శరణు..శరణు..సాయి!
సమర్థ సద్గురు సాయీ! నీకు సాష్టాంగ నమస్కారం.
జీవ జంతువుల్లోనూ, జీవంలేని వస్తువుల్లోనూ నువ్వే ఉన్నావు.
పురుగు మొదలు పరబ్రహ్మ స్వరూపం వరకూ అంతా నువ్వే, అంతటా నువ్వే నిండి ఉన్నావు.
పర్వతాలు, నేల, ఆకాశం, గాలి, నీరు...అన్నిటిలోనూ నువ్వే ఉన్నావు.
సమస్త జీవరాశిలో నువ్వే వ్యాపించి ఉన్నావు.
భక్తులందరూ నీకు సమానమే.
నీకు ఇష్టమైనవి, అయిష్టమైనవి లేవు.
నిన్నే సదా స్మరిస్తూ, నీ చరణారవిందాల చెంతనే సదా నిల్చుంది 'శరణు శరణు
సాయీ!' అంటే చాలు మా కోరికలన్నీ తీరుస్తావు. మా జీవిత పరమావధిని
నెరవేరుస్తావు.
"సంసారం మహాసముద్రం. దీనిని దాటటం చాలా కష్టం. విషయ
సుఖాలనే కెరటాలు దురాలోచన అనే ఒడ్డును బలంగా తాకుతూ ధైర్యమనే వృక్షాలను
పడగొడుతూంటాయి. అహంకారమనే గాలి రయ్యిన వీస్తూ మహా సముద్రాన్ని అల్లకల్లోలం
చేస్తుంది. అలజడి రేపుతుంది. కోపం, అసూయ, ద్వేషాలనే మొసళ్లు నిర్భయంగా
సంచరిస్తూంటాయి. మరోపక్క 'నేను', 'నాది' అనే స్వార్థాల వంటి సుడిగుండాలు
గిర్రున తిరుగుతూంటాయి. మంచితనం, వివేకం అనేవి ఆ సుడిగుండంలో పడి
కొట్టుకుపోతూంటాయి. పరనింద, అసూయ, ఓర్వలేని తనం అనే చేపలు అక్కడక్కడా
తిరుగాడుతూంటాయి."
ఇలాంటి మహాసముద్రమనే సంసారాన్ని దాటటం కష్టమే అయినా,
మనకు సమర్థ సద్గురువైన సాయిబాబా అండగా ఉన్నారు. బాబా మహర్షులతో అగస్త్యుని
వంటి వారు. అంగా, వ్యామోహాలు భౌతికవాంఛలపై ఆసక్తిని నశింపచేసే వారు.
బాబా ప్రకాశాలలో సూర్యుని వంటి వారు. సూర్యుడు జ్ఞానానికి సంకేతం. బాబా తన
జ్ఞాన ప్రకాశాలతో భక్తుల మదిలో అలముకున్న అజ్ఞానపు చీకట్లను తొలగిస్తారు.
బాబా లీలలు దీపస్తంభాలు. అవి ఈ భవసాగరాన్ని సురక్షితంగా దాటించే వెలుగుదివ్వెలు.
"బాబా! మా మనసులు చెదిరిపోనివ్వకుండా స్థిరంగా ఉంచు. మేము నిన్ను తప్ప
మరేమీ కొరము. నీ ఉపదేశాలను నిత్యం ఆచరిస్తాం. నీ లీలల్ని సదా గానం చేస్తాం.
మా బుద్ధులు నీవు చూపిన దారిలో పయనించేలా చూడు" అని ప్రార్థిస్తే బాబా
మనల్ని చేయిపట్టి నడిపిస్తారు.
No comments:
Post a Comment