సాయిబాబా మనలో ఉన్న
ఈర్ష్య, అసూయ, కామం, మోహం లాంటి దుర్గుణాలను పోగొట్టుకోమని పదేపదే
చెప్పేవాడు. స్వార్థం తగ్గించుకుని ఆధ్యాత్మిక చింతన పెంచుకోమని హితబోధ
చేశాడు. ప్రేమ భావాన్ని పెంచుకోమని ప్రబోధించాడు. తోటివారితో ప్రేమగా మసలుకోమని, జంతుజాలాన్ని కూడా ఆదరించమని చెప్పేవాడు.
సాయిబాబా తన వద్దకు వచ్చే భక్తులనే కాదు, చీమ, దోమ, కుక్క, పులి అన్ని
జీవరాశులనూ సమానంగా భావించేవాడు. బాబా బిక్షాటన చేసి వచ్చిన తర్వాత ఘన
పదార్ధాలను ఒక పాత్రలో, ద్రవ పదార్థాలను ఇంకో పాత్రలో ఉంచేవాడు. మనుషులు
మొదలు ఇతర జీవరాశుల వరకూ తమకు కావలసినది తినేందుకు వీలుగా ఉంచేవాడు.
కుక్కల్లాంటివి మూతి పెట్టినా అస్సలు చీదరించుకునేవాడు కాదు. అందరూ తిన్న
తర్వాత చివరికి మిగిలింది సాయిబాబా తినేవాడు.
జీవరాశులు అన్నీ సమానమే
అని చెప్పడానికి, ప్రతిదానిలో తాను ఉన్నానని చాటి చెప్పడానికి భక్తులకు
ఎన్నో నిదర్శనాలు చూపించేవాడు. సాయిబాబా ప్రతి మాట, ప్రతి చేష్ట మనిషిని,
మహా మనిషిగా తీర్చి దిద్దేందుకు ఉపయోగపడేది. ఆయన బోధనలు ఎంత ప్రబోధాత్మకంగా
ఉంటాయో, ఎంత స్పష్టంగా ఉంటాయో ఒకసారి చూడండి...
''ఏదో అవినాభావ సంబంధం
ఉంటేనే ఒకర్ని ఒకరు కలుసుకుంటారు. ప్రత్యక్ష లేదా పరోక్ష సంబంధం లేకుంటే
ఒకరి దగ్గరకు ఇంకొకరు రారు. కనుక అలా వచ్చిన వ్యక్తులు లేదా జంతువులు కానీ
మీ వద్దకు వస్తే నిర్దాక్షిణ్యంగా వాటిని తరిమివేయొద్దు. మన వద్దకు
వచ్చినవారిని ప్రేమతో ఆదరించాలి. జంతువులు అయినా అంతే. సాదరంగా దగ్గరకు
తీయాలి. కనికరం చూపించాలి. ఆప్యాయంగా ఆకలి తీర్చాలి.
తోటి వ్యక్తులను,
జంతుజాలాన్ని ఆదరించడం వల్ల మన సంపదలు ఏమీ కరిగిపోవు. దాహార్తితో
వచ్చినవారికి తాగడానికి నీళ్ళు ఇచ్చి దాహం తీర్చు. ఆకలితో ఉన్నవారికి కడుపు
నిండా భోజనం పెట్టు. కట్టుకోడానికి బట్టలు లేక అవస్త పడుతున్నవారికి
దుస్తులు ఇచ్చి ఆదుకో. అవసరమైన వారికి కాసేపు ఇంట్లోకి ఆహ్వానించి,
విశ్రాంతి పొందమని చెప్పు. ఇలా నువ్వు మానవ సేవ చేస్తే మాధవ సేవ చేసినట్లే.
నువ్వు ఇలా సహ్రుదయ౦తో ఉంటే, భగవంతుడు సంతోషిస్తాడు. నువ్వు దేవుడికి
దగ్గరైనట్లే. ఇతరులకు మేలు చేసేవారికి భగవంతుని అనుగ్రహం ఉంటుంది. తన
కరుణాకటాక్షాలను ప్రసరింపచేస్తాడు.
బంధుమిత్రులు లేదా పరిచయస్తులు
డబ్బు అవసరం ఉండి, లేదా మరేదో సహాయం కోరి నీ వద్దకు వచ్చినప్పుడు వీలైతే
సాయం చేయి. ఒకవేళ వారికి చేయి అందించడం నీకు ఇష్టం లేకుంటే, లేదా సాయం
చేయలేకపోతే చేయకు. కానీ, వారిని విసుక్కోకు. ఈసడించుకోవడం, సహించలేనివిధంగా
దుర్భాషలాడటం చేయకు. అవతలి వ్యక్తే నీతో దురుసుగా, పరుషంగా,
నొప్పించేవిధంగా మాట్లాడినా, అనవసర నిందలు వేసినా, లేనిపోని ఆరోపణలు చేసినా
ఉదారంగా ప్రవర్తించు. కఠినంగా జవాబులు చెప్పకు.
అవతలి వ్యక్తి నిందలు
మోపినప్పుడు భరించడం వల్ల నీకు వచ్చే నష్టం ఏమీ లేదు. తిరిగి నిష్ఠూరంగా
మాట్లాడ్డం వల్ల నీకు ఒనగూరే లాభమూ లేదు. అవతలి వ్యక్తి అజ్ఞానాన్ని
భరించి, ఔదార్యం చూపడంవల్ల నీకు అవ్యక్తమైన ఆనందం కలుగుతుంది. నెమ్మదిగా
ఉండు. జరుగుతున్నదంతా నాటకం అని భావించి, ఉదారంగా ఉండటం అలవాటు చేసుకో.
అహంకారాన్ని పోగుట్టుకోవాలి. ఎప్పుడైతే అహంకారం తొలగిపోతుందో, నీకు, నాకు
మధ్య అడ్డుగోడ తొలగిపోతుంది. అప్పుడు మన ఇద్దరిమీ ఒకటే అవుతాం. నీకు, నాకు
బేధం ఉండి అనుకోకు. ఆ భావమే నిన్ను నాకు దూరం చేస్తోంది. ఈ బేధ భావం నీలో
నెలకొని ఉంటే, నువ్వు, నేను ఒకటి కాలేము...''
సాయిబాబా బోధనలు చదివి వదిలేయకుండా ఆచరించే ప్రయత్నం చేద్దాం.
No comments:
Post a Comment