాకాసాహెబు దీక్షిత్ తో "బాధ చాల హెచ్చుగా నున్నది. నేను భరించలేకున్నాను. దీనికంటె చావు మేలని తోచుచున్నది. గతజన్మములో చేసిన పాపమును పోగొట్టుకొనుటకై నేనీబాధ ననుభవించుచున్నాను. కాని బాబావద్దకు బోయి యీ బాధ నాపుచేసి, దీనిని రాబోయే 10 జన్మలకు పంచిపెట్టవలసినదని వేడు" మనెను. దీక్షితు బాబావద్దకు వెళ్ళి యీ సంగతి చెప్పెను. బాబా మనస్సు కరగెను. బాబా దీక్షితు కిట్లనెను. "నిర్భయుడుగా నుండు మనుము. అతడేల పదిజన్మలవరకు బాధ పడవలెను? పదిరోజులలో గత జన్మపాపమును హరింపజేయగలను. నేనిక్కడుండి యిహపరసౌఖ్యములిచ్చుటకు సిద్ధముగా నుండ అతడేల చావును కోరవలెను? అతని నెవరివీపుపయి నయిన తీసికొని రండు. అతని బాధను శాశ్వతముగా నిర్మూలించెదను."

ఆ స్థితిలోనే డాక్టరును దెచ్చి బాబా కుడివైపున, ఫకీరు బాబా యెప్పుడు కూర్చుండుచోట, గూర్చుండ బెట్టిరి. బాబా అతనికి బాలీసు నిచ్చి యిట్లనెను. "ఇచ్చట నెమ్మదిగా పరుండి విశ్రాంతి తీసికొమ్ము. అసలయిన విరుగు డేమనగా గతజన్మపాపము లనుభవించి, విమోచనము పొందవలెను. మన కష్టసుఖములకు మన కర్మయే కారణము. వచ్చిన దానిని నోర్చుకొనుము. అల్లాయే యార్చి తీర్చువాడు. వాని నెల్లప్పుడు ధ్యానించుము. అతడే నీ క్షేమమును చూచును. వారి పాదములకు నీ శరీరము, మనస్సు, ధనము, వాక్కు, సమస్తము అర్పింపుము. అనగా సర్వస్యశరణాగతి వేడుము. అటుపై వారేమి చేసెదరో చూడుము." నానాసాహెబు కట్టు కట్టెననియు కాని, గుణమియ్యలేదనియు డాక్టరు పిళ్ళే చెప్పెను. బాబా యిట్లనెను. "నానా తెలివితక్కువవాడు; కట్టు విప్పుము. లేనిచో చచ్చెదవు. ఇప్పుడే ఒక కాకి వచ్చి పొడుచును. అప్పుడు నీ కురుపు నయమగును." 

ఈ సంభాషణ జరుగుచుండగా ఆబ్దుల్ (మసీదు బాగుచేసి దీపములు వెలిగించువాడు) వచ్చెను. దీపములు బాగుచేయుచుండగా, అతని కాలు సరిగా పిళ్ళే కురుపుమీద హఠాత్తుగా పడెను. కాలు వాచి యుండెను. దానిపయి అబ్దుల్ కాలు పడగనే యందులోనుంచి ఏడు పురుగులు నొక్కబడి బయటపడెను. బాధ భరింపరానిదిగా నుండెను. డాక్టరు పిళ్ళే బిగ్గరగా నేడ్వసాగెను. కొంతసేపటికి నెమ్మదించెను. అతనికి ఏడ్పు, నవ్వు ఒకటి తరువాత నింకొకటి వచ్చుచుండెను. బాబా యిట్లనెను. "చూడుడు! మన అన్న జబ్బు కుదిరి నవ్వుచున్నాడు." పిళ్ళే యిట్లనెను, "కాకి ఎప్పుడు వచ్చును?" బాబా యిట్లు జవాబు నిచ్చెను. నీవు కాకిని చూడలేదా? అది తిరిగి రాదు. అబ్దులే యా కాకి. ఇప్పుడు నీవు పోయి వాడాలో విశ్రాంతి గొనుము. నీవు త్వరలో బాగయ్యెదవు." 

ఊదీ పూయుటవలన, దానిని తినుటవలనను, ఏ చికిత్స పొందకయే, ఔషధమును పుచ్చుకొనకయే వ్యాధి పూర్తిగా 10 రోజులలో బాబా చెప్పిన ప్రకారము మానిపోయెను.

శ్యామా మరదలు

శ్యామా తమ్ముడు బాపాజీ సావుట్ బావిదగ్గర నుండువాడు. ఒకనాడతని భార్యకు ప్లేగు తగిలెను. ఆమెకు తీవ్రమైన జ్వరము వచ్చెను. చంకలో రెండు బొబ్బలు లేచెను. బాపాజీ శ్యామావద్దకు పరుగెత్తి వచ్చి సహాయపడుమనెను. శ్యామా భయపడెను. కాని యథాప్రకారము బాబా వద్దకు వెళ్ళెను, సాష్టాంగనమస్కారము చేసి వారి సహాయము కోరెను. వ్యాధిని బాగుచేయుమని ప్రార్థించెను. తన తమ్ముని ఇంటికి బోవుటకు అనుజ్ఞ నిమ్మనెను. బాబా యిట్లనెను. "ఈ రాత్రి సమయమందు వెళ్ళవద్దు. ఊదీ పంపుము. జ్వరమునకు గాని, బొబ్బలకు గాని లక్ష్యపెట్ట నవసరము లేదు. మన తండ్రియును, యజమానియు ఆ దైవమే. ఆమె వ్యాధి సులభముగా నమయగును. ఇప్పుడు వెళ్ళవద్దు. రేపటి ఉదయము వెళ్ళుము. వెంటనే తిరిగి రమ్ము." 

బాబా ఊదీయందు శ్యామాకు సంపూర్ణవిశ్వాస ముండెను. బాపాజీ ద్వారా దానిని బంపెను. బొబ్బలపై దానిని పూసి కొంత నీళ్ళలో కలిపి త్రాగించిరి. దానిని తీసికొనిన వెంటనే, బాగా చెమట పట్టెను; జ్వరము తగ్గెను. రోగికి మంచి నిద్ర పట్టెను. మరుసటి యుదయము తన భార్యకు నయమగుట జూచి బాపాజీ యాశ్చర్యపడెను. 

జ్వరము పోయెను, బొబ్బలు మానెను. మరుసటి ఉదయము శ్యామా బాబా యాజ్ఞ ప్రకారము వెళ్లగా, నామె పొయ్యి దగ్గర తేనీరు తయారు చేయుచుండుట చూచి యాశ్చర్యపడెను. తమ్ముని అడుగగా బాబా ఊదీ ఒక్క రాత్రిలోనే యా బొబ్బలను బాగుచేసె ననెను. అప్పుడు "ఉదయము వెళ్ళు, త్వరగా రమ్ము" అను బాబా మాటల భావము శ్యామా తెలిసికొనగలిగెను. 

టీ తీసికొని శ్యామా తిరిగి వచ్చెను. బాబాకు నమస్కరించి యిట్లనెను. "దేవా! ఏమి నీ యాట! మొట్టమొదట తుఫాను లేపి మాకు అశాంతి కలుగచేసెదవు. తిరిగి దానిని శాంతింపజేసి మాకు నెమ్మది ప్రసాదింతువు." బాబా యిట్లు జవాబిచ్చెను. "కర్మయొక్క మార్గము చిత్రమైనది. నేనేమి చేయకున్నను, నన్నే సర్వమునకు కారణ భూతునిగా నెంచెదరు. అది యదృష్టమును బట్టి వచ్చును. నేను సాక్షిభూతుడను మాత్రమే. చేయువాడు ప్రేరేపించువాడు దేవుడే. వారు మిక్కిలి దయార్ద్రహృదయులు. నేను భగవంతుడను కాను. ప్రభువును కాను. నేను వారి నమ్మకమైన బంటును. వారి నెల్లప్పుడు జ్ఞాపకము చేయుచుందును. ఎవరైతే తన యహంకారమును ప్రక్కకు దోసి భగవంతునికి నమస్కరించెదరో, ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో, వారు బంధములూడి మోక్షమును పొందెదరు."

ఇరానీవాని కొమార్తె

ఒక ఇరానీవాని యనుభవమును చదువుడు. అతని కొమార్తెకు ప్రతిగంటకు మూర్ఛ వచ్చుచుండెను. మూర్చరాగానే యామె మాటలాడ లేకుండెను. కాళ్ళు చేతులు ముడుచుకొని స్పృహ తప్పి పడిపోవుచుండెను. ఎ మందులు ఆమెకు నయము చేయలేదు. ఒక స్నేహితుడు బాబా ఊదీ నుపయోగించుమనెను. విలేపార్లేలోనున్న కాకాసాహెబు దీక్షిత్ వద్ద ఊది తీసికొని రమ్మనెను. ఇరానీ వాడు ఊదీని తెచ్చి ప్రతి రోజు నీటిలో కలిపి త్రాగించుచుండెను. మొదట ప్రతిగంటకు వచ్చు మూర్చ 7 గంటల కొకసారి రాసాగెను. కొద్దిరోజుల పిమ్మట పూర్తిగా నిమ్మళించెను.

హర్దా పెద్దమనిషి

హర్దాపుర (మధ్యపరగణాలు) నివాసియగు వృద్దు డొకడు మూత్రకోశములో రాయితో బాధపడుచుండెను. అట్టిరాళ్ళు ఆపరేషను చేసి తీసెదరు. కనుక, ఆపరేషను చేయించుకొమ్మని సలహా యిచ్చిరి. అతడు ముసలివాడు, మనోబలము లేనివాడు. ఆపరేషను కొప్పుకొనకుండెను. అతని బాధ యింకొక రీతిగా బాగు కావలసియుండెను. ఆ గ్రామపు ఇనాముదారు అచటకు వచ్చుట తటస్థించెను. అతడు బాబా భక్తుడు. అతనివద్ద బాబా ఊదీ యుండెను. స్నేహితులు కొందరు చెప్పగా, వృద్ధుని కుమారుడు ఊదీ తీసికొని దానిని నీళ్ళలో కలిపి తండ్రికిచ్చెను. 5నిమషములలో ఊదీ గుణమిచ్చెను. రాయి కరిగి మూత్రమువెంబడి బయటపడెను. వృద్ధుడు శీఘ్రముగా బాగయ్యెను.

బొంబాయి స్త్రీ

కాయస్థ ప్రభుజాతికి చెందిన బొంబాయి స్త్రీయొకతె ప్రసవించు సమయమున మిగుల బాధపడుచుండెను. అమె కేమియు తోచకుండెను. బాబా భక్తుడు కళ్యాణ్ వాసుడగు శ్రీరామమారుతి ఆమెను ప్రసవించు నాటికి షిరిడీకి తీసికొని పొమ్మని సలహా యిచ్చెను. ఆమె గర్భవతి కాగా భార్యాభర్తలు షిరిడీకి వచ్చిరి. కొన్నిమాసము లక్కడనుండిరి. బాబాను పూజించిరి. వారి సాంగత్యమువలన సంపూర్ణ ఫలము పొందిరి. కొన్నాళ్ళకు ప్రసవవేళ వచ్చెను. మామూలుగనే యోనిలో అడ్డు గనిపించెను. ఆమె మిగుల బాధపడెను. ఏమి చేయుటకు తోచకుండెను. బాబాను ధ్యానించెను. ఇరుగుపొరుగువారు వచ్చి, బాబా ఊదీని నీళ్ళలో కలిపియిచ్చిరి. 5 నిమిషములలో నా స్త్రీ సురక్షితముగా, ఎట్టి కష్టము లేక ప్రసవించెను. దురదృష్టముకొలది చనిపోయినబిడ్డ పుట్టియుండెను. కాని తల్లి ఆందోళనము, బాధ తప్పెను. బాబాకు నమస్కరించి వారిని ఎల్లకాలము జ్ఞప్తియందుంచుకొనిరి.
ఓం నమోః శ్రీ సాయినాథాయ
శాంతిః శాంతిః శాంతిః
ముప్పదినాలుగవ అధ్యాయము సంపూర్ణము.

|సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు|
|శుభం భవతు|

శ్రీ సాయి సత్ చరిత్రము ముప్పదియేడవ అధ్యాయము


ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

ముప్పదియేడవ అధ్యాయము

చావడి యుత్సవము

హేమాడ్ పంతు ఈ అధ్యాయములో కొన్ని వేదాంతవిషయములు ప్రస్తావించిన పిమ్మట చావడి యుత్సవముగూర్చి వర్ణించుచున్నాడు.

తొలిపలుకు

శ్రీ సాయిజీవితము మిగుల పావన మయినది. వారి నిత్యకృత్యములు ధన్యములు. వారి పద్ధతులు, చర్యలు వర్ణింప నలవికానివి. కొన్ని సమయములందు వారు బ్రహ్మాంనందముతో మైమరచెడివారు. మరికొన్ని సమయములం దాత్మజ్ఞానముతో తృప్తి పొందెడివారు. ఒక్కొక్కప్పుడన్నిపనులను నెరవేర్చుచు ఎట్టి సంబంధము లేనట్లుండెడి వారు. ఒక్కొక్కప్పు డేమియు చేయనట్లు గన్పించినప్పటికిని వారు సోమరిగా గాని, నిద్రితులుగా గాని, కనిపించెడు వారు కారు. వారు ఎల్లప్పుడు ఆత్మానుసంధానము చేసెడివారు. వారు సముద్రమువలె శాంతముతో తొణకక యుండినట్లు గనిపించినను వారి గాంభీర్యము, లోతు, కనుగొనరానివి. వర్ణనాతీతమయిన వారి నైజము వర్ణింపగలవా రెవ్వరు? పురుషులను అన్నదమ్ములవలె, స్త్రీల నక్కచెల్లెండ్రవలె తల్లులవలె చూచుకొనెడివారు. వారి శాశ్వతాస్ఖలిత బ్రహ్మచర్యము అంద రెరిగినదే. వారి సాంగత్యమున మనకు కలిగిన జ్ఞానము మనము మరణించువరకు నిలుచుగాక! ఎల్లప్పుడు హృదయపూర్వకమగు భక్తితో వారి పాదములకు సేవచేసెదము గాక. వారిని జీవకోటియందు జూచెదము గాక! వారి నామము నెల్లప్పుడు ప్రేమించెదము గాక.

వేదాంతసంబంధమైన దీర్ఘోపన్యాసము చేసిన పిమ్మట హేమాడ్ పంతు చావడి యుత్సవమును వర్ణించుటకు మొదలిడెను.

చావడి యుత్సవము

బాబా శయనశాలను ఇదివరకే వర్ణించితిని. వారు ఒకనాడు మసీదులోను, ఇంకొకనాడు చావడిలోను నిద్రించుచుండిరి. మసీదుకు దగ్గరగనే చావడి రెండు గదులతో నుండెడిది. బాబా మహాసమాధి చెందువరకు ఒకరోజు మసీదులో, ఇంకొకరోజు చావడిలో నిద్రించుచుండిరి. 1909 డిసంబరు 10 తేదీనుండి చావడిలో భక్తులు పూజాహారతులు జరుప మొదలిడిరి. వారి కటాక్షముచే దీనినే యిప్పుడు వర్ణింతుము. చావడిలో నిద్రించు సమయము రాగా భక్తులు మసీదులో గుమిగూడి కొంతసేపు మండపములో భజన చేసెడివారు. భజనబృందము వెనుక రథము, కుడివైపు తులసీబృందావనమును, ముందర బాబా వీని మధ్య భజన జరుగుచుండెను. భజనయందు ప్రీతి గల పురుషులు, స్త్రీలు సరియైన కాలమునకు వచ్చుచుండిరి. కొందరు తాళములు, చిరితలు, మృదంగము, కంజిరా, మద్దెలు పట్టుకొని భజన చేయుచుండెడివారు. సూదంటురాయివలె సాయిబాబా భక్తులందరిని తమ వద్దకు ఈడ్చుకొనెడివారు. బయట బహిరంగస్థలములో కొందరు దివిటీలు సరిచేయుచుండిరి. కొందరు పల్లకి నలంకరించుచుండిరి. కొందరు బెత్తములను చేత ధరించి 'శ్రీసాయినాథ మహారాజ్ కీ జయ్' యని కేకలు వేయుచుండిరి. మసీదు మూలలు తోరణములతో నలంకరించుచుండిరి. మసీదు చుట్టు దీపముల వరుసలు కాంతిని వెదజల్లుచుండెను. బాబా గుఱ్ఱము శ్యామకర్ణ సజ్జితమై బయట నిలుచుచుండెను. అప్పుడు తాత్యాపాటీలు కొంతమందిని వెంటబెట్టుకొని వచ్చి బాబాను సిద్ధముగా నుండుమని చెప్పెడివాడు. బాబా నిశ్చలముగా కూర్చొనెడివారు. తాత్యాపాటీలు వచ్చి బాబా చంకలో చేయివేసి లేవనెత్తుచుండెను. తాత్యా బాబాను మామా యని పిలిచెడివారు. నిజముగా వారి బాంధవ్యము మిక్కిలి సన్నిహితమయినది. బాబా శరీరముపై మామూలు కఫనీ వేసికొని, చంకలో సటకా పెట్టుకొని, చిలుమును-పొగాకును తీసికొని, పైన ఉత్తరీయము వేసుకొని, బయలుదేరుటకు సిద్ధపడుచుండిరి. పిమ్మట బాబా తన కుడిపాదము బొటనవ్రేలుతో ధునిలోని కట్టెలను ముందుకు త్రోసి, కుడిచేతితో మండుచున్న దీపము నార్పి, చావడికి బయలుదేరెడి వారు. అన్ని వాయిద్యములు మ్రోగెడివి; మతాబా మందుసామాను లనేకరంగులు ప్రదర్శించుచు కాలెడివి. పురుషులు, స్త్రీలు బాబా నామము పాడుచు మృదంగము వీణ సహాయముతో భజన చేయుచు ఉత్సవములో నడుచుచుండిరి. కొందరు సంతసముతో నాట్యమాడుచుండిరి. కొందరు జెండాలను చేత బట్టుకొనుచుండిరి. బాబా మసీదు మెట్లపైకి రాగా భాల్దారులు 'శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జయ్' అని కేకలు పెట్టుచుండిరి. బాబా కిరుప్రక్కల చామరములు మొదలగునవి పట్టుకొని విసరుచుండిరి. మార్గమంతయు అడుగులకు మడుగులు పరచెడు వారు. వానిపై బాబా భక్తుల కేకలుతో నడచెడువారు. తాత్యాయెడమచేతిని మహాళ్సాపతి కుడిచేతిని, బాపుసాహెబుజోగ్ శిరస్సుపై ఛత్రమును పట్టుకొనెడివారు. ఈ ప్రకారముగా బాబా చావడికి పయనమగుచుండెను. బాగుగాను, పూర్తిగాను నలంకరించిన యెఱ్ఱ గుఱ్ఱము శ్యామకర్ణ దారి తీయుచుండెను. దాని వెనుక పాడెడువారు, భజన చేయువారు, వాయిద్యముల మ్రోగించువారు, భక్తుల సమూహ ముండెడిది. హరినామస్మరణతోను, బాబా నామస్మరణతోను ఆకాశము బద్దలగునటుల మారుమ్రోగుచుండెను. ఈ మాదిరిగ శోభాయాత్ర మసీదు మూల చేరుసరికి ఉత్సవములో పాల్గొనువారందరు ఆనందించుచుండిరి. 
ఈ మూలకు వచ్చుసరికి బాబా చావడివైపు ముఖముపెట్టి నిలిచి యొక విచిత్రమయిన ప్రకాశముతో వెలిగెడివారు. వారి ముఖము ఉదయసంధ్య వలె లేదా బాలభానునివలె ప్రకాశించుచుండెను. అచట బాబా ఉత్తరమువైపు ముఖము బెట్టి కేంద్రీకరించిన మనస్సుతో నిలచెడివారు. వారెవరినో పిలుచునటుల గనిపించెడిది. సమస్త వాయిద్యములు మ్రోగుచున్నప్పుడు బాబా తన కుడిచేతిని క్రిందకు మీదకు ఆడించెడివారు. అట్టి సమయమున కాకాసాహెబు దీక్షిత్ ముందుకు వచ్చి, యొక వెండిపళ్ళెములో పువ్వులు గులాల్ పొడిని దీసికొని బాబాపై పెక్కుసార్లు చల్లుచుండెను. అట్టి సమయమందు సంగీత వాయిద్యములు వాని శక్తి కొలది ధ్వనించుచుండెను. బాబా ముఖము స్థిరమైన ద్విగుణీకృత ప్రకాశముతోను, సౌందర్యముతోడను, వెలుగుచుండెను. అందరు ఈ ప్రకాశమును మనసారా గ్రోలుచుండిరి. ఆ దృశ్యమును ఆ శోభను వర్ణించుటకు, మాటలు చాలవు, ఒక్కొక్కప్పు డానందమును భరించలేక మహళ్సాపతి దేవత యావేశించిన వానివలె నృత్యము చేయువాడు. కాని, బాబాయొక్క ధ్యాన మేమాత్రము చెదరక యుండెడిది. చేతిలో లాంతరు పట్టుకొని తాత్యాపాటీలు బాబాకు ఎడమప్రక్క నడచుచుండెను. భక్త మహాళ్సాపతి కుడివయిపు నడచుచు బాబా సెల్లాయంచును పట్టుకొనెడివాడు. ఆ యుత్సవమెంతో రమణీయముగ నుండెడిది. వారి భక్తి చెప్పనలవికానిది. ఈ పల్లకి యుత్సవమును చూచుటకు పురుషులు, స్త్రీలు, ధనికులు, పేదవారు గుమిగూడుచుండిరి. బాబా నెమ్మదిగా నడచుచుండెను. ప్రేమభక్తులతో భక్తమండలి బాబా కిరుప్రక్కలనడుచు చుండెడివారు. వాతావరణమంతయు ఆనందపూర్ణమై యుండగ శోభాయాత్ర చావడి చేరుచుండెను. ఆ దృశ్యము, ఆ కాలము గడచిపోయినవి. ప్రస్తుతము గాని, యికముందు గాని యా దృశ్యమును గనలేము. ఐనను ఆ దృశ్యమును జ్ఞప్తికి దెచ్చుకొని భావన చేసినచో మనస్సుకు శాంతి, తృప్తి కలుగును. 

చావడి బాగుగా నలంకరించుచుండిరి. దానిని తెల్లని పైకప్పుతోను, నిలువుటద్దములతోను అనేకరంగుల దీపములతోను వ్రేలాడ గట్టిన గాజుబుడ్డీలతోను అలంకరించుచుండిరి. చావడి చేరగనే తాత్యా ముందు ప్రవేశించి యొక యాసనము వేసి, బాలీసును ఉంచి, బాబాను కూర్చుండబెట్టి మంచి యంగరఖా తొడిగించినపిమ్మట భక్తులు బాబాను వేయి విధముల పూజించుచుండిరి. బాబా తలపై తురాయి కిరీటమును బెట్టి, పువ్వుల మాలలు వేసి, మెడలో నగలు వేయుచుండిరి. ముఖమునకు కస్తూరి నామమును, మధ్యను బొట్టును పెట్టి మనస్ఫూర్తిగా బాబావైపు హృదయానందకరముగా జూచెడివారు. తలపై కిరీటము అప్పుడప్పుడు తీయుచుండెడివారు. లేనిచో బాబా దానిని విసరివైచునని వారికి భయము, బాబా వారి యంతరంగమును గ్రహించి వారి కోరికలకు లొంగియుండెడివారు. వారు చేయుదానికి అభ్యంతర పెట్టువారు కాదు. ఈ యలంకారముతో బాబా మిక్కిలి సుందరముగా గనుపించుచుండిరి.

నానాసాహెబు నిమోన్ కర్ గిఱ్ఱున తిరుగు కుచ్చుల ఛత్రములు పట్టుకొనుచుండెను. బాపూసాహెబు జోగ్ యొక వెండి పళ్ళెములో బాబా పాదముల కడిగి, యర్ఘ్యపాద్యము లర్పించి చేతులకు గంధము పూసి, తాంబూలము నిచ్చుచుండెను. బాబా గద్దెపై కూర్చొనియుండగా తాత్యా మొదలగు భక్తులు వారి పాదములకు నమస్కరించుచుండిరి. బాలీసుపై ఆనుకొని బాబా కూర్చొని యుండగా భక్తులు ఇరువైపుల చామరములతోను, విసనకఱ్ఱలతోను విసరుచుండిరి. అప్పుడు శ్యామా చిలుమును తయారుచేసి, తాత్యాకు ఇవ్వగా నతడొక పీల్పుపీల్చి బాబా కిచ్చుచుండెను. బాబా పీల్చిన పిమ్మట భక్త మహాళ్సాకు ఇచ్చెడువారు. తదుపరి యితరులకు లభించుచుండెను. జడమగు చిలుము ధన్యమైనది. మొట్టమొదట అది యనేక తపఃపరీక్షల కాగవలసి వచ్చెను. కుమ్మరులు దానిని త్రొక్కుట, ఎండలో ఆరబెట్టుట, నిప్పులో కాల్చుట వంటివి సహించి తుదకు అది బాబా ముద్దుకు హస్తస్పర్శకు నోచుకొన్నది. ఆ యుత్సవము పూర్తి యయిన పిమ్మట భక్తులు పూలదండలను బాబా మెడలో వేసెడివారు. వాసన చూచుటకు పువ్వులగుత్తులను చేతికిచ్చేవారు. బాబా నిర్వ్యామోహము అభిమానరాహిత్యముల కవతారమగుటచేత ఆ యలంకరణములను గాని మరియాదలను గాని లెక్క పెట్టువారుకారు. భక్తలందుగల యనురాగముచే, వారి సంతుష్టికొరకు వారి యిష్టానుసారము చేయుటకు ఒప్పుకొనుచుండిరి. ఆఖరుకు బాపూసాహెబ్ జోగ్ సర్వలాంఛనములతో హారతి నిచ్చువాడు. హారతి సమయమున బాజాభజంత్రీ మేళతాళములు స్పేచ్ఛగా వాయించువారు. హారతి ముగిసిన పిమ్మట భక్తులు ఆశీర్వాదమును పొంది బాబాకు నమస్కరించి యొకరి తరువాత నొకరు తమతమ యిండ్లకు బోవుచుండిరి. చిలుము, అత్తరు, పన్నీరు సమర్పించిన పిమ్మట తాత్యా యింటికి పోవుటకు లేవగా, బాబా ప్రేమతో నాతనితో నిట్లనెను. "నన్ను కాపాడుము. నీకిష్టమున్నచో వెళ్ళుము గాని రాత్రి యొకసారి వచ్చి నా గూర్చి కనుగొనుచుండుము." అట్లనే చేయుదుననుచు తాత్యా చావడి విడచి గృహమునకు పోవుచుండెను. బాబా తన పరుపును తానే యమర్చుకొనువారు. 50, 60 దుప్పట్లను ఒకదానిపై నింకొకటి వేసి దానిపై నిద్రించువారు.

మనము కూడ ఇప్పుడు విశ్రమించెదము. ఈ యధ్యాయమును ముగించకముందు భక్తుల కొక మనవి. ప్రతిరోజు రాత్రి నిద్రించుటకు ముందు సాయిబాబాను, వారి చావడి యుత్సవమును జ్ఞప్తికి దెచ్చుకొనవలెను.
ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
ముప్పదియేడవ అధ్యాయము సంపూర్ణము.

ఐదవరోజు పారాయణము సమాప్తము.

।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు। 

శ్రీ సాయి సత్ చరిత్రము ముప్పదియారవ అధ్యాయము


ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

ముప్పదియారవ అధ్యాయము

1. ఇద్దరు గోవా పెద్దమనుష్యులు 2. షోలాపూరు నివాసియగు ఔరంగాబాద్ కర్ భార్య - వింత కథలు.

ఇద్దరు పెద్దమనుష్యులు

ఒకనాడు గోవానుండి యిద్దరు పెద్దమనుష్యులు బాబా దర్శనమునకై వచ్చి, బాబా పాదములకు సాష్టాంగముగా నమస్కరించిరి. ఇద్దరు కలిసివచ్చినప్పటికి, బాబా వారిలో నొక్కరిని 15 రూపాయలు దక్షిణ యిమ్మనెను. ఇంకొకరు అడుగకుండగనే 35 రూపాయలివ్వగా నందరికి ఆశ్చర్యము కలుగునట్లు బాబా నిరాకరించెను. అక్కడున్న శ్యామా బాబా నిట్లడిగెను. "ఇది యేమి? ఇద్దరు కలిసి వచ్చిరి. ఒకరి దక్షిణ యామోదించితివి. రెండవవానిది తిరస్కరించితివి. ఎందులకీ భేద భావము?" బాబా యిట్లు జవాబిచ్చెను. "శ్యామా! ఎందులకో నీకేమియును తెలియదు. నేనెవరివద్ద ఏమియు తీసికొనను. మసీదు మాయి బాకీని కోరును. బాకీయున్న వాడు చెల్లించి, ఋణవిమోచనము పొందును. నా కిల్లుగాని, ఆస్తిగాని, కుటుంబము గాని గలవా? నాకేమీ యక్కరలేదు. నేనెప్పుడు స్వతంత్రుడను. ఋణము, శతృత్వము, హత్య చేసిన దోషము చెల్లించియే తీరవలెను. దానిని తప్పించుకొను మార్గము లేదు." పిమ్మట బాబా తన విశిష్టధోరణిలో నిట్లనెను. "ప్రప్రథమమున అతడు పేదవాడు. ఉద్యోగము దొరికినచో మొదటినెల జీతము నిచ్చెదనని తన ఇష్టదైవమునకు మ్రొక్కుకొనెను. అతనికి నెలకు 15రూపాయల ఉద్యోగము దొరికెను. క్రమముగా జీతము పెరిగి 15 రూపాయలనుంచి 30, 60, 100, 200లకు హెచ్చెను. తుదకు 700లకు హెచ్చెను. అతడు ఐశ్వర్యము ననుభవించు కాలమందు తన మ్రొక్కును మరచెను. అతని కర్మఫలమే అతని నిచటకు ఈడ్చుకొని వచ్చినది. ఆ మొత్తమునే (15 రూపాయలు) నేను దక్షిణ రూపముగా నడిగితిని."

ఇంకొక కథ

సముద్రతీరమున తిరుగుచుండగా ఒక పెద్ద భవనమువద్దకు వచ్చి, దాని వసారాపై కూర్చుంటిని. యజమాని నన్ను బాగుగ నాదరించి చక్కని భోజనము పెట్టెను. బీరువాప్రక్కన శుభ్రమైన స్థలము చూపి యక్కడ పరుండు మనెను. నేనక్కడ నిద్రపోయితిని. నేను గాఢనిద్రలో నుండగా, ఆ మనిషి యొక రాతిపలకను లాగి గోడకు కన్నము చేసి, లోపల ప్రవేశించి, నా జేబులో నున్న ద్రవ్యమునంతయు దొంగలించెను. నేను లేచి చూచుకొనగా 30,000 రూపాయలు పోయినవి. నేను మిగుల బాధపడితిని, ఏడ్చుచు కూర్చుంటిని. పైక మంతయు నోట్ల రూపముగా నుండెను. ఆ బ్రాహ్మణుడే దానిని దొంగలించెననుకొంటిని. భోజనము, నీరు రుచింపవయ్యెను. వసారాపై ఒక పక్షము కాలము కూర్చుండి నాకు కలిగిన నష్టమున కేడ్చుచుంటిని. పిమ్మట ఒక ఫకీరు దారివెంట పోవుచు నే నేడ్చుచుండుట జూచి, యెందుల కేడ్చుచుంటి వని యడిగెను. నేను జరిగిన వృత్తాంతము చెప్పితిని. వారిట్లనిరి. "నేను చెప్పినట్లు చేసినట్లయితే నీ డబ్బు నీకు దొరుకును. ఒక ఫకీరు వద్దకు వెళ్ళుము. వారి చిరునామా నేనిచ్చెదను. వారి శరణు వేడుము. వారు నీ పైకమును నీకు తిరిగి తెప్పించెదరు. ఈలోగా నీకు ప్రియమైన యాహారమేదో దానిని నీ ద్రవ్యము దొరకునంతవరకు విసర్జింపుము." నేను ఫకీరు చెప్పినట్లు నడచుకొంటిని. నా పైకము నాకు చిక్కినది. నేను వాడాను విడిచి సముద్రపుటొడ్డునకు బోయితిని. అక్కడొక స్టీమరుండెను. దానిలో జనులు ఎక్కువగా నుండుటచే లోపల ప్రవేశించలేకపోయితిని. ఒక మంచి నౌకరు నాకు తోడ్పడగా నేను లోపలకు బోయితిని. అది యింకొక యొడ్డునకు దీసికొని పోయినది. అక్కడ రైలుబండి నెక్కి యీ మసీదుకు వచ్చితిని.

కథ పూర్తికాగానే బాబా ఆ యతిథులను భోజనముకొరకు తీసికొని పొమ్మనగా శ్యామా యట్లే చేసెను. శ్యామా వారి నింటికి దీసికొనిపోయి భోజనము పెట్టెను. భోజనసమయములో శ్యామా బాబా చెప్పినకథ చిత్రముగానున్నదనెను. బాబా వారెన్నడు సముద్రతీరమునకు పోయి యుండలేదు. వారివద్ద 30,000 రూపాయలెప్పుడు లేకుండెను. ఎన్నడు ప్రయాణము చేయలేదు. ద్రవ్యమెప్పుడును పోవుటగాని వచ్చుటగాని జరుగలేదు. కాన దాని భావము తమకేమైన దెలిసినదా? యని వారినడిగెను. అతిథుల మనస్సులు కరగెను. వారు కండ్ల తడి పెట్టుకొనిరి. ఏడ్చుచు బాబా సర్వజ్ఞుడు, అనంతుడు, పరబ్రహ్మ స్వరూపుడే యని నుడివిరి. బాబా చెప్పిన కథ మాగూర్చియే. వారు చెప్పిన దంతయు మా విషయమే. వారికి ఎట్లు తెలిసెనో యనునది గొప్ప చిత్రము. భోజనమైన తరువాత పూర్తి వివరములను చెప్పెద" మనిరి.

భోజనమయిన పిమ్మట తాంబూలము వేసుకొనుచు అతిథులు వారి కథలను చెప్పదొడంగిరి. అందులో నొకరు ఇట్లు చెప్పిరి. "లోయ లోనున్న యూరు మా స్వగ్రామము. జీవనోపాధికై నేనుద్యోగము సంపాదించి గోవా వెళ్ళితిని. నేను దత్తదేవునికి నాకు ఉద్యోగము లభించిన నా మొదటినెల జీతము నిచ్చెదనని మ్రొక్కుకొంటిని. వారి దయ వల్ల 15రూపయల యుద్యోగము నాకు దొరికెను. నాకు క్రమముగా జీతము బాబా చెప్పిన ప్రకారము 700 రూపాయలవరకు హెచ్చినది. నా మ్రొక్కును నేను మరచితిని. దానిని బాబా యివ్వధముగా జ్ఞప్తికి దెచ్చి నావద్ద 15 రూపాయలు తీసికొనిరి. అది దక్షిణ కాదు. అది పాత బాకీ; తీర్చుకొనక మరచిన మ్రొక్కును చెల్లించుట."


నీతి

బాబా యెన్నడు డబ్బు భిక్షమెత్తలేదు, సరికదా తమ భక్తులు కూడ భిక్షమెత్తికొనుటకు ఒప్పుకొనలేదు. వారు ధనమును ప్రమాదకారిగాను, పరమును సాధించుట కడ్డుగాను బావించువారు. భక్తులు దాని చేతులలో జిక్కకుండ కాపాడెడివారు. ఈ విషయమున భక్త మహళ్సాపతి యొక నిదర్శనము. ఆయన మిక్కిలి పేదవాడు. అతనికి భోజనవసతికి కూడ జరుగుబాటు లేకుండెను. అయినను అతడు ద్రవ్యము సంపాదించుటకు బాబా యనుమతించలేదు; దక్షిణలోనుండి కూడ ఏమియు ఈయలేదు. ఒకనాడు ఉదారవర్తకుడైన హంసరాజు అను బాబా భక్తుడొకడు చాల ద్రవ్యమును బాబా సముఖమున మహళ్సాపతి కిచ్చెను. కాని బాబా దానిని పుచ్చుకొనుట కనుమతించలేదు.

పిమ్మట రెండవ యతిథి తన కథనిట్లు ప్రారంభించెను. "నా బ్రాహ్మణ వంటమనిషి నావద్ద 35 సంవత్సరములనుండి నౌకరి చేయుచుండినను, దురదృష్టమున వాడు చెడు మార్గములో పడెను. వాని మనస్సు మారిపోయెను. వాడు నా ద్రవ్యమునంతయు దొంగలించెను. రాతిపలకను తొలగించి, ధనము దాచిన బోషాణమున్న గదిలో నాయాస్తి సర్వమును అనగా 30,000 రూపాయలు కరెన్సీని దొంగలించి పారిపోయెను. బాబా సరిగా ఆ మొత్తమునే యెట్లు చెప్పగలిగెనో నాకు తెలియదు. రాత్రింబవళ్ళు ఏడ్చుచు కూర్చుంటిని. నా ప్రయత్నములన్నియు విఫలమైనవి. ఒక పక్షమువరకు చాల యారాట పడితిని. విచారగ్రస్తుడనై దుఃఖముతో అరుగుపై కూర్చొనియుండగా ఒక ఫకీరు నా స్థితిని గనిపెట్టి కారణమును దెలిసికొనెను. నేను వివరములన్నియు దెలిపితిని. అతడు "షిరిడీ సాయి యను ఔలియా యున్నారు, వారికి మ్రొక్కుము. నీకు ప్రియమైన యాహారము విడువుము. నీ మనస్సులో వారి దర్శనము చేయువరకు నీకు ప్రియమైన యాహారమును తిననని మ్రొక్కుకొనుము." అనెను. నేనట్టులే "బాబా! నా ద్రవ్యము దొరికిన పిమ్మట, మీ దర్శనము చేసిన పిమ్మట, నేనన్నము తినెదను" అని మ్రొక్కుకొంటిని.

దీని తరువాత 15 దినములు గడచెను. బ్రాహ్మణుడు తనంతట తానే నా డబ్బును నా కిచ్చెను. నా శరణు వేడెను. వాడిట్లనియెను. "నేను పిచ్చియెత్తి యిట్లు చేసినాను. నా శిరస్సు నీ పాదములపై బెట్టితిని. దయచేసి క్షమించుము." ఈ విధముగా కథ సుఖాంతమైనది. నాకు కనిపించి సహాయమొనర్చిన ఫకీరు తిరిగి కనబడలేదు. ఫకీరు చెప్పిన షిరిడీ సాయిబాబాను చూచుట కెంతో గాఢమైన కోరిక కలిగినది. మాయింటి కంత దూరము వచ్చినవారు షిరిడీ సాయిబాబాయే యని నా నమ్మకము. ఎవరయితే నాకు కనపడి నా ద్రవ్యమును తిరిగి తెప్పించిరో అట్టివారు 35 రూపాయల కొరకు పేరాశ చూపెదరా" దీనికి వ్యతిరేకముగా మావద్దనుంచి యేమియు ఆశించక, ఎల్లప్పుడు తమ చేతనయినంతవరకు బాబా మమ్ములను ఆధ్యాత్మిక మార్గమున నడిపింతురు.

దొంగలించిన నా ద్రవ్యము దొరికిన వెంటనే మిక్కిలి సంతసించి మైమరచి నా మ్రొక్కును మరచితిని. ఒకనాటి రాత్రి నేను కొలాబాలో నున్నప్పుడు బాబాను స్వప్నములో జూచితిని. షిరిడీకి పోవలెనను సంగతి యప్పుడు జ్ఞప్తికి వచ్చెను. నేను గోవా వెళ్ళితిని, అక్కడనుండి స్టీమర్ మీద బొంబాయి వెళ్ళి అటునుండి షిరిడీకి పోవ నిశ్చయించితిని. నేను హార్బరువద్దకు పోగా స్టీమరులో జాగా లేకుండెను. కేప్టెను ఒప్పుకొనలేదు కాని, నాకు పరిచయములేని నవుకరొకడు చెప్పగా నొప్పుకొని నన్ను స్టీమరులో బొంబాయికి తీసికొనివచ్చెను. అక్కడనుండి యిక్కడకు రైలులో వచ్చితిని. కాబట్టి బాబా సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి. మేమెక్కడ? మా యిల్లెక్కడ? మా అదృష్టమేమని చెప్పవలెను! బాబా యా ద్రవ్యమును తిరిగి రాబట్టెను. ఇక్కడకు లాగుకొనివచ్చెను. షిరిడీ జనులారా! మీరు మాకంటె పుణ్యాత్ములు, మాకంటె యదృష్టవంతులు. ఏలన, బాబా మీతో యాడి, నవ్వి, మాట్లాడి యెన్నో సంవత్సరములు మీతో నివసించెను. మీ పుణ్య మనంతము. ఎందుకనగా అది బాబాను షిరిడీకి లాగెను. సాయియే మన దత్తుడు. వారే మ్రొక్కుకొమ్మని నన్ను ఆజ్ఞాపించిరి. స్టీమరులో జాగా యిప్పించిరి. నన్ను ఇచ్చటకు దెచ్చిరి. ఇట్లు వారి సర్వజ్ఞత్వమును సర్వశక్తిమత్వమును నిరూపించిరి.

ఔరంగాబాదుకర్ భార్య

షోలాపూరు నివాసియగు సఖారామ్ ఔరంగాబాద్ కర్ భార్యకు 27 సంవత్సరములైనను సంతానము కలుగలేదు. ఆమె అనేకదేవతలకు మ్రొక్కులు మ్రొక్కెను, కాని నిష్ప్రయోజనమయ్యెను. తుదకు నిరాశ చెందెను. ఈ విషయమై చివరి ప్రయత్నము చేయ నిశ్చయించుకొని తన సవతికొడుకగు విశ్వనాథుతో షిరిడీకి వచ్చెను. అచట బాబా సేవచేయుచు రెండు నెలలు గడపెను. ఆమె ఎప్పుడు మసీదుకు పోయినను అది భక్తులచే నిండియుండెడిది. బాబా చుట్టు భక్తమండలి మూగియుండువారు. బాబా నొంటరిగా జూచి, వారి పాదములపై పడి తన మనస్సును విప్పి చెప్పి, తన కొక సంతానము కావలెనని కోరుకొనుటకై తగిన యవకాశమునకై కనిపెట్టుకొని యుండెను. తుట్టతుదకు శ్యామా కీసంగతి చెప్పి, బాబా యొంటరిగా నున్నప్పుడు తన విషయములో జోక్యము గలుగజేసికొనుమనెను. శ్యామా, బాబా దర్బా రెల్లప్పుడు తెరచియుండుననియు, ఐనను ఆమెగూర్చి ప్రయత్నించెదననియు సాయిప్రభువు ఆశీర్వదించవచ్చుననియు చెప్పెను. బాబా భోజనసమయమున మసీదు వాకిలిలో కొబ్బరికాయ, అగరవత్తులతో సిద్ధముగా నుండుమనియు తాను సైగ చేయగనే మసీదుపైకి రావలెననియు చెప్పెను. ఒకనాడు మధ్యాహ్నభోజనానంతరము శ్యామా బాబా చేతులు తువాలుతో తుడుచుచుండగా బాబా శ్యామా బుగ్గను గిల్లెను. శ్యామా కోపగించి "దేవా! నా బుగ్గను గిల్లుట నీకు తగునా? మా బుగ్గలు గిల్లునట్టి పెంకె దేవుడు మాకక్కరలేదు. మేము నీపై నాధారపడియున్నామా? ఇదియేనా మన సాన్నిహిత్యఫలితము?" అనెను. బాబా యిట్లనెను. "శ్యామా! 72జన్మలనుంచి నీవు నాతో నున్నప్పటికి నేను నిన్ను గిల్లలేదు ఇన్నాళ్ళకు గిల్లగా నీకు కోపము వచ్చుచున్నది." శ్యామా యిట్లనియెను. మీనుండి మాకు గౌరవముగాని, స్వర్గము గాని, విమానము గాని యవసరము లేదు. మీ పాదములయందు నమ్మకము మా కెపుడును నుండుగాక." బాబా యిట్లనెను. "అవును, నేను వచ్చినది యందుకే ఇన్నాళ్ళనుంచి మీకు భోజనము పెట్టి పోషించుచుంటిని. నీయందు నాకు ప్రేమానురాగము లున్నవి."

అట్లనుచు బాబా పైకి వెళ్ళి తన గద్దెపయి కూర్చొనెను. శ్యామా యామెను చేసన్నచేసి రమ్మనెను. అమె మసీదుపైకి వచ్చి బాబాకు నమస్కరించి, కొబ్బరికాయ, అగరువత్తు లిచ్చెను. బాబా ఆ టెంకాయనాడించెను. అది యెండుది కనుక లోపల కుడుక ఆడుచు శబ్దము వచ్చు చుండెను.

బాబా:- శ్యామా! యిది గుండ్రముగా లోపల తిరుగుచున్నది, అది యేమనుచున్నదో విను.
శ్యామా:- ఆమె తన గర్భమందు ఒక బిడ్డ అటులే ఆడవలెనని వేడుచున్నది. కాన, టెంకాయను నీ యాశీర్వాదముతో నిమ్ము.
బాబా:- టెంకాయ బిడ్డను ప్రసాదించునా? అట్లనుకొనుటకు ప్రజలెంత వెడగులు?
శ్యామా:- నీ మాటల మహిమయు, ఆశీర్వాదప్రభావమును నాకు దెలియును. నీ యాశీర్వాదమే ఆమెకు బిడ్డల పరంపరను ప్రసాదించును. నీవు మాటలచే కాలయాపన చేయుచు, ఆశీర్వాదమును ఇవ్వకున్నావు.

ఆ సంవాదము కొంతసేవు జరిగెను. బాబా పదేపదే టెంకాయను కొట్టుమనుచుండెను. శ్యామా టెంకాయను కొట్టకుండ నా స్త్రీకే ఇవ్వుమని వేడుచుండెను. తుదకు బాబా లొంగి 'ఆమెకు సంతానము కలుగు' ననెను. ఎప్పుడని శ్యామా యడిగెను. 12 మాసములలోనని బాబా జవాబిచ్చెను. టెంకాయను పగులగొట్టిరి, ఒక చిన్న చిప్పను ఇరువురు తినిరి రెండవచిప్ప నామె కిచ్చిరి.

అప్పుడు శ్యామా యా స్త్రీ వైపు తిరిగి "అమ్మా! నీవు నామాటలకు సాక్షివి. నీకు 12 మాసములలో సంతానము కలుగనిచో, ఈ దేవుని తలపై నొక టెంకాయను గొట్టి ఈ మసీదునుంచి తరిమివేసెదను. ఇందుకు తప్పినచో, నేను మాధవుడ గాను, మీరు దీనిని జూచెదరుగాక" యనెను.

ఆమె ఒక సంవత్సరములో కొడుకును గనెను. 5వ మాసములో కొడుకును మసీదుకు తీసుకువచ్చి భార్యాభర్తలు బాబా పాదములపై బడిరి. కృతజ్ఞుడగు తండ్రి 500 రూపాయలిచ్చెను. బాబా గుఱ్ఱము 'శ్యామకర్ణ'కు ఈ ధనముతో శాల కట్టించెను.
ఓం నమోః శ్రీ సాయినాథాయ
శాంతిః శాంతిః శాంతిః
ముప్పదియారవ అధ్యాయము సంపూర్ణము.

|సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు|
|శుభం భవతు|

శ్రీ సాయి సత్ చరిత్రము ముప్పదియైదవ అధ్యాయము



ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

ముప్పదియైదవ అధ్యాయము

(ఊదీప్రభావము)

పరీక్షింపబడి లోటులేదని కనుగొనుట

1. కాకామహాజని స్నేహితుడు, యజమాని. 2. బాంద్రా అనిద్ర రోగి. 3. బాలాపాటీలు నేవాస్కర్.

ఈ అధ్యాయములో కూడ ఊదీమహిమ వర్ణితము. ఇందులో బాబా రెండు విషయములలో పరీక్షింపబడి లోపము లేదని కనుగొనబడుట గూడ చెప్పబడినది. బాబాను పరీక్షించు కథలు మొట్టమొదట చెప్పబడును.

ప్రస్తావన

ఆధ్యాత్మిక విషయములో లేదా సాధనలందు, శాఖలు, మన యభివృద్ధికి అడ్డుపడును. భగవంతుడు నిరాకారుడని నమ్మువారు భగవంతు డాకారముగలవాడని నమ్మువారిని ఖండించి యది వట్టి భ్రమయనెదరు. యోగీశ్వరులు మామూలు మానవులు మాత్రమే, కనుక వారికి నమస్కరింపనేల యందురు. ఇతర శాఖలవారు కూడ ఆక్షేపణ చేయుచు వారి సద్గురువు వారికి ఉండగా ఇతరయోగులకు నమస్కరించి వారికి సేవ చేయ నేల? యందురు. సాయిబాబా గూర్చి కూడ నట్టి యాక్షేపణ చేసిరి. షిరిడీకి వెళ్ళిన కొందరిని బాబా దక్షిణ యడిగెను. యోగులు ఈ ప్రకారముగా ధనము ప్రోగుచేయుట శ్రేయస్కరమా? వారిట్లు ధనము జాగ్రత్త చేసినచో వారి యోగిగుణము లెక్కడ? అని విమర్శించిరి. అనేకమంది బాబాను వెక్కిరించుటకు షిరిడీకి వెళ్ళి తుదకు వారిని ప్రార్థించుట కచటనే నిలచిపోయిరి. అటువంటి రెండు ఉదాహరణ లీ దిగువ నిచ్చుచున్నాము.

కాకా మహాజని స్నేహితుడు

కాకా మహాజని స్నేహితుడు నిరాకారుడగు భగవంతుడనారాధించువాడు. విగ్రహారాధనమున కాతడు విముఖుడు. అతడు ఊరకనే వింతలేమైన తెలిసికొనుటకు షిరిడీకి పోవనంగీకరించెను. కాని, బాబాకు నమస్కరించననియు, వారికి దక్షిణ యివ్వననియు చెప్పెను. కాకా యీ షరతులకు ఒప్పుకొనెను. ఇద్దరును శనివారమునాడు రాత్రి బొంబాయి విడిచి యా మరుసటి దినము షిరిడీకి చేరిరి. వారు మసీదు మెట్లను ఎక్కగనే కొంచెము దూరమున నున్న బాబా, మహాజని స్నేహితుని మంచిమాటలతో నాహ్వానించెను. ఆ కంఠధ్వని మిక్కిలి చిత్రముగా నుండెను. ఆ కంఠము అతని తండ్రి కంఠమువలె నుండెను. ఆ కంఠము గతించిన తన తండ్రిని జ్ఞప్తికి దెచ్చెను. శరీరము సంతోషముతో నుప్పొంగెను. కంఠపు ఆకర్షణశక్తి యేమని చెప్పుదును? మిగుల నాశ్చర్యపడి యా స్నేహితుడు " ఇది తప్పనిసరిగా మా తండ్రికంఠమే" యనెను. వెంటనే మసీదు లోపలికి వెళ్ళి, తన మనోనిశ్చయమును మరచినవాడై, బాబా పాదములకు నమస్కరించెను.

