Pages

Monday, February 4, 2013

శ్రీ సాయి సత్ చరిత్రము ముప్పదియేడవ అధ్యాయము


ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

ముప్పదియేడవ అధ్యాయము

చావడి యుత్సవము

హేమాడ్ పంతు ఈ అధ్యాయములో కొన్ని వేదాంతవిషయములు ప్రస్తావించిన పిమ్మట చావడి యుత్సవముగూర్చి వర్ణించుచున్నాడు.

తొలిపలుకు

శ్రీ సాయిజీవితము మిగుల పావన మయినది. వారి నిత్యకృత్యములు ధన్యములు. వారి పద్ధతులు, చర్యలు వర్ణింప నలవికానివి. కొన్ని సమయములందు వారు బ్రహ్మాంనందముతో మైమరచెడివారు. మరికొన్ని సమయములం దాత్మజ్ఞానముతో తృప్తి పొందెడివారు. ఒక్కొక్కప్పుడన్నిపనులను నెరవేర్చుచు ఎట్టి సంబంధము లేనట్లుండెడి వారు. ఒక్కొక్కప్పు డేమియు చేయనట్లు గన్పించినప్పటికిని వారు సోమరిగా గాని, నిద్రితులుగా గాని, కనిపించెడు వారు కారు. వారు ఎల్లప్పుడు ఆత్మానుసంధానము చేసెడివారు. వారు సముద్రమువలె శాంతముతో తొణకక యుండినట్లు గనిపించినను వారి గాంభీర్యము, లోతు, కనుగొనరానివి. వర్ణనాతీతమయిన వారి నైజము వర్ణింపగలవా రెవ్వరు? పురుషులను అన్నదమ్ములవలె, స్త్రీల నక్కచెల్లెండ్రవలె తల్లులవలె చూచుకొనెడివారు. వారి శాశ్వతాస్ఖలిత బ్రహ్మచర్యము అంద రెరిగినదే. వారి సాంగత్యమున మనకు కలిగిన జ్ఞానము మనము మరణించువరకు నిలుచుగాక! ఎల్లప్పుడు హృదయపూర్వకమగు భక్తితో వారి పాదములకు సేవచేసెదము గాక. వారిని జీవకోటియందు జూచెదము గాక! వారి నామము నెల్లప్పుడు ప్రేమించెదము గాక.

వేదాంతసంబంధమైన దీర్ఘోపన్యాసము చేసిన పిమ్మట హేమాడ్ పంతు చావడి యుత్సవమును వర్ణించుటకు మొదలిడెను.

చావడి యుత్సవము

బాబా శయనశాలను ఇదివరకే వర్ణించితిని. వారు ఒకనాడు మసీదులోను, ఇంకొకనాడు చావడిలోను నిద్రించుచుండిరి. మసీదుకు దగ్గరగనే చావడి రెండు గదులతో నుండెడిది. బాబా మహాసమాధి చెందువరకు ఒకరోజు మసీదులో, ఇంకొకరోజు చావడిలో నిద్రించుచుండిరి. 1909 డిసంబరు 10 తేదీనుండి చావడిలో భక్తులు పూజాహారతులు జరుప మొదలిడిరి. వారి కటాక్షముచే దీనినే యిప్పుడు వర్ణింతుము. చావడిలో నిద్రించు సమయము రాగా భక్తులు మసీదులో గుమిగూడి కొంతసేపు మండపములో భజన చేసెడివారు. భజనబృందము వెనుక రథము, కుడివైపు తులసీబృందావనమును, ముందర బాబా వీని మధ్య భజన జరుగుచుండెను. భజనయందు ప్రీతి గల పురుషులు, స్త్రీలు సరియైన కాలమునకు వచ్చుచుండిరి. కొందరు తాళములు, చిరితలు, మృదంగము, కంజిరా, మద్దెలు పట్టుకొని భజన చేయుచుండెడివారు. సూదంటురాయివలె సాయిబాబా భక్తులందరిని తమ వద్దకు ఈడ్చుకొనెడివారు. బయట బహిరంగస్థలములో కొందరు దివిటీలు సరిచేయుచుండిరి. కొందరు పల్లకి నలంకరించుచుండిరి. కొందరు బెత్తములను చేత ధరించి 'శ్రీసాయినాథ మహారాజ్ కీ జయ్' యని కేకలు వేయుచుండిరి. మసీదు మూలలు తోరణములతో నలంకరించుచుండిరి. మసీదు చుట్టు దీపముల వరుసలు కాంతిని వెదజల్లుచుండెను. బాబా గుఱ్ఱము శ్యామకర్ణ సజ్జితమై బయట నిలుచుచుండెను. అప్పుడు తాత్యాపాటీలు కొంతమందిని వెంటబెట్టుకొని వచ్చి బాబాను సిద్ధముగా నుండుమని చెప్పెడివాడు. బాబా నిశ్చలముగా కూర్చొనెడివారు. తాత్యాపాటీలు వచ్చి బాబా చంకలో చేయివేసి లేవనెత్తుచుండెను. తాత్యా బాబాను మామా యని పిలిచెడివారు. నిజముగా వారి బాంధవ్యము మిక్కిలి సన్నిహితమయినది. బాబా శరీరముపై మామూలు కఫనీ వేసికొని, చంకలో సటకా పెట్టుకొని, చిలుమును-పొగాకును తీసికొని, పైన ఉత్తరీయము వేసుకొని, బయలుదేరుటకు సిద్ధపడుచుండిరి. పిమ్మట బాబా తన కుడిపాదము బొటనవ్రేలుతో ధునిలోని కట్టెలను ముందుకు త్రోసి, కుడిచేతితో మండుచున్న దీపము నార్పి, చావడికి బయలుదేరెడి వారు. అన్ని వాయిద్యములు మ్రోగెడివి; మతాబా మందుసామాను లనేకరంగులు ప్రదర్శించుచు కాలెడివి. పురుషులు, స్త్రీలు బాబా నామము పాడుచు మృదంగము వీణ సహాయముతో భజన చేయుచు ఉత్సవములో నడుచుచుండిరి. కొందరు సంతసముతో నాట్యమాడుచుండిరి. కొందరు జెండాలను చేత బట్టుకొనుచుండిరి. బాబా మసీదు మెట్లపైకి రాగా భాల్దారులు 'శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జయ్' అని కేకలు పెట్టుచుండిరి. బాబా కిరుప్రక్కల చామరములు మొదలగునవి పట్టుకొని విసరుచుండిరి. మార్గమంతయు అడుగులకు మడుగులు పరచెడు వారు. వానిపై బాబా భక్తుల కేకలుతో నడచెడువారు. తాత్యాయెడమచేతిని మహాళ్సాపతి కుడిచేతిని, బాపుసాహెబుజోగ్ శిరస్సుపై ఛత్రమును పట్టుకొనెడివారు. ఈ ప్రకారముగా బాబా చావడికి పయనమగుచుండెను. బాగుగాను, పూర్తిగాను నలంకరించిన యెఱ్ఱ గుఱ్ఱము శ్యామకర్ణ దారి తీయుచుండెను. దాని వెనుక పాడెడువారు, భజన చేయువారు, వాయిద్యముల మ్రోగించువారు, భక్తుల సమూహ ముండెడిది. హరినామస్మరణతోను, బాబా నామస్మరణతోను ఆకాశము బద్దలగునటుల మారుమ్రోగుచుండెను. ఈ మాదిరిగ శోభాయాత్ర మసీదు మూల చేరుసరికి ఉత్సవములో పాల్గొనువారందరు ఆనందించుచుండిరి. 
ఈ మూలకు వచ్చుసరికి బాబా చావడివైపు ముఖముపెట్టి నిలిచి యొక విచిత్రమయిన ప్రకాశముతో వెలిగెడివారు. వారి ముఖము ఉదయసంధ్య వలె లేదా బాలభానునివలె ప్రకాశించుచుండెను. అచట బాబా ఉత్తరమువైపు ముఖము బెట్టి కేంద్రీకరించిన మనస్సుతో నిలచెడివారు. వారెవరినో పిలుచునటుల గనిపించెడిది. సమస్త వాయిద్యములు మ్రోగుచున్నప్పుడు బాబా తన కుడిచేతిని క్రిందకు మీదకు ఆడించెడివారు. అట్టి సమయమున కాకాసాహెబు దీక్షిత్ ముందుకు వచ్చి, యొక వెండిపళ్ళెములో పువ్వులు గులాల్ పొడిని దీసికొని బాబాపై పెక్కుసార్లు చల్లుచుండెను. అట్టి సమయమందు సంగీత వాయిద్యములు వాని శక్తి కొలది ధ్వనించుచుండెను. బాబా ముఖము స్థిరమైన ద్విగుణీకృత ప్రకాశముతోను, సౌందర్యముతోడను, వెలుగుచుండెను. అందరు ఈ ప్రకాశమును మనసారా గ్రోలుచుండిరి. ఆ దృశ్యమును ఆ శోభను వర్ణించుటకు, మాటలు చాలవు, ఒక్కొక్కప్పు డానందమును భరించలేక మహళ్సాపతి దేవత యావేశించిన వానివలె నృత్యము చేయువాడు. కాని, బాబాయొక్క ధ్యాన మేమాత్రము చెదరక యుండెడిది. చేతిలో లాంతరు పట్టుకొని తాత్యాపాటీలు బాబాకు ఎడమప్రక్క నడచుచుండెను. భక్త మహాళ్సాపతి కుడివయిపు నడచుచు బాబా సెల్లాయంచును పట్టుకొనెడివాడు. ఆ యుత్సవమెంతో రమణీయముగ నుండెడిది. వారి భక్తి చెప్పనలవికానిది. ఈ పల్లకి యుత్సవమును చూచుటకు పురుషులు, స్త్రీలు, ధనికులు, పేదవారు గుమిగూడుచుండిరి. బాబా నెమ్మదిగా నడచుచుండెను. ప్రేమభక్తులతో భక్తమండలి బాబా కిరుప్రక్కలనడుచు చుండెడివారు. వాతావరణమంతయు ఆనందపూర్ణమై యుండగ శోభాయాత్ర చావడి చేరుచుండెను. ఆ దృశ్యము, ఆ కాలము గడచిపోయినవి. ప్రస్తుతము గాని, యికముందు గాని యా దృశ్యమును గనలేము. ఐనను ఆ దృశ్యమును జ్ఞప్తికి దెచ్చుకొని భావన చేసినచో మనస్సుకు శాంతి, తృప్తి కలుగును. 

చావడి బాగుగా నలంకరించుచుండిరి. దానిని తెల్లని పైకప్పుతోను, నిలువుటద్దములతోను అనేకరంగుల దీపములతోను వ్రేలాడ గట్టిన గాజుబుడ్డీలతోను అలంకరించుచుండిరి. చావడి చేరగనే తాత్యా ముందు ప్రవేశించి యొక యాసనము వేసి, బాలీసును ఉంచి, బాబాను కూర్చుండబెట్టి మంచి యంగరఖా తొడిగించినపిమ్మట భక్తులు బాబాను వేయి విధముల పూజించుచుండిరి. బాబా తలపై తురాయి కిరీటమును బెట్టి, పువ్వుల మాలలు వేసి, మెడలో నగలు వేయుచుండిరి. ముఖమునకు కస్తూరి నామమును, మధ్యను బొట్టును పెట్టి మనస్ఫూర్తిగా బాబావైపు హృదయానందకరముగా జూచెడివారు. తలపై కిరీటము అప్పుడప్పుడు తీయుచుండెడివారు. లేనిచో బాబా దానిని విసరివైచునని వారికి భయము, బాబా వారి యంతరంగమును గ్రహించి వారి కోరికలకు లొంగియుండెడివారు. వారు చేయుదానికి అభ్యంతర పెట్టువారు కాదు. ఈ యలంకారముతో బాబా మిక్కిలి సుందరముగా గనుపించుచుండిరి.

