Pages

Thursday, August 29, 2013

షిరిడీ లో పల్లకి ఉత్సవం

షిరిడీ లో ప్రతి గురువారం రాత్రి పల్లకి ఉత్సవం జరుగుతుంది. అది చూడడానికి కన్నుల పండుగగా ఉంటుంది. శ్రీ సాయి ద్వారకామాయి నుండి బయలుదేరి చావడి వరకు ఊరేగింపుగా భక్తులతో కలసి తప్పెటలు, తాళాలు, బాజాల మ్రోతల మధ్యన పల్లకి వెనుకగా చిందులు వేస్తూ ఈ పల్లకి ఉత్సవం లో పాల్గొనేవారు. అసలీ ఉత్సవం ఎలా ప్రారంభమైందంటే, షిరిడీలో ఒకసారి భారీ వర్షాల వలన ద్వారకామాయి లోకి బాగా నీళ్ళు వరదలా వచ్చేసాయి. అంతా తడిసిపోయింది. బాబా నిద్రపోవడానికి ఏ మాత్రం పొడి జాగా లేదు. అప్పుడు భక్తులంతా బాబాను చావడికి తరలించారు. మరునాడు ఉదయం బాబా మామూలుగా ద్వారకామాయి తిరిగివచ్చారు. అప్పటినుండి బాబా రోజు విడిచి రోజు ద్వారకామాయిలోను, చావడిలోను నిద్రిస్తుండేవారు. ఇది డిశంబరు 10, 1909లో జరిగింది.
ఆరోజు నుండి బాబా ద్వారకామాయి నుండి చావడికి వెళ్ళే ఊరేగింపుని "పల్లకి ఉత్సవం" లేదా "చావడి ఉత్సవం"గా అందరు సాయి భక్తులు ప్రతి గురువారం సంప్రదాయ బద్ధంగా చేయనారంభించారు. ఈ ఉత్సవంలో మేళతాళాల మధ్య మహాశివునిలా చిందులు వేస్తూ బాబా తరలివస్తారు. బాబా పాదుకలను పల్లకీలో ఉంచుతారు. బాబాకు బహూకరించిన గుర్రం "శ్యామకర్ణ"ను అలంకరించి తెచ్చేవారు. తాత్యా, మహల్సాపతి, బాబాకు చెరొక ప్రక్క నడవగా, తదితర భక్తులంతా కలసి పల్లకి ఉత్సవంలో పాల్గొనేవారు. ఇప్పటికీ షిరిడీ లో ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. దేశ విదేశాల నుండి ప్రతి ఏటా షిర్డీ వచ్చే భక్తులు తప్పక ఈ ఉత్సవాన్ని చూసి వెళతారు

No comments: