Pages

Tuesday, June 11, 2013

మహిమానుభవాలు పంచుకుందాం ఆతర్వాత కూడా వున్నారు



మహిమానుభవాలు పంచుకుందాం
ఆతర్వాత కూడా వున్నారు
ఆర్థర్ ఆస్బర్న్ 1957 లో ఆంగ్లంలో వ్రాసిన ’ఇన్క్రెడిబుల్ సాయిబాబా’ పుస్తకం అప్పట్లో పాశ్చాత్యులకు సాయిని పరిచయంచేసిన తొలి పుస్తకంగా చెప్పుకోవచ్చు. పారాయణకు అనుగుణంగా ఏడు అధ్యాయాలున్న తెలుగులోనికి శ్రీ పోరంకి దక్షిణామూర్తి గారిచే అనువదించబడిన ’మహామహిమాన్వితులు సాయిబాబా – ఈ కాలవు అద్భుత యోగి కధ’ అనే ఆ పుస్తకం చివర ’ఆ తర్వాత కూడా వున్నారు’ శీర్షికన వున్న అధ్యాయం సాయి కృప షరతులు లేనిదనీ, అవధులులేనిదనీ మరోసారి గుర్తుచేస్తుంది. మనం ఇంకా ’If you look to me, I look to you’ అనే ఏకాదశ సూత్రాలలో వ్రాసుకుంటున్నాం. ’నాయందు నీదృష్టి నిలిపితే, నీ యందు నా దృష్టి నిలుపుతాను’ అన్న అర్దంలో సాయి కృపకి షరతులు ఆపాదిస్తున్నాము. కానీ ఈ అధ్యాయం చదివితే సాయి కృపకి షరతులులేవన్నది స్పష్టమవుతుంది.
1960  ప్రాంతంలొ మేము కలకత్తాలో 4 ఏళ్లు వున్న కాలంలో మాపొరుగు ప్లాట్ లో మిస్ డటన్ అనే వృద్ధురాలు వుండేది. ఆవిడ చాలా పవిత్ర వ్యక్తి. ఆవిడతో మా పరిచయం పెరిగిన తర్వాత తన వివరాలు కొన్ని చెప్పింది. ఆవిడ కొంతకాలం సన్యాసిని గా వుండెడిదట. జీవితంలో చాలా కాలం ఒక కాన్వెంట్ లో గడిపింది. రాగిరంగు జుట్టుగల చాలామంది లాగే, ఆవిడకూడా ఉద్రేక స్వభావమున్నది కావడం వలన, అక్కడి క్రమశిక్షణ ఆవిడకు నానాటికి ఇబ్బంది కలిగిస్తూ వచ్చింది. దాంతో ఘర్షణలు మొదలయ్యాయి. అసంతుష్టి కలిగింది. టూకీగా చెప్పలంటే ఆవిడ ఇతర సన్యాసినులతో స్నేహంగా వుండలేక పోయింది. చివరికి, తానిక ఏ మాత్రం భరించలేని స్థితికి వచ్చింది. పై అధికారుల సహకారంతో ఆవిడ తాను చేసిన ప్రమాణాల నుండి విముక్తి కోసం పోప్ కు విన్నవించుకుంది. అట్టే ఆలస్యం కాకుండానే ఆవిడ విన్నపం మంజూరైంది. ఆవిడ విన్నపం పరిశీలనలో వున్న కాలంలో తానున్న మానసిక స్థితిలో తన భవిష్యత్తు గురించి అంతగా ఆలోచించలేకపోయింది. కాన్వెంటు విడిచి వెళ్లేముందు ఆవిడకు, తన భవిష్యత్తు ఇప్పుడు ఎంత నిరాశాజనకంగా వుందో తెలిసివచ్చింది. నడి వయస్సు దాటిపోయింది. జీవన వృత్తి లేదు. చుట్టాలన్నవాళ్లు దాదాపు లేనట్టే. దగ్గర బంధువు ఒకడు ఎక్కడో దూరాన వున్నాడు. ఒక నాడు ఆమె తన చిన్న గదిలో అత్యంత గాఢమైన విచారంలో మునిగి వుండగా హఠాత్తుగా పొడుగాటి ఫకీరు ఒకాయన ప్రత్యక్ష్యమయ్యారు. ఆయన లోపలికి ఎలా వచ్చారో ఆమె చెప్పలేక పోయింది. ఒక సన్యాసిని గదిలోకి ముస్లీం ఫకీరు ప్రవేశించగలగడం సంభవమయే విషయం కాదు. కారుణ్యంతో ఆమె వైపు చూసి ఆయన ఇలాగ అన్నారు: “అంతగా విచార పడకు. నువ్వు కలకత్తా వెళ్ళిన తర్వాత అంతా చక్కబడుతుంది”. ఆ తరువాత ఆయన దక్షిణ ఇమ్మని అడిగారు. తన దగ్గర డబ్బేమీ లేదని ఆవిడ చెప్పింది. “ఉంది. అక్కడ అలమారులో వున్న పెట్టెలో ముప్పై ఐదు రూపాయలున్నాయి” అన్నారాయన. ’వాటి సంగతి నేను పూర్తిగా మరిచే పోయాను’ అని నాతో అన్నారావిడ. ఆ డబ్బు తేవడానికి ఆవిడ అలమారు దగ్గరకు వెళ్లింది. డబ్బు వుంది. దక్షిణ ఇద్దామని వెనక్కి తిరిగి చూసేసరికి ఆఫకీరు అక్కడ లేరు. ఆయన వచ్చిన తీరుగానే అదృశ్యమయారు. ఆవిడకి ప్రశాంతి కలిగింది.
కలకత్తాలో ఆవిడ బంధువు ఆవిడని ఆదరంతో పలుకరించాడు. అప్యాయంగా, జాగ్రత్తగా ఆవిడని సంరక్షించడమే కాకుండా, ఆవిడ పెంపుడు జంతువులని కూడా అలాగే సంరక్షించాడు. ఇప్పటికీ బహుశః అలాగే ఆవిణ్ణి సంరక్షిస్తూ వుండవచ్చు. మిస్ డటన్ అతన్ని ఎంతగానో పొగుడుతుంది. అతనికెంత కృతజ్ఞురాలంటే చర్చికి వెళ్ళి ఆరాధనలో పాల్గొని ధన్యవాదాలు తెలుపుకోడానికి ఆవిడ ప్రతిరోజూ వేకువకు ముందే నిద్రలేచేది. ఈ క్రమశిక్షణ ఆవిడకు ఎంతో సంతోషం కలిగించేది.
మీ ఫకీరు బొమ్మ నేను చూపిస్తాను’ అన్నాను ఆవిడతో. ఆయన మహామహితాన్వితులయిన సాయబాబా గారు తప్ప మరొకరు అయి వుండరన్న నమ్మకం అప్పటికే నాకు కలిగింది. అదృష్టవశాత్తూ నేను ప్లాటు లోంచి సాయిబాబా గారి పటం తీసికివచ్చి ఆ ముసిలావిడకి చూపించాను. చూస్తూనే ఆవిడ సంభ్రమాశ్చర్యాలతో ఇలా అంది ’ఈయనే నా ఫకీరు. తలకు అచ్చంగా ఈ తెల్లగుడ్డే వుంది”..
ఆవిడ అంతకుముందెన్నడూ సాయిబాబాగారి పేరు వినలేదు.

సాయికృపతో
సాయి పాదధూళి చాగంటి సాయిబాబా, ఒడిషా.