Pages

Sunday, February 3, 2013

god


శ్రీ సాయి సత్ చరిత్రము ముప్పదవ అధ్యాయము


ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

ముప్పదవ అధ్యాయము

షిరిడీకి లాగుట

1. వాణినినాసి కాకాజీ వైద్య, 2. బొంబాయి నివాసి పంజాబి రామలాల్.

ఈ అధ్యాయములో బాబా షిరిడీకి ఈడ్చిన యిద్దరుభక్తుల వృత్తాంతము చెప్పుకొందుము.

ప్రస్తావన

దయామయుడు, భక్తవత్సలుడునగు శ్రీ సాయికి నమస్కారము. వారు దర్శనమాత్రమునే భవసాగరమును తరింపజేసి మన ఆపదలను బాపెదరు. వారు నిర్గుణస్వరూపులైనను, భక్తులు కోరుటచే సగుణ స్వరూపము వహించిరి. భక్తుల కాత్మసాక్షాత్కారము కలిగించుటే యోగుల కర్తవ్యము. అది యోగీశ్వరుడైన సాయినాథునకు ముఖ్యతమ మైనది, తప్పనిసరి యైనది. వారి పాదముల నాశ్రయించిన వారి పాపము లెల్ల నశించును. అట్టివారి ప్రగతి నిశ్చయము. వారి పాదములు స్మరించుచు పుణ్యక్షేత్రములనుండి బ్రాహ్మణులు వచ్చి వారి సన్నిధిలో వేదశాస్త్రములు పారాయణ చేసి, గాయత్రీమంత్రమును జపించెదరు. దుర్బలులము, పుణ్యహీనుల మగుటచే భక్తి యనగా నేమో మనకు దెలియదు. మనకింత మాత్రము తెలియును, ఇతరులు మనలను విడిచి పెట్టునప్పటికి సాయి మాత్రము మనలను విడువరు. వారి కృపకు పాత్రులైనవారు కావలసినంత శక్తి, జ్ఞానము, నిత్యానిత్యవివేకములను పొందెదరు.

భక్తుల కోరికలను పూర్తిగా గ్రహించి సాయి వానిని నెరవేర్చును. అందుచేత ఎవరికి కావలసినవి వారు పొంది, కృతజ్ఞతతో నుండెదరు. కాని మేము వారికి సాష్టాంగనమస్కారము చేసి, వేడు కొనెదము. మా తప్పులన్నియు క్షమించి సాయి మా యారాటములన్నియు బాపుగాక. కష్టములపాలై సాయి నీవిధముగా ప్రార్థించు వారి మనస్సు శాంతించి, బాబా కటాక్షముచే వారు సంతుష్టి నొందెదరు.

దయాసముద్రుడగు సాయి కటాక్షించుటచే హేమాడ్ పంతు ఈ గ్రంథమును వ్రాయగలిగెనని చెప్పుకొనెను. లేకున్నచో తనకు గల యోగ్యత యెంత? ఎవరింత కఠినమైన పనికి పూనుకొనగలరనెను. శ్రీ సాయి ఈ భారమంతయు వహించుటచే హేమాడ్ పంతుకు కష్టము గాని, శ్రమగాని కానరాకుండెను. తన వాక్కును, కలమును గూడ ప్రేరేపించుటకు శక్తివంత మగు జ్ఞానమనే వెలుతురుండగా నతడు సంశయము గాని, ఆరాటము గాని పొందనేల? అతడు వ్రాసిన యీ పుస్తకరూపమున శ్రీ సాయి అతని సేవను గైకొనెను. ఇది యతని గత జన్మల పుణ్యపరంపరచే ప్రాప్తించెను. కావున నాతడదృష్టవంతుడనియు పుణ్యాత్ముడనియు అనుకొనెను.

ఈ క్రింది కథ సాధారణ కథ కాదు; స్వచ్ఛమైన యమృతము. దీని నెవరు త్రాగెదరో, వారు సాయి మహిమను సర్వాంతర్యామిత్వమును దెలిసికొందురు. వాదించు వారు, విమర్శించువారు ఈ కథలను చదువనక్కరలేదు. దీనికి కావలసినది యంతులేని ప్రేమ, భక్తి; వివాదము కాదు. జ్ఞానులు, భక్తివిశ్వాసములు గలవారు లేదా యోగులసేవకుల మనుకొనువారు, ఈ కథల నిష్టపడి మెచ్చుకొనెదరు. తదితరులు కాకమ్మకథ లనుకొందురు. అదృష్టవంతులయిన సాయిభక్తులు సాయి లీలలను కల్పతరువుగా భావించెదరు. ఈ సాయి లీలామృతమును త్రాగినచో అజ్ఞానులకు జన్మరాహిత్యము కలుగును, గృహస్థులకు సంతృప్తి కలుగును, ముముక్షువుల కిది సాధనగా నుపకరించును. ఇక ఈ అధ్యాయములోని కథను ప్రారంభించెదము.

కాకాజీ వైద్య

నాసిక్ జిల్లా వాణిలో కాకాజీవైద్య యనువాడుండెను. అతడచటి సప్తశృంగి దేవతకు పూజారి. అత డనేకకష్టముల పాలైమనశ్శాంతిని పోగొట్టుకొని, చంచలమనస్కు డయ్యెను. అట్టి పరిస్థితులలో ఒకనాటి సాయంకాలము దేవతాలయమునకు బోయి తనను ఆందోళననుండి కాపాడుమని హృదయపుర్వకముగా వేడుకొనెను. అతని భక్తికి దేవత సంతసించి యానాటి రాత్రి యాతనికి స్వప్నమున గాన్పించి "బాబావద్దకు పొమ్ము, నీ మనస్సు శాంతి వహించు" ననెను. ఈ బాబా యెవరో దేవి నడిగి తెలిసికొనుటకు కాకాజీ యుత్సహించెను. కాని ఇంతలోనే అతనికి మెలకువ కలిగెను. ఈ బాబా యెవరైయుండవచ్చునని అతడు యోచించెను. కొంతసేపు ఆలోచించినపిమ్మట యీ బాబా త్ర్యంబకేశ్వరుడు (శివుడు) కావచ్చునని అతడు పుణ్మస్థలమగు త్ర్యంబకము (నాసిక్ జిల్లా) వెళ్ళెను. అచ్చట పదిరోజులుండెను. అక్కడున్నంతకాలము వేకువజామున స్నానము చేసి, రుద్రమును జపించుచు, అభిషేకమును తదితరపూజలను గావించెను. అయినప్పటికి మునుపటివలెనే అశాంతమనస్కుడుగా నుండెను. పిమ్మట స్వగ్రామమునకు తిరిగివచ్చి దేవతను తిరిగి వేడుకొనెను. ఆ రాత్రి ఆమె స్వప్నములో గనిపించి యిట్లనెను. "అనవసరముగా త్ర్యంబకేశ్వర మెందుకు వెళ్ళినావు? బాబా యనగా షిరిడీ సాయిబాబా యని నా యభిప్రాయము."

షిరిడీకి పోవుటెట్లు? ఎప్పుడు పోవలెను? బాబాను జూచుటెట్లు? అని కాకాజీ మనోవ్యాకులత పొందుచుండెను. ఎవరయిన యోగీశ్వరుని చూడవలె ననుకున్నచో, ఆ యోగియేగాక దైవముకూడ అతని కోరికను నెరవేర్చుటకు సహాయపడును. యధార్థముగా యోగియు, భగవంతుడును నొకరే వారిలో నేమియు భేదము లేదు. ఎవరైన తానై పోయి యోగిని దర్శించుటన్నది యుత్తబూటకము. యోగి సంకల్పించనిదే వారిని జూడగలుగు వారెవరు? అతని యాజ్ఞ లేక చెట్టు ఆకు గూడ కదలదు. యోగి దర్శనమునకై భక్తుడు ఎంత వేదన పడునో, ఎంత భక్తివిశ్వాసములు జూపునో, యంత త్వరగాను, బలముగాను, అతని కోరిక నెరవేరును. దర్శనమునకై ఆహ్వానించువాడే వచ్చువానికి స్వాగతసన్నాహము లొనర్చును. కాకాజీ విషయములో అట్లే స్వాగతసన్నాహము లొనర్చెను. కాకాజీ విషయములో అట్లే జరిగెను.

శ్యామా మ్రొక్కు

కాకాజీ షిరిడీకి పోవుట కాలోచించుచుండగా, ఒక యతిథి అతనిని షిరిడీకి తీసికొనిపోవుట కాతని యింటికే వచ్చెను. అతడింకెవరో కాదు, బాబాకు ముఖ్యభక్తుడగు శ్యామాయే. శ్యామా ఆసమయమున వాణికి ఎట్లు వచ్చెనో చూతుము. శ్యామా బాల్యములో జబ్బు పడినప్పుడు ఆయన తల్లి తమ గృహదేవతయగు వాణిలోని సప్తశృంగి దేవతకి, జబ్బు నయము కాగానే నీ దర్శనమునకు వచ్చి బిడ్డను నీ పాదములపై బెట్టెదనని మ్రొక్కుకొనెను. కొన్ని సంవత్సరముల పిమ్మట, ఆ తల్లికి కుచములపై తామర లేచి ఆమె మిక్కిలి బాధపడెను. తనకు నయమైనచో రెండు వెండికుచములు సమర్పించెదనని అప్పుడింకొక మ్రొక్కు మ్రొక్కెను. కాని ఈ రెండు మ్రొక్కులు కూడ ఆమె చెల్లించలేదు. ఆమె చనిపోవునపుడు ఈ సంగతి శ్యామాకు చెప్పి, రెండు మ్రొక్కులు చెల్లించు భారము నాతనిపై వైచి ఆమె మృతిచెందెను. శ్యామా కొన్నాళ్ళకు ఆ మ్రొక్కులను పూర్తిగా మరచెను, ఇట్లు 30 సంవత్సరములు గడచెను. అప్పట్లో షిరిడీకి ఒక పేరుపొందిన జ్యోతిష్కుడు వచ్చి నెల దినములచట మకాము చేసెను. అతడు శ్రీమాన్ బుట్టీ మొదలగువారికి చెప్పిన భవిష్యత్తు సంతృప్తికరముగా నుండెను. శ్యామా తమ్ముడు బాపాజీ జ్యోతిషపండితుని సంప్రదించగా అతడు తల్లి మ్రొక్కుకున్న మ్రొక్కులు చెల్లించక పోవుటచే వారికి కష్టములు సప్తశృంగిదేవత కలుగజేయుచున్న దనెను. బాపాజీ యీ సంగతి శ్యామాకు తెలియపరచెను. అప్పుడు శ్యామాకు సర్వము జ్ఞప్తికివచ్చెను. ఇంకను ఆలస్యము చెసినచో హానికరమని యెంచి శ్యామా ఒక కంసాలిని బిలచి, రెండు వెండి కుచములను చెయించెను. మసీదుకు బోయి, బాబా పాదములపై బడి, రెండు కుచముల నచట బెట్టి, తన మ్రొక్కులను చెల్ల జేయుమని, బాబాయే తన సప్తశృంగి దేవత యగుటచే వాని నామోదించమని వేడెను. నీవు స్వయముగా బోయి సప్తశృంగి దేవతకు మ్రొక్కును చెల్లింపుమని బాబా నిర్బంధించెను. బాబా ఊదీని ఆశీర్వదమును పొంది, శ్యామా వాణీ పట్టణమునకు బయలుదేరెను. పూజారి యిల్లు వెదకుచు తుదకు కాకాజీ యిల్లు చేరెను. అప్పుడు కాకాజీ షిరిడీకి పోవలెనని గొప్ప కుతూహలముతో నుండెను. అట్టి సమయములో శ్యామా వారింటికి వెళ్ళెను. ఇది ఎంత యాశ్చర్యకరమైన కలయికయో చూడుడు!

"మీరెవ్వరు? ఎచటనుండి వచ్చినా" రని కాకాజీ యడిగెను. "నాది షిరిడీ. నేను సప్తశృంగి మ్రొక్కు చెల్లించుట కిక్కడకు వచ్చినా"నని శ్యామా యనెను. షిరిడీనుండి వచ్చెనని తెలియగానే శ్యామాను కాకజీ కౌగిలించుకొనెను. ప్రేమచే మైమరచెను. వారు సాయిలీలల గూర్చి ముచ్చటించుకొనిరి. శ్యామా మ్రొక్కులన్నియు చెల్లించిన పిమ్మట వారిద్దరు షిరిడీకి బయలుదేరిరి. షిరిడీకి చేరగనే, కాకాజీ మసీదుకు బోయి బాబాను జూచి, వారి పాదములపై బడెను. అతని కండ్లు కన్నీటితో నిండెను. అతని మనస్సు శాంతించెను. సప్తశృంగిదేవత స్వప్నములో తెలియపరచిన రీతిగా బాబాను చూడగనే అతని మనస్సులోని చంచలత్వమంతయు పోయి ప్రశాంతి వహించెను. కాకాజీ తన మనస్సులో నిట్లనుకొనెను. 'ఏమి ఈ యద్భుతశక్తి, బాబా యేమియు పలుకలేదు. ఉత్తరప్రత్యుత్తరములు కూడ జరుగలేదు. ఆశీర్వచనముల నైన పలుకలేదు. కేవలము వారి దర్శనమే సంతోషమునకు కారణమయ్యెను. వారి దర్శనమాత్రముననే నామనశ్చాంచల్యము పోయినది. అంతరంగమున ఆనంద ముద్భవించినది. ఇదియే దర్శనభాగ్యము.' అతడు తన దృష్టి సాయినాథుని పాదములపై నిగిడించెను. అతని నోట మాట రాకుండెను. బాబా లీలలు విని, యతని సంతోషమున కంతులేకుండెను. బాబాను సర్వస్య శరణాగతి వేడెను. తన వేదనను బాధలను మరచెను. స్వచ్ఛమైన యానందమును పొందెను. అక్కడ 12 రోజులు సుఖముగా నుండి తుదకు బాబా సెలవు తీసుకొని వారి ఊదీ ప్రసాదమును ఆశీర్వచనమును పొంది యిల్లు చేరెను.

రహాతా కుశాల్ చంద్

తెల్లవారుజామున వచ్చిన స్వప్నము నిజమగునని యందురు. ఇది సత్యమే కావచ్చు. కాని బాబా స్వప్నములకు కాలనియమము లేదు. ఒక ఉదాహరణము: ఒకనాడు సాయంకాలము బాబా కాకాసాహెబు దీక్షితును రాహాతాకు పోయి, చాలరోజులనుండి చూడకుండుటచే, కుశాల్ చంద్ ను తీసికొని రమ్మనెను. ఒక టాంగాను దీసికొని కాకా రాహాతా వెళ్ళెను. కుశాల్ చంద్ ను కలిసికొని బాబా చెప్పిన వార్త నందజేసెను. దీనిని విని కుశాల్ చంద్ యాశ్చర్యపడెను. మధ్యాహ్నభోజనానంతరము నిద్రపోవుచుండగా తనకు స్వప్నములో బాబా కనపడి వెంటనే షిరిడీకి రమ్మనినందున నతడు షిరిడీకి పోవుటకు ఆతురతతో నున్నారని చెప్పెను. తన గుఱ్ణము అచ్చట లేకుండుటచే, తన కుమారుని బాబాకు ఈ సంగతి దెలుపుటకై పంపెను. కుమారుడు ఊరు బయటకు పోవుసరికి దీక్షిత్ టాంగా తీసికొని వచ్చెను. కుశాల్ చందును దీసికొని రావలసినదని బాబా దీక్షితుకు చెప్పుటచే, నిద్దరు టాంగాలో కూర్చుండి షిరిడీ చేరిరి. కుశాల్ చంద్ బాబాను దర్శించెను. అందరు సంతసించిరి. బాబా ఈ లీలను జూచి, కుశాల్ చంద్ మనస్సు కరగెను.

పంజాబి రామలాల్ (బొంబాయి)

ఒకనాడు బొంబయిలో నుండు పంజాబి బ్రాహ్మణుడు రామలాల్ యనువాడు స్వప్నమును గాంచెను. స్వప్నములో బాబా కనపడి షిరిడీకి రమ్మనెను. బాబా వానికి మహంతువలె గనిపించెను. కాని అతనికి వారెచట గలరో తెలియకుండెను. పోయి వారిని చూడవలెనని మనమున నిశ్చయించెను. కాని చిరునామా తెలియకుండుటచే చేయుట కేమియు తోచకుండెను. ఏవరినైన మనము పిలిచినచో వచ్చువారి కొరకు కావలసిన వన్నియు మనము సమకూర్చెదము. ఈ విషయములో కూడ అట్లనే జరిగెను. అతడు ఆనాడు సాయంకాలము వీథిలో పోవు చుండగా ఒక దుకాణములో బాబా ఫోటోను జూచెను. స్వప్నములో జూచిన మహంతు ముఖలక్షణములీ పటములో నున్నవానితో సరిపోయెను. కనుగొనగా యా పటము సాయిబాబాదని తెలిసెను. అతడు వెంటనే షిరిడీకి పోయి యచ్చటనే తన యంత్యకాలమువరకుండెను.

ఈ విధముగా తన భక్తులకు దర్శనమిచ్చుటకై షిరిడీకి తీసికొని వచ్చుచుండెను. వారి యిహపరముల కోరికలు నెరవేర్చుచుండెను.
ఓం నమోః శ్రీ సాయినాథాయ
శాంతిః శాంతిః శాంతిః
ముప్పదవ అధ్యాయము సంపూర్ణము.

నాలుగవరోజు పారాయణము సమాప్తము.

|సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు|
|శుభం భవతు|

శ్రీ సాయి సత్ చరిత్రము ఇరువదితొమ్మిదవ అధ్యాయము


ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

ఇరువదితొమ్మిదవ అధ్యాయము

1. మద్రాసు భజన సమాజము, 2. తెండుల్కర్ (తండ్రి - కొడుకులు), 3. డాక్టర్ హాటే, 4. వామన నార్వేకర్ మొదలైన వారి కథలు.

ఈ యధ్యాయములో రుచికరములు ఆశ్చర్యకరములునైన మరికొన్ని సాయి కథలున్నవి

1. మద్రాసు భజనసమాజము

1916వ సంవత్సరమున రామదాసి-పంథాకు చెందిన మదరాసు భజన సమాజ మొకటి కాశీయాత్రకు బయలుదేరెను. అందులో నొక పురుషుడు అతని భార్య, అతని కొమార్తె, అతని వదినెయు నుండిరి. వారి పేర్లు తెలియవు. మార్గమధ్యమున వారు అహమదు నగరు జిల్లా, కోపర్ గాం తాలూకాలో షిరిడీ యను గ్రామమున సాయియను నొక గొప్ప యోగీశ్వరు డున్నారనియు, వారు పరబ్రహ్మ స్వరూపులనియు, ప్రశాంతులనియు, ఉదార స్వభావులనియు, భక్తులకు ప్రతిరోజు ద్రవ్యము పంచి పెట్టెదరనియు, విద్యావంతుల కళాకుశలతను బట్టి యథోచితముగా సత్కరింతురనియు వినిరి. ప్రతిరోజు దక్షిణరూపముగా చాల డబ్బు వసూలుచేసి, దానిని భక్తకొండాజి కూతురు 3యేండ్ల అమానికి ఒక రూపాయి, రెండు రూపాయలనుంచి 5 రూపాయలవరకు కొందరికి, జమాలికి 6 రూపాయలును, అమాని తల్లికి 10 రూపాయలు మొదలుకొని 20 రూపాయల వరకు, కొందరు భక్తులకు 50 రూపాయల వరకు బాబా ఇచ్చుచుండెను. ఇదంతయు విని సమాజము షిరిడీకి వచ్చి, యచట ఆగిరి. సమాజము మంచి భజన చేసెను. మంచి పాటలు పాడిరి. కాని లోలోన ద్రవ్యము నాశించుచుండిరి. వారిలో ముగ్గురు పేరాస గలవారు. యజమానురాలు మాత్రమట్టి స్వభావము గలది కాదు. ఆమె బాబా యందు ప్రేమగౌరవములు కలది. ఒకనాడు మధ్యాహ్నహారతి జరుగుచుండగా, బాబా యామె భక్తివిశ్వాసములకు ప్రీతి జెంది యామె యిష్టదైవముయొక్క దృశ్యము ప్రసాదించెను. ఆమెకు బాబా శ్రీరామునివలె గాన్పించెను. తన యిష్టదైవమును జూచి యామె మనస్సు కరిగెను. ఆమె కండ్లనుండి యానందబాష్పములు కారుచుండగా ఆనందముతో చేతులు తట్టెను. ఆమె యానందవైఖరికి తక్కినవా రాశ్చర్యపడిరి. కాని కారణమేమో తెలిసికొనలేకుండిరి. జరిగిన దంతయు ఆమె సాయంకాలము తన భర్తతో చెప్పెను. ఆమె సాయిబాబాలో శ్రీరాముని జూచితి ననెను. ఆమె అమాయిక భక్తురాలగుటచే, శ్రీరాముని జూచుట, ఆమె పడిన భ్రమ యని భర్త యనుకొనెను. అది యంతయు వట్టి చాదస్తమని వెక్కిరించెను. అందరు సాయిబాబాను జూడగా ఆమె శ్రీరాముని జూచుట యసంభవమనెను. ఆమె యా యాక్షేపణకు కోపగించ లేదు. ఆమెకు శ్రీరామదర్శనము అపుడపుడు తన మనస్సు ప్రశాంతముగా నుండునపుడు, దురాశలు లేనపుడును, లభించుచునే యుండెను.

ఆశ్చర్యకరమైన దర్శనము

ఈ ప్రకారముగా జరుగుచుండగా ఒక రాత్రి భర్తకొక యద్భుతమైన దృశ్యము ఈ ప్రకారముగా కనబడెను. అతడొక పెద్ద పట్టణములో నుండెను. అక్కడి పోలీసులు తనను బంధించిరి. తాడుతో చేతులు కట్టి, యొక పంజరమున బంధించిరి. పోలీసువారు తాడుముడి మరింత బిగించుచుండగా సాయిబాబా పంజరము దగ్గరనే నిలిచియుండుట జూచి, విచారముగా నత డిట్లనెను. "నీ కీర్తి విని, నీ పాదముల వద్దకు వచ్చితిని. నీవు స్వయముగా నిచట నిలచి యుండగా, ఈయాపద నాపయి బడనేల?". బాబా యిట్లనెను. "నీవు చేసిన కర్మఫలితమును నీవే యనుభవింపవలెను." అతడిట్లనెను. "ఈ జన్మలో నాకిట్టి యాపద వచ్చుటకు నేనేమి పాపము చేయలేదు." బాబా యిటులనెను, "ఈ జన్మములో కాకున్న గతజన్మములో నేమయిన పాపము చేసియుండ వచ్చును." అతడిట్లనెను. "గతజన్మములో యేమయిన పాపము చేసి యున్నచో, నీ సముఖమున దాని నేల నిప్పుముందర యెండుగడ్డివలె దహనము చేయరాదు?" బాబా "నీ కట్టి విశ్వాసము గలదా?" యని యడుగ అతడు 'కలదు' అనెను. బాబా యప్పుడు కండ్లు మూయుమనెను. అతడు కండ్లు మూసి తెరచునంతలో ఏదో పడిపోయి క్రిందబడిన పెద్ద చప్పుడయ్యెను. పోలీసువారు రక్తము కారుచు పడిపోయి యుండిరి. తాను బంధవిముక్తుడై యుండెను. అతడు మిక్కిలి భయపడి బాబావైపు జూచెను. బాబా యిట్లనెను. "ఇప్పుడు నీవు బాగుగ పట్టుబడితివి. ఆఫీసర్లు వచ్చి నిన్ను బంధించెదరు." అప్పుడతడు ఇటుల విన్నవించెను. "నీవు తప్ప రక్షించేవా రెవరునులేరు. నన్ను ఎటులయిన కాపాడుము." అప్పుడు బాబా వానిని కండ్లు మూయుమనెను. వాడట్లుచేసి, తిరిగి తెరచునంతలో, వాడు పంజరమునుండి విడుదలయినట్లు బాబా ప్రక్కనున్నట్లు గాన్పించెను. అతడు బాబా పాదములపై బడెను. బాబా యిట్లనెను, "ఈ నమస్కారములకు ఇంతకుముందటి నమస్కారముల కైమైన భేదము కలదా? బాగా యాలోచించి చెప్పుము." అతడు ఇట్లనెను. "కావలసినంత భేదము కలదు. ముందటి నమస్కారములు నీవద్ద పైకము తీసుకొనుటకు చేసినవి. ఈ నమస్కారము నిన్ను దేవునిగా భావించి చేసినది. మరియును, నేను కోపముతో నీవు మహమ్మదీయుడవై హిందువులను పాడుచేయుచుంటివని యనుకొనెడి వాడను." బాబా "నీ మనస్సులో మహమ్మదీయ దేవతలను నమ్మవా?" యని ప్రశ్నింప అతడు నమ్మననెను. అప్పుడు బాబా "నీ యింటిలో పంజా లేదా? నీవు మోహర మప్పుడు పూజ చేయుట లేదా? మరియు మీ యింటిలో మహమ్మదీయ దేవత యగు కాడ్బీబీ లేదా? పెండ్లి మొదలగు శుభకార్యములప్పు డామెను మీరు శాంతింప జేయుట లేదా?" యనెను. అతడు దీనికంతటికి యొప్పుకొనెను. అపుడు బాబా యిటులనెను. "నీకింక ఏమి కావలెను?" అతడు తన గురువగు రామదాసును దర్శింప కోరిక గలదనెను. వెనుకకు తిరిగి చూడుమని బాబా యనెను. వెనుకకు తిరుగగనే యతనికి ఆశ్చర్యము కలుగునట్లు రామదాసు తన ముందర నుండెను. వారి పాదములపై బడగనే, రామదాసు అదృశ్యమయ్యెను. జిజ్ఞాస గలవాడై యతడు బాబాతో యిటులనెను. "మీరు వృద్ధులుగా గనబడుచున్నారు. మీ వయస్సు మీకు తెలియునా?" బాబా, "నేను ముసలివాడ ననచున్నావా? నాతో పరుగెత్తి చూడు" ఇట్లనుచు బాబా పరుగిడ మొదలిడెను. అతడు కూడ వెంబడించెను. ఆ ధూళిలో బాబా అదృశ్యుడయ్యెను. అతడు నిద్రనుండి మేల్కొనెను.

మేలుకొనిన వెంటనే స్వప్నదర్శనము గూర్చి తీవ్రముగా నాలోచించ మొదలిడెను. వాని మనోవైఖరి పూర్తిగా మారి బాబా గొప్పదనమును గ్రహించెను. అటుపిమ్మట వాని సంశయవైఖరి పేరాస పూర్తిగా తొలగెను. బాబా పాదములపై అసలయిన భక్తి మనమున నుద్భవించెను. ఆ దృశ్యమొక స్వప్నమే కాని, యందుగల ప్రశ్నోత్తరములు చాల ముఖ్యమైనవి, రుచికరమైనవి. ఆ మరుసటి యుదయమందరు మసీదులో హారతికొరకు గుమి గూడి యుండగా అతనికి బాబా రెండురూపాయల విలువగల మిఠాయిని, రెండురూపాయల నగదు నిచ్చి ఆశీర్వదించెను. అతని మరికొన్నిరోజు లుండుమనెను. అతనిని బాబా ఆశీర్వదించి యిట్లనియె. "అల్లా నీకు కావలసినంత డబ్బు నిచ్చును. నీకు మేలు చేయును." అతని కచ్చట యెక్కువ ధనము దొరుకలేదు, కాని అన్నిటికంటె మేలైన వస్తువు దొరికెను. అదియే బాబా యాశీర్వాదము. తరువాత ఆ భజనసమాజమున కెంతో ధనము లభించెను. వారి యాత్రకూడ జయప్రదముగా సాగెను. వారి కెట్టి కష్టములు ప్రయాణ మధ్యమున కలుగలేదు. అందరు క్షేమముగా ఇల్లుచేరిరి. వారు బాబా పలుకులు, ఆశీర్వాదములు, వారి కటాక్షముచే కలిగిన ఆనందమును గూర్చి మనమున చింతించుచుండిరి.

తన భక్తులను వృద్ధిచేయుటకు, వారి మనస్సులను మార్చుటకు బాబా యవలంబించిన మార్గములలో నొకటి చూపుట కీ కథ యదాహరణము. ఇప్పటికి నిట్టి మార్గములను బాబా అవలంబించుచున్నారు.


2. తెండూల్కర్ కుటుంబము

బాంద్రాలో తెండూల్కర్ కుటుంబముండెను. ఆ కుటుంబము వారందరు బాబాయందు భక్తి కలిగియుండిరి. సావిత్రీబాయి తెండూల్కర్, 'శ్రీ సాయినాథ భజనమాల' యను మరాఠీ గ్రంథమును 800 ఆభంగములు, పదములతో ప్రచురించెను. దానిలో సాయిలీల లన్నియు వర్ణింపబడెను. బాబా యందు శ్రద్ధాభక్తులు గలవారు దానిని తప్పక చదువవలెను. వారి కుమారుడు బాబా తెండుల్కర్ వైద్యపరీక్షకు కూర్చొనవలెనని రాత్రింబవళ్ళు కష్టపడి చదువుచుండెను. కొందరు జ్యోతిష్కుల సలహా చేసెను. వారు అతని జాతకమును జూచి ఈ సంవత్సరము గ్రహములు అనుకూలముగా లేవని చెప్పిరి. కనుక యా మరుసటి సంవత్సరము పరీక్షకు కూర్చొనవలెననియు అట్లుచేసిన తప్పక ఉత్తీర్ణుడగునని చెప్పిరి. ఇది విని అతని మనస్సుకు విచారము అశాంతి కలిగెను. కొన్నిదినముల తరువాత అతని తల్లి షిరిడీకి పోయి బాబాను దర్శించెను. ఆమె బాబాకు అనేక విషయములతో పాటు తన కొడుకు విచారగ్రస్తుడైన సంగతి కూడ చెప్పెను. ఇది విని బాబా యామె కిట్లనెను. "నాయందు నమ్మకముంచి జాతకములు, వాని ఫలితములు, సాముద్రికశాస్త్రజ్ఞుల పలుకు లోకప్రక్కకు ద్రోసి, తన పాఠములు చదువుకొనుమని చెప్పుము. శాంతమనస్సుతో పరీక్షకు వెళ్ళుమనుము. అతడు ఈ సంవత్సరము తప్పక ఉత్తీర్ణుడగును. నాయందే నమ్మకముంచు మనుము. నిరుత్సాహము చెందవద్దనుము." తల్లి యింటికి వచ్చి బాబా సందేశము కొడుకుకు వినిపించెను. అతడు శ్రద్ధగా చదివెను; పరీక్షకు కూర్చొనెను. వ్రాతపరీక్షలో బాగుగ వ్రాసెను గాని, సంశయములో మునిగి ఉత్తీర్ణుడగుటకు కావలసిన మార్కులు రావనుకొనెను. కావున నోటిపరీక్షకు కూర్చొన నిష్టపడలేదు. కాని పరీక్షకులు అతని వెంటబడిరి. వ్రాతపరీక్షలో ఉత్తీర్ణుడాయెననియు, నోటిపరీక్షకు రావలెననియు ఆ పరీక్షాధికారి కబురు పెట్టెను. ఇట్లు ధైర్యవచనము వినియాతడు పరీక్షకు కూర్చొని రెండింటిలో ఉత్తీర్ణుడాయెను. గ్రహములు వ్యతిరేకముగా నున్నను, బాబా కటాక్షముచే ఆ సంవత్సరము పరీక్షలో ఉత్తీర్ణుడయ్యెను. సంశయములు కష్టములు మన భక్తిని స్థిరపరచుటకు మనలను చుట్టుముట్టును; మనల పరీక్షించును. పూర్తి విశ్వాసముతో బాబాను కొలుచుచు మన కృషి సాగించినచో, మన ప్రయత్నములన్నియు తుదకు విజయవంతమగును.

ఈ విద్యార్థి తండ్రి రఘునాథరావు బొంబయిలో నొక విదేశకంపెనీలో కొలువుండెను. వృద్ధులగుటచే సరిగా పని చేయలేక సెలవుపెట్టి విశ్రాంతి పొందుచుండెను. సెలవుకాలములో అతని స్థితి మెరుగుపడలేదు. కావున సెలవు పొడిగించవలెననుకొనెను; లేదా ఉద్యోగమునుండి విరమించుకొనుట నిశ్చయమని తోచెను. కంపెనీ మేనేజరు అతనికి పింఛను ఇచ్చి ఉద్యోగవిరమణము చేయించవలెనని నిశ్చయించెను. మిక్కిలి నమ్మకముతో చాలాకాలము తమవద్ద ఉద్యోగము చేసినవాడు కనుక ఎంత పింఛను ఇవ్వవలె ననునది యాలోచించుచుండిరి. అతని వేతనము నెలకు 150 రూపాయలు. పింఛను అందులో సగము 75 రూపాయలు, కుటుంబ ఖర్చులకు సరిపోదు. కాబట్టి యీ విషయమై వారందరు ఆతురుతతో నుండిరి. తుది నిర్ణయమునకు 15రోజులు ముందు బాబా తెండూల్కర్ భార్యకు స్వప్నములో గనిపించి, "100 రూపాయలు పింఛను ఇచ్చిన బాగుండు ననుకొందును. అది నీకు సంతృప్తికరమా?" యనెను. ఆమె యిట్లు జవాబిచ్చెను. "బాబా, నన్నేల యడిగెదవు? మేము నిన్నే విశ్వసించి యున్నాము." బాబా 100 రూపాయలు అనినను, అతనికి 10 రూపాయలు అధికముగా అనగా 110 రూపాయలు పింఛను లభించెను. తన భక్తులపై బాబా ఇట్టి విచిత్రమైన ప్రేమానురాగములు ప్రదర్శించువారు.

3. కాప్టెన్ హాటే

కాప్టెన్ హాటే బికానేరులో నుండువాడు. అతడు బాబాకు కూర్చుభక్తుడు. ఒకనాడు బాబా యతని స్వప్నములో గనిపించి 'నన్ను మరచితివా?' యనెను. హాటే వెంటనే బాబా పాదములు పట్టుకొని "బిడ్డ తల్లిని మరచినచో, అదెట్లు బ్రతుకును?" అనుచు తోటలోనికి బోయి తాజా చిక్కుడు కాయలు తెచ్చి స్వయం పాకమును, దక్షిణను బాబా కర్పింప నుండగా, నతడు మేల్కొనెను. ఇదియంతయు స్వప్నమనుకొనెను. కొన్నిదినములతరువాత గ్వాలియర్ వెళ్ళెను. అక్కడనుండి 12 రూపాయలు మనియార్డరుద్వారా తన స్నేహితునకు బంపి అందులో రెండు రూపాయలతో స్వయంపాకము వస్తువులు చిక్కుడుకాయలు కొని, 10 రూపాయలు దక్షిణగా సమర్పించవలెనని, వ్రాసెను. ఆ స్నేహితుడు షిరిడీకి పోయి కావలసిన సామానులు కొనెను. కాని, చిక్కుడుకాయలు దొరకలేదు. కొంచెము సేపటికి యొక స్త్రీ తలపై చిక్కుడు కాయల గంపను పెట్టుకొని వచ్చెను. చిక్కుడుకాయలు కొని స్వయంపాకము సిద్ధము చేసి కాప్టెన్ హాటె పక్షమున దానిని బాబాకు అర్పించిరి. నిమోంకరు మరుసటిదినము అన్నము కూర చేసి బాబా కర్పించెను. బాబా భోజనము చేయునప్పుడు అన్నమును ఇతర పదార్థములను మాని, చిక్కుడు కాయ కూరను తినెను. ఈ సంగతి స్నేహితునిద్వారా తెలిసికొన్న హాటే సంతోషమున కంతు లేకుండెను.

పవిత్రము చేసిన రూపాయి

ఇంకొకసారి హాటేకు తన యింటిలో బాబా తాకి పవిత్రమొనర్చిన రూపాయి నుంచవలెనని కోరిక గలిగెను. షిరిడీకి పోవు స్నేహితుడొకడు తటస్థపడగా వాని ద్వారా హాటే రూపాయి పంపెను. ఆ స్నేహితుడు షిరిడీ చేరెను. బాబాకు నమస్కరించిన పిదప తన గురు దక్షిణ యొసంగెను. బాబా దానిని జేబులో వేసికొనెను. తరువాత హాటే యిచ్చిన రూపాయిని ఇవ్వగా, బాబా దానివైపు బాగా చూచి తన కుడిచేతి బొటనవ్రేలుతో పైకెగురవేసి యాడి ఆ స్నేహితున కిట్లనెను. "దీనిని దాని యజమానికి ఊదీప్రసాదముతో కూడ ఇచ్చివేయుము. నాకేమి యక్కరలేదని చెప్పుము. శాంతముగా సంతోషముగా నుండు మనుము." ఆ స్నేహితుడు గ్వాలియర్ తిరిగి వచ్చెను. హాటేకు బాబా పవిత్రము చేసిన రూపాయి ఇచ్చి జరిగినదంతయు చెప్పెను. ఈసారి హాటే మిక్కిలి సంతుష్టిజెందెను. బాబా సద్బుద్ధి కలుగజేయునని గ్రహించెను. మనః పూర్వకముగా కోరుటచే బాబా తనకోరికను యథాప్రకారము నెరవేర్చెనని సంతసించెను.

4. వామన నార్వేకర్

చదువరు లింకొక కథను వినెదరుగాక. వామన నార్వేకర్ అను నతడు బాబాను మిక్కిలి ప్రేమించువాడు. ఒకనాడతడు ఒక రూపాయి తెచ్చెను. దానికి నొకప్రక్క సీతారామలక్ష్మణులును, ఇంకొక ప్రక్క భక్తాంజనేయుడును గలరు. అతడు దానిని బాబా కిచ్చెను. బాబా దానిని తాకి పవిత్రమొనర్చి ఊదీ ప్రసాదముతో తన కివ్వవలెనని అతని కోరిక. కాని బాబా దానిని వెంటనే జేబులో వేసి కొనెను. శ్యామా, నార్వేకర్ ఉద్దేశమును తెలుపుచు, దానిని తిరగి ఇచ్చివేయుమని బాబాను వేడెను. వామనరావు ఎదుట బాబా యిట్లనెను. "దీని నేల అతని కివ్వవలెను? దీనిని మనమే యుంచుకొందుము. అతడు 25 రూపాయ లిచ్చినచో, తిరిగి వానిది వాని కిచ్చెదము." ఆ రూపయికొరకు, వామనరావు 25రూపాయలు వసూలుచేసి, బాబా ముందర బెట్టెను. బాబా యిట్లనెను. "ఆ నాణేము విలువ 25 రూపాయల కెంతో హెచ్చైనది. శ్యామా! యీ రూపాయిని దీసికొనుము. మన కోశములో దీని నుంచుము. దీనిని నీ మందిరములో బెట్టి పూజించుము." బాబా యెందులకీ మార్గము నవలంబించిరో యడుగుట కెవరికిని ధైర్యము చాలకుండెను. ఎవరికేది క్షేమమో వారికే తెలియును.
ఓం నమోః శ్రీ సాయినాథాయ
శాంతిః శాంతిః శాంతిః
ఇరువదితొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము.

|సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు|
|శుభం భవతు|

శ్రీ సాయి సత్ చరిత్రము ఇరువదియెనిమిదవ అధ్యాయము


ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

ఇరువదియెనిమిదవ అధ్యాయము

పిచ్చుకలను షిరిడీకి లాగుట

1. లక్ష్మీచంద్ 2. బురహాన్ పూరు మహిళ 3. మేఘశ్యాముడు - కథలు.

ప్రస్తావన

సాయి యనంతుడు. చీమలు, పురుగులు మొదలుకొని బ్రహ్మపర్యంతము సకలజీవులందు నివసించును. వారు సర్వాంతర్యామి. వేదజ్ఞానమందు, ఆత్మాసాక్షాత్కారవిద్యయందు వారు పారంగతులు. ఈ రెండింటిలో వారికి ప్రావీణ్య ముండుటచే వారు సద్గురువు లనిపించు కొనుటకు సమర్థులు. పండితులయినప్పటికి శిష్యుల నెవరైతే ప్రేరేపించి యాత్మసాక్షాత్కారము కలిగించలేరో వారు సద్గురువులు కానేరరు. సాధారణముగ తండ్రి శరీరమును పుట్టించును. పిమ్మట చావు జీవితమును వెంబడించును. కాని, సద్గురువు చావుపుట్టుకలను రెంటిని దాటింతురు కాబట్టి వారందరికంటె దయార్ద్రహృదయులు.

సాయిబాబా యనేకసారు లిట్లు నుడివిరి. "నా మనుష్యుడు ఎంత దూరమున నున్నప్పటికి, 1000 క్రోసుల దూరమున నున్నప్పటికి, పిచ్చుక కాళ్ళకు దారము కట్టియీడ్చినటుల అతనిని షిరిడీకి లాగెదను." అటువంటి మూడుపిచ్చుకలగురించి, ఈ అధ్యాయములో చెప్పుకొందుము.

1. బాలా లక్ష్మీచంద్

అతడు మొట్టమొదట రైల్వేలోను, అటుతరువాత బొంబాయిలోని శ్రీవేంకటేశ్వర ముద్రణాలయమునందును తదుపరి ర్యాబి బ్రదర్సు కంపెనీలో గుమాస్తాగును ఉద్యోగము చేసెను. 1910వ సంవత్సరమున అతనికి బాబా సాంగత్యము లభించెను. శాంతాక్రుజులో, క్రిస్టమస్ పండుగకు ఒకటిరెండు మాసములకు పూర్వము, స్వప్నములో గడ్డముతో నున్న యొక ముసలివానిని, చుట్టు భక్తులు గుంపులు గూడియున్నట్లు చూచెను. కొన్నాళ్ళ తరువాత దాసుగణు కీర్తన వినుటకు తన స్నేహితుడగు దత్తాత్రేయ మంజునాథ్ బిజార్ యింటికివెళ్ళెను. కీర్తన చేయునప్పుడు దాసుగణు బాబా పటమును సభలో పెట్టుట యాచారము. స్వప్నములో చూచిన ముసలివాని ముఖలక్షణములు ఈ పటములో నున్నవానికి సరిపోయెను. కావున తాను సాయిబాబాను స్వప్నములో జూచినటుల గ్రహించెను. పటము, దాసుగణు కీర్తన, తుకారాం జీవితము (అప్పుడు దాసుగణు చెప్పుచున్న హరికథ) ఇవన్నియు మనస్సున నాటి, లక్ష్మీచంద్ షిరిడీకి పోవుట కువ్విళ్లూరుచుండెను. సద్గురుని వెదకుటలోను ఆధ్యాత్మికకృషియందును దేవుడు భక్తులకు సహాయపడు ననునది భక్తుల యనుభవమే. ఆనాటి రాత్రి 8 గంటలకు అతని స్నేహితుడగు శంకరరావు వచ్చి తలుపు కొట్టి షిరిడీకి వచ్చెదవాయని యడిగెను. అతని యానందమున కంతులేకుండెను. షిరిడీకి పోవలెనని నిశ్చయించుకొనెను. పినతండ్రి కొడుకువద్ద 15 రూపాయలు అప్పుపుచ్చుకొని కావలసిన యేర్పాటులన్నియును జేసికొనిన పిమ్మట షిరిడీకి పయనమయ్యెను. రైలులో నతడును, అతని స్నేహితుడగు శంకరరావును భజన చేసిరి. సాయిబాబాను గూర్చి తోడి ప్రయాణీకుల నడిగిరి. చాల సంవత్సరములనుంచి షిరిడీలో నున్నసాయిబాబా గొప్ప యోగిపుంగవులని వారు చెప్పిరి. కోపర్ గాం రాగానే బాబాకొరకు జామపండ్లను కొనవలె ననుకొనెను. కాని, యా గ్రామ పరిసరములను ప్రకృతి దృశ్యములను జూచి యానందించి యావిషయమును మరచెను. షిరిడీ సమీపించుచుండగా వారికాసంగతి జ్ఞప్తికి వచ్చెను. అప్పుడే యొక ముసలమ్మ నెత్తిపై జామపండ్లగంప పెట్టుకొని తమ గుఱ్ఱపుబండి వెంట పరుగెత్తుకొని వచ్చుచుండెను. బండి నాపి కొన్నియెంపుడు పండ్లను మాత్రమే కొనెను. అప్పుడా ముసలమ్మ తక్కిన పండ్లను కూడ తీసికొని తన పక్షమున బాబా కర్పితము చేయుడని కోరెను. జామపండ్లను కొనవలె ననుకొనుట, ఆ విషయమే మరచుట, ముసలమ్మను కలిసికొనుట, యామె భక్తి, యివన్నియు నిద్దరికి ఆశ్చర్యమును కలుగజేసెను. ఆ ముసలమ్మ తాను స్వప్నములో చూచిన ముసలివాని బంధువై యుండవచ్చు ననుకొనెను. అంతలో బండి షిరిడీ చేరెను. మసీదుపయి జండాలను చూచి నమస్కరించిరి. పూజా సామాగ్రితో మసీదుకు వెళ్ళి బాబాను ఉచితవిధముగా పూజించిరి. లక్ష్మీచంద్ మనస్సు కరగెను. బాబాను జూచి చాల సంతసించెను. సువాసనగల తామరపువ్వును భ్రమరము జూచి సంతసించునటుల బాబా పాదముల జూచి సంతసించెను. అప్పుడు బాబా యిట్లనెను. "టక్కరి వాడు; దారిలో భజన చేసెను. ఇతరులను కనుగొనుచుండెను. ఇతరుల నడుగనేల? మన కండ్లతోడ సమస్తము చూడవలెను. ఇతరులను నడుగవలసిన యవసరమేమి? నీ స్వప్నము నిజమయినదా కాదా యనునది యాలోచించుము. మార్వడివద్ద 15రూపాయలు అప్పుతీసికొని దర్శనము చేయవలసిన యవసరమేమి? హృదయములోని కోరిక యిప్పుడయిన నెరవేరినదా?"

ఈ మాటలు విని బాబా సర్వజ్ఞత్వమునకు లక్ష్మీచంద్ యాశ్చర్యపడెను. బాబాకీ సంగతులన్నియు నెటుల దెలిసినవని అతడాశ్చర్యపడెను. ఇందులో ముఖ్యముగా గమనింపదగినది బాబా దర్శనము కొరకుగాని, సెలవురోజు అనగా పండుగదినము గడుపుటకు గాని, తీర్థయాత్రకు పోవుటకు గాని అప్పు చేయరాదని బాబా యభిప్రాయము.

సాంజా

మధ్యాహ్నభోజనమునకు గూర్చున్నప్పుడు లక్ష్మీచందుకు ఒక భక్తుడు సాంజాను ప్రసాదముగా నిచ్చెను. అది తిని లక్ష్మీచందు సంతసించెను. ఆ మరుసటిదినము కూడ దాని నాశించెను. కాని, యెవరును సాంజా తేలేదు. అతడు సాంజాకై కనిపెట్టుకొని యుండెను. మూడవరోజు హారతి సమయమునందు బాపుసాహెబ్ జోగ్ యేమి నైవేద్యము తీసికొని రావలెనని బాబాను అడిగెను. సాంజాతీసికొని రమ్మని బాబా చెప్పెను. భక్తులు రెండు కుండల నిండ సాంజాతెచ్చిరి. లక్ష్మీచందు చాల యాకలితో నుండెను. అతని వీపు నొప్పిగా నుండెను. బాబా యిట్లనెను. "నీవు ఆకలితో నుండుట మేలయినది. కావలసినంత సాంజా తినుము. నీ వీపు నొప్పికి ఏదయిన ఔషధము తీసికొనుము." బాబా తన మనస్సును కనుగొనెనని లక్ష్మీచంద్ రెండవసారి యాశ్చర్వపడెను. బాబా యెంత సర్వజ్ఞుడు!


దోష దృష్టి

ఆ సమయముననే లక్ష్మీచందు చావడి యుత్సవమును జూచెను. అప్పుడు బాబా దగ్గుచే బాధపడుచుండెను. ఎవరిదో దోషదృష్టి ప్రసరించుటచే బాబాకు బాధ కలిగినదనుకొనెను. ఆ మరుసటి యుదయము లక్ష్మీచందు మసీదుకు పోగా, బాబా శ్యామాతో నిట్లనియె. "ఎవరిదో దోషదృష్టి నాపయి పడుటచే నేను బాధపడుచున్నాను." లక్ష్మీచందు మనస్సులో నేమి భావించుచుండెనో యది యంతయు బాబా వెల్లడి చేయుచుండెను.

ఈ విధముగా సర్వజ్ఞతకు, కారుణ్యమునకు కావలసినన్ని నిదర్శనములను గని లక్ష్మీచందు బాబా పాదములపైబడి "మీ దర్శనము వలన నేనెంతో సంతోషించితిని. ఎల్లప్పుడు నాయందు దయాదాక్షిణ్యములు జూపి నన్ను రక్షించుము. నాకీ ప్రపంచములో మీ పాదములు తప్ప యితరదైవము లేదు. నా మనస్సు ఎల్లప్పుడును మీ పాదపూజయందు, మీ భజనయందు ప్రీతి జెందునుగాక, మీ కటాక్షముచే నన్ను ప్రపంచబాధలనుండి కాపాడుదురు గాక!" యని ప్రార్థించెను.

బాబా యాశీర్వాదమును, ఊదీప్రసాదములను పుచ్చుకొని లక్ష్మీచంద్ సంతోషముతో తృప్తితో స్నేహితునితో కలిసి ఇంటికి తిరిగి వచ్చెను. దారిలో బాబా మహిమలను కీర్తించుచుండెను. సదా బాబాకు నిజమైన భక్తుడుగా నుండెను. పరిచితులు షిరిడీకి పోవువారి ద్వారా పూలమాలలు, కర్పూరము, దక్షిణ పంపుచుండెను.

2. బురహాన్ పూరు మహిళ

ఇంకొక పిచ్చుక (భక్తురాలి) వృత్తాంతము జూచెదము. బురహాన్ పురూలో నొక మహిళకు సాయి స్వప్నములో కనబడి గుమ్మము పద్దకు వచ్చి తినుటకు 'కిచిడీ' కావలెననెను. మేల్కొని చూడగా తన ద్వారమువద్ద నెవ్వరు లేకుండిరి. చూచిన దృశ్యమునకు చాల సంతసించి ఆమె యందరికి తెలియజేసెను. తన భర్తకు గూడ తెలిపెను. అతడు పోస్టాఫీసులో నుద్యోగము చేయుచుండెను. అతనిని అకోలా బదిలీ చేసిరి. భార్యాభర్తలు షిరిడీ పోవ నిశ్చయించుకొని ఒక శుభదినమందు షిరిడీకి బయలుదేరిరి. మార్గమధ్యమున గోమతీతీర్థమును దర్శించి షిరిడీ చేరి, అచట రెండుమాసము లుండిరి. ప్రతిరోజు మసీదుకు బోయి బాబాను దర్శించి, పుజించి మిక్కిలి సంతసించుచుండిరి. వారు బాబాకు కిచిడీప్రసాదము నర్పించవలెనని షిరిడీకి వచ్చిరి. కాని యది 14 రోజులవరకు తటస్థించలేదు. ఆమెకు కాలయాపన యిష్టము లేకుండెను. 15వ రోజు ఆమె కిచిడీతో మసీదుకు 12గంటలకు వచ్చెను. మసీదులో నందరు భోజనమునకు కూర్చొనిరి. కనుక తెర వేసి యుండెను. తెరవేసి యుండునపుడు ఎవరు లోపల ప్రవేశించుటకు సాహసించరు. కాని ఆమెనిలువలేక పోయెను. ఒకచేతితో తెరపైకెత్తి లోపల ప్రవేశించెను. బాబా యానాడు కిచిడీకొరకు కనిపెట్టుకొని యున్నట్లు తోచెను. ఆమె కిచిడీ యచట పెట్టగనే బాబా సంతసముతో ముద్దమీదముద్ద మ్రింగుట ప్రారంభించెను. బాబా యీ యాతురతను జూచియందరు ఆశ్చర్యపడిరి. ఈ కిచిడీ కథను విన్నవారు బాబాకు తన భక్తులపై అసాధారణ ప్రేమ యుండుననుటను విశ్వసించిరి.

3. మేఘశ్యాముడు

ఇక అన్నిటికంటె పెద్దదైన మూడవ పిచ్చుక గురించి వినుడు. విరమ్ గాం నివాసియగు మేఘశ్యాముడు హరి వినాయక సాఠెగారి వంటబ్రాహ్మణుడు. అతడు అమాయకుడైన, చదువురాని శివభక్తుడు. ఎల్లప్పుడు శివపంచాక్షరి 'నమశ్శివాయ' జపించువాడు. అతనికి సంధ్యావందనముగాని, గాయత్రీ మంత్రముగాని, తెలియకుండెను. సాఠేగారికి వీనియందు శ్రద్ధ గలిగి గాయత్రీమంత్రముతో సంధ్యావందనము నేర్పించిరి. సాయిబాబా శివుని యవతారమని సాఠే అతనికి బోధించి షిరిడీకి ప్రయాణము చేయించెను. బ్రోచి స్టేషనువద్ద సాయిబాబా మహమ్మదీయుడని యెవరో చెప్పగా అతని మనస్సు కలవరపడి తనను అచటకు పంపవద్దని యజమానిని వేడుకొనెను. కాని ఆ యజమాని మేఘుడు షిరిడీకి పోయి తీరవలెనని నిశ్చయించి అతనికి ఒక పరిచయపు టుత్తరము షిరిడీ వాసి తన మామగారగు దాదా కేల్కరుకు వ్రాసి సాయిబాబాతో వరిచయము కలుగజేయవలెనని ఇచ్చెను. షిరిడీ చేరి మసీదుకు పోగా బాబా కోపించి అతనిని లోపలకు రానీయక "వెధవను తన్ని తరిమివేయుడు" అని గర్జించి, మేఘునితో నిట్లనెను. "నీవు గొప్పజాతి బ్రాహ్మణుడవు. నేనా తక్కువజాతి మహమ్మదీయుడను. నీ విచటకు వచ్చినచో, నీ కులము పోవును, కనుక వెడలిపొమ్ము." ఈ మాటలు విని మేఘుడు వణక నారంభించెను. అతడు తన మసస్సులోనున్న విషయములు బాబాకెట్లు దెలిసెనని యాశ్చర్యపడెను. కొన్నిదినము లచటనే యుండి తనకు తోచినట్లు బాబాను సేవించుచుండెను. కాని యతడు సంతృప్తి చెందలేదు. తరువాత తన యింటికి బోయెను. అక్కడనుండి త్ర్యంబక్ (నాసిక్ జిల్లా) పోయి యచట ఒకసంవత్సరము 6 మాసములుండెను. తిరిగి షిరిడీకి వచ్చెను. ఈసారి దాదా కేల్కర్ కల్పించుకొనుటచే నాతడు మసీదులో ప్రవేశించుటకు, షిరిడీలో నుండుటకు బాబా సమ్మతించెను. మేఘశ్యామునకు బాబా ఉపదేశముద్వారా సహాయము చేయలేదు. అతని మనస్సులోనే మార్పుకలుగజేయుచు చాలా మేలుచేసెను. అప్పటినుండి అతడు సాయిబాబాను శివుని యవతారముగా భావించుచుండెను. శివుని యర్చనకు బిల్వపత్రి కావలెను. మేఘుడు ప్రతిరోజు మైళ్ళకొలది నడిచి పత్రిని దెచ్చి బాబాను పూజించుచుండెను. గ్రామములో నున్న దేవతలనందరిని పూజించిన పిమ్మట మసీదుకు వచ్చి బాబా గద్దెకు నమస్కరించి పిదప బాబాను పూజించుచుండెను. కొంతసేపు వారి పాదముల నొత్తిన పిమ్మట బాబా పాదతీర్థమును త్రాగుచుండెడివాడు. ఒకనాడు మందిరము వాకిలి మూసియుండుటచే ఖండోబాదేవుని పూజింపక మసీదుకు వచ్చెను. బాబా అతని పూజకు అంగీకరించక తిరిగి పంపివేసెను. ఖండోబామందిరము వాకిలి తెరిచియున్నదని చెప్పెను. మేఘశ్యాముడు మందిరమునకు పోయెను. వాకిలి తెరిచి యుండుటచే ఖండోబాను పూజించి తిరిగి వచ్చి బాబాను పూజించెను.

గంగా స్నానము

ఒక మకరసంక్రాంతినాడు మేఘుడు బాబా శరీరమునకు చందనము పూసి, గంగానదీజలముతో నభిషేకము చేయదలంచెను. బాబాకు అది ఇష్టములేకుండెను. కాని యత డనేకసారులు వేడుకొనగా బాబా సమ్మతించెను. మేఘశ్యాముడు రానుపోను 8 క్రోసుల దూరము నడచి గోమతీనదీతీర్థము తేవలసియుండెను. అతడు తీర్థము దెచ్చి, యత్నము లన్నియు జేసికొని, బాబావద్దకు 12గంటలకు వచ్చి, స్నానమునకు సిద్ధముగా నుండుమనెను. బాబా తనకా యభిషేకము వలదనియు, ఫకీరగుటచే గంగానదీజలముతో నెట్టిసంబంధము లేదనియు చెప్పెను. కాని మేఘుడు వినలేదు. శివుని కభిషేక మిష్టము గనుక, తనకు శివుడైన బాబాకు అభిషేకము చేసితీరవలెనని పట్టుబట్టెను. బాబా సమ్మతించి క్రిందికి దిగి పీటపయి కూర్చుండి తల ముందుకు సాచి, ఇట్లనెను. "ఓ మేఘా! ఈ చిన్న యుపకారము చేసిపెట్టుము. శరీరమునకు తల ముఖ్యము. కావున తలపైనే నీళ్ళు పోయుము. శరీరమంతటిపై పోసినట్లగును." అట్లనే యని మేఘశ్యాము డొప్పుకొని, నీళ్ళకుండను పైకెత్తి తలపై పోయ యత్నించెను. కాని, భక్తిపారవశ్యమున 'హరగంగే, హరగంగే' యనుచు శరీరమంతటిపై నీళ్ళు పోసెను. కుండ నొక ప్రక్కకు బెట్టి, బాబా వయిపు జూచెను. వాని యాశ్చర్యానందములకు మేరలేదు. బాబా తల మాత్రమే తడిసి, శరీరమంతయు పొడిగా నుండెను.

త్రిశూలము, లింగము

మేఘశ్యాముడు బాబాను రెండుచోట్ల పూజించుచుండెను. మసీదులో బాబాను స్వయముగా పూజించుచుండెను. వాడాలో నానా సాహెబు చాందోర్క రిచ్చినపటమును పూజించుచుండెను. ఈ ప్రకారము 12 నెలలు చేసెను. వాని భక్తికి మెచ్చుకొనెనని తెలుపుటకు బాబా అతనికొక దృష్టాంతము చూపెను. ఒకనాడు వేకువజామున మేఘుడు తన శయ్యపయి పండుకొని కండ్లు మూసియున్నప్పటికి, లోపల ధ్యానము చేయుచు, బాబా రూపమును జూచెను. అతడు మేలుకొన్నటుల తెలిసికొని, బాబా యక్షతలు చల్లి "మేఘా, త్రిశూలమును వ్రాయుము" అని అదృశ్యుడయ్యెను. బాబా మాటలు విని, యాతురతగా కండ్లు దెరచెను. బాబాను చూడలేదు గాని, యక్షత లక్కడక్కడ పడియుండెను. బాబా వద్దకు పోయి, చూచిన దృశ్యమును గూర్చి చెప్పి త్రిశులమును వ్రాయుట కాజ్ఞ నిమ్మనెను. బాబా యిట్లనెను. "నా మాటలు వినలేదా? త్రిశూలమును వ్రాయుమంటిని. అది దృశ్యము కాదు. స్వయముగా వచ్చి, నేనే చెప్పితిని. నా మాటలు పొల్లుగావు. అర్థవంతములు." మేఘు డిట్లుపలికెను. "మీరు నన్ను లేపినటుల భావించితిని. తలుపులన్ని వేసి యుండుటచే, నది దృశ్యమను కొంటిని." బాబా తిరిగి యిట్లు జవాబిచ్చెను. "ప్రవేశించుటకు నాకు వాకిలి యవసరము లేదు. నాకు రూపము లేదు. నేనన్నిచోట్ల నివసించుచున్నాను. ఎవరయితే నన్నే నమ్మి నా ధ్యానమునందే మునిగి యుందురో వారి పనులన్నియు సూత్రధారినై నేనే నడిపించెదను."

మేఘుడు వాడాకు తిరిగి వచ్చి, బాబా పటమువద్ద గోడపై త్రిశూలము ఎర్రరంగుతో వ్రాసెను. ఆ మరుసటి దినము ఒక రామదాసి భక్తుడు పూనానుంచి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగమును సమర్పించెను. అప్పుడే మేఘుడు కూడ అచటకు వచ్చెను. బాబా యిట్లనెను. "చూడు శంకరుడు వచ్చినాడు; జాగ్రత్తగా పూజింపుము." మేఘుడు త్రిశూలమును వ్రాసిన వెంటనే లింగము వచ్చుట జూచి యాశ్చర్యపడెను. వాడాలో కాకాసాహెబు దీక్షిత్ స్నానము చేసి సాయిని తలంచుకొనుచుండగా తన మనోదృష్టియందు లింగము వచ్చుట గాంచెను. అతడాశ్చర్యపడుచుండగా మేఘశ్యాముడు వచ్చి, బాబా తనకు లింగము కానుకగా నిచ్చెనని చూపెను. దీక్షితుడు దానిని జూచి సరిగా నది తన ధ్యానములో కనపడినదానివలె నున్నదని సంతసించెను. కొద్ది రోజులలో త్రిశూలమును వ్రాయుట పూర్తికాగా, బాబా మేఘశ్యాముడు పూజచేయుచున్న పెద్దపటమువద్ద లింగములు ప్రతిష్ఠించెను. మేఘశ్యామునకు శివుని పూజించుట చాలా ప్రీతి గనుక త్రిశూలము వ్రాయించి, లింగమును ప్రతిష్ఠించుట ద్వారా, బాబా వానియందుండు నమ్మకమును స్థిరపరచెను.

అనేకసంవత్సరములు బాబా సేవచేసి యనగా పూజా, మధ్యాహ్న సాయంకాల హారతి సేవలు చేసి తుదకు 1912లో మేఘశ్యాముడు కాలము నొందెను. బాబా వాని కళేబరముపయి చేతులుచాచి "ఇతడు నా నిజమయిన భక్తు"డనెను. బాబా తన సొంతఖర్చులతో బ్రాహ్మణులకు చావుభోజీ ఏర్పాటు చేయుమనెను. కాకా సాహెబు దీక్షిత్ బాబా ఆజ్ఞ నెరవేర్చెను.
ఓం నమోః శ్రీ సాయినాథాయ
శాంతిః శాంతిః శాంతిః
ఇరువదియెనిమిదవ అధ్యాయము సంపూర్ణము.

|సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు|
|శుభం భవతు|

శ్రీ సాయి సత్ చరిత్రము ఇరువదియేడవ అధ్యాయము


ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

ఇరువదియేడవ అధ్యాయము

భాగవతము విష్ణుసహస్రనామముల నిచ్చి అనుగ్రహించుట

1. దీక్షిత్ గారికి విఠల్ దర్శనము 2. గీతారహస్యము 3. ఖాపర్డే దంపతులు

బాబా మతగ్రంథములను తాకి పవిత్రముచేసి వానిని తన భక్తులకు పారాయణము కొరకు ప్రసాదించుట మొదలగునవి యీ ఆధ్యాయములో చెప్పుకొందుము.

ప్రస్తావన

మానవుడు సముద్రములో మునుగగానే, అన్ని తీర్థములలోను పుణ్యనదులలోను స్నానముచేసిన పుణ్యము లభించును. అటులనే మానవుడు సద్గురుని పాదారవిందముల నాశ్రయింపగనే, త్రిమూర్తులకు (బ్రహ్మవిష్ణుమహేశ్వరులకు) నమస్కరించిన ఫలముతోపాటు పరబ్రహ్మమునకు నమస్కరించిన ఫలితముకూడ లభించును. కోరికలను నెరవేర్చు కల్పతరువు, జ్ఞానమునకు సముద్రము, మనకు ఆత్మసాక్షాత్కారమును కలుగ జేయునట్టి శ్రీ సాయిమహారాజునకు జయమగు గాక. ఓ సాయీ! నీ కథలందు మాకు శ్రద్ధను కలుగజేయుము. చాతకపక్షి మేఘజలము త్రాగి యెట్లు సంతసించునో, అటులనే నీకథలను చదువువారును, వినువారును, మిక్కిలి ప్రీతితో వానిని గ్రహింతురుగాక. నీ కథలు విను నప్పుడు వారికి వారి కుటుంబములకు సాత్వికభావములు కలుగునుగాక. వారి శరీరములు చెమరించగాక; వారి నేత్రములు కన్నీటిచే నిండుగాక; వారి ప్రాణములు స్థిరపడుగాక; వారి మనస్సులు ఏకాగ్రమగుగాక; వారికి గగుర్పాటు కలుగుగాక; వారు వెక్కుచు ఏడ్చి వణకెదరుగాక; వారిలోగల వైషమ్యములు తరతమ భేదములు నిష్క్రమించుగాక. ఇట్లు జరిగినచో, గురువుగారి కటాక్షము వారి పైన ప్రసరించినదను కొనవలెను. ఈ భావములు నీలో కలిగినప్పుడు, గురువు మిక్కిలి సంతసించి ఆత్మసాక్షాత్కారమునకు దారి చూపును. మాయాబంధములనుండి స్వేచ్ఛ పొందుటకు బాబాను హృదయపూర్వకశరణాగతి వేడవలెను. వేదములు నిన్ను మాయయనే మహాసముద్రమును దాటించలేవు. సద్గురువే యాపని చేయగలరు. సర్వజీవకోటియందును భగవంతుని చూచునట్లు చేయగలరు.

గ్రంథములను పవిత్రముచేసి కానుకగా నిచ్చుట

ముందుటి అధ్యాయములో బాబా బోధలొనర్చు తీరులను జూచితిమి. అందులో నొక్కదానినే యీ అధ్యాయములో జూచెదము. కొందరు భక్తులు మతగ్రంథములను పారాయణ చేయుటకు బాబా చేతికిచ్చి బాబా పవిత్రము చేసినపిమ్మట వానిని పుచ్చుకొనెడివారు. అట్టి గ్రంథములు పారాయణ చేయునప్పుడు బాబా తమతో నున్నటుల భావించెడివారు. ఒకనాడు కాకామహాజని ఏకనాథ భాగవతమును దీసికొని షిరిడీకి వచ్చెను. శ్యామా యా పుస్తకమును చదువుటకై తీసుకొని మసీదుకు బోయెను. అచ్చట బాబా దానిని దీసికొని చేతితో తాకి, కొన్ని పుటలను త్రిప్పి, శ్యామాకిచ్చి దానిని తనవద్ద నుంచుకొమ్మనెను. అది కాకా పుస్తకమనియు, నందుచే దానినాతని కిచ్చివేయవలెననియు శ్యామా చెప్పెను. కాని బాబా "దానిని నేను నీకిచ్చితిని. దానిని జాగ్రత్తగా నీవద్ద నుంచుము. అది నీకు పనికివచ్చు" ననిరి. ఈ ప్రకారముగ బాబా అనేక పుస్తకములు శ్యామావద్ద నుంచెను. కొన్ని దినముల పిమ్మట కాకా మహాజని తిరిగి భాగవతమును తెచ్చి బాబా కిచ్చెను. బాబా దానిని తాకి ప్రసాదముగా మహాజనికే ఇచ్చి దానిని భద్రపరచుమనెను. అది యాతనికి మేలు చేయుననిరి. కాకా సాష్టాంగనమస్కారముతో స్వీకరించెను.

శ్యామా విష్ణుసహస్రనామముల పుస్తకము

శ్యామా బాబాకు మిక్కిలి ప్రియభక్తుడు. బాబా యతనికి మేలు చేయ నిశ్చయించి విష్ణుసహస్రనామమును ప్రసాదముగా నిచ్చెను. దానిని ఈ క్రింది విధముగా జరిపెను. ఒకప్పుడు రామదాసి (రామదాసు భక్తుడు) షిరిడీకి వచ్చెను. కొన్నాళ్ళు అక్కడ నుండెను. ప్రతి రోజు ఉదయమే లేచి, ముఖము కడుగుకొని, స్నానము చేసి, పట్టుబట్టలు ధరించి విభూతి పూసికొని, విష్ణుసహస్రనామమును (భగవద్గీతకు తరువాత ముఖ్యమైనది), ఆధ్యాత్మరామాయణమును శ్రద్ధతో పారాయణ చేయుచుండెను. అత డీ గ్రంథముల ననేకసారులు పారాయణ చేసెను. కొన్ని దినముల పిమ్మట బాబా శ్యామాకు మేలు చేయ నిశ్చయించి, విష్ణుసహస్రనామ పారాయణము చేయింపదలచెను. కావున రామదాసిని బిలచి తమకు కడుపు నొప్పిగా నున్నదనియు సోనాముఖి తీసికొననిదే నొప్పి తగ్గదనియు, కనుక బజారుకు పోయి యా మందును తీసికొని రమ్మనియు కోరెను. పారాయణము ఆపి రామదాసి బజారుకు పోయెను. బాబా తమ గద్దె దిగి రామదాసి పారాయణ చేయు స్థలమునకు వచ్చి విష్ణుసహస్రనామ పుస్తకమును దీసికొనెను. తమ స్థలమునకు తిరిగివచ్చి యిట్లనెను. "ఓ శ్యామా! యీ గ్రంథము మిగుల విలువైనది, ఫలప్రదమైనది, కనుక నీకిది బహూకరించుచున్నాను. నీవు దీనిని చదువుము. ఒకప్పుడు నేను మిగుల బాధ పడితిని, నా హృదయము కొట్టుకొనెను. నా జీవిత మపాయములో నుండెను. అట్టి సందిగ్థస్థితియందు నేను ఈ పుస్తకమును నా హృదయమునకు హత్తుకొంటిని. శ్యామా! అది నాకు గొప్ప మేలు చేసెను. అల్లాయే స్వయముగా వచ్చి బాగు చేసెనని యనుకొంటిని. అందుచే దీనిని నీ కిచ్చుచున్నాను. దీనిని కొంచెము ఓపికగా చదువుము. రోజున కొక నామము చదివినను మేలు కలుగజేయును." శ్యామా తన కాపుస్తక మక్కరలేదనెను. ఆ పుస్తకము రామదాసిది. అతడు పిచ్చివాడు. మొండివాడు, కోపిష్ఠి కావున వానితో కయ్యము వచ్చుననెను. మరియు తాను అనాగరికు డగుటచే దేవనాగరి అక్షరములు చదువలేననెను.

తనకు రామదాసితో బాబా కయ్యము కలుగజేయు చున్నాడని శ్యామా యనుకొనెనే గాని బాబా తనకు మేలు కలుగ జేయనున్నాడని యనుకొనలేదు. బాబా యా సహస్రనామమనే మాలను శ్యామా మెడలో వేయ నిశ్చయించెను. అతడు అనాగరకుడయినప్పిటికి బాబాకు ముఖ్యభక్తుడు. బాబా ఈ ప్రకార మతనిని ప్రపంచబాధలనుండి తప్పించగోరెను. భగవన్నామఫలిత మందరికి విశదమే. సకలపాపములనుండి దురాలోచనలనుండి, చావుపుట్టుకలనుండి అది మనలను తప్పించును. దీనికంటె సులభమయిన సాధన మింకొకటి లేదు. అది మనస్సును పావనము చేయుటలో మిక్కిలి సమర్థమైనది. దాని కెట్టి తంతు కూడ అవసరము లేదు. దానికి నియమము లేమియు లేవు. అది మిగుల సులభమైనది, ఫలప్రదమైనది. శ్యామాకు ఇష్టము లేనప్పటికి వానిచేదాని నభ్యసింప చేయవలెనని బాబాకు దయకలిగెను. కనుక దానిని బాబా వానిపయి బలవంతముగా రుద్దెను. ఆ ప్రకారముగనే చాలా కాలము క్రిందట ఏకనాథ మహారాజు బలవంతముగా విష్ణుసహస్రనామమునొక బీద బ్రాహ్మణునిచే పారాయణ చేయించి వానిని రక్షించెను. విష్ణుసహస్రనామ పారాయణము చిత్తశుద్ధి కొక విశాలమయిన చక్కటి మార్గము. కాన దానిని బాబా శ్యామాకు బలవంతముగా ఇచ్చెను.

రామదాసి త్వరలో సోనాముఖి తెచ్చెను. అన్నా చించణీకర్ యక్కడనే యుండెను. నారదునివలె నటించి జరిగిన దంతయు వానికి జెప్పెను. రామదాసి వెంటనే కోపముతో మండిపడెను. కోపముతో శ్యామాపయి బడి, శ్యామాయే కడుపునొప్పి సాకుతో బాబా తనను బజారుకు పంపునట్లు చేసి ఈ లోపల పుస్తకమును తీసికొనెనని యనెను. శ్యామాను తిట్టనారంభించెను. పుస్తకము ఈయనిచో తల పగులగొట్టుకొందుననెను. శ్యామా నెమ్మదిగా జవాబిచ్చెను. కాని ప్రయోజనము లేకుండెను. అప్పుడు దయతో బాబా రామదాసితో నిట్లు పలికెను. "ఓ రామదాసీ! యేమి సమాచారము? ఎందులకు చీకాకుపడుచున్నావు? శ్యామా మనవాడు కాడా? అనవసరముగా వాని నేల తిట్టెదవు? ఎందుకు జగడ మాడుచున్నావు? నెమ్మదిగా ప్రేమతో మాటలాడలేవా? ఈ పవిత్రమైన గ్రంథములను నిత్యము పారాయణ చేయచుంటివి గాని, యింకను నీ మనస్సు నపవిత్రముగాను, అస్వాధీనముగాను ఉన్నట్లున్నది. నీ వెట్టి రామదాసివయ్యా? సమస్తవిషయములందు నీవు నిర్మముడవుగా నుండవలెను. నీ వాపుస్తకమును అంతగా నభిలషించుట వింతగా నున్నది. నిజమైన రామదాసికి మమత కాక సమత యుండవలెను. ఒక పుస్తకము కొరకు శ్యామాతో పోరాడుచున్నావా? వెళ్ళు, నీ స్థలములో కూర్చొనుము. ధనమిచ్చిన పుస్తకము లనేకములు వచ్చును, కాని మనుష్యులు రారు. బాగా ఆలోచించుము, తెలివిగా ప్రవర్తింపుము. నీ పుస్తకము విలువ యెంత? శ్యామాకు దానితో నెట్టి సంబంధము లేదు. నేనే దానిని తీసికొని వాని కిచ్చితిని. నీ కది కంఠపాఠముగా వచ్చును కదా! కావున శ్యామా దానిని చదివి మేలు పొందు ననుకొంటిని. అందుచే దాని నతని కిచ్చితిని."

బాబా పలుకులెంత మధురముగా, మెత్తగా, కోమలముగా అమృత తుల్యముగా నున్నవి! వాని ప్రభావము విచిత్రమయినది. రామదాసి శాంతించెను. దానికి బదులు పంచరత్నగీత యను గ్రంథమును శ్యామా వద్ద తీసికొనెదననెను. శ్యామా మిక్కిలి సంతసించెను. "ఒక్కటేల? పది పుస్తకముల నిచ్చెద" ననెను.

ఈ విధముగా బాబా వారి తగవును తీర్చెను. ఇందు ఆలోచించవలసిన విషయమేమన రామదాసి పంచరత్నగీత నేల కోరెను? అతడు లోనున్న భగవంతుని తెలిసికొనుట కెన్నడు యత్నించి యుండలేదు. ప్రతినిత్యము మతగ్రంథములను మసీదులో బాబా ముందర పారాయణ చేయువాడు, శ్యామాతో బాబా యెదుట ఏల జగడమాడెను? మనము ఎవరిని నిందించవలెనో, యెవరిని తప్పుపట్టవలెనో పోల్చుకొనలేము. ఈ కథ నీ విధముగా నడిపించకపోయినచో ఈ విషయముయొక్క ప్రాముఖ్యము, భగవన్నామ స్మరణఫలితము, విష్ణుసహస్రనామ పారాయణ మొదలగునవి శ్యామాకు తెలిసియుండవు. బాబా బోధించు మార్గము, ప్రాముఖ్యము కలుగజేయు విషయములు సాటిలేనివి. ఈ గ్రంథమును క్రమముగ శ్యామా చదివి దానిలో గొప్ప ప్రావీణ్యము సంపాదించెను. శ్రీ మాన్ బుట్టీ అల్లుడగు జి. జి. నార్కేకు బోధించ గలిగెను. ఈ నార్కే పూనా యింజనీరింగు కాలేజి ప్రిన్సిపాలుగా నుండెను.


గీతా రహస్యము

బ్రహ్మవిద్య నధ్యయనము చేయువారిని బాబా యెల్లప్పుడు ప్రేమించువారు, ప్రోత్సహించువారు. ఇచట దానికొక యుదాహరణమిచ్చెదము. ఒకనాడు బాపుసాహెబుజోగ్ కు ఒక పార్సెలు వచ్చెను. అందులో తిలక్ వ్రాసిన గీతారహస్య ముండెను. అతడా పార్సిలును తన చంకలో పెట్టుకొని మసీదుకు వచ్చెను. బాబాకు సాష్టాంగనమస్కారము చేయునప్పు డది క్రిందపడెను. అదేమని బాబా యడిగెను. అక్కడనే దానిని విప్పి బాబా చేతిలో ఆ పుస్తకము నుంచెను. బాబా కొన్ని నిమిషములు పుస్తకములోని పేజీలను ద్రిప్పి తన జేబులోనుండి ఒక రూపాయి తీసి పుస్తకముపై బెట్టి దక్షిణతో గూడ పుస్తకమును జోగున కందించుచు "దీనిని పూర్తిగ చదువుము, నీకు మేలు కలుగును." అనెను.

ఖాపర్డే దంపతులు

ఖాపర్డే వృత్తాంతముతో నీ యధ్యాయమును ముగించెదము. ఒకప్పుడు ఖాపర్డే తన భార్యతో షిరిడీకి వచ్చి కొన్ని నెలలుండెను. దాదా సాహెబు ఖాపర్డే సామాన్యుడు కాడు. అమరావతిలో మిక్కిలి ప్రసిద్ధి కెక్కిన ప్లీడరు, మిక్కిలి ధనవంతుడు, ఢిల్లీ కౌన్సిలులో సభ్యుడు, మిక్కిలి తెలివయినవాడు, గొప్పవక్త. కాని బాబా ముందర నెప్పుడు నోరు తెరవలేదు. అనేకమంది భక్తులు పలుమారులు బాబాతో మాటలాడిరి, వాదించిరి. కాని ముగ్గురు మాత్రము ఖాపర్డే, నూల్కర్, బుట్టీ - నిశ్శబ్దముగా కూర్చుండువారు, వారు వినయవిధేయత నమ్రతలున్న ప్రముఖులు. పంచదశిని ఇతరులకు బోధించగలిగిన ఖాపర్డే బాబా ముందర మసీదులో కూర్చొనునప్పుడు నోరెత్తి మాట్లాడువాడు కాడు, నిజముగా మానవుడెంత చదివినవాడైనను, వేదపారాయణ చేసినవాడైనను, బ్రహ్మజ్ఞాని ముందర వెలవెలబోవును. పుస్తకజ్ఞానము, బ్రహ్మజ్ఞానము ముందు రాణించదు. దాదా సాహెబు ఖాపర్డే 4 మాసములుండెను. కాని, యతని భార్య 7 మాసము లుండెను. ఇద్దరును షిరిడీలో నుండుటచే సంతసించిరి. ఖాపర్డే గారి భార్య బాబాయందు భక్తిశ్రద్ధలు గలిగి యుండెడిది. ఆమె బాబాను మిగుల ప్రేమించుచుండెను. ప్రతి రోజు 12 గంటలకు బాబాకొరకు నైవేద్యము స్వయముగా దెచ్చుచుండెను. దానిని బాబా యామోదించిన తరువాత తాను భోజనము చేయుచుండెను. ఆమె యొక్క నిలకడను, నిశ్చలభక్తిని బాబా యితరులకు బోధించనెంచెను. ఆమె ఒకనాడు మధ్యాహ్న భోజనసమయమున ఒక పళ్ళెములో సాంజా, పూరీ, అన్నము, వులుసు, వరమాన్నము మొదలగునవి మసీదుకు దెచ్చెను. గంటల కొలది యూరకనే యుండు బాబా యానాడు వెంటనే లేచి, భోజన స్థలములో గూర్చుండి, యామెతెచ్చిన పళ్ళెము పయి యాకు దీసి త్వరగా తిన నారంభించెను. శ్యామా యిట్లడిగెను. "ఎందు కీ పక్షపాతము? ఇతరుల పళ్ళెముల నెట్టివైచెదవు. వాని వైపు చూడనయిన చూడవు కాని, దానిని నీ దగ్గర కీడ్చుకొని తినుచున్నావు. ఈమె తెచ్చిన భోజన మెందు కంత రుచికరము? ఇది మాకు సమస్యగా నున్నది". బాబా యిట్లు బోధించెను. "ఈ భోజనము యథార్థముగా మిక్కిలి యమూల్యమయినది. గత జన్మలో నీమె ఒక వర్తకుని యావు. అది బాగా పాలిచ్చుచుండెను. అచ్చటనుండి నిష్క్రమించి, ఒక తోటమాలి యింటిలో జన్మించెను. తదుపరి యొక క్షత్రియుని యింటిలో జన్మించి యొక వర్తకుని వివాహమాడెను. తరువాత ఒక బ్రాహ్మణుని కుటుంబములో జన్మించెను. చాలకాలము పిమ్మట ఆమెను నేను జూచితిని కావున ఆమె పళ్ళెము నుండి యింకను కొన్ని ప్రేమయుతమగు ముద్దలను దీసికొననిండు." ఇట్లనుచు బాబా యామె పళ్ళెము ఖాళీ చేసెను. నోరు చేతులు కడుగుకొని త్రేన్పులు తీయుచు, తిరిగి తన గద్దెపయి కూర్చుండెను. అప్పుడు ఆమె బాబాకు నమస్కరించెను, బాబా కాళ్ళను పిసుకుచుండెను. బాబా యామెతో మాట్లాడదొడంగెను. బాబా కాళ్ళను తోముచున్న యామెచేతులను బాబా తోముటకు ప్రారంభించెను. గురుశిష్యులు బండొరులు సేవచేసికొనుట జూచి శ్యామా యిటులనెను. "చాలా బాగా జరుగుచున్నది. భగవంతుడును, భక్తురాలును ఒకరికొకరు సేవ చేసికొనుట మిగుల వింతగా నున్నది." ఆమె యథార్థమయిన ప్రేమకు సంతసించి, బాబా మెల్లగా, మృదువయిన యాకర్షించు కంఠముతో 'రాజారామ్' యను మంత్రమును ఎల్లప్పుడు జపించు మనుచు నిట్లనియెను. "నీవిట్లు చేసినచో, నీ జీవతాశయమును పొందెదవు. నీ మసస్సు శాంతించును. నీకు మేలగును." ఆధ్యాత్మికము తెలియనివారికి, ఇది సామాన్యవిషయమువలె గాన్పించును. కాని యది యట్లుగాదు. అది శక్తిపాతము. అనగా గురువు శిష్యునకు శక్తి ప్రసాదించుట. బాబాయొక్క మాటలెంత బలమయినవి! ఎంత ఫలవంతమయినవి! ఒకక్షణములో నవి యామెహృదయమును ప్రవేశించి, స్థిరపడెను.

ఈ విషయము గురువునకు శిష్యునకు గల సంబంధమును బోధించు చున్నది. ఇద్దరు పరస్పరము ప్రేమించి సేవ చేసికొనవలెను. వారిద్దరికి మధ్య భేదము లేదు. ఇద్ద రొకటే. ఒకరు లేనిదే మరియొకరు లేరు. శిష్యుడు తన శిరస్సును గురువు పాదముల మీద బెట్టుట, బాహ్యదృశ్యమేగాని, యథార్థముగా వారిరువురు లోపల ఒక్కటే. వారి మధ్య బేధము పాటించువారు పక్వమునకు రానివారు, సంపూర్ణ జ్ఞానము లేనివారును.
ఓం నమోః శ్రీ సాయినాథాయ
శాంతిః శాంతిః శాంతిః
ఇరువదియేడవ అధ్యాయము సంపూర్ణము.

|సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు|
|శుభం భవతు|


శ్రీ సాయి సత్ చరిత్రము ఇరువదియారవ అధ్యాయము


ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

ఇరువదియారవ అధ్యాయము

1. భక్తపంతు, 2. హరిశ్చంద్ర పితళే, 3. గోపాల అంబాడేకర్.

ప్రస్తావన

ఈ విశ్వమునందు కనిపించు ప్రతివస్తువు కేవలము భగవంతుని మాయచే సృష్టించబడినది. ఈ వస్తువులు నిజముగా నుండియుండలేదు. నిజముగా నుండునది ఒక్కటే. అదియే భగవంతుడు. చీకటిలో తాడును గాని, దండమునుకాని చూచి పామనుకొనునట్లు, ప్రపంచములో కనిపించు వస్తువు బహ్యమునకు అగుపడునట్లు గాన్పించును గాని యంతర్గతముగా నున్న సత్యమును తెలిసికొనలేము. సద్గురువే మన బుద్ధి యను అక్షులను దెరిపించి వస్తువులను సరిగా జూచునటుల జేయును. మనకగుపడునది నిజస్వరూపము కాదని గ్రహించెదము. కాబట్టి సద్గురుని యసలయిన దృష్టిని కలుగజేయుమని ప్రార్థింతుముగాక. అదే సత్యదృష్టి.

ఆంతరిక పూజ

హేమాడ్ పంతు మనకొక కొత్తరకము పూజావిధానమును బోధించుచున్నారు. సద్గురుని పాదములు కడుగుట కానందబాష్పములనే వేడినీళ్ళ నుపయోగించెదముగాక. స్వచ్ఛమైన ప్రేమయను చందనమును వారి శరీరమునకు పూసెదముగాక. దృఢవిశ్వాసమను వస్త్రముతో వారి శరీరమును కప్పెదముగాక. అష్టసాత్త్వికభావము లనెడు ఎనిమిది తామరపుష్పములు సమర్పించెదముగాక. ఏకాగ్ర చిత్తమను ఫలమును సమర్పించెదముగాక. భావమను బక్కా వారి శిరముపై జల్లి భక్తియనే మొలత్రాడును కట్టెదముగాక. మన శిరస్సును వారి బొటనవ్రేళ్ళపై నుంచెదముగాక. సద్గురుని ఈ ప్రకారముగా నగలతో నలంకరించి మన సర్వమును వారికి సమర్పింతుముగాక. వేడిని తొలగించుటకు భక్తియనే చామరమును వీచెదముగాక. అట్టి యానందకరమైన పూజ చేసిన పిమ్మట ఇటుల ప్రార్థించెదముగాక.

"మా మనస్సును అంతర్ముఖము చేయుము. దానిని లోపలివయిపు పోవునటుల జేయుము. నిత్యానిత్యములకు గల తారతమ్యమును దెలిసికొను శక్తి దయచేయుము. ప్రపంచవస్తువులందు మాకు గల యాసక్తిని పోగొట్టి మాకు ఆత్మసాక్షాత్కారము కలుగునటుల చేయుము. మేము మా శరీరమును, ప్రాణమును సర్వమును నీకు సమర్పించెదము. సుఖ దుఃఖానుభవములు కలుగకుండునట్లు మా నేత్రములు నీవిగా చేయుము. మా శరీరమును మనస్సును నీ స్వాధీన మందుంచుకొనుచు నీ యిష్టము వచ్చినటుల చేయుము. మా చంచల మనస్సు నీ పాదముల చెంత విశ్రాంతి పొందుగాక.”

ఇకనీ అధ్యాయములోని కథలవైపు మరలుదము.

భక్త పంతు

ఒకనాడు పంతు అను భక్తుడు, మరొక సద్గురుని శిష్యుడు అదృష్టవశమున షిరిడీకి వచ్చెను. అతనికి షిరిడీ పోవు ఇచ్ఛలేకుండెను. కాని తానొకటి తలచిన దైవమింకొకటి తలచునందురు. బి.వి & సి.ఐ రైల్వేలో పోవుచుండెను. అందులో అనేకులు స్నేహితులు, బంధువులు కలిసిరి. వారందరు షిరిడీకి పోవుచుండిరి. వారందరు తమ వెంట రమ్మని కోరగా వారిని కాదన లేకుండెను. వారు బొంబాయిలో దిగిరి. పంతు విరార్ లో దిగెను. అచట తన గురువును దర్శించి, షిరిడీ పోవుటకు అనుమతి పొంది, ఖర్చుల నిమిత్తము డబ్బును కూర్చుకొని యందిరితో కలసి షిరిడీకి వచ్చెను. ఉదయమే షిరిడీ చేరిరి. 11 గంటలకు మసీదుకు పోయిరి. బాబా పూజ కొరకు చేరిన భక్తుల గుంపునకు జూచి యందరు సంతసించిరి. కాని పంతుకు మూర్ఛ వచ్చి హఠాత్తుగా క్రింద పడెను. వారందరు భయపడిరి. అతనికి చైతన్యము కలిగించుటకు ప్రయత్నించిరి. బాబా కటాక్షముచే అతని ముఖముపై నీళ్ళు చల్లగా తెలివి వచ్చెను. నిద్రనుండి లేచిన వానివలె లేచి కూర్చుండెను. సర్వజ్ఞుడగు బాబా, యింకొక గురువు తాలూకు శిష్యుడని గ్రహించి, నిర్భయముగా నుండుమని ధైర్యము చెప్పుచు తన గురువునందే భక్తి నిలుచునటుల నీ క్రింది విధముగా బలికెను. "ఏమైనను కానిండు, పట్టు విడువరాదు. నీ గురునియందే యాశ్రయము నిలుపుము; ఎల్లప్పుడు నిలకడగా నుండుము. ఎప్పుడు వారి ధ్యానమునందే మునిగి యుండుము." పంతు ఈ మాటలయొక్క ప్రాముఖ్యమును గ్రహించెను. ఈ విధముగా తన సద్గురుని జ్ఞప్తికి దెచ్చుకొనెను. అతడు తన జీవితములో బాబా చేసిన యీ మేలును మరువలేదు.

హరిశ్చంద్ర పితళే

బొంబాయిలో హరిశ్చంద్ర పితళే యను వారుండిరి. అతనికి మూర్ఛరోగముతో బాధపడుచున్న కొడుకొకడు గలడు. ఇంగ్లీషు మందులను, ఆయుర్వేద మందులను కూడ వాడెను గాని జబ్బు కుదరలేదు. కావున యోగుల పాదములపయి బడుట యనే సాధన మొక్కటే మిగిలెను. 15వ అధ్యాయమందు చక్కనికీర్తనలచే దాసుగణు బాబా కీర్తిని బొంబాయి రాజధానిలో వెల్లడి చేసెనని వింటిమి. 1910లో పితళే అట్టి కథలు కొన్నిటిని వినెను. వానినుండి, యితరులు చెప్పినదానినుండి, బాబా తన దృష్టిచేతను, తాకుటచేతను, బాగుకానట్టి జబ్బులను బాగుచేయునని గ్రహించెను. సాయిబాబాను జూచుటకు మనస్సులో కోరిక పుట్టెను. సర్వవిధముల సన్నాహమై, బహుమానములను వెంట దీసికొని పండ్ల బుట్టలను బట్టుకొని భార్యాబిడ్డలతో షిరిడీకి వచ్చెను. అతడు మసీదుకు బోయెను. బాబాకు సాష్టాంగనమస్కారము చేసెను. తన రోగి కొడుకును బాబా పాదములపై వైచెను. బాబా యా బిడ్డవైపు చూడగనే యొక వింత జరిగెను. పిల్లవాడు వెంటనే కండ్లు గిర్రున తిప్పి చైతన్యమును దప్పి నేలపైబడెను. అతని నోట చొంగ కారెను. అతని శరీరమున చెమట పట్టెను. అతడు చచ్చిన వానివలె పడెను. దీనిని జూచి తల్లి దండ్రులు మిక్కిలి భయపడిరి. అటువంటి మూర్ఛలు వచ్చుచుండెనుగాని యీ మూర్ఛ చాలసేపటివర కుండెను. తల్లి కంటినీరు వరదలుగా కారు చుండెను. ఆమె యేడ్చుటకు మొదలిడెను. ఆమె స్థితి దొంగలనుండి తప్పించుకొనవలెనని యొక గృహము లోనికి పరుగెత్తగా అది తన నెత్తిపయి బడినట్లు, పులికి భయపడి పారి పోయి కసాయివాని చేతిలో పడిన యావువలె, ఎండచే బాధపడి చెట్టు నీడకు పోగా నది బాటసారి పయిబడినట్లు, లేదా భక్తుడు దేవాలయమునకు పోగా అది వానిపై కూలినట్లుండెను.

ఆమె యిటు లేడ్చుచుండగా బాబా యామెనిటుల యోదార్చెను. "ఇటు లేడ్వవలదు, కొంతసే పాగుము. ఓపికతో నుండుము. కుర్రవానిని బసకు దీసికొని పొమ్ము. అరగంటలో వానికి చైతన్యము పచ్చును." బాబా చెప్పిన ప్రకారము వారు నెరవేర్చిరి. బాబా మాటలు యదార్ధము లయ్యెను. వాడాలోనికి దీసికొని పోగానే, కుర్రవానికి చైతన్యము వచ్చెను. పితళే కుటుంబమంతయు సంతోషించిరి. వారి సంశయము లన్నియు దీరెను. పితళే బాబా దర్శనమునకై భార్యతో మసీదుకు వచ్చెను. బాబా పాదములకు వినయముతో సాష్టాంగనమస్కారము చేసి వారి పాదముల నొత్తుచు కూర్చుండిరి. మనస్సులో బాబా చేసిన యుపకారమునకు నమస్కరించుచుండిరి. బాబా చిరునవ్వుతో నిట్లనియె. "నీ యాలోచనలు, సంశయములు, భయోత్పాతములు, ఇప్పుడు చల్ల బడినవా? ఎవరికయితే నమ్మకము, ఓపిక గలదో వారిని తప్పక భగవంతుడు రక్షించును." పితళే ధనికుడు, మరియాద గలవాడు. అతడందరికి అపరిమితముగా మిఠాయి పంచిపెట్టెను. బాబాకు చక్కని పండ్లను తాంబూలము నిచ్చెను. పితళే భార్య సాత్వికురాలు. నిరాడంబరము, ప్రేమభక్తులతో నిండియుండెను. ఆమె స్తంభమునకు దగ్గరగా కూర్చుని బాబావైపు దృష్టి నిగిడ్చి కండ్లనుండి యానందభాష్పములు రాల్చుచుండెను. ఆమె స్నేహప్రేమ భావములను గని బాబా మిక్కిలి సంతుష్టి చెందెను. దేవునివలె యోగీశ్వరులు కూడ తమ భక్తులపయి నాధారపడెదరు. ఏ భక్తుడు హృదయపూర్వకముగను, మనఃపూర్వకముగను పూజించి శరణు వేడునో వానికే భగవంతుడు తోడ్పడును. వారు కొద్ది రోజులు బాబావద్ద సుఖముగా నున్నపిమ్మట ఇంటికి పోవనిశ్చయించి, బాబా దర్శనమునకయి మసీదుకు వచ్చిరి. బాబా వారికి ఊదీ ప్రసాదమిచ్చి ఆశీర్వదించెను. పితళేను దగ్గరకు బిలచి యిట్లనెను. "బాపూ, అంతకుముందు 2 రూపాయ లిచ్చియుంటిని. ఇప్పుడు 3 రూపాయ లిచ్చుచున్నాను. వీనిని నీ పూజామందిరములో బెట్టుకొని పూజింపుము. నీవు మేలు పొందెదవు." పితళే వీనిని ప్రసాదముగా నంగీకరించెను. బాబాకు సాష్టాంగనమస్కారము చేసి యాశీర్వచనములకయి ప్రార్థించెను. ఇదే తనకు షిరిడీ పోవుటకు మొదటిసారి గనుక, అంతకుముందు 2 రూపాలయిలిచ్చెనను బాబా మాటల యర్థమును గ్రహింపలేకుండెను. దీనిని తెలిసి కొనవలెనని కుతూహలపడెను గాని బాబా యూరకొనెను. స్వగృహమునకు పోయి తన ముదుసలితల్లికి ఈవృత్తాంతమంతయు చెప్పి బాబాయంతకు ముందు రెండురూపాయలిచ్చెననెను; అదేమియని యడిగెను. ఆమె తన పుత్రున కిట్లనెను. నీ కొడుకుతో నీవిప్పుడు షిరిడీకి పోయినట్లు, మీ తండ్రి నిన్ను దీసికొని అక్కల్ కోట్ కర్ మహారాజుగారి వద్దకు బోయెను. ఆ మహారాజు కూడ సిద్ధపురుషుడు; పూర్ణయోగి, సర్వజ్ఞుడు, దయాళువు, మీతండ్రి నిర్మలమైన భక్తుడు కనుక ఆయన పూజను స్వామి ఆమోదించిరి. వారు మీతండ్రికి రెండు రూపాయలిచ్చి మందిరములో బెట్టి పూజింపు మనిరి. మీ తండ్రిగారు చనిపోవువరకు వానిని పూజించుచుండిరి. అటు పిమ్మట పూజ ఆగిపోయినది. రూపాయలు పోయినవి. కొన్ని సంవత్సరముల పిమ్మట రూపాయల సంగతి పూర్తిగా మరచితిమి. నీ వదృష్టవంతుడ వగుటచే, అక్కల్ కోటకర్ మహారాజు శ్రీ సాయి రూపములో గనిపించి నీ కర్తవ్యమును జ్ఞప్తికి దెచ్చి, నీ కష్టములను తప్పింప జూచుచున్నారు. కాబట్టి యికమీదట జాగ్రత్తగా నుండుము. సంశయములను, దురాలోచనలను విడువుము. మీ తాతముత్తాతల యాచారము ప్రకారము నడువుము. సత్ప్రవర్తనము నవలంబింపుము. కుటుంబదైవములను పూజింపుము. రూపాయలను పూజింపుము. వాటిని చక్కగా పూజించి వాని విలువను కనుగొని, యోగుల యాశీర్వచనము దొరికినందుకు గర్వించుము. శ్రీ సాయి నీలోనున్న భక్తిని మేలుకొల్పినారు. నీ మేలుకొరకు దాని నభివృద్ధి చేసికొనుము" తల్లి మాటలు విని పితళే మిక్కిలి సంతోషించెను. శ్రీ సాయియొక్క సర్వాంతర్యామిత్వమునందు, వారి శక్తియందు అతనికి నమ్మకము కలిగెను. వారి దర్శన ప్రాముఖ్యము గ్రహించెను. అప్పటినుండి తన నడవడి గూర్చి చాల జాగ్రత్తగా నుండెను.


అంబాడేకర్ గారు

పూనానివాసి గోపాల నారాయణ అంబాడేకర్ బాబా భక్తుడు. ఆబ్ కారి డిపార్టుమెంటులో 10సంవత్సరములు నౌకరి చేసెను. ఠాణా జిల్లాలో, జౌహర్ స్టేట్ లోను వారుద్యోగములను జేసి, విరమించు కొనిరి. మరొక ఉద్యోగము కొరకు ప్రయత్నించిరి, కాని ఫలించలేదు. ఆతడనేకకష్టముల పాలయ్యెను. అతని స్థితి రానురాను అసంతృప్తికరముగా నుండెను. ఈ ప్రకారముగా 7 ఏండ్లు గడచెను. అతడు ప్రతి సంవత్సరము షిరిడీకి పోవుచు బాబాకు తనకష్టములు చెప్పుచుండెడివాడు. 1916లో నతని స్థితి చాల హీనముగా నుండుటచే షిరిడీలో ప్రాణత్యాగము చేయ నిశ్చయించుకొనెను. అతడు భార్యతో షిరిడీకి వచ్చి రెండు మాసములుండెను. దీక్షిత్ వాడాకు ముందున్న యెడ్లబండిమీద కూర్చొని ఒకనాడు రాత్రి దగ్గరనున్న నూతిలో బడి చావవలెనని నిశ్చయించుకొనెను. అతడీ ప్రకారముగా చేయ నిశ్చయించుకొనగనే బాబా మరియొకటి చేయ నిశ్చయించెను. కొన్ని అడుగుల దూరమున నొక హోటలుండెను. దాని యజమాని సగుణమేరు నాయక్. అతడు బాబా భక్తుడు. అతడు అంబాడేకర్ ను బిలచి అక్కల్ కోటకర్ మహారాజు గారి చరిత్రను చదివితివా? యని యడుగుచు పుస్తకము నిచ్చెను. అంబాడేకర్ దానిని తీసుకొని చదువనెంచెను. పుస్తకము తెరచుసరికి ఈ కథ వచ్చెను. "అక్కల్ కోట కర్ మహారాజు గారి కాలములో ఒక భక్తుడు బాగుకానట్టి దీర్ఘరోగముచే బాధ పడుచుండెను. బాధను సహించలేక నిరాశజెంది బావిలో దుమికెను. వెంటనే మహారాజు వచ్చి వానిని బావిలోనుంచి బయటకు దీసి యిట్లనెను. "గతజన్మ పాపపుణ్యములను నీవు అనుభవించక తీరదు. నీ యనుభవము పూర్తి కాకున్నచో ప్రాణత్యాగము నీకు తోడ్పడదు. నీవింకొక జన్మమెత్తి, బాధ యనుభవించవలెను. చచ్చుటకు ముందు కొంతకాల మేల నీకర్మ ననుభవించరాదు? గత జన్మముల పాపముల నేల తుడిచివేయ రాదు? దానిని శాశ్వతముగా పోవునట్లు జేయుము."

సమయోచితమైన ఈ కథను చదివి, అంబాడేకర్ మిగుల నాశ్చర్యపడెను. వాని మనస్సు కరగెను. బాబా సలహా యీప్రకారముగా లభింపనిచో వాడు చచ్చియే యుండును. బాబా సర్వజ్ఞత్వమును, దయాళుత్వమును జూచి అంబాడేకరుకు బాబా యందు నమ్మకము బలపడి అతనికిగల భక్తి దృఢమయ్యెను. అతని తండ్రి అక్కల్ కోట్ కర్ మహారాజు భక్తుడు. కాన కొడుకుకూడ తండ్రివలె భక్తుడు కావలెనని బాబా కోరిక. అతడు బాబా యాశీర్వచనమును పొందెను. వాని శ్రేయస్సు వృద్ధిపొందెను. జ్యోతిష్యము చదివి అందులో ప్రావీణ్యము సంపాదించి దానిద్యారా తన పరిస్థితి బాగుచేసికొనెను. కావలసినంత ధనమును సంపాదించుకొనగలిగెను. మిగత జీవితమంతయు సుఖముగా గడిపెను.
ఓం నమోః శ్రీ సాయినాథాయ
శాంతిః శాంతిః శాంతిః
ఇరువదియారవ అధ్యాయము సంపూర్ణము.

|సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు|
|శుభం భవతు|


శ్రీ సాయి సత్ చరిత్రము ఇరువదియైదవ అధ్యాయము


ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

ఇరువదియైదవ అధ్యాయము

దాము అన్నా కాసార్ (అహమదునగరు)

1. సట్టా వ్యాపారము 2. మామిడిపండ్ల కథ.

ప్రస్తావన

భగవదవతారమును, పరబ్రహ్మస్వరూపుడును, మహాయోగేశ్వరుడును, కరుణాసాగరుడును అగు శ్రీ సాయినాధునకు సాష్టాంగ చూడామణియగు శ్రీ సాయినాధమహారాజుకు జయమగు గాక! సమస్త శుభములకు నిలయము, మన ఆత్మారాముడు, భక్తులపాలిటి ఆశ్రయదాత యగు సాయికి జయమగు గాక, జీవితాశయమును, పరమావధిని గాంచిన బాబాకు ప్రణామములు.

సాయిబాబా యెల్లప్పుడు కరుణాపూర్ణులు. మనకు కావలసినది వారియందు మనఃపూర్వకమైన భక్తి. భక్తునకు స్థిరమైన నమ్మకము, పూర్ణభక్తి యున్నప్పుడు వానికోరికలన్నియు శీఘ్రముగా నెరవేరును. హేమాడ్ పంతు మనస్సునందు బాబా జీవితలీలలను వ్రాయుకోరిక జనించగనే, బాబా వెంటనే అతనిచే వ్రాయించెను. సంగ్రహముగా సంగతులను వ్రాసికొనుమని బాబా యాజ్ఞ యిచ్చిన వెంటనే హేమాడ్ పంతుకు ప్రేరణకలిగి గ్రంథరచనకు కావలసిన బుద్ధి, శక్తి, ధైర్యము కలిగి దానిని ముగించెను. దానిని వ్రాయుయోగ్యత మొదట అతనికి లేకుండెను. కాని బాబా దయాపూరితమగు ఆశీర్వచనములచే దాని నతడు పూర్తి చేయగలిగెను. ఈ విధముగా సత్చరిత్ర సిద్ధమైనది. అది యొక చంద్రకాంతిమణి వంటిది. దానినుండి సాయిలీలలను నమృతము స్రవించును. దానిని చదువరులు మనసార త్రాగవచ్చును.

భక్తునకు సాయియందు పూర్ణమైన హృదయపూర్వకమగు భక్తి కలిగినప్పుడు దుఃఖములనుండి, యపాయములనుండి బాబా కాపాడి రక్షించుచుండెను. వాని యోగక్షేమములు బాబా చూచుచుండెను. అహమద్ నగర నివాసియగు (ప్రస్తుతము పూనా వాసి) దామోదర్ సావల్ రామ్ రాసనె కాసార్ వురఫ్ దాము అన్నాకథ పైన పేర్కొనిన వాక్యమునకు ఉదాహరణముగా దిగువ నివ్వబడినది.

దాము అన్నా

(దామోదర్ సావల్ రామ్ రాసనె)
6వ అధ్యాయములో శ్రీరామనవమి యుత్సవసందర్భమున ఇతనిగూర్చి చెప్పితిమి. చదువరులు దానిని జ్ఞప్తియందుంచుకొనియే యుందురు. అతడు 1895వ సంవత్సరమున శ్రీరామనవమి యుత్సవము ప్రారంభించినప్పుడు షిరిడీకి పోయెను. అప్పటినుండి ఇప్పటివరకు అలంకరించిన పతాక మొకటి కానుకగా నిచ్చుచున్నాడు. అదియును గాక ఉత్సవమునకు వచ్చు బీదలకు అన్నదానము చేయుచున్నాడు.

అతని జట్టీ వ్యాపారములు

1. ప్రత్తి
బొంబాయి స్నేహితుడొకడు దాము అన్నాకు, ప్రత్తిలో జట్టీ వ్యాపారము చేసి భాగస్థుడుగా సుమారు రెండులక్షల రూపాయలు లాభము సంపాదించవలెనని వ్రాసెను. వ్యాపారము లాభకరమైన దనియు, నెంత మాత్రము ప్రమాదకరము కాదనియు, గనుక అవకాశము పోగొట్టుకొనవలదనియు అతడు వ్రాసెను. దాము అన్నా యాబేరమును చేయుటయా? మానుటయా? యను నాందోళనలో పడెను. జట్టీ వ్యాపారమును చేయుటకు వెంటనే నిశ్చయించుకొనలేకుండెను. దాని గూర్చి బాగుగ ఆలోచించి, తాను బాబా భక్తుడగుటను వివరములతో శ్యామాకొక ఉత్తరము ప్రాసి బాబానడిగి, వారి సలహాను తెలిసికొనుమనెను. ఆ మరుసటి దినము ఆ ఉత్తరము శ్యామాకు ముట్టెను. శ్యామా దానిని తీసికొని మసీదుకు బోయెను. బాబా ముందరబట్టెను. బాబా యా కాగితమేమని యడిగెను. సమాచార మేమనెను? శ్యామా అహమద్ నగరు నుండి దాము అన్నా యేదో కనుగొనుటకు వ్రాసినాడనెను. బాబా యిట్లనెను. "ఏమి వ్రాయుచున్నాడు? ఏమి యెత్తు వేయుచున్నాడు? భగవంతు డిచ్చినదానితో సంతుష్టిజెందక యాకాశమున కెగుర ప్రయత్నించుచున్నట్లున్నది. వాని యుత్తరము చదువుము." బాబా చెప్పినదే ఆయుత్తరములో గల సమాచారమని, శ్యామా "దేవా! నీవిక్కడనే ప్రశాంతముగా కూర్చొని, భక్తుల నాందోళనపాలు చేసెదవు. వారు వ్యాకులులగుటతో, వారి నిచట కీడ్చుకొని వచ్చెదవు. కొందరిని ప్రత్యక్షముగాను, కొందరిని లేఖల రూపముగాను తెచ్చెదవు. ఉత్తరములోని సంగతులు తెలిసియు నన్నేల చదువుమని బలవంత పెట్టుచున్నావు?" అనెను. బాబా యిట్లనియె: "ఓ శ్యామా! దయచేసి చదువుము. నా నోటికి వచ్చినది నేను మాట్లాడెదను. నన్ను విశ్వసించు వారెవ్వరు?"

అప్పుడు శ్యామా ఉత్తరము చదివెను. బాబా జాగ్రత్తగా విని కనికరముతో నిట్లనియె. "సేటుకు పిచ్చి యెత్తినది. అతని గృహమందేలోటు లేదని వ్రాయుము. తన కున్న సగము రొట్టెతో సంతుష్టి చెందుమని వ్రాయుము. లక్షలార్జించుటకు ఆయాసపడవద్దని చెప్పుము." శ్యామా జవాబును పంపెను. దానికొర కాతురతతో దాము అన్నా కని పెట్టుకొని యుండెను. జాబు చదువుకొని అతడు తన యాశయంతయు అడియాస యైన దనుకొనెను. కాని స్వయముగా వచ్చి మాట్లాడుటకు, ఉత్తరము వ్రాయుటకు భేదము కలదని శ్యామా వ్రాయుటచే తానే స్వయముగా షిరిడీ వెళ్ళి బాబాతో స్వయముగా మాట్లాడవలెనని యనుకొనెను. అందుచే షిరిడీకి వెళ్ళెను. బాబాకు నమస్కరించెను. బాబా పాదములు ఒత్తుచు కూర్చుండెను. అతనికి బాబాను బహింరంగముగా జట్టీ వ్యాపారము గూర్చి యడుగుటకు ధైర్యము చాలకుండెను. బాబా సహాయపడినచో వ్యాపారములో కొంతలాభము బాబా కిచ్చినచో బాగుండు ననుకొనెను. ఇట్లు రహస్యముగా దాము అన్నా తన మనస్సున ననుకొనెను. బాబాకు తెలియనిదేమియు లేదు. అరచేతనున్న యుసిరికాయవలె భూతభవిష్యత్ వర్తమానమును కూడ బాబా తెలిసినవారు. బిడ్డకు తీపి వస్తువులు కావలయును. కాని తల్లి చేదుమాత్రలిచ్చును. తీపి వస్తువులు ఆరోగ్యమును జెరచును. చేదుమాత్ర లారోగ్యమును వృద్ధిచేయును. తల్లి తన బిడ్డయొక్క మేలును కాంక్షించి బుజ్జగించి చేదుమాత్రలే యిచ్చును. బాబా దయగల తల్లివంటివారు. తన భక్తుల భవిష్యత్ వర్తమానముల లాభముల గూర్చి బాగుగ దెలిసినవారు. దాము అన్నా మనస్సును గనిపెట్టి బాబా యిట్లనెను. "ప్రపంచ విషయములలో తగుల్కొనుటకు నాకిష్టము లేదు." బాబా యొక్క యసమ్మతి గ్రహించి దాము అన్నా యా పనిని మానుకొనెను.

2. ధాన్యముల బేరము
పిమ్మట ధాన్యము, బియ్యము, గోధుమలు మొదలగు వాని వ్యాపారము చేయు తలపెట్టెను. ఈ యాలోచనకూడ బాబా గ్రహించి యిట్లనెను. "నీవు 5 నేర్లచొప్పున కొని 7 సేర్ల చొప్పున అమ్మవలసి వచ్చును. కనుక నీ వ్యాపారము కూడ మానుకొను"మనెను. కొన్నాళ్ళువరకు ధాన్యము ధర హెచ్చుగానే యుండెను. కాని యొక మాసము రెండు మాసములు వర్షములు విశేషముగా కురిసెను. ధరలు హఠాత్తుగా పడిపోయెను. ధాన్యములు నిలువచేసినవారెల్ల నష్టపడిరి. ఈ దురదృష్టము నుండి దాము అన్నా కాపాడబడెను. ప్రత్తి జట్టీవ్యాపారము కూడ కూలిపోయెను. ఆ దళారి ఇంకొక వర్తకుని సహాయముతో వ్యాపారము చేసెను. మదుపు పెట్టినవారికి గొప్ప నష్టము వచ్చెను. బాబా తనను రెండుసారులు గొప్ప నష్టములనుండి తప్పించెనని, దాము అన్నాకు బాబా యందుగల నమ్మకము హెచ్చెను. బాబా మహాసమాధి చెందువరకు వారికి నిజమైన భక్తుడుగా నుండెను. వారి మహాసమాధి పిమ్మట గూడ ఇప్పటివరకు భక్తితో నున్నాడు.


ఆమ్రలీల (మామిడిపండ్ల చమత్కారము)

ఒకనాడు 300 మామిడిపండ్ల పార్సెలు వచ్చెను. రాలేయను మామలతదారు గోవానుంచి శ్యామా పేరున బాబాకు పంపెను. అది తెరచునప్పటికి పండ్లన్నియు బాగానే యుండెను. అది శ్యామా స్వాధీనములో పెట్టిరి. అందులో 4 పండ్లు మాత్రము బాబా కొలంబలో (కుండలో) పెట్టెను. బాబా "ఈ నాలుగు దాము అన్నాకు, అవి యక్కడనే యుండవలె" ననెను.

దాము అన్నాకు ముగ్గురు భార్యలు గలరు. అతడే చెప్పిన ప్రకారము వాని కిద్దరే భార్యలు. కాని యతనికి సంతానము లేకుండెను. అనేక జ్యోతిష్కులను సంప్రదించెను. అతడు కూడ జ్యోతిష్యమును కొంతవరకు చదివెను. తన జాతకములో దుష్టగ్రహప్రభావ ముండుటచే అతనికి సంతానము కలుగు నవకాశము లేదనుకొనెను. కాని అతనికి బాబాయందు మిక్కిలి నమ్మకము గలదు. మామిడిపండ్లు అందిన రెండుగంటలకు అతడు షిరిడీకి చేరి బాబాకు నమస్కరించుటకు పోగా బాబా యిట్లనెను. "అందరు మామిడిపండ్లవైపు చూచుచూన్నారు. కాని అవి దాముకొరకుంచినవి. కావున అవి దామూయే తిని చావవలెను." దాము ఈ మాటలు విని భయపడెను. కాని మహాళ్సాపతి (బాబా ముఖ్యభక్తుడు) దాని నిట్లు సమర్థించెను. "చావనునది యహంకారమునుగూర్చి. దానిని బాబాయందు చంపుట యొక యాశీర్వాదము." బాబా యతడి నిట్లనియె; "నీవు తినవద్దు, నీ చిన్నభార్య కిమ్ము. ఈ యామ్రలీల ఆమెకు నలుగురు కొడుకులను, నలుగురు కొమార్తెలను ప్రసాదించును." దాము ఆ ప్రకారమే చేసెను. కొంతకాలమునకు బాబా మాటలు నిజమాయెను. జ్యోతిష్కుని మాటలు ఉత్తవాయెను. బాబా మాటలు వారి సమాధికి పూర్వమేగాక ఇప్పుడు గూడ వారి మహత్మ్యమును స్థాపించుచున్నవి. బాబా యిట్లనెను. "సమాధి చెందినప్పటికి నా సమాధిలోనుంచి నా యెముకలు మాట్లాడును. అవి మీకు ఆశను నమ్మకమును కలిగించును. నేనేగాక నా సమాధికూడ మాట్లాడును; కదులును. మనస్ఫూర్తిగ శరణుజొచ్చినవారితో మాట్లాడును. నేను మీవద్దనుండనేమో యని మీరాందోళన పడవద్దు. నా యెముకలు మాట్లాడుచు మీ క్షేమమును కనుగొనుచుండును. ఎల్లప్పుడు నన్నే జ్ఞప్తియందుంచుకొనుడు. నాయందే మనఃపూర్వకముగను హృదయపూర్వకముగను నమ్మకముంచుడు. అప్పుడే మీరు మిక్కిలి మేలుపొందెదరు."

ప్రార్థన

హేమాడ్ పంతు ఈ అధ్యాయము నొక ప్రార్థనతో ముగించుచున్నాడు. "ఓ సాయి సద్గురూ! భక్తుల కోరికల నెరవేర్చు కల్పవృక్షమా! మీ పాదముల మేమెన్నటికి మరువకుందుము గాక. మీ పాదముల నెప్పుడు చూచుచుండెదము గాక. ఈ సంసారమున చావుపుట్టుకలచే మిక్కిలి బాధపడుచుంటిమి. ఈ చావుపుట్టుకలనుంచి మమ్ము తప్పింపుము. మా ఇంద్రియములు విషయములపై బోనీయకుండ యడ్డుకొనుము. మా దృష్టిని లోపలకు మరల్చి యాత్మతో ముఖాముఖి జేయుము. ఇంద్రియములు, మనస్సు బయటకు పోవు నైజము నాపు నంతవరకు, ఆత్మసాక్షాత్కారమునకు అవకాశము లేదు. అంత్యకాలమున కొడుకు గాని, భార్య గాని, స్నేహితుడు గాని యుపయోగపడరు. నీవే మాకు ఆనందమును, మోక్షమును కలుగ జేయువాడవు. వివాదములందు, దుర్మార్గపు పనులందు మాకు గల యాసక్తిని పూర్తిగ నశింపజేయుము. నీ నామస్మరణము చేయుటకు జిహ్వ యుత్సహించుగాక, సమాలోచనలు అన్ని మంచివే యగుగాక చెడ్డవే యగుగాక, తరిమివేయుము. మాగృహములను శరీరములను మరచునట్లుజేయుము. మా యహంకారమును నిర్మూలింపుము. నీ నామమే ఎల్లప్పుడు జ్ఞప్తి యందుండునటుల చేయుము. తక్కిన వస్తువలన్నిటిని మరచునట్లు జేయుము. మనశ్చాంచల్యమును తీసివేయుము. దానిని స్థిరముగా ప్రశాంతముగా నుంచుము. నీవు మమ్ములను గట్టిగ పట్టియుంచినచో మా యజ్ఞానాంధకారము నిష్క్రమించును. నీ వెలుతురునందు మేముసంతోషముగా నుండెదము. మమ్ములను నిద్రనుండి లేపుము. నీ లీలామృతము త్రాగు భాగ్యము నీ కటాక్షము చేతను గత జన్మలలో మేము చేసిన పుణ్యమువలనను కలిగినది."

నోటు:- దాము అన్నా యిచ్చిన వాఙ్మూలము ఈ సందర్భమున గమనింప దగినది.

ఒకనా డనేకమందితో నేనుగూడ బాబా పాదములవద్ద కూర్చొని యున్నప్పుడు, నా మనస్సున రెండు సంశయములు కలిగెను. ఆ రెంటికి బాబా యిట్లు జవాబిచ్చెను. 1. సాయిబాబావద్ద అనేకమంది గుమిగూడు చున్నారు. వారందరు బాబా వలన మేలు పొందెదరా? దీనికి బాబా యిట్లు జవాబిచ్చెను. "మామిడిచెట్ల వయిపు పూత పూసియున్నప్పుడు చూడుము. పువ్వులన్నియు పండ్లు అయినచో, నెంత మంచి పంట యగును? కాని యట్లు జరుగునా? పువ్వుగానే చాలమట్టుకు రాలిపోవును. గాలికి కొన్ని పిందెన రాలిపోవును. కొన్ని మాత్రమే మిగులును. 2. ఇది నాగురించి యడిగినది. బాబా భౌతికశరీరము విడిచిన పిమ్మట, నా జీవితమనే ఓడ నెట్లు నడపగలను? అది యెటో కొట్టుకొని పోవునా? అయినచో నాగతి యేమి? దీనికి బాబా జవాబిట్లు ఇచ్చెను. "ఎక్కడైనను నెప్పుడయినను నా గురించి చింతించినచో నే నక్కడనే యుండెదను." 1918కి ముందు వారి వాగ్దానము ప్రకారము వారు నెరవేర్చుచుండిరి. 1918 తరువాత కూడ నెరవేర్చుచున్నారు. ఇప్పటికి నాతోనే యున్నారు. ఇప్పటికి నాకు దారి చూపుచున్నారు. ఇది 1910-11 కాలములో జరిగెను. నా సోదరులు వేరుపడిరి. నా సోదరి కాలధర్మము నొందెను. దొంగతనము జరిగెను. పోలీసు విచారణ జరిగెను. ఇవన్నియు నన్ను కల్లోలపరచినవి. నా సోదరి చనిపోగా, నా మనస్సు వికలమయ్యెను. నేను జీవితమును సుఖములను లక్ష్యపెట్టలేదు. నేను బాబా వద్దకు పోగా, వారు ఉపదేశముతో శాంతింపజేసి, అప్పా కులకర్ని యింటిలో బొబ్బట్లతో విందు గావించిరి. నా నుదుట చందనము పూసిరి.

నా యింటిలో దొంగతనము జరిగినది. నాకు ముప్పది సంపత్సరములనుండి యొక స్నేహితుడుండెను. అతడు నా భార్యయొక్క నగలపెట్టె దొంగలించెను. అందులో శుభమగు సత్తు (నాసికాభరణము) ఉండెను. బాబా ఫోటోముందేడ్చితిని, ఆ మరుసటి దినమే యా మనిషి నగలపెట్టెను తిరిగి యిచ్చివేసి క్షమాపణ కోరెను.
ఓం నమోః శ్రీ సాయినాథాయ
శాంతిః శాంతిః శాంతిః
ఇరువదియైదవ అధ్యాయము సంపూర్ణము.

|సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు|
|శుభం భవతు|

శ్రీ సాయి సత్ చరిత్రము ఇరువదినాలుగవ అధ్యాయము


ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

ఇరువదినాలుగవ అధ్యాయము

బాబా హాస్యము, చమత్కారము, శనగల లీల

1.హేమాడ్ పంతు 2.సుదామ 3.అన్నా చించణీకర్, మావిశీ బాయి - కథలు.

ప్రస్తావనఈ సంఘటనమున బాబా యేమి చెప్పిరో జాగ్రత్తగా గమనించెదము. పంచేంద్రియములకంటె ముందే, మనస్సు, బుద్ధి విషయానంద మనుభవించును. కనుక మొదలే భగవంతుని స్మరించవలెను. ఇట్లు చేసినచో, నిదికూడ ఒకవిధముగ భగవంతుని కర్పితమగును. విషయములను విడచి పంచేంద్రియము లుండలేవు. కనుక ఆ విషయములను మొదట గురుని కర్పించినచో వానియం దభిమానము సహజముగా ఆదృశ్యమైపోవును. ఇవ్విధముగా కామము, క్రోధము, లోభము మొదలగువాని గూర్చిన వృత్తులన్నిటిని (ఆలోచనలను) మొట్టమొదట గురుని కర్పించవలెను. ఈ ఆభ్యాసము నాచరించినచో దేవుడు వృత్తులన్నియు నిర్మూలనమగుటకు సహాయపడును. విషయముల ననుభవించు ముందు బాబా మనచెంతనే యున్నట్లు భావించినచో, నా వస్తువు ననుభవింపవచ్చునా? లేదా? యను ప్రశ్న యేర్పడును. ఏది యనుభవించుటకు తగదో దానిని విడిచి పెట్టెదము. ఈ విధముగా మన దుర్గుణములన్నియు నిష్క్రమించును. మన శీలము చక్కబడును. గురువు నందు ప్రేమ వృద్ధిపొందును. శుద్ధజ్ఞానము మొలకెత్తును. ఈ జ్ఞానము పృద్ధిపొందినపుడు దేహబుద్ధి నశించి, బుద్ధి చైతన్యఘనమున లీనమగును. అప్పుడే మన కానందము, సంతృప్తి కలుగును. గురువునకు, దేవునకు ఎవరు భేదము నెంచెదరో వారు దైవము నెచ్చటను జూడలేరు. భేద భావము లన్నిటిని ప్రక్కకు త్రోసి, గురువును, దేవుని ఒకటిగా భావించవలెను. ఈ ప్రకారముగా గురుని సేవించినచో భగవంతుడు నిశ్చయముగా ప్రీతిచెందును. మన మనస్సులను స్వచ్ఛము చేసి. ఆత్మసాక్షాత్కారము ప్రసాదించును. క్లుప్తముగా చెప్పునదేమన మనము గురుని స్మరించనిదే యేవస్తువును పంచేంద్రియములతో ననుభవించరాదు. మనస్సును ఈవిధముగా శిక్షించినచో మనమెల్లప్పుడు బాబాను జ్ఞప్తియందుంచుకొనెదము. మనకు బాబా యందు ధ్యాన మెన్నో రెట్లు వృద్ధిపొందును. బాబా సగుణస్వరూపము మన కండ్ల యెదుట నిలుచును. అప్పుడు భక్తి, వైరాగ్యము, మోక్షము మన వశమగును. మన మనస్సునందు బాబాను ఎప్పుడయితే నిలుపగలమో, అప్పుడు మనము ఆకలిని, పిపాసను, సంసారమును మరచెదము. ప్రపంచసుఖములందు గల యభిలాష నశించి మన మనస్సులు శాంతిని, ఆనందమును పొందును.

సుదాముని కథ

పై కథ చెప్పుచున్నప్పుడే హేమాడ్ పంతుకు సుదాముని కథ జ్ఞప్తికి వచ్చెను. అందులోకూడ ఇదేనీతి యున్నది. కనుక దాని నిక్కడ చెప్పుచున్నాము.

శ్రీ కృష్ణుడు, అతని యన్న బలరాముడు, మరియొక సహపాఠి సుదాముడను వాడును గురువగు సాందీపుని యాశ్రమములో నివసించు చుండిరి. శ్రీ కృష్ణబలరాములను అడవికి పోయి కట్టెలు తీసికొని రమ్మని గురువు పంపెను. సాందీపుని భార్య సుదామునికూడ అదే పని మీద ముగ్గురి కొరకు శనగలిచ్చి పంపెను. కృష్ణుడు సుదాముని యడవిలో గలసి యిట్లనెను. “దాదా నాకు నీళ్ళు కావలెను, నాకు దాహము వేయుచున్నది.” సుదాముడు, “ఉత్తకడుపుతో నీరు త్రాగకూడదు, కనుక కొంత తడవాగుట మంచి” దనెను. కాని తనవద్ద శనగలున్నవని, కొంచెము తినుమని యనలేదు. శ్రీ కృష్ణుడు అలసియుండుటచే సుదాముని తొడపయి తలయుంచి గుఱ్ఱుపెట్టుచు నిద్రపోయెను. ఇది కనిపెట్టి సుదాముడు తన జేబులోని శనగలు తీసి తినుట కారంభించెను. హఠాత్తుగ శ్రీకృష్ణు డిట్లనియె, “దాదా! యేమి తినుచుంటివి? ఎక్కడనుంచి యీ శబ్దము వచ్చుచున్నది?”. సుదాము డిట్లనెను, “తినుట కేమున్నది? నేను చలితో వణకుచున్నాను. నా పండ్లు కటకట మనుచున్నవి, విష్ణుసహస్రనామమును గూడ సరిగ ఉచ్ఛరించలేకున్నాను. ”ఇది విని సర్వజ్ఞుడగు శ్రీ కృష్ణుడిట్లనెను. “నేనొక స్వప్నమును గంటిని. అందులో ఒకడింకొకరి వస్తువులను దినుచుండెను. ఏమి తినుచుంటివని యడుగగా ఏమున్నది తినుటకు మన్నా? యనెను. అనగా తినుట కేమియు లేదని భావము. రెండవవాడు ‘తథాస్తు’అనెను. దాదా! యిది యొక స్వప్నము. నా కివ్వకుండ నీవేమి తినవని నాకు తెలియును.” స్వప్నప్రభావముచే నీ వేమితినుచుంటివని యడిగితిని. ” శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడనిగాని, అతని లీలలు గాని తెలిసియున్నచో సుదాముడట్లు చేసియుండడు. కాబట్టి అతడు చేసినదానిని తానే యనుభవింపవలసి వచ్చెను. శ్రీ కృష్ణుని ప్రియ స్నేహితు డయినప్పటికి అతని ఉత్తరకాల మంతయు గర్భదారిద్ర్యముచే బాధపడవలసి వచ్చెను. కొన్నాళ్ళకు భార్య కష్టము చేసి సంపాదించిన పిడికెడు అటుకులు సమర్పించగనే శ్రీ కృష్ణుడు సంతసించి ఒక బంగారు పట్టణము ననుభవించుట కిచ్చెను. ఎవరికయితే దగ్గరున్నవారు కియ్యకుండ తిను అలవాటుండునో వారు దీనిని జ్ఞప్తియందుంచుకొన వలెను.

శ్రుతికూడ దీనినే నొక్కి చెప్పుచున్నది. మొదట భగవంతునికి అర్పించి, ఆ భుక్తశేషమునే మనము అనుభవించవలెను. బాబాకూడ దీనినే హాస్యరూపముగా యుక్తితో బోధించెను.

అణ్ణా చించణీకరు, మావిశీబాయి

హేమాడ్ పంతు ఇచట నింకొక హాస్యసంఘటనను అందులో బాబా చేసిన మధ్యవర్తిత్వమును వర్ణించెను. దామోదర్ ఘనశ్యామ్ బాబరె వురఫ్ అణ్నా చించణీకర్ యను భక్తుడొకడు గలడు. అతడు సరళుడు, మోటువాడు, ముక్కుసూటిగా మాట్లాడువాడు, ఎవరిని లక్ష్యపెట్టువాడు కాడు. ఉన్నదున్నట్లు చెప్పేవాడు. ఎప్పటి దప్పుడే తేల్చువాడు. బయటికి కఠినునివలెను, హఠము చేయువానివలెను, గాన్పించినను, వాడు మంచిహృదయము గలవాడు. నక్కజిత్తులవాడు కాడు. అందుచే బాబా వానిని ప్రేమించుచుండెను. అందరు సేవ చేయునట్లే, యితడుకూడ మధ్యాహ్నము బాబా యెడమచేతిని (కఠడా పైన వేసియుండు దానిని) తోముచుండెను. కుడివయిపు ఒక ముసలి వితంతువు వేణుబాయి కౌజల్గి యనునామె యుండెను. ఆమెను బాబా ‘అమ్మా’ యని పిలుచుచుండెను. ఇతరులు మావిశీబాయి యని పిలిచెడి వారు. ఆమెకూడ బాబాను సేవించుచుండెను. ఈమెది స్వచ్చమైన హృదయము. ఆమె బాబా నడుమును మొలను వీపును తన రెండు చేతుల వ్రేళ్ళు అల్లి, దానితో నొక్కుచుండెను. ఆమె దీనిని అతి తీవ్రముగా చేయుచుండెను. బాబా వీపు కడుపు కలిసిపోవునట్లు గాన్పించు చుండెను. ఇంకొక ప్రక్క అణ్ణా తోముచుండెను. మావిశీబాయి ముఖము క్రిందకు మీదకగుచుండెను. ఒకసారి యామె ముఖము అణ్ణా ముఖమునకు చాలదగ్గరగా బోయెను. హాస్యమాడు నైజము గలదగుటచే నామె యిట్లనెను. “ఓహో! యీ అణ్ణా చెడ్డవాడు, నన్ను ముద్దుబెట్టుకొనుటకు యత్నించుచున్నాడు. ఇంత ముసలివాడయినప్పటికి నన్ను ముద్దు పెట్టుకొనుటకు సిగ్గులేదా?” యనెను. అణ్ణాకు కోపము వచ్చెను. చొక్కా చేతులు పై కెత్తి అతడిట్లనెను. “నేను ముసలివాడను దుర్మార్గుడ ననుచున్నావు. నేను వెర్రివాడనా? నీవే కలహమునకు కాలుద్రువ్వుచున్నావు.” అక్కడున్న వారందరు ఈ ముసలి వాండ్రకలహమును జూచి నవ్వుచుండిరి. బాబా యిద్దరిని సమానముగా ప్రేమించువారు కనుక ఇద్దరిని ఓదార్చవలెనని తలచి యీ క్రింది విధముగా నేర్పుతో సమాధానపరచెను. బాబా ప్రేమతో “ఓ అణ్ణా! ఎందు కనవసరముగా గోల చేయుచున్నావు? తల్లిని ముద్దు పెట్టుకొనినచో దానిలో అనౌచిత్యమేమి?” యనెను. బాబా మాటలు విని, యిద్దరు సంతుష్టి చెందిరి. అందరు సరదాగా నవ్విరి. బాబా చమత్కారమునకు హృదయానంద పూరితులైరి.

బాబా నైజము, భక్తపరాయణత్వము

బాబా తన భక్తులను వారి వారి యిష్టానుసారము సేవ చేయుటకు అనుమతించుచుండెను. దీనిలో నితరులు జోక్యము కలుగజేసికొనుట బాబా కిష్టము లేదు. ఒక ఉదాహరణము నిచ్చెదము. ఈ మావిశీబాయియే యింకొకప్పుడు బాబా పొత్తికడుపును తోముచుండెను. ఆమె ప్రయోగించు బలమును జూచి, యితర భక్తులు ఆతురపడిరి. వారిట్లనిరి. “అమ్మా! కొంచెము మెల్లగా తోముము. బాబా కడుపులోని ప్రేవులు, నరములు తెగిపోగలవు”. ఇట్లనగనే, బాబా వెంటనే లేచి కోపముతో సటకాను నేలపై గొట్టెను. వారి కండ్లు నిప్పుకణములవలె ఎర్రనాయెను. బాబాను జూచుట కెవ్వరికి ధైర్యము లేకుండెను. బాబా సటకా చివరను రెండు చేతులతో పట్టుకొని పొత్తికడుపులోనికి గ్రుచ్చుకొనెను. ఇంకొకచివరను స్తంభమునకు నాటించెను. సటకా యంతయు పొత్తికొడుపులో దూరునట్లు కానవచ్చుచుండెను. కొద్ది సేపటిలో పొత్తికడుపు ప్రేలు ననుకొనిరి. బాబా క్రమముగా స్తంభమువైపు పోవుచుండెను. అందరు భయపడిరి. ఆశ్చర్యముతోను, భయముతోను మాట్లాడలేక మూగవాండ్రవలె నిలిచిరి. బాబా తన భక్తురాలి కొరకు ఈ కష్టము అనుభవించిరి. తక్కిన భక్తులు ఆమెను బాబాకు హానిలేకుండ తోముమనిరి. మంచి యుద్దేశముతో వారు ఈ మాటలనిరి. దానికికూడ బాబా యొప్పుకొనలేదు. వారి మంచి యుద్దేశమే బాబాను కష్టములో దించినందుకు వారాశ్చర్యపడిరి. ఏమియు చేయలేక కనిపెట్టుకొని చూచుచుండిరి. అదృష్టముచే బాబా కోపము తగ్గెను. సటకాను విడిచి గద్దెపయి కూర్చుండిరి. అప్పటినుండి భక్తుల యిష్టానుసారము సేవచేయునప్పుడు ఇతరులు జోక్యము కలుగజేసికొనరాదను నీతిని నేర్చుకొనిరి. ఎవరి సేవ యెట్టిదో బాబాకే గుర్తు.
ఓం నమోః శ్రీ సాయినాథాయ
శాంతిః శాంతిః శాంతిః
ఇరువదినాలుగవ అధ్యాయము సంపూర్ణము.

|సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు|
|శుభం భవతు|
ఈ అధ్యాయములోగాని, వచ్చే అధ్యాయములోగాని ఫలానిది చెప్పెదమనుట ఒకవిధముగా అహంకారమే. మన సద్గురుని పాదములకు అహంకారమును సమర్పించినగాని, మన ప్రయత్నమందు జయమును పొందము, మన మహంకారరాహితుల మయినచో, మన జయము నిశ్చయము.

సాయిబాబాను పూజించుటచే ఇహపరసౌఖ్యములు రెంటిని పొందవచ్చును. మన మూలప్రకృతియందు పాతుకొని, శాంతిసౌఖ్యములను పొందెదము. కాబట్టి యెవరయితే క్షేమమును కోరెదరో వారు గౌరవాదరములతో సాయిబాబా లీలలను వినవలెను; మననము చేయవలెను. దీనిని నెరవేర్చినచో వారు సులభముగా జీవితపరమావధిని పొందెదరు. తుదకు మోక్షానందమును పొందెదరు.

సాధారణముగా నందరు హాస్యము, చమత్కారభాషణమన్న నిష్టపడెదరు గాని, తాము హాస్యాస్పదులగుట కిష్టపడరు. కాని బాబా చమత్కారము వేరు. అది అభినయముతో కూడినప్పుడు చాల సంతోషదాయకముగ నీతిదాయకముగ నుండెడిది. కావున ప్రజలు తాము వెక్కిరింతలపాలై నప్పటికి అంతగా బాధపడేవారు కారు. హేమాడ్ పంతు తన విషయమునే యీ క్రింద తెలుపుచున్నాడు.

శనగల కథ

షిరిడీలో ఆదివారమునాడు సంత జరిగెడిది. చుట్టుప్రక్కల పల్లెల నుండి ప్రజలు వచ్చి వీధులలో దుకాణములు వేసికొని వారి సరుకులు అమ్ముచుండెడివారు. ప్రతిరోజు మధ్యాహ్నము 12 గంటలకు మసీదు నిండుచుండెను. ముఖ్యముగా ఆదివారమునాడు క్రిక్కిరిసి పోవుచుండెను. ఒక ఆదివారమునాడు హేమాడ్ పంతు సాయిబాబా ముందు కూర్చొని బాబా పాదము లొత్తుచు మనస్సునందు జపము చేయుచుండెను. బాబా యెడమవైపు శ్యామా, కుడివైపు వామనరావు ఉండిరి. శ్రీమాన్ బుట్టీ, కాకాసాహెబ్ దీక్షిత్ మొదలగువారు కూడ నుండిరి. శ్యామా నవ్వుచు అణ్ణా సాహెబుతో “నీ కోటుకు శనగగింజ లంటినట్లున్నవి చూడుము.” అనెను. అట్లనుచు హేమాడ్ పంతు చొక్కాచేతులను తట్టగా శనగగింజలు నేల రాలెను. హేమాడ్ పంతు తన చొక్కా ఎడమ చేతి ముందుభాగమును సాచెను. అందరికి ఆశ్యర్యము కలుగునట్లు కొన్ని శనగగింజలు క్రిందికి దొర్లుట ప్రారంభించెను. అక్కడున్న వారు వానిని ఏరుకొనిరి.

ఈ సంఘటనము హాస్యమునకు తావిచ్చెను. అక్కడున్న వారందరు ఆశ్చర్యపడిరి. ఎవరికి తోచినట్లు వారు శనగలు చొక్కాచేతిలో నెట్లు ప్రవేశించయుండెనో ఊహింపనారంభించిరి. శనగలు చొక్కాలో నెట్లు దూరి యచట నిలువగలిగినవో హేమాడ్ పంతు కూడ గ్రహించ లేకుండెను. ఎవ్వరికిని సరియైన సమాధానము తోచక జవాబు నివ్వనప్పుడు అందరును ఈ యద్భుతమున కాశ్చర్యపడుచుండగా బాబా ఇట్లనియె. “వీనికి (అణ్ణా సాహెబుకు) తానొక్కడే తిను దుర్గుణ మొకటిగలదు. ఈనాడు సంతరోజు శనగలు తినుచు ఇక్కడకు వచ్చినాడు. వాని నైజము నాకు తెలియును. ఈ శనగలే దానికి నిదర్శనము. ఈ విషయములో నేమి యాశ్చర్యమున్నది?”

హేమాడ్ పంతు:- బాబా నేనెప్పుడు ఒంటరిగా తిని యెరుగను. అయితే యీ దుర్గుణమును నాపై నేల మోపెదవు? ఈనాటికి ఎన్నడును షిరిడీలోని సంత నేను చూచి యుండలేదు. ఈ దినము కూడ నేను సంతకు పోలేదు. అట్లయినచో నేను శనగల నెట్లు కొనియుంటిని? నేను కొననప్పుడు నే నెట్లు తినియుందును? నాదగ్గరనున్న వారికి పెట్టకుండనే నెప్పుడేమియు తిని యెరుగను.

బాబా:- అవును అది నిజమే. దగ్గరున్న వారి కిచ్చెదవు. ఎవరును దగ్గర లేనప్పుడు నీవుగాని, నేనుగాని యేమి చేయగలము? కాని నీవు తినుటకు ముందు నన్ను స్మరింతువా? నేనెల్లప్పుడు నీ చెంత లేనా? నీవేదైన తినుటకు ముందు నాకర్పించుచున్నావా?

నీతి


శ్రీ సాయి సత్ చరిత్రము ఇరువదిమూడవ అధ్యాయము


ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

ఇరువదిమూడవ అధ్యాయము

(నాలుగువదినము పారాయణము – ఆదివారము)

యోగము – ఉల్లిపాయ

1. శ్యామా పాముకాటు బాగగుట. 2. కలరా నియమముల నుల్లంఘించుట. 3. గురుభక్తి పరీక్ష

ప్రస్తావన

నిజముగా నీజీవుడు త్రిగుణములకు అనగా సత్వరజస్తమో గుణముల కతీతుడు. కాని మాయచే గప్పబడి, వాని నైజమగు సత్చిదానందమును మరచుచు తాను శరీరమే యనుకొనుచు, అట్టి భావనతో తానే చేయువాడు, అనుభవించువాడు అని యనుకొనుచు, లెక్కలేని బాధలలో చిక్కుకొనుచు విముక్తిని గాంచలేకున్నాడు. విమోచనమునకు మార్గ మొక్కటే కలదు. అది గురుని పాదములయందు ప్రేమ మయమగు భక్తి. గొప్పనటుడగు సాయి తన భక్తులను వినోదింపజేసి వారిని తన నైజములోనికి మార్చెను.

ఇంతకు పూర్వము చెప్పిన కారణములచే మేము సాయిని భగవంతుని యవతారముగా నెన్నుచున్నాము. కాని వారెల్లప్పుడు తాము భగవంతుని సేవకుడనని చెప్పెడివారు. వారు అవతారపురుషులయినప్పటికి ఇతరులు సంతృప్తికరముగా నెట్లు ప్రవర్తింపవలెనో చూపుచుండెడివారు; ఆయా వర్ణాశ్రమములకు విధింపబడిన కర్మల నెట్లు నెరవేర్చవలెనో తెలిపెడివారు. ఇతరులతో దేనిలోనయిన పోటి పడెడి వారుకారు. తనకొరకేమైన చేయుమని యితరులను కోరెడి వారు కారు. సమస్త చేతనాచేతనములందు, భగవంతుని జూడగలిగిన బాబాకు వినయశీలమే ఉచితమని, ఎవరిని నిరాదరించుటగాని, అవమానించుట గాని వారెరుగరు. సమస్తజీవులలో వారు నారాయణుని గాంచు చుండెడివారు. ‘నేను భగవంతుడను’ అని వారెన్నడు అనలేదు. భగవంతుని విధేయ సేవకుడనని చెప్పేవారు. భగవంతుని ఎల్లప్పుడు తలచువారు. ఎల్లప్పుడు ‘అల్లా మాలిక్’ అనగా భగవంతుడే సర్వాధికారియని యనుచుండెడివారు.

మేమితర యోగుల నెరుగము. వారెట్లు ప్రవర్తింతురో, ఏమి చేసెదరో, ఎట్లు తినెదరో తెలియదు. భగవత్కటాక్షముచే వారవతరించి యజ్ఞానులకు, బద్ధజీవులకు విమోచనము కలుగజేసెదరని మాత్రమెరుగుదుము. మన పుణ్యమేమైన యున్నచో యోగుల కథలను లీలలను వినుటకు కుతూహలము కలుగును. లేనిచో నట్లు జరుగదు. ఇక నీ యధ్యాయములోని ముఖ్య కథలను చూచెదము.

యోగము – ఉల్లిపాయ

ఒకనాడు యోగాభ్యాసము చేయు విద్యార్థి ఒకడు నానాసాహెబు చాందోర్కరుతో షిరిడీకి వచ్చెను. అతడు యోగశాస్త్రమునకు సంబంధించిన గ్రంథములన్నియు చదివెను. తుదకు పఠంజలి యోగసూత్రములు కూడ చదివెను. కాని, యనుభవమేమియు లేకుండెను. అతడు మనస్సును కేంద్రీకరించి సమాధిస్థితిలో కొంచెము సేపయిన నుండలేకుండెను. సాయిబాబా తన యెడ ప్రసన్నుడైనచో చాలసేపు సమాధిలోనుండుట నేర్పెదరని అతడనుకొనెను. ఈ లక్ష్యముతో నాతడు షిరిడీకి వచ్చెను. అతడు మసీదుకు పోయి చూచుసరికి బాబా ఉల్లిపాయతో రొట్టె తినుచుండిరి. దీనిని చూడగనే అతనికి మనస్సున ఒక యాలోచన తట్టెను. “రుచిలేని రొట్టెను పచ్చియుల్లిపాయతో తినువాడు నాకష్టముల నెట్లు తీర్చగలడు? నన్నెట్లు ఉద్ధరించగలడు?” సాయిబాబా యతని మనస్సున నున్నదానిని కనిపెట్టి నానాసాహెబుతో నిట్లునియెను. “నానా! యెవరికైతే ఉల్లిని జీర్ణించుకొను శక్తికలదో వారే దానిని తినవలెను.” ఇది విని, యోగి యాశ్చర్యపడెను. వెంటనే బాబా పాదములపయి బడి సర్వస్యశరణాగతి చేసెను. స్వచ్ఛమైన మనస్సుతో తన కష్టముల దెలిపి ప్రత్యుత్తరముల బడసెను. ఇట్లు సంతృప్తి జెంది యానందించినవాడై బాబా ఊదీప్రసాదముతో ఆశీర్వచనములతో షిరిడీ విడిచెను.

పాముకాటునుండి శ్యామాను కాపాడుట

ఈ కథను ప్రారంభించక పూర్వము హేమాడ్ పంతు, జీవుని పంజరములోనున్న రామచిలుకతో సరిపోల్చవచ్చుననిరి. రెండును బంధింప బడియే యున్నవి; ఒకటి శరీరములోను, రెండవది పంజరమందును. రెండును తమ ప్రస్తుతస్థితియే బాగున్నదని యనుకొనుచున్నవి. సహాయకుడు వచ్చి, వానిని బంధములనుండి తప్పించగనే వానికి నిజము తెలియును. భగవత్కటాక్షముచే గురువు వచ్చి వారి కండ్లను తెరిపించి బంధవిముక్తుల జేసినప్పుడు వారిదృష్టి యన్నిటికంటె గొప్పస్థితివైపు బోవును. అప్పుడే గతించిన జీవితముకంటె రానున్నది గొప్పదియని గ్రహింతురు.

గత అధ్యాయములో మిరీకర్ కు రానున్న యపాయము గనిపెట్టి దానినుండి యతనిని తప్పించిన కథ వింటిరి. అంతకంటె ఘనమగు కథను ఇచ్చట వినెదరు. ఒకనాడు శ్యామాను విషసర్పము కరచెను. అతని చిటికెనవ్రేలును పాము కరచుటచే శరీరములోనికి విషము వ్యాపింప మొదలిడెను. బాధ యెక్కువగా నుండెను. శ్యామా తాను మరణించెద ననుకొనెను. స్నేహితు లాతని విఠోబాగుడికి తీసికొనిపోవ నిశ్చయించిరి. పాముకాట్లు అచ్చట బాగగుచుండెను. కాని శ్యామా తన విఠోబా యగు బాబా వద్దకు పరుగిడెను. బాబా యతనిని జూడగనే ఈసడించుకొని వానిని తిట్టనారంభించెను. కోపోద్ధీపితుడయి బాబా యిట్లునయె, “ఓరి పిరికి పురోహితుడా! యెక్కవద్దు, నీ వెక్కినచో నేమగునో చూడు” మని బెదిరించి తరువాత ఇట్లు గర్జించెను. “పో, వెడలిపొమ్ము, దిగువకు పొమ్ము.” బాబా యిట్లుకోపోద్దీపితుడగుట జూచి శ్యామా మిక్కిలి విస్మయ మందెను, నిరాశ చెందెను. అతడు మసీదు తన యిల్లుగా బాబా తన యాశ్రయముగా భావించుచుండెను. ఇట్లు తరిమివేసినచో తానెక్కడకు పోగలడు? అతడు ప్రాణమందాశ వదలుకొని యూరకుండెను. కొంతసేపటికి బాబా మామూలు స్థితికి వచ్చెను, శ్యామా దగ్గరకుపోయి కూర్చుండెను. అప్పుడు బాబా యిట్లనెను. “భయపడవద్దు. ఏ మాత్రము చింతించకు. ఈ దయార్ద్ర ఫకీరు నిన్ను రక్షించును. ఇంటికి పోయి ఊరక కూర్చుండుము. బయటికి పోవద్దు. నాయందు విశ్యాస ముంచుము. నిర్భయుడవు కమ్ము. ఆతురపడవద్దు.” ఇట్లని శ్యామాను ఇంటికి పంపించెను. వెంటనే బాబా తాత్యా పటేలును, కాకాసాహెబు దీక్షితును అతనివద్దకు పంపి తన కిష్టము వచ్చినవి తినవచ్చుననియు, గృహములోనే తిరుగవచ్చుననియు, కాని పండుకొనగూడదనియు, ఈ సలహాల ప్రకారము నడుచుకొమ్మనెను. కొద్దిగంటలలో శ్యామా బాగుపడెను. ఈ పట్టున జ్ఞప్తియందుంచుకొనవలసిన దేమన బాబా వలికిన 5 అక్షరముల మంత్రము (పో, వెడలిపొమ్ము, క్రిందకు దిగు) శ్యామాను ఉద్దేశించినదిగాక సర్పమును ఆజ్ఞాపించిన మాటలు. దాని విషము పైకి ఎక్కరాదనియు, అది శరీరమంతట వ్యాపింపరాదనియు ఆజ్ఞాపించిరి. మంత్రములలో నారితేరిన తక్కినవారివలె, వారేమంత్రము ఉపయోగింప నవసరము లేకుండెను. మంత్రబియ్యము గాని, తీర్థము గాని ఉపయోగించ నవసరము లేకుండెను. శ్యామా జీవితమును రక్షించుటలో వారి పలుకలే మిక్కిలి బలమైనవి. ఎవరైన ఈ కథగాని యింక నితరకథలుగాని, వినినచో బాబా పాదములయందు స్థిరమైన నమ్మకము కలుగును. మాయయను మహా సముద్రమును దాటుటకు బాబా పాదములను హృదయములో ధ్యానించవలెను.


కలరా రోగము

ఒకప్పుడు షిరిడీలో కలరా భయంకరముగా చెలరేగుచుండెను. గ్రామవాసులు మిక్కిలి భయపడిరి. వారితరులతో రాకపోకలు మానిరి. గ్రామములో పంచాయతీ వారు సభచేసి రెండత్యవసరమైన నియమములు చేసి కలరా నిర్మూలించ ప్రయత్నించిరి. అవి యేవన – 1. కట్టెల బండ్లను గ్రామములోనికి రానీయకూడదు. 2. మేకను గ్రామములో కోయరాదు. ఎవరయిన వీనిని ధిక్కరించినచో వారికి జరిమానా వేయవలెనని తీర్మానించిరి. బాబా కిదంతయు వట్టి చాదస్తమని తెలియును. కాబట్టి బాబా యా చట్టములను లక్ష్యపెట్టలేదు. ఆ సమయములో కట్టెలబండి యొకటి ఊరిలోనికి ప్రవేశించుచుండెను. ఊరిలో కట్టెలకు కరువున్నదని అందరికి తెలియును. అయినప్పటికి కట్టెలబండిని తరిమివేయుటకు ప్రయత్నించుచుండిరి. బాబా యీ సంగతి తెలిసికొనెను. అచ్చటికి వచ్చి, కట్టెలబండిని మసీదుకు తీసికొనిపొమ్మని యుత్తరువు నిచ్చెను. బాబా చర్యకు వ్యతిరేకముగ చెప్పుటకెవ్వరు సాహసించలేదు. ధునికొరకు కట్టెలు కావలసియుండెను. కనుక బాబా కట్టెలను కొనెను. నిత్యాగ్నిహోత్రివలె బాబా తన జీవితమంతయు ధునిని వెలిగించియే యుంచెను. అందుల కయి వారికి కట్టె లవసరము. గనుక నిల్వచేయువారు. బాబా గృహమనగా మసీదు, ఎప్పుడు తెరచియుండెడిది. ఎవరయిన పోవచ్చును. దానికి తాళముగాని చెవిగాని లేదు. కొందరు తమ యుపయోగము కొరకు కొన్ని కర్రలను తీసికొని పోవువారు. అందుకు బాబా యెప్పుడును గొణుగుకొన లేదు. ఈ ప్రపంచమంతయు దేవుడే యావరించి యుండుటచే వారికి ఎవరియందు శళ్యత్వముండెడిది గాదు. వారు పరిపూర్ణ వైరాగులై నప్పటికి, సాధారణగృహస్థులకు ఆదర్శముగా నుండుటకై యిట్లు చేయుచుండెడివారు.

గురుభక్తిని పరీక్షించుట

రెండవ కలరా నిబంధనమును బాబా యెట్లు ధిక్కరించెనో చూతుము. నిబంధనములతో నున్నప్పుడెవరో యొకమేకను మసీదుకు తెచ్చిరి. ఆ ముసలిమేక దుర్బలముగా చావుకు సిద్ధముగా నుండెను. ఆ సమయమున మాలేగాం ఫకీరు పీర్ మహమ్మద్ ఉరఫ్ బడేబాబా యచటనే యుండెను. సాయిబాబా దానిని యొక కత్తివ్రేటుతో నరికి, బలి వేయుమని బడేబాబాకు చెప్పెను. ఈ బడేబాబాయందు సాయిబాబాకు ఎక్కువ గౌరవము. ఆయన ఎల్లప్పుడు సాయిబాబాకు కుడివయిపు కూర్చొనెడివారు. చిలుము బడేబాబా పీల్చినపిదప, సాయిబాబా పీల్చి యితరుల కిచ్చెడివారు. మధ్యాహ్నభోజనసమయమందు సాయిబాబా బడేబాబాను పిలిచి యెడమప్రక్కన కూర్చుండబెట్టుకొనిన పిమ్మట భోజనమును ప్రారంభించువారు. దక్షిణరూపముగా వసూలయిన పైకమునుంచి ఆయనకు దినమొక్కంటికి 50 రూపాయలు సాయిబాబా యిచ్చుచుండెడివారు. బడేబాబా పోవునపుడు 100 అడుగులవరకు సాయిబాబా వెంబడించువారు. అట్టిది బాబాకు వారికి గల సంబంధము. సాయిబాబా వారిని మేకను నరుకుమనగా అనవసరముగా దానిని చంపనేల యని బడేబాబా నిరాకరించెను. అప్పుడు సాయిబాబా శ్యామాను ఆపని చేయుమనెను. అతడు రాధాకృష్ణమాయివద్దకు బోయి కత్తిని దెచ్చి బాబా ముందు బెట్టెను. ఎందులకు కత్తిని దెప్పించిరో తెలిసికొనిన పిమ్మట రాధాకృష్ణమాయి దానిని తిరిగి తెప్పించు కొనెను. ఇంకొక కత్తి తెచ్చుటకు శ్యామా పోయెను, కాని వాడలోనుండి త్వరగా రాలేదు. తరువాత కాకా సాహెబు దీక్షిత్ వంతు వచ్చెను. వారు మేలిమి బంగారమే కాని, దానిని పరీక్షించవలెను. ఒక కత్తి దెచ్చి నరుకుమని బాబా యాజ్ఞాపించెను. అతడు సాఠేవాడకు బోయి కత్తిని దెచ్చెను. బాబా యుత్తరువు కాగానే దానిని నరకుటకు సిద్ధముగా నుండెను. అతడు స్వచ్ఛమైన బాహ్మణకుటుంబములో పుట్టి చంపుట యనునది ఎరుగకుండిరి. హింసించుపనులను చేయుటయందిష్టము లేనివాడయినప్పటికి, మేకను నరకుటకు సంసిద్ధుడయ్యెను. బడేబాబాయను మహమ్మదీయుడే యిష్టపడనప్పుడు ఈ బ్రాహ్మణుడేలసిద్ధపడుచుండెనని యంద రాశ్చర్యపడుచుండిరి. అతడు తన ధోవతిని ఎత్తి బిగించి కట్టుకొనెను. కత్తిని పయికెత్తి బాబా యాజ్ఞకై యెదురు చూచుచుండెను. బాబా “ఏమి ఆలోచించుచుంటివి? నరుకుము.” అనెను. అతని చేతిలోనున్న కత్తి మేకపై పడుటకు సిద్ధముగా నుండగా బాబా ‘ఆగు’ మనెను. “ఎంతటి కఠినాత్ముడవు. బ్రాహ్మణుడవయి మేకను చంపెదవా?” యనెను. బాబా యాజ్ఞానుసారము దీక్షిత్ కత్తిని క్రిందబెట్టి బాబాతో నిట్లనియె. “నీ యమృతమువంటి పలుకే మాకు చట్టము. మా కింకొక చట్టమేమియు తెలియదు. నిన్నే యెల్లప్పుడు జ్ఞప్తియందుంచుకొనెదము. నీరూపమును ధ్యానించుచు రాత్రింబవళ్ళు నీ యాజ్ఞలు పాటింతుము. అది ఉచితమా? కాదా? యనునది మాకు తెలియదు. దానిని మేము విచారింపము. అది సరియైనదా? కాదా? యని వాదించము, తర్కించము. గురువు ఆజ్ఞ అక్షరాల పాలించుటయే మా విధి, మా ధర్మము.”

బాబాయే మేకను చంపి బలివేసెదనని చెప్పిరి. మేకను ‘తకియా’ యనుచోట చంపుటకు నిశ్చయించిరి. ఇది ఫకీరులు కూర్చొను స్థలము. అచటకు దానిని తీసికొనిపోవునపుడు మార్గమధ్యమున అది ప్రాణములు విడిచెను.

శిష్యులెన్ని రకములో చెప్పుచు ఈ యధ్యాయము హేమాడ్ పంతు ముగించుచున్నారు. శిష్యులు మూడు రకములు – 1. ఉత్తములు 2. మధ్యములు. 3. సాధారణులు.

గురువులకేమి కావలెనో గుర్తించి వెంటనే వారాజ్ఞాపించక పూర్వమే దానిని నెరవేర్చువారు ఉత్తమ శిష్యులు. గురుని యాజ్ఞానుసారము ఆలసింపక అక్షరాల నెరవేర్చువారు మధ్యములు. మూడవ రకమువారు, అడుగడుగునకు తప్పులు చెయుచు గురుని ఆజ్ఞను వాయిదా వేసెదరు.

శిష్యులకు దృఢమైన నమ్మకముండవలెను. తోడుగా బుద్ధికుశలత యోరిమి యున్నచో అట్టివారికి ఆధ్యాత్మికపరమావధి దూరము కాదు. ఉచ్ఛ్వాస, నిశ్శ్వాసములను బంధించుటగాని, హఠయోగము గాని యితర కఠినమయిన సాధనలన్నియు ననవసరము. పైన చెప్పిన గుణముల నలవరచుకొన్నచో, వారు ఉత్తరోత్తరోపదేశముల కర్హులగుదురు. అప్పుడు గురువు తటస్థించి జీవితపరమావధిని పొందుటకై ఆధ్యాత్మిక మార్గమున నడిపింతురు.

వచ్చే అధ్యాయములో బాబా గారి హాస్యము, చమత్కారముల గూర్చి చెప్పుకొందుము.
ఓం నమోః శ్రీ సాయినాథాయ
శాంతిః శాంతిః శాంతిః
ఇరువదిమూడవ అధ్యాయము సంపూర్ణము.

|సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు|
|శుభం భవతు|

శ్రీ సాయి సత్ చరిత్రము ఇరువదిరెండవ అధ్యాయము


ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

ఇరువదిరెండవ అధ్యాయము

పామువిషమునుంచి తప్పించుట

1.బాలాసాహెబు మిరీకర్ 2.బాపుసాహెబు బుట్టీ 3.అమీరు శక్కర్ 4.హేమడ్ పంతు

సర్పములను చంపుటగూర్చి బాబా అభిప్రాయము

ప్రస్తావన

బాబాను ధ్యానించు టెట్లు? భగవంతుని నైజముగాని, స్వరూపమునుగాని అగాధములు. వేదములుగాని వెయ్యి నాలుకలు గల ఆది శేషుడుగాని వానిని పూర్తిగ వర్ణింపలేరు. భక్తులు భగవంతుని రూపమును చూచి కనుగొని తీరవలెను. ఎందుకనగా తమ యానందమునకు భగవంతుని పాదములే ముఖ్యమార్గమని వారికి తెలియును. జీవిత పరమార్థమును పొందుటకు గురుని పాదములనే ధ్యానించవలెను గాని, యింకొక మార్గము లేదని వారలకు తెలియును. హేమడ్ పంతు ఒక సులభమైన మార్గమును ఉపదేశరూపముగా చెప్పుచున్నాడు. అది ధ్యానమునకు భక్తికికూడ అనుకూలించును.

నెలలో కృష్ణపక్షమున రానురాను వెన్నెల క్రమముగా క్షీణించును. తుదకు అమావాస్యనాడు చంద్రుడు కానరాడు. వెన్నెల కూడా రాదు. శుక్లపక్షము ప్రారంభించగనే ప్రజలు చంద్రుని చూచుటకు ఆతురపడెదరు. మొదటి దినము చంద్రుడు కానరాడు. రెండవనాడది సరిగా కనిపించదు. అప్పుడు రెండు చెట్టుకొమ్మల మధ్య గుండా చూడుమనెదరు. ఆతురతతో నేకధ్యానముతో అ సందుద్వారా చూచునపుడు దూరముగానున్న చంద్రుని యాకారమొకగీతవలె గాన్పించును. వారప్పుడు సంతసించెదరు. ఈ సూత్రము ననుసరించి బాబా తేజమును జూచెదముగాక. బాబా కూర్చున్న విధానమును జూడుడు. అది యెంత సుందరముగా నున్నది! వారు కాళ్ళను ఒక దానిపైని ఇంకొకటి వేసియున్నారు. కుడికాలు యెడమ మోకాలుపై వేసియున్నారు. ఎడమచేతి వ్రేళ్ళు కుడి పాదముపై వేసియున్నారు. కుడికాలి బొటన వ్రేలుపై చూపుడు వ్రేలున్ను, మధ్య వ్రేలున్ను ఉన్నవి. ఈ కూర్చున్న విధమును బట్టి చూడగ బాబా మనకీ దిగువ విషయము చెప్ప నిశ్చయించుకొన్నట్లున్నది. “నా ప్రకాశమును చూడవలెనంటే, అహంకారమును విడిచి మిక్కిలి యణకువతో చూపుడు వ్రేలుకు మధ్య వ్రేలుకు నున్న బొటన వ్రేలుపై దృష్టిని సారించినచో నా ప్రకాశమును జూడగలరు. ఇది భక్తికి సులభమైన మార్గము.”

ఒక క్షణము బాబా జీవితమును గమనించెదము. బాబా నివాసము వలన షిరిడీ యొక యాత్రాస్థల మాయెను. అన్ని మూలలనుండి ప్రజలచట గుమిగూడుచుండిరి. బీదవారు గొప్పవారు కూడ అనేక విధముల మేలు పొందుచుండెడివారు. బాబా యొక్క యనంత ప్రేమను, అశ్చర్యకరమైన సహజమైన వారి జ్ఞానమును, వారి సర్వాంతర్యామిత్వమును వర్ణించగల వారెవ్వరు? వీనిలో నేదైన నొకదానిని గాని, యన్నియు గాని యనుభవించినవారు ధన్యులు. ఒక్కొక్కప్పుడు బాబా దీర్ఘ మౌనము పాటించువారు. అది వారియొక్క బ్రహ్మబోధము. ఇంకొకప్పుడు చైతన్యఘనులుగా నుండువారు. ఆనందమున కవతారముగా, భక్తులచే పరివేష్టితులై యుండెడివారు. ఒక్కొక్కప్పుడు వారు నీతి బోధించు కథలను చెప్పెడివారు. ఇంకొకప్పుడు హాస్యము, తమాషా చేయుటలో మునిగెడివారు. ఒకప్పుడు సూటిగా మాట్లాడువారు. ఒక్కొక్కప్పుడు కోపోద్దీపితుడా యని తోచువారు. ఒక్కొక్కప్పుడు దీర్ఘ వివాదములోనికి దించెడివారు. అనేకసార్లు ఉన్నదున్నట్లు మాట్లాడెడివారు. ఈ ప్రకారముగ వారనేక సలహాలు అవసరము ప్రకార మనేక మందికి ఇచ్చుచుండెడివారు. వారి జీవిత మగోచరమైనది. మన మేధా శక్తికి భాషకు అందుబాటులో నుండెడెదికాదు. వారి ముఖమును జూచుటయందు ఆసక్తిగాని వారితో సంభాషించుటయందుగాని, వారి లీలలు వినుటయందుగాని తనివి తీరెడిదికాదు. అయినప్పటికి సంతోషముతో నుప్పొంగుచండేవారము. వర్షబిందువులను లెక్కించగలము; తోలు సంచిలో గాలిని మూయగలము, కాని బాబా లీలలను లెక్కింపలేము. వానిలో నొక్కదానినిగూర్చి చెప్పెదము. భక్తుల యాపదలను కనుగొని భక్తులను వానినుండి సకాలమున బాబా యెట్లు తప్పించుచుండెనో యిచట చెప్పుదుము.

బాలాసాహెబు మిరీకర్

సర్దారు కాకాసాహెబు మిరీకర్ కొడుకగు బాలా సాహెబు మిరీకర్ కోపర్ గాంకు మామలత్ దారుగా నుండెను. చితిలీ గ్రామ పర్యటనకు పోవుచుండెను. మార్గమధ్యమున బాబాను జూచుటకు షిరిడీ వచ్చెను. మసీదుకు బోయి, బాబాకు నమస్కరించెను. ఆతని యోగ క్షేమముల గూర్చి మాట్లాడునప్పుడు బాబా జాగ్రత్తగా నుండవలెనని హెచ్చరిక చేయుచు నిట్లడిగెను. “నీకు మన ద్వారకామాయి తెలియునా?” బాలా సాహెబునకు బోధపడక పోవుటచే అతడూరకుండెను. “నీ విప్పుడు కూర్చున్నదే ద్వారకమాయి. ఎవరయితే యామె తొడపయి కూర్చొనెదరో యామె వారిని కష్టములనుండి యాతురతల నుండి తప్పించును. ఈ మసీదుతల్లి చాల దయార్ద్రహృదయురాలు. ఆమె నిరాడంబరభక్తులకు తల్లి. వారిని కష్టములనుండి తప్పించును. ఒక్కసారి మనుజులు ఆమె తొడపై కూర్చొనినచో, వారి కష్టము లన్నియు పోవును. ఎవరామె నీడ నాశ్రయించెదరో వారికి ఆనందము కలుగును” అనెను. పిమ్మట బాలా సాహెబుకు ఊదీప్రసాద మిచ్చి వాని శిరస్సుపై చేయి వేసెను. బాలాసాహెబు పోవుచుండగా బాబా యిట్లనెను. “నీకు పొడుగాటి బాబా తెలియునా? అనగా సర్పము” ఎడమ చేతిని మూసి, దానిని కుడిచేతి వద్దకు తెచ్చిపాముపడగవలె వంచి, “అది మిక్కిలి భయంకరమైనది. కాని ద్వారకా మాయిబిడ్డల నేమి చేయగలదు? ద్వారకామాయి కాపాడుచుండగా, ఆ సర్పమేమి చేయగలదు?” అనెను.

అక్కడున్న వారందరు దీని భావమును దెలిసికొనుటకు, దానికి మిరీకరుకు గల సంబంధమును దెలిసికొనుటకు కుతూహల పడుచుండిరి. కాని బాబా నీవిషయమై యడుగుటకు ధైర్యము లేకుండెను. బాలాసాహెబు బాబాకు నమస్కరించి మసీదును విడచి శ్యామాతో వెళ్ళెను. బాబా శ్యామాను బిలచి బాలాసాహెబుతో చితళీవెళ్ళి యానందించు మనెను. బాబా యాజ్ఞానుసారము శ్యామ కూడ తనవెంట వచ్చెదనని బాలాసాహెబుతో చెప్పెను. అసౌకర్యముగ నుండునని కాన, రావద్దని బాలాసాహెబు శ్యామాతో చెప్పెను. శ్యామా బాబాకీ సంగతి దెలిపెను. బాబా యిట్లనెను. “సరే, వెళ్ళవద్దు. వాని మంచి మనము కోరితిమి. ఏది నుదుట వ్రాసియున్నదో యది కాక తప్పదు.”

ఈ లోపల బాలాసాహెబు తిరిగి యాలోచించి శ్యామాను వెంట రమ్మనెను. శ్యామా బాబావద్ద కేగి సెలవు పుచ్చుకొని బాలాసాహెబుతో టాంగాలో బయలుదేరెను. వారు రాత్రి 9గంటలకు చితళీ చేరిరి. ఆంజనేయాలయములో బసచేసిరి. కచేరీలో పనిచేయువారెవరు రాలేదు; కావున నెమ్మదిగా నొకమూల కూర్చొని మాట్లాడుచుండిరి. చాపపైని కూర్చొని బాలాసాహెబు వార్తాపత్రిక చదువుచుండెను. అతడు ధరించిన అంగవస్త్రముపై నొక సర్పముండెను. దాని నెవ్వరును చూడలేదు. అది బుసకొట్టుచు కదలుచుండెను. ఆ ధ్వని నౌకరు వినెను. అతడొక లాంతరు దెచ్చి, సర్పమును జూచి పాముపామని యరచెను. బాలాసాహెబు భయపడెను. వణుకుట ప్రారంభించెను. శ్యామాకూడ ఆశ్చర్యపడెను. అందరు మెల్లగా కట్టెలను దీసిరి. బాలాసాహెబు నడుమునుండి పాము దిగుటకు ప్రారంభించెను. దానిని కొట్టి చంపివేసిరి. ఈ ప్రకారముగా బాబా ముందుగా హెచ్చరించి బాలాసాహెబును హానినుండి తప్పించిరి. బాబాయందు బాలాసాహెబుకు గల ప్రేమ దృఢమయ్యెను.


బాపుసాహేబు బుట్టీ

నానా సాహెబు డెంగ్లే యను గొప్ప జ్యోతిష్కుడు, బాపూ సాహెబు బుట్టీ షిరిడీలో నుండునపుడు ఒకనా డిట్లనెను. “ఈ దినము అశుభము. నీ ప్రాణమునకు హాని కలదు.” ఇది బాపు సాహెబును చలింపజేసెను. ఆయన యథాప్రకారము మసీదుకు రాగా బాబా బాపు సాహెబుతో నిట్లనియె. “ఈ నానా యేమనుచున్నాడు? నీకు మరణమున్నదని చెప్పుచున్నాడు. సరే, నీవు భయపడనక్కరలేదు. వానికి ధైర్యముతో నిట్లు చెప్పుము. మృత్యువు ఎట్లు చంపునో చూచెదము గాక.” ఆనాటి సాయంకాలము బాపుసాహెబు బుట్టీ మరుగు దొడ్డికి పోయెను. అక్కడొక పామును జూచెను. అతని నౌకరు దానిని చూచెను. ఒక రాయెత్తి కొట్టబోయెను. బాపుసాహెబు పెద్దకర్రను దీసికొని రమ్మనెను. నౌకరు కర్రను తీసికొని వచ్చునంతలో, పాము కదలిపోయి యదృశ్యమయ్యెను. ధైర్యముతో నుండుమని యాడిన బాబా పలుకులను బాపుసాహెబు జ్ఞప్తికి తెచ్చుకొని సంతోషించెను.

అమీరు శక్కర్

కోపర్ గాం తాలుకాలో కొరేలా గ్రామనినాసి అమీరు శక్కర్. అతడు కసాయి జాతికి చెందినవాడు. బాంద్రాలో కమీషను వ్యాపారి, పలుకుబడి కలవాడు. అతడు కీళ్ళవాతము జబ్బుతో బాధపడుచుండుటచే భగవంతుని జ్ఞప్తికి దెచ్చుకొని వ్యాపారమును విడిచిపెట్టి షిరిడీ చేరి బాధనుండి తప్పింపుమని బాబాను వేడెను. చావడిలో కూర్చొనుమని బాబా యాజ్ఞాపించెను. అటువంటి రోగికి ఈ స్థలము సరియైనది కాదు. అది యెల్లప్పుడు చెమ్మగా నుండును. గ్రామములో నింకేదైన స్థలము బాగుండెడిది. బాబా పలుకులే తగిన యౌషదము, నిర్ణయసూత్రము. మసీదుకు వచ్చుటకు బాబా యనుజ్ఞ ఇవ్వలేదు. చావడిలో కూర్చొనుమని యాజ్ఞాపించెను. అది వానికి మిక్కిలి లాభకారి యయ్యెను. ఎందుకనగా బాబా ఉదయము సాయంకాలము చావడివైపు పోవుచుండెను. అదియును గాక దినము విడిచి దినము ఉత్సవముతో బోయి బాబా యచట నిద్రించుచుండెను. ఆందుచే అమీరు బాబా యొక్క సాంగత్యమును సులభముగా పొందుచుండెను. పూర్తిగ 9 మాసములు అమీరు శక్కర్ అక్కడ నుండెను. తరువాత ఆ స్థలముపై విసుగు కలిగెను. ఒకనాటి రాత్రి యెవరికి చెప్పకుండ కోపర్ గాం పారిపోయెను. అచ్చటొక ధర్మశాలలో దిగెను. అచ్చటొక ఫకీరు చచ్చుటకు సిద్ధముగా నుండెను. నీళ్ళు కావలెననగా, అమీరు పోయి తెచ్చి ఇచ్చెను. ఆ నీళ్ళను త్రాగి ఫకీరు చనిపోయెను. అమీరు చిక్కులో పడెను. అతడు పోలీసువారికి తెలియపరచినచో, మొట్టమొదట సమాచారమును దెచ్చిన వాడగుటచే వీని కావిషయ మేమైన తెలిసియుండునని పట్టుకొనెదరు. ఆ చావునకు కూడ అతడు కారణభూతుడయి యుండవచ్చునని యనుమానించెదరు. బాబా యాజ్ఞ లేనిదే షిరిడీ విడిచి పెట్టుట తనదే తప్పని అతడు గ్రహించెను, పశ్చాత్తాపపడెను. షిరిడీ పోవ నిశ్చయించుకొని యారాత్రియే యచటనుండి షిరిడీకి పోయెను. మార్గమధ్యమున బాబా నామమును జపము చేయుచుండెను. సూర్యోదయమునకు ముందు షిరిడీ చేరి యాతురతనుండి తప్పించుకొనెను. బాబా యాజ్ఞానుసారము చావడి లోనే యుండి రోగముక్తుడయ్యెను. ఒకనాడు మధ్యరాత్రి బాబా “ఓ అబ్దుల్! నా పరుపు వైపు ఏదో దుష్టప్రాణి వచ్చుచున్నది.” యని యరచెను. లాంతరు దీసికొని అబ్దుల్ వచ్చి బాబా పరుపు జూచెను గాని, యేమియు గాన్పించలేదు. జాగ్రత్తగా చూడుమని బాబా చెప్పుచు నేలపై సటకాతో కొట్టుచుండెను. అమీరు శక్కర్ బాబా లీలను జూచి అచ్చటకు పాము వచ్చెనని బాబా యనుమానించి యుండునని యనుకొనెను. బాబా సాంగత్యమువలన, బాబా యాడు మాటల చేయు క్రియల భావమును అమీరు గ్రహించుచుండెను. (బాబా అబ్దుల్ ను లాంతరు తీసికొని రమ్మనెను.) అమీరు తన దిండుకు సమీపమున నేదో కదలుచుండుట గమనించెను. అంతలో నచ్చటొక పాము కనబడెను. అది తలను క్రిందకి మీదకి ఆడించుచుండెను. వెంటనే దానిని చంపిరి. ఇట్లు బాబా సకాలమున హెచ్చరిక చేసి అమీరును కాపాడెను.

హేమడ్ పంతు (తేలు – పాము)

1. తేలు :– బాబా చెప్పుటచే కాకాసాహెబు దీక్షితు శ్రీ ఏకనాథ మహారాజుగారి రెండు గ్రంధములు భాగవతమును, భావార్థరామాయణమును నిత్యము పారాయణ చెయుచుండెను. ఒకనాడు పురాణ కాలక్షేపము జరుగుచుండగా హేమడ్ పంతు గూడ శ్రోత యయ్యెను. రామాయణములో ఆంజనేయుడు తన తల్లి యాజ్ఞానుసారము శ్రీరాముని మహిమను పరీక్షించుభాగము చదువునపుడు వినువారందరు మైమరచి యుండిరి. అందులో హేమాడ్ పంతొకడు. ఒక పెద్ద తేలు హేమాడ్ పంతు భుజముపై బడి వాని యుత్తరీయముపయి కూర్చుండెను. మొదట దాని నెవ్వరు గనిపెట్టకుండిరి. ఎవరు పురాణముల వినెదరో వారిని భగవంతుడు రక్షించును గావున హేమాడ్ పంతు తన కుడి భుజముపై నున్న తేలును జూచెను. అది చచ్చినదానివలె నిశ్శబ్ధముగా కదలకుండెను. అది కూడ పురాణము వినుచున్నట్లు గనిపించెను. భగవంతుని కటాక్షముచే నితరులకు భంగము కలుగజేయకుండ తన యుత్తరీయము రెండు చివరలను పట్టుకొని, దానిలో తేలుండునట్లు జేసి, బయటకు వచ్చి తోటలో పారవైచెను.

2. పాము :– ఇంకొకప్పుడు సాయంకాలము కాకాసాహెబు మేడమీద కొందరు కూర్చొని యుండిరి. ఒక సర్పము కిటికీలోనున్న చిన్న రంధ్రము ద్వారా దూరి చుట్టుకొని కూర్చొనెను. దీపమును దెచ్చిరి. మొదట యది వెలుతురుకు తడబడెను. అయినప్పటికి అది నెమ్మదిగా కూర్చొనెను. దాని తలమాత్రము క్రిందకు మీదకు నాడించుచుండెను. అనేకమంది బడితెలు, కర్రలు తీసుకొని వేగముగ పోయిరి. అది యెటుకాని స్థలములో నుండుటచే దానిని చంపలేకుండిరి. మనుష్యుల శబ్దమును విని యా సర్పము వచ్చిన రంధ్రములోనికి గబగబ దూరెను. అందరు ఆపదనుండి తప్పించుకొనిరి.

బాబా అభిప్రాయము

ముక్తారామ్ యను నొక భక్తుడు పాము తప్పించుకొని పోవుటచే మంచియే జరిగినదనెను. హేమాడ్ పంతు అందుల కొప్పుకొనలేదు. అది సరియైన యాలోచన కాదనెను. పాములను చంపుటయే మంచిదనెను. ఇద్దరికి గొప్పవాక్కలహము జరిగెను. ముక్తారామ్ సర్పములు మొదలగు క్రూరజంతువులను చంప నవసరము లేదనెను. హేమాడ్ పంతు వానిని తప్పక చంపవలెననెను. రాత్రిసమీపించెను. కలహము సమాప్తి గాకుండెను. ఆ మరుసటిదిన మా ప్రశ్నను బాబా నడిగిరి. బాబా యిట్లు జవాబిచ్చెను. “భగవంతుడు సకలజీవులందు నివసించుచున్నాడు. అవి సర్పములుగాని, తేళ్ళుగాని కానిడు. ఈ ప్రపంచమును నడిపించు సుత్రధారి భగవంతుడు. సకలజంతుకోటి పాములు, తేళ్ళతో సహా, భగవదాజ్ఞను శిరసావహించును. వారి యాజ్ఞయైనగాని యెవరు ఇతరులకు హాని చేయలేరు. ప్రపంచమంతయు వానిపైనాధారపడి యున్నది. ఎవ్వరును స్వతంత్రులు కారు. కాబట్టి మనము కనికరించి అన్ని జీవులను ప్రేమించవలెను. అనవసరమైన కలహములందు, చంపుటయందు పాల్గొనక యోపికతో నుండవలెను. దేవుడందరిని రక్షించువాడు. ”
ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
ఇరువదిరెండవ అధ్యాయము సంపూర్ణము.

మూడవరోజు పారాయణము సమాప్తము.

।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు। 

శ్రీ సాయి సత్ చరిత్రము ఇరువదియొకటవ అధ్యాయము


ఓం
శ్రీ సాయి నాథాయ నమః

శ్రీ

సాయిబాబా

జీవిత చరిత్రము

ఇరువదియొకటవ అధ్యాయము

1. వి. హెచ్. ఠాకూరు 2. అనంతరావు పాటంకర్ 3. పండరీ పురము ప్లీడరు - వీరి కథలు.

ఈ అధ్యాయములో హేమడ్ పంతు వినాయక హరిశ్చంద్ర ఠాకూరు, బి.ఏ.అనంతరావు పాటంకర్ (పూనా), పండరీపురము ప్లీడరు గూర్చిన కథలు చెప్పెను. ఈ కథలన్నియు నానందదాయకమైనవి. ఇవి సరిగా చదివి గ్రహించినచో, ఆధ్యాత్మికమార్గమునకు దారి చూపును.

ప్రస్తావన

సామాన్యముగ మన గతజన్మపుణ్యసముపార్జనమువలని యదృష్టముచే యోగీశ్వరుల సాంగత్యము పొంది దానివలన మేలు పొందెదము. దీనికి ఉదాహరణముగా హేమడ్ పంతు తన సంగతినే చెప్పుచున్నాడు. బొంబాయి దగ్గరగానున్న బాంద్రాకు ఇతడు చాలాకాలము మేజిస్ట్రేటుగ నుండెను. అక్కడ పీరుమౌలానా యను మహమ్మదీయ యోగిపుంగవుడు నివసించుచుండెను. అనేకమంది హిందువులు పారశీకులు, ఇతర మతస్థులుపోయి వారిని దర్శించుచుండిరి. అతని పురోహితుడగు యూనుస్, హేమడ్ పంతును అనేకసార్లు పీరుమౌలానాను దర్శించుమని చెప్పెను. కాని ఏదో కారణముచేత అతడు చూడ లేకపోయెను. అనేక సంవత్సరముల తరువాత అతనివంతు వచ్చెను. అతడు షిరిడీకి పోయి, శాశ్వతముగా షిరిడీ సాయి సంస్థానములో చేరెను. దురదృష్టులకు ఇట్టియోగుల సాంగత్యము లభించదు. కేవలము అదృష్టవంతులకే యట్టిది లభించును.

యోగీశ్వరుల వ్వవస్థ

అత్యంత ప్రాచీన కాలమునుండి ప్రపంచమున యోగీశ్వరుల వ్యవస్థ యున్నది. అనేకమంది యోగు లనేకచోట్ల అవతరించి వారి వారికి విధింపబడిన పనులను నెరవేర్చెదరు. వారనేకచోట్ల పని చెసినను అందరా భగవంతుని యాజ్ఞానుసారము నెరవేర్చెదరు. కాన ఒకరు చేయునది యింకొకరికి తెలియును. ఒకరు చేసినదానిని ఇంకొకరు పూర్తిచేసెదరు. దీనిని బోధించుట కొకయుదాహరణ మీ దిగువ కలదు.

వి.హెచ్.ఠాకూరుగారు (బి.ఏ.)

వీరు రెవన్యూశాఖలో గుమాస్తాగా నుండిరి. ఆయన ఒక సర్వేపార్టీతో వచ్చెను. అక్కడ ‘అప్ప’ యను కన్నడ యోగిని దర్శించి వారి పాదములకు నమస్కరించెను. ఆయోగి నిశ్చలదాసు రచించిన ‘విచార సాగర’ మను వేదాంతగ్రంథమును సభలో నున్నవారికి బోధించుచుండెను. ఠాకూరు పోవునపుడు వారి సెలవు కోరగా వారిట్లు చెప్పిరి. “ఈ పుస్తకమును నీవు చదువవలెను. నీ వట్లు చెసినచో నీకోరికలు నెరవేరును. ముందుముందు నీ యుద్యోగమునకు సంబంధించిన పనిమీద ఉత్తరదిక్కునకు బోయినప్పుడు నీ వొక గొప్పయోగిని యదృష్టముచే కలిసికొనెదవు. వారు నీ భవిష్యత్తుమార్గమును చూపెదరు. నీ మనస్సునకు శాంతి కలుగజేసెదరు. నీ కానందము కలుగజేసెదరు.” ఠాకూరు జున్నరుకు బదిలీ యయ్యెను. అచటికి పోవుటకై నానేఘాటు లోయను దాటి పోవలసియుండెను. ఈ లోయ మిక్కిలి లోతైనది. దానిని దాటుట చాల కష్టము. దానిని దాటుట కెనుబోతు తప్ప యితరమేదియు నుపయోగించరు. కావున ఎనుబోతు పై లోయను దాటుటచే అతనికి బాధ కలిగెను. అచ్చటనుండి కల్యాణ్ కు పెద్ద యుద్యోగముపై బదిలి యయ్యెను. అచట నానాసాహెబు చాందోర్కరుతో పరిచయము కలిగెను. ఆయనవలన సాయిబాబాగూర్చి యనేకసంగతులు తెలిసికొని వారిని చూచుటకు కాంక్షించెను. ఆ మరుసటిదినమే నానాసాహెబు షిరిడీపోవుటకు నిశ్చయించుకొనెను. కావున ఠాకూరును తనతో కూడ రమ్మని యడిగెను. ఠాకూర్ తనకు ఠాణాలో సివిల్ కేసుండుటచే రాలేనని చెప్పెను. అందుచే నానాసాహెబు ఒక్కడే వెళ్ళెను. ఠాకూరు ఠాణాకు వెళ్ళెను. కాని యచ్చట కేసు వాయిదా పడెను. అతడు నానాసాహెబు వెంట షిరిడీకి వెళ్ళకపోవుటచే మిక్కిలి పశ్చాత్తాపపడెను. అయినప్పటికి షిరిడీ వెళ్ళెను. అంతకుముందొకనాడు నానాసాహెబు షిరిడీ విడిచిపెట్టెనని తెలిసెను. ఇతరస్నేహితులు కొందరు కలిసిరి. వారు ఠాకూరును బాబావద్దకు దీసికొనిపోయిరి. అతడు బాబాను జూచి వారి పాదములకు నమస్కరించి మిక్కిలి సంతసించెను. కొంతసేపటికి సర్వజ్ఞుడగు బాబా యిట్లనెను. ఇచ్చటి మార్గము అప్పా బోధించు నీతులంత సులభమైనది కాదు. నానేఘాటులో ఎనుబోతు పైన సవారి చేయునంత సులభము కాదు. ఈ యధ్యాత్మికమార్గము మిగుల కఠినమైనది. కావలసినంత కృషి చేయవలసియుండును. ఠాకూ రొక్కనికే తెలియు ఈ ముఖ్యమైన గుర్తులు మాటలు వినగనే యతడు యమితానందపరవశుడయ్యెను. కన్నడయోగి చెప్పిన మాటలు యథార్థములని గ్రహించెను. రెండుచేతులు జోడించి బాబా పాదములపై శిరస్సును బెట్టి, తనను స్వీకరించి యాశీర్వదించ వలెనని ప్రార్థించెను. అప్పుడు బాబా యిట్లనెను. అప్పా చెప్పినదంతయు నిజమే కాని యవన్నియు అభ్యసించి ఆచరణలో పెట్టవలెను. ఊరకనే చదువుట వలన ప్రయోజనము లేదు. నీవు చదివినదంతయు నాలోచించి యాచరణలో పెట్టవలెను. లేనిచో దాని ప్రయోజనమేమియు నుండదు. గురుని యాశీర్వాదము లేని ఉత్త పుస్తక జ్ఞాన మాత్మసాక్షాత్కారము లేనిచో ప్రయోజనము లేనిది. విచారసాగరము పుస్తకములోని సిద్ధాంతభాగ మాతడు చదివియుండెను, గాని యాచరణలో పెట్టతగిన దానిని షిరిడీలో నేర్చెను. ఈ దిగువ యింకొక కథ కూడ నీ సత్యమును బలపరచును.

అనంతరావు పాటంకర్


పూనా పెద్దమనుష్యుడొకడు అనంతరావు పాటంకర్ యను వాడు బాబాను చూడగోరెను. షిరిడీ వచ్చి బాబా దర్శనము చేసెను. అతని కండ్లు సంతుష్టిచెందెను. అతడానందించెను. అతడు బాబా పాదములపయి బడి, తగిన పూజచేసినపిమ్మట బాబాతో ఇట్లనెను. నేనెక్కువగా చదివితిని. వేదములను, వేదాంతములను, ఉపనిషత్తులను చదివితిని. అష్టాదశపురాణములు వింటిని. నా మనస్సుకు శాంతి యైనను కలుగుట లేదు. కనుక నా పుస్తకజ్ఞాన మంతయు నిష్ప్రయోజనము. పుస్తక జ్ఞానములేని నిరాడంబరభక్తులు నాకంటేమేలు. మనస్సు శాంతి పొందనిచో పుస్తకజ్ఞానమంతయు వ్యర్థము. నీ దృష్టివలనను నీ చమత్కారపు మాటలవలనను నీవు శాంతి ప్రసాదింతువని వింటిని. అందుచే నేనిచ్చటికి వచ్చితిని. కావున నాయందు దాక్షిణ్యము చూపుము. నన్ను ఆశీర్వదించుము. పిమ్మట బాబా ఒక నీతికథను ఈ విధముగ చెప్పెను.

తొమ్మిది ఉండల గుఱ్ఱపులద్ది నీతికథ (నవ విధభక్తి)

ఒకనా డొకవర్తకు డిక్కడకు వచ్చెను. అతనిముందు ఆడగుఱ్ఱము లద్ధివేసెను. అది తొమ్మిది యుండలుగా పడెను. జిజ్ఞాసువైన యా వర్తకుడు పంచెకొంగు సాచి తొమ్మిది యుండల నందులో పట్టుకొనెను. ఇట్లు అతడు మనస్సును కేంద్రీకరించగలిగెను.

ఈ మాటల యర్థమును పాటంకర్ గ్రహించలేకుండెను. అందుచేనతడు గణేశదామోదర్ వురఫ్ దాదాకేల్కరు నిట్లు అడిగెను. దీని వలన బాబా యుద్దేశమేమి, అతడిట్లు జవాబు ఇచ్చెను. నాకుగూడ బాబా చెప్పినదంతయు తెలియదుగాని వారి ప్రేరణ ప్రకారము, నాకు తోచినది నేను చెప్పెదను. ఆడగుఱ్ఱమనగా ఇచట భగవంతుని యనుగ్రహము. తొమ్మిది యుండల లద్ది యనగా నవవిధభక్తి. అవి యేవన-1.శ్రవణము అనగా వినుట 2. కీర్తనము అనగా ప్రార్థించుట 3. స్మరణము అనగా జ్ఞప్తియందుంచుకొనుట 4. పాదసేవనము అనగా సాష్టాంగనమస్కారమొనర్చుట 5. అర్చనము అనగా పూజ 6. నమస్కారము అనగా వంగి నమస్కరించుట 7. దాస్యము అనగా సేవ 8. సఖ్యత్వము అనగా స్నేహము 9. ఆత్మనివేదనము అనగా ఆత్మను సమర్పించుట.

ఇవి నవవిధ భక్తులు. వీనిలో నేదయిన ఒక మార్గమునందు నమ్మక ముంచి నడచుకొనినయెడల భగవంతుడు సంతుష్టిజెందును. భక్తుని గృహమందు ప్రత్యక్షమగును. భక్తిలేని సాధనము లన్నియు అనగా జపము, తపము, యోగము, మత గ్రంథముల పారాయణ, వానిలోని సంగతుల నితరులకు బోధించుట యనునవి నిష్ప్రయోజనము. భక్తియే లేనిచో వేదములలోని జ్ఞానము, జ్ఞానియను గొప్ప ప్రఖ్యాతి, నామమాత్రమునకే చేయుభజన వ్యర్థము. కావలసినది ప్రేమాస్పదమయిన భక్తి మాత్రమే. నీవు కూడ ఆ వర్తకుడ ననుకొనుము. లేదా సత్యమును దెలిసికొనుటకు ప్రయత్నించుచున్న వ్యక్తి ననుకొనుము. వానివలె నవవిధభక్తులను ప్రోగు చేయుము. ఆతురతతో నుండుము. వానివలె నవవిధభక్తులను ఆచరణలో పెట్టుటకు సిద్ధముగా నుండుము. అప్పుడే నీకు మనఃస్థైర్యము శాంతి కలుగును.

ఆ మరుసటి దినము పాటంకర్ బాబాకు నమస్కరించుటకు పోగా, గుఱ్ఱపు లద్ది తొమ్మిది ఉండలను ప్రోగుచేసితివా లేదా యని ప్రశ్నించెను. అతడు తాను నిస్సహాయుడననియు ప్రప్రధమమున తనను బాబా యాశీర్వదించవలెననియు ప్రార్ధించెను. అట్లయినచో వానిని సులభముగా ప్రోగుచేయవచ్చుననెను. అప్పుడు బాబా వానిని ఓదార్చుచు శాంతిక్షేమములు కలుగునని యాశీర్వదించెను. ఇది విని పాటంకర్ యపరిమితానందభరితు డయ్యెను.

పండరీపురము ప్లీడరు

ఒక చిన్నకథతో నీ అధ్యాయమును ముగించెదము. ఆ కథ బాబా సర్వజ్ఞుడని తెలుపును. ప్రజలను సరియైన మార్గమున బెట్టుటకు, వారి తప్పులను సవరించుటకు, బాబా సర్వజ్ఞత్వము నుపయోగించుచుండెను. ఒకనాడు పండరీపురమునుండి యొక ప్లీడరు వచ్చెను. అతడు మసీదుకు పోయెను. సాయిబాబాను దర్శించెను. వారి పాదములకు నమస్కరించెను. అడుగకుండగనే దక్షిణ యిచ్చెను. జరుగుచున్న సంభాషణలు వినుట కొకమూల గూర్చుండెను. బాబా యతనివైపు ముఖము త్రిప్పి యిట్లనెను. ప్రజలెంత టక్కరులు. వారు పాదములపయి బడెదరు. దక్షిణ నిచ్చెదరు. చాటున నిందించెదరు. ఇది చిత్రము గాదా. ఈ టోపి (మాట) ప్లీడరుకు సరిపోయెను. అతడు దానిని ధరించెను. ఎవరికి గూడ ఈ విషయము బోధపడకుండెను. ప్లీడరు దీనిని గ్రహించెను గాని, యెవ్వరికి చెప్పలేదు. వాడా లోనికి వచ్చిన పిమ్మట, ప్లీడరు కాకాసాహెబు దీక్షితున కిట్లనియెను. బాబా చెప్పివదంతయు యథార్థమే. ఆ బాణము నాపయి ప్రయోగించిరి. అది నాగూర్చియే. నేనెవరిని, నిందించకూడదు, తృణీకరించరాదని బోధించుచున్నది. పండరిపురము సబ్ జడ్జియగు నూల్కర్ తన యారోగ్యాభివృద్ధి కొరకు షిరిడీకి వచ్చెను. అచ్చట మకాము చేసెను. ప్లీడర్ల విశ్రాంతిగదిలో దీనిగూర్చి వివాదము జరిగెను. సబ్ జడ్జి బాధపడుచుండెడి రోగము లేయౌషధమును సేవించక షిరిడీకి పోయిన మాత్రమున బాగు కాగలవా అని మాట్లాడుకొనిరి. సబ్ జడ్జిని వ్యాఖ్య చేసిరి. సాయి బాబాను నిందించిరి. నేనుకూడ అందు కొంత భాగమును వహించితిని. నేను చేసినది సమంజసము గాదని ఇప్పుడు సాయిబాబా నిరూపించెను. ఇది నాకు దూషణ కాదు. నాకిది యాశీర్వచనమే. ఇది నాకు ఒక ఉపదేశము. నేనికమీదట ఎవరిని దుషించరాదు. ఎవరిని నిందించరాదు. ఇతరుల విషయములో జోక్యము కలుగజేసికొనరాదు.

షిరిడీ పండరీపురమునకు మూడు వందల మైళ్ళ దూరమున నున్నది. బాబా సర్వజ్ఞుడగుటచే పండరీపురములోని ప్లీడర్ల విశ్రాంతి గదిలోనేమి జరిగెనో తెలిసికొనిరి. ఈ నడుమనున్న స్థలము, నదులు, అడవులు, పర్వతములు, వారి సర్వజ్ఞత్వమున కడ్డుపడలేదు. వారు సర్వమును జూడగలిగిరి. అందరి హృదయములలో గలదానిని చదువగలిగిరి. వారికి తెలియని రహస్య మేదియు లేదు. దగ్గర నున్నవి, దూరముగనున్నవి ప్రతివస్తువుకూడ పగటికాంతివలె వారికి తేట తెల్లము. ఎవడయిన దూరముగా గాని, దగ్గరగా గాని యుండనిమ్ము. బాబా సర్వాంతర్యామి యగుటచే వారి దృష్టినుంచి తప్పించుకొనుటకు వీలులేదు. దీనినిబట్టి ప్లీడరొక నీతిని నేర్చుకొనెను. ఒకరిని గూర్చి చెడు చెప్పరాదు. మరియు ననవసరముగ వ్యాఖ్యానము చేయరాదు. బాబా అతని దుర్గుణమును పోగొట్టి సన్మార్గమందు పెట్టెను.

ఇది యెక ప్లీడరును గూర్చినదైనప్పటికి అందరికి వర్తించును. కాబట్టి యీ కథ బోధించు నీతిని జ్ఞప్తియందుంచుకొని మేలు పొందెదము గాక.

సాయిబాబా మహిమ అగాధము, అట్లనే వారి లీలలు కూడ అట్టివే. వారి జీవితము కూడ అట్టిదే. వారు పరబ్రహ్మము యొక్క యవతారమే.
ఓం నమో శ్రీ సాయినాథాయ నమః
శాంతిః శాంతిః శాంతిః
ఇరువదియొకటవ అధ్యాయము సంపూర్ణము.

।సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు।
।శుభం భవతు।