Pages

Tuesday, September 10, 2013

సాయిబాబా ప్రబోధనలు

సాయిబాబా మనలో ఉన్న ఈర్ష్య, అసూయ, కామం, మోహం లాంటి దుర్గుణాలను పోగొట్టుకోమని పదేపదే చెప్పేవాడు. స్వార్థం తగ్గించుకుని ఆధ్యాత్మిక చింతన పెంచుకోమని హితబోధ చేశాడు. ప్రేమ భావాన్ని పెంచుకోమని ప్రబోధించాడు. తోటివారితో ప్రేమగా మసలుకోమని, జంతుజాలాన్ని కూడా ఆదరించమని చెప్పేవాడు.
సాయిబాబా తన వద్దకు వచ్చే భక్తులనే కాదు, చీమ, దోమ, కుక్క, పులి అన్ని జీవరాశులనూ సమానంగా భావించేవాడు. బాబా బిక్షాటన చేసి వచ్చిన తర్వాత ఘన పదార్ధాలను ఒక పాత్రలో, ద్రవ పదార్థాలను ఇంకో పాత్రలో ఉంచేవాడు. మనుషులు మొదలు ఇతర జీవరాశుల వరకూ తమకు కావలసినది తినేందుకు వీలుగా ఉంచేవాడు. కుక్కల్లాంటివి మూతి పెట్టినా అస్సలు చీదరించుకునేవాడు కాదు. అందరూ తిన్న తర్వాత చివరికి మిగిలింది సాయిబాబా తినేవాడు.
జీవరాశులు అన్నీ సమానమే అని చెప్పడానికి, ప్రతిదానిలో తాను ఉన్నానని చాటి చెప్పడానికి భక్తులకు ఎన్నో నిదర్శనాలు చూపించేవాడు. సాయిబాబా ప్రతి మాట, ప్రతి చేష్ట మనిషిని, మహా మనిషిగా తీర్చి దిద్దేందుకు ఉపయోగపడేది. ఆయన బోధనలు ఎంత ప్రబోధాత్మకంగా ఉంటాయో, ఎంత స్పష్టంగా ఉంటాయో ఒకసారి చూడండి...
''ఏదో అవినాభావ సంబంధం ఉంటేనే ఒకర్ని ఒకరు కలుసుకుంటారు. ప్రత్యక్ష లేదా పరోక్ష సంబంధం లేకుంటే ఒకరి దగ్గరకు ఇంకొకరు రారు. కనుక అలా వచ్చిన వ్యక్తులు లేదా జంతువులు కానీ మీ వద్దకు వస్తే నిర్దాక్షిణ్యంగా వాటిని తరిమివేయొద్దు. మన వద్దకు వచ్చినవారిని ప్రేమతో ఆదరించాలి. జంతువులు అయినా అంతే. సాదరంగా దగ్గరకు తీయాలి. కనికరం చూపించాలి. ఆప్యాయంగా ఆకలి తీర్చాలి.
తోటి వ్యక్తులను, జంతుజాలాన్ని ఆదరించడం వల్ల మన సంపదలు ఏమీ కరిగిపోవు. దాహార్తితో వచ్చినవారికి తాగడానికి నీళ్ళు ఇచ్చి దాహం తీర్చు. ఆకలితో ఉన్నవారికి కడుపు నిండా భోజనం పెట్టు. కట్టుకోడానికి బట్టలు లేక అవస్త పడుతున్నవారికి దుస్తులు ఇచ్చి ఆదుకో. అవసరమైన వారికి కాసేపు ఇంట్లోకి ఆహ్వానించి, విశ్రాంతి పొందమని చెప్పు. ఇలా నువ్వు మానవ సేవ చేస్తే మాధవ సేవ చేసినట్లే. నువ్వు ఇలా సహ్రుదయ౦తో ఉంటే, భగవంతుడు సంతోషిస్తాడు. నువ్వు దేవుడికి దగ్గరైనట్లే. ఇతరులకు మేలు చేసేవారికి భగవంతుని అనుగ్రహం ఉంటుంది. తన కరుణాకటాక్షాలను ప్రసరింపచేస్తాడు.
బంధుమిత్రులు లేదా పరిచయస్తులు డబ్బు అవసరం ఉండి, లేదా మరేదో సహాయం కోరి నీ వద్దకు వచ్చినప్పుడు వీలైతే సాయం చేయి. ఒకవేళ వారికి చేయి అందించడం నీకు ఇష్టం లేకుంటే, లేదా సాయం చేయలేకపోతే చేయకు. కానీ, వారిని విసుక్కోకు. ఈసడించుకోవడం, సహించలేనివిధంగా దుర్భాషలాడటం చేయకు. అవతలి వ్యక్తే నీతో దురుసుగా, పరుషంగా, నొప్పించేవిధంగా మాట్లాడినా, అనవసర నిందలు వేసినా, లేనిపోని ఆరోపణలు చేసినా ఉదారంగా ప్రవర్తించు. కఠినంగా జవాబులు చెప్పకు.
అవతలి వ్యక్తి నిందలు మోపినప్పుడు భరించడం వల్ల నీకు వచ్చే నష్టం ఏమీ లేదు. తిరిగి నిష్ఠూరంగా మాట్లాడ్డం వల్ల నీకు ఒనగూరే లాభమూ లేదు. అవతలి వ్యక్తి అజ్ఞానాన్ని భరించి, ఔదార్యం చూపడంవల్ల నీకు అవ్యక్తమైన ఆనందం కలుగుతుంది. నెమ్మదిగా ఉండు. జరుగుతున్నదంతా నాటకం అని భావించి, ఉదారంగా ఉండటం అలవాటు చేసుకో.
అహంకారాన్ని పోగుట్టుకోవాలి. ఎప్పుడైతే అహంకారం తొలగిపోతుందో, నీకు, నాకు మధ్య అడ్డుగోడ తొలగిపోతుంది. అప్పుడు మన ఇద్దరిమీ ఒకటే అవుతాం. నీకు, నాకు బేధం ఉండి అనుకోకు. ఆ భావమే నిన్ను నాకు దూరం చేస్తోంది. ఈ బేధ భావం నీలో నెలకొని ఉంటే, నువ్వు, నేను ఒకటి కాలేము...''
సాయిబాబా బోధనలు చదివి వదిలేయకుండా ఆచరించే ప్రయత్నం చేద్దాం.

దుఃఖాలను పోగొట్టే ద్వారకామాయి

షిర్డీలో సాయిబాబా నివాసమున్న మసీదు ద్వారకామాయి. ప్రస్తుతం ద్వారకామాయి ఫోటో ఉన్న స్థలంలో బాబా కాళ్ళు బారజాపుకుని కూర్చునేవారు. అలా కూర్చున్నప్పుడు వారి కాళ్ళు ముందున్న స్తంభం వరకూ వచ్చేపట. గురుస్థానం నుంచి బాబా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ మసీదు శిధిలావస్థలో ఉంది. బాబా ఇక్కడ ధునిని ప్రతిష్టించారు. ఇటుకలు, మట్టి రాలిపడుతూ ఉండేవి. ఇక్కడ బాబా స్నానానికి ఉపయోగించే స్నానపు రాయి ఉంది. ఇక్కడ ఉన్న బాబా చిత్రానికి చాల మహత్తు ఉంది. విల్లీపార్లేకి చెందిన శ్యాంరావు ఆర్.వి. జయకర్ ఈ చిత్రం గీశాడు. బాబా ఆశీస్సులతో ఆ పటాన్ని ఇంటికి తీసుకువెళ్ళి పూజలో పెట్టుకుందామనుకుని బాబా వద్దకు ఆ పటం తీసికెళ్ళాడు. నేను నిష్క్రమించాక ఈ పటం ద్వారా నేను నా భక్తుల శ్రేయస్సు చూస్తుంటాను. ఈ ఫోటో ఇక్కడే ఉండనీ’ అన్నారట సాయిబాబా.
అనేకమంది భక్తులు నేటికీ తాము తమ నివాసాలకు వెళ్లేందుకు బాబా అనుమతి ఇక్కడి నుంచే పొందుతారు. ఇక్కడనుంచే చాలామందికి బాబా నుంచి ఆదేశాలు అందుతుంటాయి. ఇక్కడ ఓ పక్కన బస్తాలో గోధుమలుంటాయి. బాలాజీ పాటిల్ నెవాస్కర్ అనే భక్తుడు తన పంటను బాబాకు సమర్పించి బాబాకు తనకు తిరిగి ఇచ్చిన దానితోనే కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈయన తరువాత ఆయన కొడుకు కూడా అలాగే చేసేవాడు. అతని స్మృతికి చిహ్నంగా ఓ గోధుమల బస్తాను నేటికీ అక్కడ ఉంచుతూ ఉంటారు. షిరిడీలో రెండు తిరగళ్ళు మనకు కనిపిస్తాయి. ఒకటి ఇక్కడ, మరొకటి సమాధి మందిరంలో. బాబా వీటితో గోధుమలు విసిరేవారట. మసీదులో ఓక పక్కన జ్యోతి వెలుగుతూ ఉంటుంది ఈ జ్యోతి ఉన్న స్థానంలో బాబా నీటితో దీపాలు వెలిగించారు. ఇక్కడ గల ఒక కుండలో నీటిని బాబా ఎంతోమందితో తాగించేవారు. అయినా అందులో నీరు తరిగేది కాదు. ఇప్పటికి చాలామంది భక్తులు అందులోని నీరు తాగుతారు.
ద్వారకామాయి దక్షిణం వైపు రెండు పాదాలు ఉన్నాయి. రోజూ ఆరతి అయ్యాక బాబా ఇక్కడ కొద్దిసేపు కూర్చునేవారు. ధుని నుంచి ఊదీ తీసి భక్తుల నుదుట పెట్టేవారు. ''మీకు శుభం జరుగుతుంద''ని ఆశీర్వదించేవారు. 1886లో మూడు రోజులపాటు శరీరాన్ని విడిచిపెట్టి బాబా తిరిగి వచ్చిన అద్భుత ఘటన జరిగిన స్థలమిది. అందుకు గుర్తుగా ఇక్కడ తాబేలు బొమ్మ ప్రతిష్టించారు.
శ్యాంసుందర్ అనే గుర్రాన్ని బాబా అమితంగా ప్రేమించేవారు. హారతి సమయంలో దానిని చక్కగా అలంకరించి ఇక్కడ నిలబెట్టేవారు.
భక్తులకోసం బాబా వంటచేసే సమయంలో ఇక్కడ ఉన్న గుంజకు ఆనుకుని కూర్చునేవారు. తమ గురువుకు గుర్తుగా సాయి ఇక్కడ అగ్నిని ప్రజ్వలింపచేశారు. దీనిని ధుని అంటారు. అది నేటికీ అఖండంగా వెలుగుతూనే ఉంది. దీనిలోని భస్మాన్ని ఊదీ అంటారు. ఈ ఊదీని ధరిస్తే అనారోగ్యాలు పోతాయి.
ద్వారకామాయి గురుకులం లాంటిది, ఎందరో ఇక్కడ జ్ఞానసిద్ధి పొందుతుంటారు.సాయిచరిత్ర చదివితే ఇక్కడ బాబా లీలలు ఎన్నో జరిగినట్లు తెలుసుకోవచ్చు. బాబా సమాధికి ఒక వారం రోజుల ముందు ఒక పులి సద్గతి పొందింది. 1969 దీని విగ్రహాన్ని మసీదులో ప్రతిష్టించారు. ఈ విగ్రహం పక్కనే ఉన్న రాయి మీదనే సాయంత్రం వేళ సాయిబాబా కూర్చునేవారు.
ద్వారకామాయిని దర్శించుకుంటే చాలు దుఖాలు పోయి సుఖసంతోషాలు సొంతమౌతాయి.