నానాసాహెబు నిమోన్ కర్ గిఱ్ఱున తిరుగు కుచ్చుల ఛత్రములు పట్టుకొనుచుండెను. బాపూసాహెబు జోగ్ యొక వెండి పళ్ళెములో బాబా పాదముల కడిగి, యర్ఘ్యపాద్యము లర్పించి చేతులకు గంధము పూసి, తాంబూలము నిచ్చుచుండెను. బాబా గద్దెపై కూర్చొనియుండగా తాత్యా మొదలగు భక్తులు వారి పాదములకు నమస్కరించుచుండిరి. బాలీసుపై ఆనుకొని బాబా కూర్చొని యుండగా భక్తులు ఇరువైపుల చామరములతోను, విసనకఱ్ఱలతోను విసరుచుండిరి. అప్పుడు శ్యామా చిలుమును తయారుచేసి, తాత్యాకు ఇవ్వగా నతడొక పీల్పుపీల్చి బాబా కిచ్చుచుండెను. బాబా పీల్చిన పిమ్మట భక్త మహాళ్సాకు ఇచ్చెడువారు. తదుపరి యితరులకు లభించుచుండెను. జడమగు చిలుము ధన్యమైనది. మొట్టమొదట అది యనేక తపఃపరీక్షల కాగవలసి వచ్చెను. కుమ్మరులు దానిని త్రొక్కుట, ఎండలో ఆరబెట్టుట, నిప్పులో కాల్చుట వంటివి సహించి తుదకు అది బాబా ముద్దుకు హస్తస్పర్శకు నోచుకొన్నది. ఆ యుత్సవము పూర్తి యయిన పిమ్మట భక్తులు పూలదండలను బాబా మెడలో వేసెడివారు. వాసన చూచుటకు పువ్వులగుత్తులను చేతికిచ్చేవారు. బాబా నిర్వ్యామోహము అభిమానరాహిత్యముల కవతారమగుటచేత ఆ యలంకరణములను గాని మరియాదలను గాని లెక్క పెట్టువారుకారు. భక్తలందుగల యనురాగముచే, వారి సంతుష్టికొరకు వారి యిష్టానుసారము చేయుటకు ఒప్పుకొనుచుండిరి. ఆఖరుకు బాపూసాహెబ్ జోగ్ సర్వలాంఛనములతో హారతి నిచ్చువాడు. హారతి సమయమున బాజాభజంత్రీ మేళతాళములు స్పేచ్ఛగా వాయించువారు. హారతి ముగిసిన పిమ్మట భక్తులు ఆశీర్వాదమును పొంది బాబాకు నమస్కరించి యొకరి తరువాత నొకరు తమతమ యిండ్లకు బోవుచుండిరి. చిలుము, అత్తరు, పన్నీరు సమర్పించిన పిమ్మట తాత్యా యింటికి పోవుటకు లేవగా, బాబా ప్రేమతో నాతనితో నిట్లనెను. "నన్ను కాపాడుము. నీకిష్టమున్నచో వెళ్ళుము గాని రాత్రి యొకసారి వచ్చి నా గూర్చి కనుగొనుచుండుము." అట్లనే చేయుదుననుచు తాత్యా చావడి విడచి గృహమునకు పోవుచుండెను. బాబా తన పరుపును తానే యమర్చుకొనువారు. 50, 60 దుప్పట్లను ఒకదానిపై నింకొకటి వేసి దానిపై నిద్రించువారు.

మనము కూడ ఇప్పుడు విశ్రమించెదము. ఈ యధ్యాయమును ముగించకముందు భక్తుల కొక మనవి. ప్రతిరోజు రాత్రి నిద్రించుటకు ముందు సాయిబాబాను, వారి చావడి యుత్సవమును జ్ఞప్తికి దెచ్చుకొనవలెను.
ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
ముప్పదియేడవ అధ్యాయము సంపూర్ణము.

ఐదవరోజు పారాయణము సమాప్తము.

।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు। 

No comments: