నలుగురు గుడ్డివాళ్లు ఏనుగును నాలుగు రకాలుగా వర్ణించిన కథ మనకు తెలుసు. అంధత్వం వల్ల వారు తాము చేత్తో తాకి పట్టుకున్న అవయవాన్నే మొత్తం ఏనుగుగా వర్ణించారు. మనం కళ్లుండి కూడా అజ్ఞానమనే అంధత్వం వల్ల దైవాన్ని సరిగా చూడలేకపోతున్నాం. మనకు తోచిందే సరైనదనే నమ్మకం మనది. ఈ ధోరణితో గడిపినంత కాలం భగవంతుడ్ని చూడలేం. భగవంతుడే ఎదురుగా నిలుచున్నా, ' దేవుడంటే ఫలానా విధంగా ఉంటాడు.. నా ఎదురుగా ఉన్నది ఆయన కాదు' అనే అజ్ఞానంలో పడిపోతాం.
బివి దేవు తన ఇంట జరగనున్న ఉద్యాపన వ్రతానికి బాబాను ఆహ్వానిస్తూ బాపూ సాహెబు జోగుకు లేఖ రాశాడు. దానిని జోగు బాబాకు చదివి వినిపించాడు. ' నన్నే స్మరించే వారిని మరువను. నాకు బండి కానీ, రైలుకానీ, విమానం కానీ అవసరం లేదు. ప్రేమతో పిలిచే వారి చెంతకు పరుగున వెళతాను. నువ్వు, నేను, మరొకరు సంతర్పణకు వస్తామని రాయి' అని బాబా జోగుకు సూచించారు. నిజానికి బాబా ఎప్పుడూ రహతా, రుయీ, నీమ్‌గాం తప్ప షిర్డీ విడిచి మరెక్కడికీ వెళ్లిన దాఖలాల్లేవు. కాబట్టి తన ఉద్వాసనకు బాబా వస్తారా? అని దేవు సందే హించాడు.
ఉద్యాపనకు కొద్దిరోజుల ముందు బెంగాలీ సన్యాసి దహను రైల్వే స్టేషన్‌లో దిగారు. స్టేషన్ మాస్టర్‌ను కలిసి గో సంరక్షణకు చందాలు వసూలు చేసే నిమిత్తం వచ్చానని చె ప్పారు. దహను మామల్తదారు దేవును కలిస్తే చందాల వసూలు కార్యక్రమం ఫలప్రదమవుతుందని స్టేషన్ మాస్టారు చెప్పాడు. అనుకోకుండా దేవు అక్కడికే వచ్చాడు. సన్యాసి విషయం చెప్పగానే ప్రస్తుతం ఊళ్లో మరో రెండు మూడు చందా వసూళ్లు జరుగుతున్నాయని, కాబట్టి రెండు లేదా మూడు నెలలు ఆగి వస్తే పనవుతుందని చెప్పాడు.
నెల తరువాత బెంగాళీ సన్యాసి టాంగాలో వచ్చి దేవు ఇంటి ఎదురుగా దిగారు. ఉద్వాపన పనుల్లో ఉన్న దేవు ఆయన చందాల పనిపై వచ్చి ఉంటారని తలచాడు. సన్యాసి దేవు భావం గ్రహించినట్లు తాను చందాల కోసం రాలేదని భోజనానికి వచ్చానని చెప్పాడు. దేవు మనస్పూర్తిగా స్వాగతం పలికాడు. తనతో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారని, వారిని కూడా తీసుకుని మధ్యాహ్నం 12 గంటలకు వస్తానని చెప్పి సన్యాసి వెళ్లిపోయాడు. చెప్పినట్లే సన్యాసి మరో ఇద్దరితో వచ్చి మధ్యాహ్నం 12 గంటలకు దేవు ఇంట భోజనం చేసి వెళ్లిపోయాడు. ఉద్యాపన వ్రతం పూర్తి కాగానే దేవు అసంతృప్తికి గురయ్యాడు. బాబా వస్తానని మాటిచ్చి నిలుపుకోలేక పోయారని జోగుకు లేఖ రాశాడు. యథావిధిగా జోగు ఆ లేఖలోని సారాంశాన్ని బాబాకు చెప్పడానికి మసీదుకు వెళ్లాడు. అతను లేఖను చదవకముందే బాబా ఇలా అన్నారు.
" దేవు ఏమంటున్నాడు? నేను దగా చేశానంటున్నాడా? ఇద్దరితో కలిసి నేను సంతర్పణకు వస్తానని చెప్పలేదా? చెప్పినట్లే సంతర్పణకు వచ్చింది నిజం కాదా? రమ్మని పిలువనేల వచ్చిన తర్వాత పోల్చుకోనేల? నన్ను చూడగానే చందాల కోసం వచ్చిన సన్యాసిని అనుకున్నాడు. నేను భక్తులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ప్రాణాలనైనా విడుస్తాను '' బాబా సమాధానాన్ని పేర్కొంటూ జోగు తిరిగి దేవుకు లేఖ రాశాడు. బాబా రాకను పసికట్టలేకపోయినందుకు దేవు చింతించాడు. తన పట్ల భక్తుల మనసెంత స్థిరమో, విశ్వాసమో సాయి పరీక్షిస్తారు. అన్నింటిలోనూ, అంతటా తనను దర్శిస్తున్నారా? లేదా? అని బాబా చూస్తారు. ఆ విశ్వాస పరీక్షలో నెగ్గిన వారు బాబా కృపకు పాత్రులు. వారే ధన్యులు.
సాయిపై విశ్వాసం ఉంటే సాధించలేనిది లేదు బాబా దయగల తండ్రి. ప్రేమను పంచే మాతృహృదయుడు. బాబా కరుణా కటాక్షాల కోసం మనం ఎన్నో విధాలా వేడుకుంటాం. ప్రార్థిస్తాం. మన కష్టసుఖాలను మొరపెట్టుకుంటాం. 'కొట్టినా పెట్టినా నువ్వే బాబా!' అని సర్వ శ్రేయోదాయి సాయిని అర్థించిన చేతులతోనే కొన్నిసార్లు బాబా మాటలు కాదని మన చేతుల్ని హస్తసాముద్రికులు, జోతిష్యుల చేతిలో పెడతాం. సాయి సచ్ఛరిత్రలో జ్యోతిషాలను నమ్మవద్దని బాబా చెప్పిన ఉదంతాలు రెండు మూడు ఉన్నాయి. జోతిష్యాల ఆకర్షణలో, గ్రహశాంతుల ఊబిలో పడవద్దని బాబా తన భక్తులకు పదే పదే చెప్పారు. సాయి కృపను పొందడానికి, సాయిపథంలో నడవడానికి విశ్వాసమే తొలిమెట్టు. మనం సాయిపథంలో నడవాలంటే బాబా చెప్పిన విషయాలను తు.చ తప్పకుండా పాటించాలి. బాబా పైనే విశ్వాసం ఉంచాలి.'నిన్ను నవ్వు నమ్ముకో నీలోని భగవంతుడ్ని నమ్ముకో' అనేది బాబా ఉపదేశం. మనలోని భగవంతుడు సాయినాథుడు కనుక మన భారాలు, విచారాలు అన్నిటినీ బాబాపైనే వేద్దాం. మన జీవిత నౌకను మోక్షమనే తీరానికి క్షేమంగా దరిచేర్చే బాధ్యతను బాబాయే తీసుకుంటారు.
సావిత్రీబాయి టెండూర్కర్, రఘునాథ్ టెండూర్కర్‌ల కుమారుడు బాబు టెండూర్కర్. బాబు వైద్య విద్య రెండవ సంవత్సరం చదువుతుండగా జోతిష్యులు అతని జాతకచక్రాన్ని చూశారు. ఆ సంవత్సరం గ్రహాలు అనుకూలంగా లేవని, ఎంత చదివినా ప్రయోజనం లేదని వారు పెదవి విరిచారు. మరుసటి సంవత్సరం కష్టపడి చదవనవసరం లేకుండానే ఉత్తీర్ణుడవుతాడని కూడా వారు చెప్పారు. ఆ మాటలు విని బాబు దిగులు, ఆందోళనలకు గురయ్యాడు. ఆ రోజునుంచి చదవడం మానేసి నిర్లిప్తంగా గడపడం మొదలె ట్టాడు. కుమారుని వాలకం చూసి సావిత్రీబాయి కలత చెందింది. ఆమె మనసు తల్లడిల్లింది. రఘునాథ్ కూడా కొడుకుని చూసి బెంగపెట్టుకున్నాడు. సావిత్రిబాయి కూడా ఎన్నో విధాలా నచ్చచెప్ప చూసి విఫలమైంది. కష్టంలోనూ సుఖంలోనూ తమ వెన్నంటి ఉండే బాబా వద్దకు వె ళ్లింది. కొడుకు పరిస్థితి బాబాకు చెప్పి కంటతడి పెట్టుకుంది. బాబా హృదయం ద్రవించింది.
'జాతకాలు, జన్మకుండలిని పట్టించుకోవద్దు. సాముద్రికాన్ని చూడొద్దు. నా పై విశ్వాసం ఉంచి బుద్దిగా చదువుకోమను. ఈ సంవత్సరమే అతను ఉత్తీర్ణుడవుతాడు'. అని బాబా అభయం ఇచ్చారు. సావిత్రి వెంటనే ఇంటికి వెళ్లిపోయి బాబా మాటల్ని బాబుకు చెప్పింది. బాబా ఇచ్చిన అభయంతో బాబు ఆత్మవిశ్వాసాన్ని నింపుకున్నాడు. శ్రద్దగా చదివాడు. పరీక్షలు కూడా రాశాడు. కానీ, ఉత్తీర్ణుడ్ని అవుతాననే నమ్మకం మాత్రం లేదు. అందుకే పరీక్షా ఫలితాలు విడుదలైనా చూసుకోలేదు. ఓ మిత్రుడు వచ్చి పరీక్షలో ఉత్తీర్ణుడివి అయ్యావని, ఇంటర్వ్యూకు కూడా పిలుపు వచ్చిందిన బాబుతో చెప్పాడు. బాబాపై ఉంచిన నమ్మకమే బాబును గట్టున పడేసింది. బాబాపై మన విశ్వాసం చెదిరిపోనిదే అయితే మనం సాధించేలేనిది ఏమీ లేదు. సాయినాథాయ నమః