ఉదయ మొకసారి మధ్యాహ్న మొకసారి బాబా దక్షిణ యడుగగా కాకా మహాజని యిచ్చెను. బాబా కాకానే దక్షిణ యడుగు చుండెను. కాని యతని స్నేహితుని అడుగలేదు. అతని స్నేహితుడు కాకా చెవిలో "బాబా నిన్నే రెండుసారులు దక్షిణ యడిగెను. నేను నీతో నున్నాను. నన్నెందుకు విడిచిపెట్టుచున్నారు?" అని యడిగెను. "నీవే బాబాను అడుగుము" యని యతడు జవాబిచ్చెను. తన స్నేహితుడేమని చెవిలో నూదుచున్నాడని బాబా కాకా మహాజని నడుగగా, తన స్నేహితుడు తానుకూడ దక్షిణ యివ్వవచ్చునా యని బాబాను అడిగెను. బాబా "నీ కిచ్చుటకు మనమున నిష్టము లేకుండెను. కాన నిన్నడుగలేదు. కాని, యిప్పుడు నీ కిష్టమున్న యెడల ఇవ్వవచ్చు" ననెను. కాకా యిచ్చినంత అనగా 17 రూపాయలు దక్షిణము అతని స్నేహితుడు కూడనిచ్చెను. బాబా యపుడు కొన్ని మాటలు సలహారూపముగా నిట్లు చెప్పెను. "నీవు దానిని తీసివేయుము; మనకు మధ్య నున్న యడ్డును తీసివేయుము. అప్పుడు మన మొకరినొకరు ముఖాముఖి చూచు కొనగలము; కలిసికొనగలము." పోవుటకు బాబా వారికి సెలవునిచ్చెను. ఆకాశము మేఘములతో కమ్మియున్నప్పటికి వర్షము వచ్చునేమోయను భయము కలుగుచున్నప్పటికి ప్రయాస లేకుండ ప్రయాణము సాగునని బాబా యాశీర్వదించెను. ఇద్దరు సురక్షితముగా బొంబాయి చేరిరి. అతడు ఇంటికిపోయి తలుపు తీయుసరికి రెండు పిచ్చుకలు చచ్చిపడియుండెను. ఇంకొకటి కిటికీద్వారా యెగిరిపోయెను. వారి యదృష్టానుసారముగ నవి చచ్చెను. మూడవదానిని రక్షించుటకై బాబా త్వరగా తనను బంపె ననుకొనెను.

కాకామహాజని - యజమాని

థక్కర్ ధరమ్సె జెఠాభాయి, హైకోర్టు ప్లీడరు కొక కంపెని గలదు. దానిలో కాకా మేనేజర్ గా పని చేయుచుండెను. యజమానియు మేనేజరును అన్యోన్యముగా నుండెడివారు. కాకా షిరిడీకి అనేకసారులు పోవుట, కొన్నిదినము లచటనుండి, తిరిగి బాబా యనుమతి పొంది వచ్చుట, మొదలగునవి థక్కరుకు తెలియును. కుతూహలము కోసము బాబాను పరీక్షించు ఆసక్తితోను, థక్కర్ కాకాతో హోళీ సెలవులలో షిరిడీకి పోవ నిశ్చయించుకొనెను. కాకా యెప్పుడు తిరిగి వచ్చునో యనునది నిశ్చయముగా తెలియదు కనుక థక్కరింకొకరిని వెంట తీసుకొని వెళ్ళెను. ముగ్గురు కలసి బయలుదేరిరి. బాబా కిచ్చుటకై కాకా రెండుసేర్ల యెండుద్రాక్షపండ్లు (గింజలతోనున్నవి) దారిలో కొనెను. వారు షిరిడీకి సరియైన వేళకు చేరి, బాబా దర్శనమునకయి మసీదుకు బోయిరి. అప్పుడక్కడ బాలాసాహెబు, తర్ఖ డుండెను. తర్ఖడ్ మీరెందుకు వచ్చితిరని థక్కరు నడిగెను. దర్శనముకొరకని థక్కరు జవాబిచ్చెను. మహిమ లేమైన జరిగినవా యని థక్కర్ ప్రశ్నించెను. బాబా వద్ద ఏమైన అద్భుతములు చూచుట తన నైజము కాదనియు, భక్తులు ప్రేమతో కాంక్షించునది తప్పక జరుగుననియు తర్ఖడ్ చెప్పెను. కాకా బాబా పాదములకు నమస్కరించి యెండు ద్రాక్షపండ్లను అర్పించెను. బాబా వానిని పంచిపెట్టుమని యాజ్ఞాపించెను. ధక్కరుకు కొన్నిద్రాక్షలు దొరికెను. అతనికి అవి తినుట కిష్టము లేదు. ఎందుచేత ననగా తన వైద్యుడు కడిగి శుభ్రపరచనిదే తినకూడదని సలహా యిచ్చియుండెను. ఇప్పుడాతనికి అది సమస్యగా తోచెను. తనకు వానిని తినుట కిష్టములేదు. కాని బాబా తినుట కాజ్ఞాపించుటచే పారవేయలేకుండెను. పారవేసినట్లయితే బాగుండదని వానిని నోటిలో వేసికొనెను. గింజలనేమి చేయవలయునో తోచకుండెను. మసీదులో గింజ లుమ్మివేయుటకు జంకుచుండెను. తన యిష్టమునకు వ్యతిరేకముగ తుదకు తన జేబులోనే వేసికొనెను. బాబా యోగి యయినచో తనకు ద్రాక్షపండ్లు ఇష్టము లేదని తెలియదా? బాబా వాని నేల బలవంతముగా నిచ్చెను? ఈ యోలోచన అతని మనస్సున తట్టగానే బాబా యింకను మరికొన్ని ద్రాక్షపండ్లు ఇచ్చెను. అతడు వానిని తినలేదు. చేతిలో పట్టుకొనెను. బాబా వానిని తినుమనెను. వారి యాజ్ఞానుసారము తినగా, వానిలో గింజలు లేకుండెను. అందు కతడు మిగుల నాశ్చర్యపడెను. అద్భుతములు చూడలేదను కొనెను గాన నాతనిపై నీ యద్భుతము ప్రయోగింపబడెను. బాబా తన మనస్సును గనిపెట్టి గింజలుగల ద్రాక్షపండ్లను గింజలు లేనివానిగా మార్చివేసెను. ఏమి యాశ్చర్యకరమైన శక్తి! బాబాను పరీక్షించుటకు తర్ఖడు కెట్టి ద్రాక్షలు దొరికెనని యడిగెను. గింజలతోనున్నవి దొరికెనని తర్ఖడ్ చెప్పెను. థక్కరు ఆశ్చర్యపడెను. తనయందుద్భవించుచున్న నమ్మకము దృఢపరచుటకై బాబా యథార్థముగా యోగి యైనచో, ద్రాక్షపండ్లు మొట్టమొదట కాకా కివ్వవలె ననుకొనెను. అతని మనస్సు నందున్న యీ సంగతి కూడ గ్రహించి, బాబా కాకావద్దనుంచి యెండు ద్రాక్షల పంపిణి ప్రారంభింప వలయునని యాజ్ఞాపించెను. ఈ నిదర్శనముతో థక్కరు సంతుష్టి చెందెను. 

శ్యామా థక్కరును కాకా యజమానిగా బాబాకు పరిచయము చేసెను. అందుకు బాబా యిట్లనెను. "అతడెట్లు వానికి యజమాని కాగలడు? అతని యజమాని వేరొకరు గలడు". కాకా యీ జవాబుకు చాలా ప్రీతిచెందెను. తన మనోనిశ్చయము మరచి ధక్కరు బాబాకు నమస్కరించి వాడాకు తిరిగిపోయెను.

మధ్యాహ్నహారతియైన పిమ్మటు, వారందరు బాబా సెలవు దీసికొనుటకు మసీదుకు బోయిరి. శ్యామా వారి పక్షమున మాట్లాడెను. బాబా యిట్లు చెప్పదొడంగెను.

"ఒక చంచలమనస్సుగల పెద్దమనుష్యు డుండెను. అతనికి ఆరోగ్యము ఐశ్వర్యము కూడ నుండెను. ఎట్టి విచారములు లేకుండెను. అనవసరమైన యారాటములు పైన వేసుకొని, యక్కడక్కడ తిరుగుచు మనశ్శాంతిని పోగొట్టుకొనుచుండెను. ఒక్కొక్కప్పుడు భారము లన్నియు వదిలివేయుచుండెను; మరొకప్పుడు వానిని మోయుచుండెను. అతని మనస్సునకు నిలకడ లేకుండెను. అతని స్థితి కనిపెట్టి కనికరించి నేను, "నీ కిష్టము వచ్చిన చోట నీ నమ్మకము పాదుకొల్పుము. ఎందుకిట్లు భ్రమించెదవు? ఒకేచోట నాశ్రయించుకొని నిలకడగా నుండు" మని చెప్పితిని."

వెంటనే ధక్కరదియంతయు తన గూర్చియే యని గ్రహించెను. కాకా కూడ తన వెంట రావలె ననుకొనెను. కాని కాకాకు అంత త్వరగా షిరిడీ విడుచుట కాజ్ఞ దొరకునని యెవ్వరనుకొనలేదు. బాబా దీనిని కూడ కనుగొని కాకాను అతని యజమానితో పోవుట కనుజ్ఞ నిచ్చెను. ఈ విధముగా బాబా సర్వజ్ఞుడనుటకు ధక్కరు కింకొక నిదర్శనము దొరికెను.

బాబా కాకాను 15 రూపాయలు దక్షిణ యడిగి పుచ్చుకొని అతని కిట్లని చెప్పెను. "నేను ఒక రూపాయి దక్షిణ యెవరివద్దనుంచి గాని తీసికొనినచో దానికి పదిరెట్లు ఇవ్వవలెను. నేనూరకనే యేమి తీసికొనను. యుక్తాయుక్తములు తెలియకుండగ నే నెవరిని అడుగను. ఫకీరెవరిని చూపునో వారివద్దనే నేను తీసికొనెదను. ఎవరైన ఫకీరుకు గతజన్మనుంచి బాకీ యున్నచో, వాని వద్దనే ధనము పుచ్చుకొందును. దానము చేయువాడిచ్చునది ప్రస్తుతము విత్తనములు నాటుటవంటిది. అది మునుముందు గొప్ప పంట అనుభవించుట కొరకే. ధర్మము చేయుటకు ధనముపయోగించవలెను. దానిని సొంతమునకు వాడుకొనిన నది వ్యర్థమయిపోవును. గతజన్మలో నీ విచ్చియుంటేనే గాని, నీ విప్పు డనుభ వించలేవు. కనుక ధనమును పొందవలెననినచో. దానిని ప్రస్తుత మితరుల కిచ్చుటయే సరియైన మార్గము. దక్షిణ యిచ్చుచున్నచో వైరాగ్యము పెరుగును. దానివలన భక్తిజ్ఞానములు కలుగును. ఒక రూపాయి నిచ్చి 10 రూపాయలు పొందవచ్చును."

ఈ మాటలు విని, థక్కరు తన నిశ్చయమును మరచి 15 రూపాయలు బాబా చేతిలో పెట్టెను. షిరిడీకి వచ్చుట మేలయిన దనుకొనెను. ఏలన, అతని సంశయము లన్నియును తొలగెను. ఆతడెంతయో నేర్చుకొనెను.

అటువంటివారి విషయములో బాబా ప్రయోగించు యుక్తి మిక్కిలి యమోఘమయినది. అన్ని బాబాయే చేయుచున్నను, దేనియందభిమాన ముంచలేదు. ఎవరయినను నమస్కరించినను నమస్కరించకపోయినను, దక్షిణ యిచ్చినను, ఈయకున్నను తన కందరు సమానమే. బాబా యెవరిని అవమానించలేదు. తనను పూజించినందుకు గర్వించెడివారు కాదు. తనను పూజించలేదని విచారించెడువారు కాదు. వారు ద్వంద్వాతీతులు.

నిద్రపట్టని రోగము

బాంద్రానివాసి కాయస్థ ప్రభుజాతికి చెందిన ఒక పెద్దమనుష్యుడు చాలకాలము నిద్రపట్టక బాధపడుచుండెడివాడు. నిద్రించుటకై నడుము వాల్చగనే గతించిన తన తండ్రి స్వప్నములో గానిపించి తీవ్రముగా తిట్టుచుండెడివాడు. ఇది అతని నిద్రను భంగపరచి రాత్రియందస్థిరునిగా చేయుచుండెను. ప్రతిరోజిట్లు జరిగి, యేమి చేయుటకు తోచకుండెను. ఒకనాడు బాబా భక్తునితో నీ విషయము మాట్లాడెను. బాబా ఊదియే దీనిని తప్పనిసరిగ బాగుచేయునని అతడు సలహా ఇచ్చెను. అతడు వానికి కొంత ఊదీ నిచ్చి ప్రతిరోజు నిద్రించుటకు ముందు కొంచెము నుదుటకి రాసుకొని మిగత పొట్లమును తలక్రింద దిండుకు దిగువ బెట్టుకొను మనెను. ఇట్లు చేసిన పిమ్మట, సంతోషము, ఆశ్చర్యము కలుగునట్లు అతనికి మంచినిద్రపట్టెను. ఎట్టి చికాకు లేకుండెను. అతడుసాయిని నిత్యము స్మరించుచుండెను. సాయిబాబా పటమును దెచ్చి గోడపై వ్రేలాడదీసెను. దానిని ప్రతిరోజు పూజించు చుండెను. గురువారము నాడు పూలమాల వేయుచుండెను. నైవేద్యము సమర్పించు చుండెను. పిమ్మట నతని వ్యాధి పూర్తిగా తగ్గిపోయెను.

బాలాజీ పాటీలు నేవాస్కరు

వీరు బాబాకు గొప్పభక్తులు. వీరు ఫలాపేక్ష లేకుండ చాలమంచి సేవ చేసిరి. ఇతడు షిరిడీలో బాబా యేయే మార్గముల ద్వారా పోవుచుండెనో వాని నన్నిటిని తుడిచి శుభ్రము చేయుచుండెను. వారి యనంతరము ఈ పని రాథాకృష్ణమాయి, యతిశుభ్రముగా నెరవేర్చుచుండెను. ఆమె తరువాత అబ్దుల్లా చేయుచుండెను. బాలాజీ ప్రతిసంవత్సరము పంట కోయగనే దాని నంతయు దెచ్చి, బాబా కర్పితము చేయుచుండెను. బాబా యిచ్చినదానితో తాను కుటుంబమును పోషించుకొనువాడు. ఈ ప్రకారముగా నతడు చాలసంవత్సరములు చేసెను. అతని తరువాత అతని కుమారుడు దాని నవలంబించెను.

ఊదీ ప్రభావము

ఒకనాడు బాలాజీ సాంవత్సరికమునాడు నేవాస్కరు కుటుంబము వారు కొంతమంది బంధువులను భోజనమునకు బిలచిరి. భోజనసమయానికి పిలచినవారికంటె మూడురెట్లు బంధువులు వచ్చిరి. నేవాస్కరు భార్యకు సంశయము కలిగెను. వండిన పదార్థములు వచ్చిన వారికి చాలవనియు, కుటుంబ గౌరవమునకు భంగము కలుగుననియు ఆమె భయపడెను. ఆమె యత్తగారు ఓదార్చుచు, "భయపడకుము. ఇది మనది కాదు. ఇది సాయి యాహారమే. అన్ని పాత్రలు గుడ్డలతో పూర్తిగ కప్పివేయుము. వానిలో కొంచెము ఊదీ వేయుము. గుడ్డ పూర్తిగ తీయకుండ వడ్డన చేయుము. సాయి మనలను కాపాడును." అనెను. ఆమె యీ సలహా ప్రకారమే చేసెను. వచ్చినవారికి భోజనపదార్థములు సరిపోవుటయేగాక, ఇంకను చాల మిగిలెను. తీవ్రముగా ప్రార్థించినచో, యథాప్రకారము ఫలితమును బొందవచ్చునని యీ సంఘటనము తెలుపుచున్నది.

సాయి పామువలె గాన్పించుట

ఒకనాడు షిరిడీవాసి రఘుపాటీలు నెవాసెలో నున్న బాలాజీ పాటీలింటికి వెళ్ళెను. ఆనాడు సాయంకాల మొకపాము ఆవులకొట్టము లోనికి బుసకొట్టుచు దూరెను. అందులోని వశువులన్నియు భయపడి కదల జొచ్చెను. ఇంటిలోనివారందరు భయపడిరి. కాని బాలాజీ శ్రీ సాయియే ఆ రూపమున వచ్చెనని భావించెను. ఏమియు భయపడక గిన్నెతో పాలు దెచ్చి సర్పము ముందు బెట్టి యిట్లనెను. "బాబా ఎందుకు బుసకొట్టుచున్నావు? ఎందులకీ యలజడి? మమ్ము భయపెట్టదలచితివా? ఈ గిన్నెడు పాలను దీసికొని నెమ్మదిగా త్రాగుము." ఇట్లనుచు అతడు దాని దగ్గర నిర్భయముగా గూర్చుండెను. ఇంటిలోని తక్కిన వారు భయపడిరి. వారికి ఏమి చేయుటకు తోచకుండెను. కొద్ది సేపటిలో సర్పము తనంతటతానే మాయమైపోయెను. ఎంత వెదికినను కనిపించ లేదు.

బాలాజీకి ఇద్దరు భార్యలు, కొంతమంది బిడ్డలుండిరి. బాబా దర్శనమునకై వారప్పుడప్పుడు షిరిడీకి పోవుచుండెడివారు. వారికొరకు చీరలు, బట్టలు కొని యాశీర్వచనములతో బాబా వారికి ఇచ్చుచుండెడివారు.
ఓం నమోః శ్రీ సాయినాథాయ
శాంతిః శాంతిః శాంతిః
ముప్పదియైదవ అధ్యాయము సంపూర్ణము.

|సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు|
|శుభం భవతు|

శ్రీ సాయి సత్ చరిత్రము ముప్పదిమూడవ అధ్యాయము


ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

ముప్పదిమూడవ అధ్యాయము

ఊదీ మహిమ

1. తేలుకాటు, ప్లేగు జ్వరములు నయమగుట, 2. జామ్ నేర్ చమత్కారము, 3. నారాయణరావు జబ్బు, 4. బాల బువ సుతార్, 5. అప్పాసాహెబు కులకర్ణి, 6. హరి భాఉ కర్ణిక్ - కథలు.

గత అధ్యాయములో గురువు మహిమను వర్ణించితిమి. ఇందులో ఊదీ మహిమను వర్ణించెదము.

ప్రస్తావన

మన మిప్పుడు గొప్ప యోగీశ్వరులకు నమస్కరించెదము. వారి కరుణాకటాక్షములు, కొండంత పాపములను గూడ నశింపజేయును. మనలోని దుర్గుణములను పోగొట్టును. వారి సామాన్యపు పలుకులే మనకు నీతులు బోధించును. అమృతానందమును ప్రసాదించును. ఇది నాది, అది నీది, యను భేదభావము వారి మనస్సులందు పుట్టదు. వారి ఋణమును ఈ జన్మయందుగాని వచ్చే పెక్కుజన్మలయందుగాని మనము తీర్చుకొనలేము.

ఊదీ ప్రసాదము

బాబా యందరివద్దనుంచి దక్షిణ తీసికొనుచుండునని యందరికి తెలిసిన విషయము. ఈ విధముగా వసూలుచేసిన మొత్తములో నెక్కువ భాగము దానము చేసి మిగతదానితో వంటచెఱకును (కట్టెలను) కొనుచుండెను. ఈ కట్టెలను బాబా ధునిలో వేయుచుండెను. దానిని నిత్యము మంట పెట్టుచుండెను. అది యిప్పటికి నటులే మండుచున్నది. అందులోని బూడిదనే ఊది యనుచున్నాము. బాబా దానిని భక్తులకు తమతమ యిండ్లకుతిరిగి పోవునప్పుడు పంచిపెట్టెడివారు.

ఊదీవలన బాబా యేమి బోధించ నుద్దేశించెను? ప్రపంచములో కనిపించు వస్తువులన్నియు బూడిదవలె అశాశ్వతములు. పంచభూతములచే చేయబడిన మన శరీరములన్నియు సౌఖ్యముల ననుభవించిన పిమ్మట పతనమైపోయి బూడిద యగును. ఈ సంగతి జ్ఞప్తికి దెచ్చుటకై బాబా భక్తులకు ఊదీ ప్రసాదమును పంచిపెట్టుచుండెను. ఈ ఊదీ వలననే బ్రహ్మము నిత్యమనియు, ఈ జగత్తు అశాశ్వతమనియు, ప్రపంచములో గల బంధువులు, కొడుకుగాని, తండ్రిగాని, తల్లిగాని, మనవాండ్రు కారనియు బాబా బోధించెను. ఈ ప్రపంచములోనికి మనము ఒంటరిగా వచ్చితిమి, యొంటరిగానే పోయెదము. ఊదీ యనేకవిధముల శారీరక మానసిక రోగములను బాగుచేయుచుండెను. భక్తుల చెవులలో బాబా ఊదీద్వారా నిత్యానిత్యమునకు గల తారతమ్యము, అనిత్యమైనదానియం దభిమానరాహిత్యము గంటమ్రోత వలె వినిపించుచుండెను. మొదటిది (ఊది) వివేకము, రెండవది (దక్షిణ) వైరాగ్యము బోధించుచుండెను. ఈ రెండును కలిగియున్నగాని సంసారమనే సాగరమును దాటలేము. అందుచే బాబా యడిగి దక్షిణ తీసికొనుచుండెను. షిరిడీనుంచి యింటికి పోవునప్పుడు భక్తులకు ఊదీయే ప్రసాదముగా నిచ్చి, కొంత నుదుటపై వ్రాసి తన వరదహస్తమును వారి శిరస్సులపై నుంచుచుండెను. బాబా సంతోషముతో నున్నప్పుడు పాడుచుండెడివారు. పాటలలో ఊదీ గురించి యొకటి పాడుచుండిరి. దాని పల్లవి "కళ్యాణ రామ రారమ్మ; గోనెలతో ఊదీని తేతెమ్ము." బాబా దీనిని చక్కని రాగముతో మధురముగా పాడుచుండెడివారు.

ఇదంతయు ఊదియొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యము. దానికి భౌతిక ప్రాధాన్యము కూడ కలదు. అది ఆరోగ్యమును, ఐశ్వర్యమును యాతురతల నుండి విమోచనము మొదలగునవి యొసగుచుండెను. ఇక ఊదీ గూర్చిన కథలను ప్రారంభించెదము.


తేలుకాటు

నాసిక్ నివాసియగు నారాయణ మోతీరాంజాని యనునతడు బాబా భక్తుడు. అతడు రామచంద్ర వామనమోదక్ యను బాబా భక్తునివద్ద ఉద్యోగము చేయుచుండెను. అతడు ఒకసారి తనతల్లితో షిరిడీకి పోయి బాబాను దర్శించెను. అప్పుడు స్వయముగా బాబా అతడు మోదక్ సేవను మాని, తాను సొంతముగా వ్యాపారము పెట్టుకొనవలెనని చెప్పెను. కొన్ని దినముల తరువాత బాబా మాట సత్యమయ్యెను. నారాయణ జాని ఉద్యోగము మాని స్వయముగా 'ఆనందాశ్రమము' అను హోటలు పెట్టెను. అది బాగా అభివృద్ధి చెందెను. ఒకసారి యీ నారాయణరావు స్నేహితునికి తేలు కుట్టెను. దాని బాధ భరింపరానంత యుండెను. అటువంటి విషయములలో ఊదీ బాగా పనిచేయును. నొప్పియున్న చోట ఊదీని రాయవలెను. అందుచే నారాయణరావు ఊదీకొరకు వెదకెను. కాని యది కనిపించలేదు. అతడు బాబా పటము ముందర నిలచి బాబా సహాయము కోరి, బాబా నామజపము చేసి, బాబా పటము ముందు రాలిబడిన అగురవత్తి బూడిద చిటికెడంత తీసి దానినే ఊదీగా భావించి, నొప్పి యున్నచోట రాసెను. అతడు ఊదీ రాసిన చేయి తీసివేయగనే నొప్పి మానిపోయెను. ఇద్దరు ఆశ్చర్యానందములలో మునిగిరి.

ప్లేగు జబ్బు

ఒకానొకప్పుడు బాంద్రాలో నుండు బాబా భక్తుని కొమార్తె వేరొక గ్రామమున ప్లేగు జ్వరముతో బాధపడుచుండెను. తనవద్ద ఊదీ లేదనియు, కనుక ఊదీ పంపుమనియు నానాసాహెబు చాందోర్కరు గారికి అతడు కబురు పంపెను. ఈ వార్త నానాసాహెబుకు ఠాణా రైల్వేస్టేషనువద్ద తెలిసెను. అప్పుడతడు భార్యతోకూడ 'కళ్యాణ్' పోవు చుండెను. వారివద్ద అప్పుడు ఊదీ లేకుండెను. కావున రోడ్డుపైని మట్టిని కొంచెము తీసి, సాయి నామజపము చేసి, సహాయము నభ్యర్ధించి నానా సాహెబు తన భార్య నుదుటిపై రాసెను. ఆ భక్తుడిదంతయు జూచెను. అతడు తన కొమార్తె యింటికి పోవుసరికి మూడు రోజుల నుండి బాధ పడుచున్న వాని కూతురు జబ్బు నానాసాహెబు తనభార్య నుదుటిపై మట్టిని పూసినప్పటినుండి తగ్గెనని విని మిక్కిలి సంతసించెను.

జామ్నేర్ చమత్కారము

1904 - 1905 వ సంవత్సరమున నానాసాహెబు చాందోర్కర్ జామ్నేర్ లో, మామలతుదారుగా నుండెను. ఇది ఖాందేషు జిల్లాలో షిరిడీకి 100 మైళ్ల దూరములో నున్నది. ఆయన కొమార్తె మైనతాయి గర్భిణి; ప్రసవించుటకు సిద్ధముగా నుండెను. ఆమెస్థితి బాగులేకుండెను. ఆమె రెండుమూడు దినములనుండి ప్రసవవేదన పడుచుండెను. నానా సాహెబు ఔషధము లన్నియు వాడెను. కాని ప్రయోజనము లేకుండెను. అప్పుడు బాబాను జ్ఞప్తికి దెచ్చుకొని వారి సహాయము వేడెను. షిరిడీలో రామ్ గిర్ బువ యను సన్యాసి యుండెను. బాబా అతనిని బాపుగిర్ బువ యనువారు. అతని స్వగ్రామము ఖాందేషులో నుండెను. అత డచ్చటికి పోవుటకు నిశ్చయించుకొనెను. బాబా అతనిని బిలిచి మార్గమధ్యమున జామ్నేర్ లో కొంత విశ్రాంతి తీసికొని నానాసాహెబుకు ఊదిని హారతి పాటను ఇమ్మనెను. తనవద్ద రెండేరుపాయి లున్నవనియు, అవి జలగామ్ వరకు రైలుటిక్కెటుకు సరిపోవుననియు, కాబట్టి జలగామ్ నుండి జామ్నేర్ పోవుటకు (సుమారు 30 మైళ్ళు) ధనము లేదని రామగిర్ బువ చెప్పెను. అన్నియు సరిగా అమరును గాన, నీవు కలత జెందనవసరము లేదని బాబా పలికెను. శ్యామాను బిలచి మాధవ ఆడ్కర్ రచించిన హారతిని వ్రాయుమనెను. హారతి పాటను ఊదీని రామగిర్ బువాకిచ్చి నానాసాహెబుకు అందజేయుమనెను. బాబా మాటలపయి ఆధారపడి రామగిర్ బువ షిరిడీ విడచి, రాత్రి రెండున్నర గంటలకు జలగామ్ చేరెను. అచటికి చేరునప్పటికి అతనిచెంత 2 అణాలు మాత్రమే యుండెను. కాబట్టి కష్టదశలో నుండెను. అప్పుడే యెవరో "బాపుగిర్ బువా యెవరు?" అని కేక వైచుచుండిరి. బువా యచ్చటికి పోయి తానేయని చెప్పెను. నానాసాహెబు పంపించినారని చెప్పుచు, ఆ బంట్రోతు ఒక చక్కని టాంగావద్దకు దీసికొని పోయెను. దానికి రెండు మంచి గుఱ్ఱములు కట్టియుండెను. ఇద్దరు అందులో కూర్చుండి బండిని వదిలిరి. టాంగా వేగముగా బోయెను. తెల్లవారు జామున టాంగా యొక సెలయేరువద్దకు చేరెను. బండి తోలువాడు గుఱ్ఱములను నీళ్ళు త్రాగించుటకు పోయెను. బంట్రోతు రామగిర్ బువాను ఫలహారము చేయుమని, ఫలహారపు దినుసులను బెట్టెను. గడ్డముమీసములున్న ఆ బంట్రోతు బట్టలు చూచి రామగిర్ బువా యతడు మహమ్మదీయుడని సంశయించి ఫలహారముల తినకుండెను. కాని యా బంట్రోతు తాను హిందువుడ ననియు, గర్ వాల్ దేశపు క్షత్రియుడ ననియు, నానాసాహెబు ఆ ఫలహారముల బంపెను గాన, తినుట కెట్టి సంశయము వలదనెను. అప్పుడిద్దరు కలిసి ఫలహారము చేసి బయలు దేరిరి. ఉషఃకాలమున జామ్ నేర్ చేరిరి. ఒంటికి పోసుకొనుటకై రామ్ గిర్ బువా టాంగా దిగి రెండు మూడు నిమిషములలో వచ్చెను. తిరిగి వచ్చుసరికి టాంగా గాని, టాంగా తోలువాడు గాని, బంట్రోతు గాని లేకుండిరి. బాపుగిర్ బువ నోటివెంట మాట రాకుండెను. దగ్గరనున్న కచేరికి బోయి యడుగగా, నానా సాహెబు ఇంటివద్దనే యున్నట్లు దెలిసెను. నానాసాహెబుగారింటికి వెళ్ళి తాను షిరిడీ సాయిబాబా వద్దనుంచి వచ్చినట్లు చెప్పెను. బాబా ఊదీ, హారతి పాట నానాసాహెబు కందజేసెను. మైనతాయి చాల దుస్థితిలో నుండెను. అంద రామెగూర్చి మిగుల ఆందోళన పడుచుండిరి. నానా సాహెబు తన భార్యను బిలచి ఊదీని నీళ్ళలో కలిపి కొమార్తె కిచ్చి, హారతిని పాడుమనిరి. బాబా మంచి సమయములో సహాయము బంపెననుకొనిరి. కొద్దినిమిషములలో ప్రసవము సుఖముగా జరిగెనని వార్త వచ్చెను. గండము గడచినదని చెప్పిరి. నానాసాహెబు గారు టాంగా నౌకరును, ఫలహారములను పంపినందుకు బాపుగిర్ బువా ఆయనకు కృతజ్ఞత తెలుపగా నాతడు మిక్కిలి యాశ్చర్యపడెను. షిరిడీనుండి యెవ్వరు వచ్చుచున్నది అతనికి తెలియదు. కనుక నత డేమియు పంపియుండలేదని చెప్పెను.

బి.వి. దేవ్ గా రీవషయమై బాపురావు చాందోర్కరును, రామగిర్ బువాను కలిసికొని విచారించి సాయిలీలా మాగజైన్ లో (XII - 11, 12, 13) గొప్ప వ్యాసమును ప్రకటించినారు. బి.వి. నరసింహస్వామిగారు మైనతాయీ, బాపూరావు చాందోర్కరు, రాంగిర్ బువాల వాజ్ఞ్మూలమును సేకరించి "భక్తుల అనుభవములు" అను గ్రంథమున (3వ భాగము) ప్రకటించినారు.

భక్తనారాయణరావుకు బాబాను రెండుసారులు దర్శనముచేయు భాగ్యము కలిగెను. బాబా సమాధి చెందిన మూడేండ్లకు షిరిడీకి పోవలెననుకొనెను. కాని, పోలేకపోయెను. బాబా సమాధి చెందిన యొక సంవత్సరములో నతడు జబ్బు పడి మిగుల బాధపడుచుండెను. సాధారణ చికిత్సలవలన ప్రయోజనము కలుగలేదు. కావున రాత్రింబవళ్ళు బాబాను ధ్యానించెను. ఒకనాడు స్వప్నములో నొకదృశ్యమును జూచెను. అందు బాబా అతనిని ఓదార్చి యిట్లనెను. "ఆందోళన పడవద్దు. రేపటి నుంచి బాగగును. వారము రోజులలో నడువగలవు." స్వప్నములో చెప్పిన రీతిగా రోగము వారములో కుదిరెను. ఇచట మన మాలోచించవలసిన విషయమిది. "శరీర మున్నన్నాళ్ళు బాబా బ్రతికి యుండిరా? శరీరము పోయినదిగాన చనిపోయినారా?" లేదు. ఎల్లప్పుడు జీవించియే యున్నారు. వారు జననమరణముల కతీతులు. ఎవరయితే బాబా నొకసారి హృదయపూర్వకముగా ప్రేమించెదరో వారెక్క డున్నప్పటికి ఎట్టి సమయమందుగాని బాబానుంచి తగిన జవాబు పొందెదరు. వారెల్లప్పుడు మన ప్రక్కనే యుందురు. ఏ రూపములోనో భక్తునకు దర్శనమిచ్చి వాని కోరికను నెరవేర్చెదరు.

బాలబువ సుతార్

బొంబాయిలో నుండు యోగియగు బాలబువ సుతార్ 1917వ సంవత్సరమున మొదటిసారి షిరిడీకి వచ్చెను. అతడు గొప్పభక్తుడు. వారెల్లప్పుడు ధ్యానము, భజన చేయుటచే వారిని 'నవయుగ తుకారామ్' అని పిలుచువారు. వారు బాబాకు నమస్కరించగా బాబా "నేనీతనిని నాలుగు సంవత్సరములనుండి యెరుగుదును." అనెను. తాను మొదటి సారిగా ఇప్పుడే షిరిడీకి వచ్చినవా డగుటచే బాలబువ ఇదెట్లు సంభవమనుకొనెను. కాని తీవ్రముగా నాలోచించగా బొంబాయిలో 4 సంవత్సరముల క్రిందట బాబా ఫోటోకు నమస్కరించినట్లు జ్ఞప్తికి వచ్చెను. బాబా మాటల ప్రాముఖ్యమును గ్రహించెను. తనలో తానిట్లనుకొనెను. "యోగు లెంతటి సర్వజ్ఞులు సర్వాంతర్యాములు? తన భక్తులందు వారి కెంత ప్రేమ? నేను వారి ఫోటోను చూచుట వారిని స్వయముగా చూచిన దానితో సమానమని నాకు బోధించిరి."

అప్పా సాహెబు కులకర్ణి

1917వ సంవత్సరమున అప్పాసాహెబు కులకర్ణివంతు వచ్చెను. అతడు ఠాణాకు బదిలీ యయ్యెను. బాలాసాహెబు భేటే అతనికి బాబా ఫోటో నిచ్చియుండెను. అతడు దానిని జాగ్రత్తగా పూజించుచుండెను. పువ్వులు, చందనము, నైవేద్యము బాబాకు నిత్యమర్పించుచు బాబాను చూడవలెనని మిగుల కాంక్షించుచుండెను. ఈ సందర్భమున బాబా పటమును మనఃపూర్వకముగా చూచినచో బాబాను ప్రత్యక్షముగా చూచిన దానితో సమానమే యని చెప్పవచ్చును. (దీనికి నిదర్శనము పైన జెప్పబడిన కథ).

కులకర్ణి ఠాణాలో నుండగా భివండి పర్యటనకు బోవలసివచ్చెను. ఒక వారమురోజుల లోపల తిరిగి వచ్చుట కవకాశము లేకుండెను. అతడు లేనప్పుడు మూడవరోజున ఈ దిగువ యాశ్చర్యమయిన సంగతి జరిగెను. మధ్యాహ్నము 12గంటలకు ఒక ఫకీరు అప్పాకులకర్ణి యింటికి వచ్చెను. వారి ముఖలక్షణములు సాయిబాబా ముఖలక్షణములతో సరిపోయెను. కులకర్ణిగారి భార్యాబిడ్డలు, వారు షిరిడీ సాయిబాబాగారా యని యడిగిరి. వారిట్లు నుడివిరి. "లేదు. నేను భగవంతుని సేవకుడను. వారి యాజ్ఞానుసారము మీ యోగ క్షేమములను కనుగొనుటకు వచ్చితిని." అట్లనుచు దక్షిణ నడిగెను. ఆమె ఒక రూపాయి నిచ్చెను. వారొక చిన్న పొట్లముతో ఆమెకు ఊదీ నిచ్చి, దానిని పూజలో ఫోటోతో కూడ నుంచుకొని పూజించుమనిరి. పిమ్మట యిల్లు విడిచి వెళ్లిపోయిరి. ఇక చిత్రమైన సాయిలీలను వినుడు.

భివండిలో తన గుఱ్ఱము జబ్బుపడగా అప్పాసాహెబు తన పర్యటన మానుకొనవలసి వచ్చెను. ఆనాటి సాయంకాలమే తిరిగి ఇల్లు చేరెను. ఫకీరుగారి రాక భార్యవల్ల వినెను. ఫకీరుగారి దర్శనము దొరకనందులకు మిగుల మనోవేదన పొందెను. ఒక్కరూపాయి మాత్రమే దక్షిణగా నిచ్చుట కిష్టపడకుండెను. తానే యింటివద్ద నున్నచో 10రూపాయలకు తక్కువగాకుండ దక్షిణ యిచ్చి యుందుననెను. వెంటనే ఫకీరును వెదకుటకై బయలుదేరెను. మసీదులలోను, తక్కిన చోట్లను భోజనము చేయకయే వారికొరకు వెదకెను. అతని యన్వేషణ నిష్ఫలమయ్యెను. ఇంటికి వచ్చి భోజనము చేసెను. 32వ అధ్యాయములో ఉత్తకడుపుతో భగవంతుని వెదకరాదని బాబా చెప్పినది చదువరి గమనించవలెను. అప్పాసాహె బిచ్చట ఒక నీతిని నేర్చుకొనెను. భోజనమయన తరువాత చిత్రేయను స్నేహితునితో వాహ్యాళికి బయలుదేరెను. కొంతదూరము పోగా నెవరో వారివైపు త్వరగా వచ్చుచున్నట్లు గాన్పించెను. వారి ముఖలక్షణములనుబట్టి వారు తన యింటికి 12గంటలకు వచ్చినవారే యని యనుకొనెను. వెంటనే ఫకీరు చేయి చాచి దక్షిణ నడిగెను. అప్పాసాహెబు ఒక రూపాయి నిచ్చెను. వారు తిరిగి యడుగగా ఇంకా రెండురూపాయ లిచ్చెను. అప్పటికి అతడు సంతుష్టి చెందలేదు. అప్పాసాహెబు చిత్రేవద్దనుంచి మూడు రూపాయలు తీసుకొని ఫకీరుకు ఇచ్చెను. వారింకను దక్షిణ కావలెననిరి. అప్పాసాహెబు వారి నింటికి రావలసినదని వేడుకొనెను. అందరు ఇల్లు చేరిరి. అప్పాసాహెబు వారికి 3 రూపాయలిచ్చెను. మొత్తము తొమ్మిది రూపయలు ముట్టెను. అప్పటికి సంతుష్టి చెందక ఫకీరు ఇంకను దక్షిణ యిమ్మనెను. అప్పాసాహెబు తనవద్ద పదిరూపాయల నోటు గలదనెను. ఫకీరు దానిని పుచ్చుకొని తొమ్మిది రూపాయలు తిరిగి యిచ్చివేసి యక్కడనుండి వెడలెను. అప్పాసాహెబు పదిరూపాయలిచ్చెదననెను గనుక ఆ మొత్తమును దీసికొని పవిత్రపరచిన పిమ్మట తొమ్మిది రూపాయల నిచ్చి వేసెను. సంఖ్య 9 చాల ముఖ్యమైనది. అది నవవిధభక్తులను తెలియజేయును. (బాబా లక్ష్మీబాయి శిందేకు 9 రూపాయలు సమాధి సమయమందిచ్చిరి). అప్పాసాహెబు ఊదీ పొట్లమువిప్పి చూచెను. అందులో పువ్వుల రెక్కలును అక్షతలునుండెను. కొంత కాలము పిమ్మట బాబాను షిరిడీలో దర్శించినప్పుడు వారి వెంట్రుక యొకటి చిక్కెను. అతడు ఊదీ పొట్లమును, వెంట్రుకను, ఒక తాయెతులో పెట్టి తన దండపై కట్టుకొనెను. అప్పాసాహెబు ఊదీ ప్రభావము గ్రహించెను. అతడు మిక్కిలి తెలివైనవాడయినప్పటికి నెలకు 40 రూపాయలు జీతము మాత్రమే దొరకుచుండెను. బాబా ఫోటోను, ఊదీని పొందిన తరువాత 40 రూపాయల కెన్నో రెట్లు ఆదాయము వచ్చెను. మంచి పలుకుబడియు, అధికారమును లభించెను. ఈ లౌకికమైన కానుకలేగాక దైవభక్తికూడ వృద్ధి యగుచుండెను. కావున బాబా ఊదీని పొందు భాగ్యము కలవారు స్నానము చేసినపిమ్మట ఊదీని నుదుట రాసికొని, కొంచెము నీటిలో కలిపి బాబా పవిత్రమైన తీర్థముగ భావించి పుచ్చుకొనవలెను.

హరి భాఉ కర్ణిక్

ఠాణా జిల్లా దహను గ్రామమునుండి హరిభాఉ కర్ణిక్ అనునతడు 1917వ సంవత్సరమున గురుపౌర్ణమినాడు షిరిడీకి వచ్చి బాబాను తగిన లాంచనములతో పూజించెను; వస్త్రములు దక్షిణ సమర్పించెను. శ్యామాద్వారా బాబా సెలవు పొంది మసీదు మెట్లు దిగెను, అప్పుడే యింకొక రూపాయి బాబాకు దక్షిణ నివ్వవలెనని తోచగా మసీదు మరల ఎక్కుచుండగా, బాబా సెలవుపొందిన పిమ్మట తిరిగి వెనుకకు రారాదని విని యింటికి బయలు దేరెను. మార్గమధ్యమున నాసిక్ లో కాలా రాముని మందిరము ప్రవేశించి, దర్శనము చేసికొని వెలుపలికి వచ్చుచుండగా నరసింగ మహారాజు అను యోగి తన శిష్యులను విడచిలోపలనుండి బయటకు వచ్చి, హరి భాఉ ముంజేతిని బట్టుకొని "నా రూపాయి నాకిమ్ము" అనెను. కర్ణిక్ మిగుల ఆశ్చర్యపడెను. రూపాయిని సంతోషముగా నిచ్చి, సాయిబాబా యివ్వధముగా తానివ్వ నిశ్చయించుకొనిన రూపాయిని నరసింగ మహారాజుద్వారా గ్రహించెననుకొనెను.

యోగీశ్వరులంద రొకటే యనియు, ఏకాత్మతాభావముతో కార్యము లొనర్తురనియు నీకథ తెలుపుచున్నది.
ఓం నమోః శ్రీ సాయినాథాయ
శాంతిః శాంతిః శాంతిః
ముప్పదిమూడవ అధ్యాయము సంపూర్ణము.

|సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు|
|శుభం భవతు|


Different moods of sai


Different moods of sai

Photographs of Saibaba's Devotees kept in Samadhi Mandir- Shirdi


Photographs of Saibaba's Devotees kept in Samadhi Mandir- Shirdi

శ్రీ సాయి సత్ చరిత్రము ముప్పదిరెండవ అధ్యాయము


ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

ముప్పదిరెండవ అధ్యాయము

గురుని, దేవుని వెదుకుట; ఉపవాసము నామోదింపకుండుట

గురుని, దేవుని వెదుకుట; ఉపవాసము నామోదింపకుండుట

ఈ అధ్యాయములో హేమాడ్ పంతు రెండు విషయములను వర్ణించెను.

1. బాబా తన గురువును అడవిలో నెట్లు కలిసెను, వారి ద్వారా దేవుని గనెను. 2. గోఖలేగారి భార్య మూడురోజు లుపవసింప నిశ్చయించుకొనగా నామెచే బాబా యెట్లు బొబ్బట్లు తినిపించెను.

ప్రస్తావన

ప్రారంభమున హేమాడ్ పంతు సంసారమును, అశ్వత్థవృక్షముతో పోల్చుచు, గీతలో చెప్పిన ప్రకారము, దాని వ్రేళ్ళుమీదకు కొమ్మలు క్రిందకు గలవనెను. దాని కొమ్మలు క్రిందవైపు మీదివైపుగూడ వ్యాపించి యున్నవి; అవి గుణములచే పోషింపబడుచున్నవి. దాని యంకురములు ఇంద్రియ విషయములు. దాని వ్రేళ్ళు కర్మను చేయించుచు మానవప్రపంచమువరకు వ్యాపించి యున్నవి. దాని స్వరూపము గాని దాని యాధారముగాని, దాని యాద్యంతములు గాని ఈలోకమున తెలియరావు. వైరాగ్యమను పదునైన కత్తితో ఈ బలమైన వ్రేళ్ళుగల అశ్వత్థవృక్షమును నరికి, ఏ యతీతమార్గము ననుసరించిన తిరిగి జన్మలేదో యట్టిదాని ననుసరించవలెను.

అట్టి దారియందు నడచుటకు, దారి చూపు మంచిగురువు సహాయము మిక్కిలి యవసరము. ఒకడెంత పండితుడై నప్పటికిని వేదవేదాంగములను బాగుగ చదివినప్పటికిని, తన గమ్యస్థానమునకు సురక్షితముగ పోలేడు. మార్గదర్శియే యుండి సహాయపడి సరియైన దారి చూపినచో, మార్గములో నున్న గోతులనుండి, అడవి మృగముల నుండి తప్పించుకొని సుగమముగా పయనించును.

ఈ విషయములో బాబా యనుభవము బాబాయే స్వయముగా చెప్పెను. ఇది మిక్కిలి చిత్రమైనది. దీని ప్రకారము జాగ్రత్తగా నడచుకొన్నచో నమ్మకము, భక్తి, మోక్షము ప్రాప్తించను.

అన్వేషణము

ఒకానొకప్పుడు మేము నలుగురుము మత గ్రంథములు చదువుచు అజ్ఞానముతో బ్రహ్మము నైజముగూర్చి తర్కించ మొదలిడితిమి. మాలో నొకడు ఆత్మను ఆత్మచే ఉద్ధరించవలెను గాని యితరులపై నాధారపడరాదు అనెను. అందుకు రెండవవాడు మనస్సును స్వాధినమందుంచుకొన్నవాడే ధన్యుడనియు మనము ఆలోచనలనుండి భావముల నుండి ముక్తులమైనచో మనకంటె వేరైనది ఈ ప్రపంచములో మరేదియు లేదనియు చప్పెను. మూడవవాడు దృశ్యప్రపంచము సదాపరిణామ శీలమైన దనియు, నిరాకారమే శాశ్వతమైనదనియు కావున సత్యాసత్య విచక్షణ మవసరమనియు చెప్పెను. నాలుగవవారు (అనగా బాబా) "పుస్తక జ్ఞానమెందుకు పనికిరానిది. మనకు విధింపబడిన కర్మను మనము పూర్తిచేసి, తనువును, మనమును, పంచప్రాణములను గురువు పాదములపై బెట్టి శరణు వేడవలెను. గురువే దైవము; సర్వమును వ్యాపించిన వాడు. ఇట్టి ప్రత్యయ మేర్పడుటకు, దృఢమైన యంతులేని నమ్మక మవసరము" అనెను.

ఈ ప్రకారముగా తర్కించుచు, మేము నలుగురు పండితులము భగవంతుని వెదకుట కడవులలో తిరుగ నారంభించితిమి. తక్కిన ముగ్గురును వారి స్వతంత్రబుద్థి నుపయోగించి వెదక నిశ్చయించిరి. దారిలో ఒక వర్తకుడు (బంజారా) మమ్ములను కలిసి "ఇప్పుడు చాలా ఎండగా నున్నది. ఎంతదూరము పోవుచున్నారు? ఎక్కడికి పోవుచున్నా" రని యడిగెను. అడవులు వెదకుటకని మేము జవాబిచ్చితిమి. ఏమి వెదకుటకు పూనుకొంటిరని యతడు తిరిగి నడిగెను. ఏదో సందిగ్ధమైన యుక్తి జవాబిచ్చితిమి. ధ్యేయరహితముగా మేము తిరుగుట చూచి, యతడు కనికరించి యిట్లనెను. "అడవుల సంగతి పూర్తిగ తెలియకుండ మీ యిష్టము వచ్చినట్లు తిరుగరాదు. అడవులలో సంచరింపదలచినచో మీ వెంట నొక మార్గదర్శి యుండియే తీరవలెను. అనవసరముగా ఈ ఎండ వేళప్పుడు ప్రయాస పడెద రెందుకు? మీ రహస్యాన్వేషణము నాకు జెప్పనక్కరలేదు. అయినను మీరు కూర్చుండి, భోజనము చేసి, నీళ్ళు త్రాగి కొంత విశ్రాంతి దీసికొనిన పిమ్మట పోవచ్చును. ఓపికతో నుండు" డనెను. అతడంత మృదువుగా మాట్లాడినను, వానిని నిరాకరించి నడువ సాగితిమి. మా కన్ని సంగతులు దెలియును, కాన ఇతరుల సహాయమక్కర లేదనుకొంటిమి. అడవులు పెద్దవి, మార్గములు లేనివి. చెట్లు దగ్గరగాను, ఎత్తుగాను నుండుటచే సూర్యరశ్మి లోపల ప్రవేశింపకుండెను. కనుక దారి తప్పి యటునిటు చాలసేపు తిరిగితిమి. తుట్టతుద కెక్కడనుండి బయలుదేరితిమో యచ్చటికే యదృష్టవశాత్తు తిరిగి వచ్చితిమి. బంజారా తిరిగి కలిసికొని యిట్లనెను. "మీ తెలివితేటలపై నాధారపడి మీరు దారి తప్పిరి. చిన్నదానికిగాని, పెద్దదానికి గాని సరియైన మార్గము చూపుటకొక మార్గదర్శి యుండియే తీరవలెను. ఉత్తకడుపుతో నేయన్వేషణము జయప్రదము కాదు. భగవంతుడు సంకల్పించనిదే మనకు దారిలో నెవ్వరు కలియరు. పెట్టిన భోజనము వద్దనకుడు. వడ్డించిన విస్తరిని త్రోసివేయకుడు. భోజనపదార్థము లర్పించుట శుభసూచకములు." ఇట్లనుచు తిరిగి మమ్ములను ప్రశాంతముగా భోజనము చేయుమని బతిమాలెను. ఈ యాతిథ్యమున కిష్టపడక నిరాకరించి పోతిమి. విచారించక భోజనము చేయక ఆముగ్గురు తిరిగి సాగిపోవ నారంభించిరి. వారి హఠ మావిదముగా నుండెను. నేను మాత్రమాకలితోను, దాహముతోను నుంటిని. బంజారా ప్రదర్శించిన యసామాన్యప్రేమకు లొంగిపోతిని. మేమెంతో తెలివైనవార మనుకొంటిని కాని, దయా దాక్షిణ్యములకు దూరమయితిమి. బంజారా చదువుకొన్నవాడు కాడు; యోగ్యతలు లేనివాడు; తక్కువజాతివాడు. కాని, వాని హృదయము ప్రేమమయము. భోజనము చేయుమని మమ్ముల వేడెను. ఈ విధముగా ఫలాపేక్ష లేకుండ ఎవరయితే యితరులను ప్రేమించెదరో వారు నిజముగా నాగరికులని యెంచి వాని యాతిథ్యము నామోదించుటయే జ్ఞానమునకు ప్రథమ సోపానమని యనుకొంటిని. మిక్కిలి మర్యాదతో అతడు పెట్టిన భోజనము నేను తిని (అనగా బాబా) నీళ్ళు త్రాగితిని. 

ఏమి యాశ్చర్యము! వెంటనే మాగురువుగారు వచ్చి మాయెదుట నిలచిరి. వారడుగుటచే జరిగిన వృత్తాంతమంతయు విశదపరచితిని అప్పుడు వారు "నాతో వచ్చుట కిష్టపడెదరా? మీకు కావలసిన దేదో నేను జూపెదను. నాయందు విశ్వాసమున్న వారికే జయము కలుగును" అనిరి. తక్కినవారు వారి మాటలకు సమ్మతింపక యెక్కడికో పోయిరి. నేను మాత్రము వారికి గౌరవపూర్వకముగా నమస్కరించి వారి యాజ్ఞకు లోబడితిని. అంతట వారు నన్నొక బావి వద్దకు దీసికొని పోయినారు. నా కాళ్ళను తాడుతో కట్టి నన్ను తలక్రిందులుగా ఒక చెట్టుకు గట్టి బావిలో నీళ్ళకు మూడడుగుల మీదుగా నన్ను వ్రేలాడదీసిరి. నా చేతులతో గాని, నోటితో గాని నీళ్ళను అందుకొనలేకుంటిని. నన్ను ఈ విధముగా వ్రేలాడగట్టి వారు ఎచ్చటికో పోయిరి. 4, 5 గంటల తరువాత వారు మరల వచ్చి నన్ను బావిలోనుంచి బయటికి దీసి, యెట్లుంటివని యడిగిరి. "ఆనందములో మునిగియుంటిని. నేను పొందిన యానందమును నావంటి మూర్ఖుడెట్లు వర్ణించగలడు" అని జవాబిచ్చితిని. దీనిని విని గురువుగారు మిక్కిలి సంతుష్టి చెందిరి. నన్ను దగ్గరకు చేరదీసి, నా వీపును తమ చేతులతో తట్టి నన్ను వారివద్ద నుంచుకొనిరి. తల్లి పక్షి పిల్లపక్షులను జాగ్రత్తగా జూచునట్లు నన్ను వారు కాపాడిరి. నన్ను తమ బడిలో చేర్చుకొనిరి. అది చాల అందమైన బడి. అక్కడ నేను నా తల్లిదండ్రులను మరచితిని. నా యభిమాన మంతయు తొలగెను. నాకు సులభముగా విమోచనము కలిగెను. గురువుగారి మెడను కౌగలించుకొని వారిని తదేక దృష్టితో నెల్లప్పుడు చూచుచుండవలె ననిపించినది. వారి ప్రతిబింబము నా కనుపాపలందు నిలువనప్పుడు నాకు కనులు లేకుండుటే మేలనిపించెడిది. అది యటువంటి బడి. అందులో ప్రవేశించినవారెవరును రిక్తహస్తములతో బయటకురారు. నా గురువే నాకు సమస్తముగా తోచుచుండెను. నా యిల్లు, నా యాస్తి, నా తల్లిదండ్రులు అంతయు వారే. నా యింద్రియము లన్నియు తమతమ స్థానములు విడచి, నా కండ్లయందు కేంద్రీకృతమయ్యెను. నా దృష్టి గురువునందు కేంద్రీకృతమయ్యెను. నాధ్యానమంతయు నా గురువుపైననే నిల్పితిని. నాకింకొక దానియందు స్పృహలేకుండెను. వారిని ధ్యానము చేయునప్పుడు నా మనసు, నా బుద్ధి స్తబ్ధమగుచుండెను. నిశ్శబ్దముగా వారికి నమస్కరించుచుంటిని.

ఇతర పాఠశాలలలో పూర్తిగా మరొక విధమైన దృశ్యములు కానవచ్చును. భక్తులు జ్ఞానము సంపాదించుటకు పోయి ద్రవ్యమును, కాలమును, కష్టమును వ్యయము చేసెదరు. తుట్టతుదకు పశ్చాత్తాప పడెదరు. అక్కడున్న గురువు తనకు గల రహస్యశక్తిని గురించి తన ఋజువర్తనము గూర్చి పొగడుకొనుచు తన పావిత్ర్యమును ప్రదర్శించునే కాని, హృదయము మృదువుగా నుండదు. అత డనేకవిషయముల గూర్చి మాట్లాడును. తన మహిమను తానే పొగడుకొనును. కాని యతని మాటలు భక్తుల హృదయమందు నాటవు, వారిని యొప్పింపజేయవు. ఆత్మసాక్షాత్కార మతనికి తెలియనే తెలియదు. అటువంటి బడులు శిష్యుల కేమి మేలు చేయును? వారి కేమి లాభము? కాని, పైన పేర్కొన్న గురువు మరొక రకమువారు. వారి కటాక్షముచే ఎట్టి శ్రమలేకయే యాత్మజ్ఞానము దానిమట్టు కది నాయందు ప్రకాశించెను; నేను కోరుట కేమియు లేకుండెను. సర్వము దానిమట్టు కదియే పగటి ప్రకాశమువలె బోధపడెను. తల క్రిందుగను, కాళ్ళు మీదుగను నుంచుటవలన గలుగు ఆనందము గురువుకే తెలియను.

నలుగురిలో ఒకడు కర్మఠుడు (అనగా కర్మలయందు నమ్మకము గలవాడు). అతనికి కొన్ని కర్మలు, విధులు, నిషేధములు మాత్రమే తెలియును. రెండవవాడు జ్ఞాని. అతడు తనకున్న జ్ఞానమునకు గర్వించువాడు. మూడవవాడు భక్తుడు, భగవంతునికి సర్వస్యశరణాగతి చేసినవాడు, భగవంతుడే సర్వమును చేయువాడని అతని నమ్మకము. వారిట్లు తర్కించుచు వివాదపడుచుండగా దేవుని సమస్య వచ్చెను. వారు తమకు దెలిసిన విద్యపై నాధారపడి, దేవుని వెదకుటకు పోయిరి. వివేకమునకు, వైరాగ్యమునకు అవతారమగు శ్రీ సాయి ఆ నలుగురిలో నొకరు. పరబ్రహ్మస్వరూపులైకూడ వారెందుచేత నితరులతో కలిసి తెలివితక్కువగా ప్రవర్తించిరని యెవరైన నడుగవచ్చును. ప్రజాభిప్రాయమును, వారి మంచిని సంపాదించుటకును, వారికొక యుదాహరణము జూపుటకును, వారిట్లు చేసిరి. వారు అవతారపురుషులై నప్పటికి ఒక సాధారణుడైన బంజారాను గౌరవించి వాని యాహారము నామోదించిరి. అన్నము పరబ్రహ్మస్వరూపమని వారి నమ్మకము. బంజారా వాని యాహారమును నిరాకరించినవారు కష్టముల పాలయిరి. గురువు లేనిదే జ్ఞానము సంపాదించుటకు వీలుకాదని వారు బోధించిరి. తైత్తరీయోపనిషత్తు తల్లిని, తండ్రిని, గురువును, గౌరవించి పూజించి మతగ్రంథముల నభ్యసింపవలెనని చెప్పుచున్నది. ఇవియే మన మనస్సును పావనము చేయుటకు మార్గములు. మనస్సును పావనము చేయనిదే ఆత్మసాక్షాత్కారము పొందలేము. ఇంద్రియములుగాని, మనస్సుగాని, బుద్ధిగాని, ఆత్మను చేరలేవు. ప్రత్యక్షము, అనుమానము మొదలైన ప్రమాణములు మనకు ఈ విషయములో సహాయపడవు. గురువు గారి కటాక్షమే మనకు తోడ్పడును. ధర్మము, అర్థము, కామము, మన కృషివల్ల లభించును. కాని నాలుగవదియగు మోక్షము గురువు సహాయము వలననే పొందనగును.

సాయి దర్బారులోనికి అనేకమంది వచ్చి, వారికి తెలియు విద్యలను ప్రదర్శించి పోయెడివారు. జ్యోతిష్కులు రాబోవు విషయములు చెప్పుచుండెడివారు. యువరాజులు, గౌరవనీయులు, సామాన్యులు, పేదవారు, సన్యాసులు, యోగులు, పాటకాండ్రు మొదలగువారు బాబా దర్శనమునకై వచ్చెడివారు. ఒక మహారు (మాలవాడు) వచ్చి జోహారు చేసి యీ సాయి 'మాయి బాప' (తల్లియు తండ్రియు) అనియు, వారు మన చావుపుట్టుకలను తుడిచివేయుదురనియు చెప్పెను. గారడివాండ్రు, గ్రుడ్డివాండ్రు, చొట్టవారు, నర్తకులు, నాథసంప్రదాయమువారు పగటి వేషములవారు కూడ సమాదరింపబడుచుండిరి. తన వంతు రాగా, ఆ బంజారా కూడ గాన్పించెను. తన పాత్రయు ముగించెను. మన మిప్పుడింకొక కథను విందుము.

గోఖలేగారి భార్య - ఉపవాసము

బాబా యెన్నడు ఉపవసించలేదు. ఇతరులను కూడ ఉపవాసము చేయనిచ్చువారు కారు. ఉపవాసము చేయువారి మనస్సు స్థిమితముగా నుండదు. అట్టివాడు పరమార్థ మెట్లు సాధించును? ఉత్తకడుపుతో దేవుని చూడలేము. మొట్టమొదట ఆత్మను శాంతింప చేయవలెను. కడుపులో తడి కలుగ జేయు ఆహారము గాని, పౌష్టికశక్తి గాని లేనప్పుడు భగవంతుడి నేకండ్లతో చూడగలము? వేయేల మన యవయవము లన్నియు వాని శక్తిని అవి సంపాదించుకొన్నప్పుడు, అవి మంచిస్థితిలో నున్నప్పుడే, మనము భక్తిమొదలగు సాధనముల నాచరించి దేవుని చేర గలము. కాబట్టి ఉపవాసము గాని మితిమించిన భోజనముగాని మంచిది గాదు. ఆహారములో మితి, శరీరమునకు మనస్సునకు కూడ మంచిది.

గోఖలే గారి భార్య, కానిట్ కర్ గారి భార్యవద్దనుంచి దాదా కేల్కరుకు జాబు తీసికొని షిరిడీకి వచ్చెను. ఆమె బాబా పాదములవద్దమూడురోజులుపవసించి కూర్చొను నిశ్చయముతో వచ్చెను. అంతకు ముందురోజు బాబా దాదా కేల్కరుతో తన భక్తులను హోళిపండుగ నాడు ఉపవాసము చేయనీయనని చెప్పియుండెను. వారుపవసించినచో బాబా (తన) యొక్క ఉపయోగ మేమనెను. ఆ మరుసటిదినము ఆ స్త్రీ కేల్కరుతో పోయి బాబావద్ద కూర్చుండగా బాబా వెంటనే యామెతో "ఉపవాసము చేయవలసిన యవసరమేమి? దాదాభట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసి అతని పిల్లలకు బెట్టి నీవు కూడ తినుము." అనెను. హోళీ పండుగ వచ్చెను. కేల్కరుభార్య బయట చేరెను. దాదాభట్టు ఇంట్లో వండుట కెవరు లేకుండిరి. కావున బాబా సలహా సమయోచితముగా నుండెను. గోఖలేగారి భార్య దాదాభట్టు ఇంటికి బోయి బొబ్బట్లు చేసెను. ఆ రోజు అక్కడనే యుండెను. ఇతరులకు బెట్టెను, తాను తినెను. ఎంత మంచికథ! ఎంతచక్కని నీతి!

బాబా సర్కారు

బాబా తన బాల్యములో జరిగిన కథను ఈ విధముగ చెప్పెను. "నా చిన్నతనములో భుక్తికొరకు వెదకుచు బీడ్ గాం వెళ్ళితిని. అక్కడ నాకు బట్టలపై చేయు అల్లికపని దొరికెను. శ్రమ యనక కష్టపడి పని చేసితిని. యజమాని నాపనికి సంతుష్టి చెందెను. నాకంటె పూర్వము ముగ్గురు కుర్రవాళ్ళు పనిలో నుండిరి. మొదటివానికి 50 రూపాయలు రెండవవానికి 100 రూపాయలు, మూడవవానికి 150 రూపాయలు, నాకీమూడు మొత్తములకు రెండింతలు అనగా 600 రూపాయల జీత మిచ్చెను. నా తెలివితేటలు జూచి, యజమాని నన్ను ప్రేమించి నన్ను మెచ్చుకొని, నిండుదుస్తులిచ్చి, నన్ను గౌరవించెను. (తలపాగా, శెల్లా) వీనిని వాడకుండ జాగ్రత్తగా దాచుకొంటిని. మానవు డిచ్చినది త్వరలో సమసిపోవునుగాని, దైవమిచ్చునది శాశ్వతముగా నిలుచును. ఇంకెవ్వరిచ్చినది దీనితో సరిపోల్చలేము. నా ప్రభువు "తీసికో, తీసికో" అనును కాని, ప్రతివాడు నావద్దకు వచ్చి 'తే,తే' యనుచున్నాడు. నేనేమి చెప్పుచున్నానో గ్రహించువా డొక్కడును లేడు. నాసర్కారు యొక్క ఖజానా (ఆధ్యాత్మిక ధనము) నిండుగానున్నది. అది యంచువరకు నిండి పొంగిపోవుచున్నది. నేను "త్రవ్వి, ఈ ధనమును బండ్లతో తీసుకపొండు. సుపుత్రుడైన వాడు ఈ ద్రవ్యము నంతయు ఆచికొనవలెను." అనుచున్నాను. నా ఫకీరు చతురుత, నా భగవానుని లీలలు, నా సర్కారు అభిరుచి మిగుల యమోఘమైనవి. నా సంగతి యేమి? శరీరము మట్టిలో కలియును. ఊపిరి గాలిలో కలియును. ఇట్టి యవకాశము తిరిగి రాదు. నే నెక్కడికో పోయెదను; ఎక్కడనో కూర్చుండెదను; మాయ నన్ను మిగులబాధించుచున్నది. ఐనప్పటికి నావారికొరకు ఆతురపడెదను. ఎవరయిన నేమైన సాధన చేసినచో తగిన ఫలితము పొందెదరు. ఎవరయితే నా పలుకులను జ్ఞప్తియందుంచుకొనెదరో, వారమూల్యమైన యానందమును పొందెదరు.
ఓం నమోః శ్రీ సాయినాథాయ
శాంతిః శాంతిః శాంతిః
ముప్పదిరెండవ అధ్యాయము సంపూర్ణము.

|సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు|
|శుభం భవతు|


శ్రీ సాయి సత్ చరిత్రము ముప్పదియొకటవ అధ్యాయము




ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

ముప్పదియొకటవ అధ్యాయము

(ఐదవదినము పారాయణము - సోమవారము)

బాబా సముఖమున మరణించినవారు

1. సన్యాసి విజయానంద్, 2. బాలారామ్ మాన్ కర్, 3. నూల్కర్, 4. మేఘశ్యాముడు, 5. పులి.

ఈ అధ్యాయములో బాబా సన్నిధిలో కొంతమందితోపాటు ఒక పులికూడ మరణము పొందుటను గూర్చి హేమాడ్ పంతు వర్ణించు చున్నాడు.

ప్రస్తావన

మరణకాలమున మనస్సునందున్న కోరికగాని యాలోచనగాని వాని భవిష్యత్తును నిశ్చయించును. భగవద్గీత 8వ అధ్యాయమున 5, 6 శ్లోకములలో శ్రీకృష్ణు డిట్లు చెప్పియున్నాడు. "ఎవరయితే వారి యంత్యదశయందు నన్ను జ్ఞప్తియందుంచుకొందురో వారు నన్ను చేరెదరు. ఎవరయితే యేదో మరొక దానిని ధ్యానించెదరో, వారు దానినే పొందెదరు." అంత్యకాలమందు మనము మంచి యాలోచనలే మనస్సునందుంచుకొన గలమని నిశ్చయము లేదు. అనేకమంది అనేక కారణములవల్ల భయపడి యదరి పోయెదరు. కావున అంత్యసమయమందు మనస్సును నిలకడగా నేదో మంచియోలోచనయందే నిలుపవలె నన్నచో నిత్యము దాని నభ్యసించు టవసరము. భగవంతుని ధ్యానము చేయుచు జ్ఞప్తియందుంచుకొని యెల్లప్పుడు భగవన్నామస్మరణ చేసినచో, మరణకాలమందు గాబరా పడకుండ ఉండగలమని యోగీశ్వరులందరు మనకు బోధించుచుందురు. భక్తులు యోగులకు సర్వస్యశరణాగతి చేసెదరు. ఏలన సర్వజ్ఞులగు యోగులు దారి చూపి, యంత్యకాలమున సహాయము చేసెదరని వారి నమ్మకము. అటువంటివి కొన్ని యిచ్చట చెప్పెదము.

1. విజయానంద్

విజయానంద్ అను మద్రాసు దేశపు సన్యాసి మానససరోవరమునకు యాత్రార్థమై బయలుదేరెను. మార్గములో బాబా సంగతి విని షిరిడీలో ఆగెను. అక్కడ హరిద్వారమునుంచి వచ్చిన సన్యాసియగు సోమదేవస్వామిని కలిసికొనెను. మానససరోవరపు యాత్రగూర్చి వివరములను కనుగొనెను. ఆ స్వామి సరోవరము, గంగోత్రికి 500 మైళ్ళ పైన గలదనియు ప్రయాణమున కలుగు కష్టము లన్నిటిని వర్ణించెను. మంచు యెక్కువనియు భాష ప్రతి 50 క్రోసులకు మారుననియు భూటాన్ ప్రజల సంశయనైజమును, వారు యాత్రికులను పెట్టు కష్టములు మొదలగువానిని జెప్పెను. దీనిని విని సన్యాసి నిరాశచెంది యాత్రను మానుకొనెను. అతడు బాబావద్దకేగి సాష్టాంగనమస్కారము చేయగా బాబా కోపగించి యిట్లనెను. "ఈ పనికిరాని సన్యాసిని తరిమి వేయుడు. వాని సాంగత్యము మన కుపయుక్తము గాదు." సన్యాసికి బాబా నైజము తెలియనందున అసంతృప్తి కలిగెను. కూర్చుండి జరుగుచున్న విషయములన్నిటిని గమనించుచుండెను. అది ఉదయమున జరుగు దర్బారు సమయము. మసీదు భక్తులచే క్రిక్కిరసి యుండెను. వారు బాబాను అనేకవిధముల పూజించుచుండిరి. కొందరు వారి పాదముల కభిషేకము చేయుచుండిరి. వారి బొటనవ్రేలునుండి తీర్థమును కొందరు త్రాగుచుండిరి. కొందరు దానిని కండ్లకద్దుకొనుచుండిరి. కొందరు బాబా శరీరమున కత్తరు చందనములను పూయుచుండిరి. జాతిమత భేదములు లేక యందరును, సేవ చేయుచుండిరి. బాబా తనను కోపించినప్పటికి, అతనికి బాబాయందు ప్రేమ కలిగెను. కావున నాతనికి ఆస్థలము విడిచి పెట్టుట కిష్టము లేకుండెను.

అతడు షిరిడీలో రెండు రోజు లుండినపిమ్మట తల్లికి జబ్బుగా నున్నదని మద్రాసునుండి ఉత్తరము వచ్చెను. విసుగుచెంది అతడు తన తల్లి వద్దకు పోగోరెను. కాని బాబా యాజ్ఞలేనిదే షిరిడీ విడువలేకుండెను. ఉత్తరము తీసికొని బాబా దర్శనమునకై వెళ్ళెను. ఇంటికి పోవుటకు బాబా యాజ్ఞ వేడెను. సర్వజ్ఞుడగు బాబా, ముందు జరుగబోవునది గ్రహించి "నీ తల్లిని అంతప్రేమించువాడవయితే, సన్యాసమెందుకు పుచ్చుకొంటివి? కాషాయవస్త్రములు ధరించువానికి దేనియందభిమానము చూపుట తగదు. నీ బసకు పోయి హాయిగ కూర్చుండుము. ఓపికతో కొద్ది రోజులు కూర్చుండుము. వాడాలో పెక్కు దొంగలున్నారు. తలుపు గడియవేసికొని జాగ్రత్తగా నుండుము. దొంగలంతయు దోచుకొని పోయెదరు. ధనము, ఐశ్వర్యము మొదలగునవి నిత్యము కావు. శరీరము శిథిలమై తుదకు నశించును. దీనిని తెలిసికొని నీ కర్తవ్యమును జేయుము, ఇహలోక పరలోక వస్తువు లన్నిటియందు గల యభిమానమును విడిచి పెట్టుము. ఎవరయితే ఈ ప్రకారముగ జేసి హరియొక్క పాదములను శరణు వేడెదరో, వారు సకలకష్టములనుండి తప్పించుకొని మోక్షమును పొందెదరు. ఎవరయితే ప్రేమభక్తులతో భగవంతుని ధ్యానము చేసి మననము చేసెదరో, వారికి దేవుడు పరుగెత్తిపోయి, సహాయము చేయును. నీ పూర్వపుణ్య మెక్కువగుటచే నీ విక్కడకు రాగలిగితివి. నేను చెప్పినదానిని జాగ్రత్తగ విని, జీవిత పరమావధిని కాంచుము. కోరికలు లేనివాడవై, రేపటినుండి భాగవతమును పారాయణ చేయము. శ్రద్ధతో మూడు సప్తాహములను చేయుము. భగవంతుడు సంతుష్టిజెంది నీ విచారములను దొలగించును. నీ భ్రమలు నిష్క్రమించును. నీకు శాంతి కలుగును" అనిరి. అతని మరణము సమీపించినందున, బాబా అతని కీ విరుగుడు నుపదేశించెను. మృత్యుదేవతకు 'రామవిజయము' ప్రీతి యగుటచే దానిని చదివించెను. ఆ మరుసటి యుదయము స్నానము మొదలగునవి యాచరించిన పిమ్మట విజయానందుడు భాగవతమును లెండీ తోటలో ఏకాంతమున చదువుటకు ప్రారంభించెను. రెండు పారాయణములు చెయగనే యలసిపోయెను. వాడాకు వచ్చి రెండు దినము లుండెను. మూడవరోజు ఫకీరు (బడే) బాబా తొడపై ప్రాణములు వదలెను. బాబా ఒకరోజంతయు శవము నటులే యుంచుడనెను. పిమ్మట పోలీసువాండ్రు వచ్చి, విచారణ జరిపిన పిమ్మట శవసంస్కారమున కాజ్ఞ నిచ్చిరి. యథోచితముగా శరీరమును తగిన స్థలమునందు పూడ్చిరి. ఈ విధముగా బాబా సన్యాసి సద్గతికి సహాయపడెను.

2. బాలారామ్ మాన్ కర్

బాలారామ్ మాన్ కర్ అను గృహస్థుడొకడు బాబా భక్తుడుగా నుండెను. అతని భార్య చనిపోయెను. అతడు విరక్తిచెంది కొడుకునకు గృహభారమప్పగించి షిరిడీకి వచ్చి బాబాతో నుండెను. అతని భక్తికి బాబా మెచ్చుకొని, అతనికి సద్గతి కలుగ జేయవలెనని యీ దిగువరీతిగ జేసెను. బాబా అతనికి 12 రూపాయలిచ్చి సతారా జిల్లాలోని మచ్చీంద్ర గడలో నుండుమనెను. బాబాను విడిచిపెట్టి మచ్చీంద్రగడలో నుండుట అతని కిష్టము లేకుండెను. కాని యదే అతనికి మంచి మార్గమని బాబా యొప్పించెను. అచట రోజుకు మూడుసారులు ధ్యానము చేయమనెను. బాబా మాటలందు నమ్మకముంచి మాన్ కర్ గడముకు వచ్చెను. అక్కడి చక్కని దృశ్యమును, శుభ్రమైన నీటిని, ఆరోగ్యమైన గాలిని, చుట్టుప్రక్కల గల ప్రకృతిసౌందర్యమును జూచి సంతసించి, బాబా సెలవిచ్చిన ప్రకారము మిక్కిలి తీవ్రముగా ధ్యానముచేయ మొదలిడెను. కొలది దినముల పిమ్మట యొకదృశ్యమును గనెను. సాధారణముగా భక్తులు సమాధిస్థితియందు దృశ్యములను పొందెదరుగాని మాన్ కర్ విషయములో నట్లుగాక చైతన్యమునకు వచ్చిన పిమ్మట దృశ్యము లభించెను. అతనికి బాబా స్యయముగా గాన్పించెను. మాన్ కర్ బాబాను జూచుటయేగాక తన నచట కేల పంపితివని యడిగెను. బాబా యిట్లు చెప్పెను. "షిరిడీలో అనేకాలోచనలు నీ మనస్సున లేచెను. నీ చంచలమనస్సునకు నిలకడ కలుగజేయవలెనని యిచటకు బంపితిని. " కొంతకాలము గడచిన పిమ్మట మాన్ కర్ గడమును విడచి బాంద్రాకు పయనమయ్యెను. పూనానుండి దాదరుకు రైలులో పోవలెననుకొనెను. టిక్కెట్టుకొరుకు బుకింగ్ ఆఫీసుకు పోగా నది మిక్కిలి క్రిక్కిరిసి యుండెను. అతనికి టిక్కెటు దొరకకుండెను. లంగోటి కట్టుకొని కంబళికప్పుకొని ఒక పల్లెటూరివాడు వచ్చి, "మీరెక్కడికి పోవుచున్నా" రని యడిగెను. దాదరుకని మాన్ కర్ బదులు చెప్పెను. అతడిట్లనెను. "దయచేసి నా దాదరు టిక్కెటు తీసికొనుము, నాకవసరమైన పని యుండుటచే దాదరుకు వెళ్ళుట మానుకొంటిని." టిక్కెటు లభించినందున మాన్ కర్ యెంతో సంతసించెను. జేబులోనుంచి పైకము తీయునంతలో నా జానపదు డంతర్ధానమయ్యెను. మాన్ కర్ ఆగుంపులో నతనికై వెదకెను. కాని లాభము లేకపోయెను. అతని కొరకు బండి కదలునంతవర కాగెను. కాని వాని జాడయే కానరాకుండెను. మాన్ కర్ కు కలిగిన వింత యనుభవములందు ఇది రెండవది. ఇంటికి పోయి వచ్చి తిరిగి మాన్ కర్ షిరిడీ చేరెను. అప్పటినుంచి షిరిడీలోనే బాబా పాదముల నాశ్రయించి యుండెను. వారి సలహాల ననుసరించి నడుచుకొనుచుండెను. తుదకు బాబా సముఖమున వారి యాశీర్వాదములతో ఈ ప్రపంచమును విడిచినందువలన అత డెంతో యదృష్టవంతు డని చెప్పవచ్చును.

3. తాత్యాసాహెబు నూల్కర్

తాత్యాసాహెబు నూల్కర్ గూర్చి హేమాడ్ పంతు ఏమియు చెప్పియుండలేదు. వారు షిరిడీలో కాలము చేసినవారని మాత్రము చెప్పెను. సాయిలీలా పత్రికనుంచి యీ వృత్తాంతమును గ్రహించితిమి.

1909వ సంవత్సరములో తాత్యాసాహెబు పండరీపురములో సబ్ జడ్జీగా నుండెను. అప్పుడు నానాసాహెబు చాందోర్కరు అచట మామలతదారుగా నుండెను. ఇద్దరు చాలసార్లు కలిసికొని మాట్లాడుచుండిరి. తాత్యాసాహబుకు యోగులయందు నమ్మకము లేకుండెను. నానాసాహెబుకు వారియందు మిగుల ప్రేమ. అనేక పర్యాయములు నానాసాహెబు, నూల్కర్ కు బాబా లీలలను చెప్పి, షిరిడీకి పోయి వారి దర్శనము చేయుమని బలవంతపట్టెను. తుదకు రెండు షరతులపై నూల్కర్ ఒప్పుకొనెను. అందులో ఒకటి బ్రాహ్మణవంటవాడు దొరక వలెను. రెండవది బహూకరించుటకు చక్కని నాగపూరు కమలాఫలములు దొరకవలెను. భగవత్కటాక్షముచే ఈ రెండును తటస్థించెను. ఒక బ్రాహ్మణుడు నానాసాహెబు వద్దకు రాగా ఆతడు వానిని తాత్యాసాహెబు నూల్కర్ వద్దకు పంపెను. ఎవరోగాని 100 కమలాఫలములను నూల్కర్ కు పంపిరి. రెండు షరతులు నెరవేరుటచే తాత్యాసాహెబు షిరిడీకి తప్పక పోవలసి వచ్చెను. మొట్టమొదట బాబా అతనిపై కోపగించెను. క్రమముగా బాబా యవతారపురుషుడని తగిన నిదర్శనములు తాత్యాసాహెబు నూల్కర్ కు లభించెను. కనుక నతడు బాబా యెడ మక్కువపడి తన యంత్యదశవరకు షిరిడీలోనే యుండెను. తన యంత్యదశలో మతగ్రంథముల పారాయణము వినెను. చివరి సమయములో బాబా పాదతీర్థము అతని కిచ్చిరి. అతని మరణవార్తవిని బాబా యిట్లనెను. "అయ్యో! తాత్యా మనకంటె ముందే వెళ్ళిపోయెను. అతనికి పునర్జన్మము లేదు."

4. మేఘశ్యాముడు

28వ అధ్యాయములో మేఘునికథ చెప్పితిమి. మేఘశ్యాముడు మరణించగా గ్రామవాసు లందరు శవమువెంట వెళ్ళిరి. బాబా కూడ వెంబడించెను. బాబా అతని శవముపై పువ్వులు చల్లెను. దహనసంస్కారమైన పిమ్మట బాబా కంట నీళ్ళు కారెను. సాధారణ మానవునివలె బాబా చింతావిచారమగ్నుడైనట్లు కనబడెను. శవమంతయు పూలతో కప్పి, దగ్గరిబంధువువలె నేడ్చి బాబా మసీదుకు తిరిగివచ్చెను.

యోగు లనేకులు భక్తులకు సద్గతి నిచ్చుట విందుము. కాని బాబా గొప్పదన మమోఘమైనది. క్రూరమైన పులికూడ వారివలన సద్గతినే పొందెను. ఆ కథయే ఇప్పుడు చెప్పుదును.

5. పులి

బాబా సమాధి చెందుటకు 7రోజుల ముందొక విచిత్రమైన సంగతి షిరిడీలో జరిగెను. ఒక నాటుబండి వచ్చి మసీదు ముందర ఆగెను. ఆ బండిపై నినుపగొలుసులతో కట్టియుంచిన పులి యుండెను. దాని భయంకరమైన ముఖము వెనుకకు తిరిగి యుండెను. దానిని ముగ్గురు దూర్వీషులు పెంచుచు ఊరూరు త్రిప్పి డబ్బు సంపాదించుకొనుచుండిరి. అది వారి జోవనోపాధి. ఆ పులి యేదో జబ్బుతో బాధపడుచుండెను. అన్ని విధముల ఔషధములను వాడిరి. కాని వారి ప్రయత్నములు నిష్ఫలమయ్యెను. బాబా కీర్తి విని వారు దానిని షిరిడీకి తీసికొని వచ్చిరి. దానిని గొలుసులతో పట్టుకొని ద్వారమువద్ద నిలబెట్టి, దూర్వీషులు బాబా వద్దకు బోయి దాని విషయ మంతయు బాబాకు చెప్పిరి. అది చూచుటకు భయంకరముగా నుండియు జబ్బుతో బాధపడుచుండెను. అందుచే అది మిగుల చికాకు పడుచుండెను. భయాశ్చర్యములతో దానివైపు ప్రజలందరు చూచుచుండిరి. బాబా దానిని తన వద్దకు దీసికొని రమ్మనెను. అప్పుడు దానిని బాబా ముందుకు తీసికొని వెళ్ళిరి. బాబా కాంతికి తట్టుకొనలేక యది తల వాల్చెను. బాబా దానివైపు చూడగా, నది బాబా వైపు ప్రేమతో చూచెను. వెంటనే తన తోకను నేలపై మూడుసార్లు కొట్టి తెలివితప్పి క్రిందపడి చచ్చెను. అది చచ్చుట జూచి దూర్వీషులు విరక్తి జెంది విచారములో మునిగిరి. కొంతసేపటికి వారికి తెలివి కలిగెను. ఆ జంతువు రోగముతో బాధపడుచు చచ్చుటకు సిద్ధముగా నుండుటచే నది బాబా సముఖమున వారి పాదములవద్ద ప్రాణములు గోల్పోవుట దాని పూర్వజన్మపుణ్యమే యని భావించిరి. అది వారికి బాకీపడి యుండెను. దాని బాకీ తీరిన వెంటనే యది విమోచనము పొంది, బాబా పాదములచెంత ప్రాణములు విడిచినది. యోగుల పాదములకడ వినమ్రులై ప్రాణములు విడుచువారు రక్షింప బడుదురు. వారెంతో పుణ్యము చేయనిదే వారి కట్టి సద్గతి యెట్లు కలుగును?
ఓం నమోః శ్రీ సాయినాథాయ
శాంతిః శాంతిః శాంతిః
ముప్పదియొకటవ అధ్యాయము సంపూర్ణము.

|సద్గురు శ్రీసాయినాథార్పణ