Pages

Saturday, August 3, 2013

శ్రీ శిరిడీ సాయి దివ్య లీలావైభవం

అఖిలాంఢకోటి బ్రహ్మాండనాయకుడు, రాజాధిరాజు, యోగిరాజు, పరిశుద్ధ పరమేశ్వర అవతారం అయినా శ్రీ సాయినాధుని లోని విశిష్ట ఏమిటంటే కల్పవృక్షం, కామధేనువు కంటే భిన్నంగా అడిగినవారికీ, అడగనివారికీ కూడా వారికి నిత్య జాగృతుడై, కావల్సినవన్నింటినీ సమకూర్చి, మొదట వారి భౌతిక అవసరాలను తీర్చి, పిమ్మట వారిని అధ్యాత్మిక మార్గంలో పయనింపజేస్తారు. అంతే కాక మొదటి నుండి వారి వెంట వుండి,వారిని దారి తప్పకుండా మార్గ దర్శి వలే నిలిచి,చివరికంటా గమ్యం చేరుస్తారు. తనకు సర్వస్య శరణాగతి చేసిన భక్తులకు ఎళ్ళవేళలా రక్షణ కవచాన్ని అందిస్తూ వారికి ముక్తిని ప్రసాదించే అతి శక్తివంతుడు, ఆర్తత్రాణ పరాయణుడు శ్రీసాయినాధులు. ఇప్పుడు ఆ మహనీయుడు చేసిన ఒక అద్భుతమైన లీలను స్మరించుకుందాం.

పూనా జిల్లా, జున్నూరు తాలూకా నారాయణ గ్రామము వాస్తవ్యుడు అయిన భీమాజీ పాటిల్ కు ఒకసారి ఉపిరితిత్తుల వ్యాధి సోకి, క్రమంగా అది క్షయగా పరిణమించింది. వైద్య విజ్ఞానం అంతగా అభివృద్ధి చెందని ఆ రోజులలో క్షయవ్యాధిని మృత్యు ద్వారంగా పరిగణించేవారు. స్వతాహాగా ధనవంతుడైన భీమాజీ ఎన్నో రకములైన మందులను వాడాడు, ఎందరో ప్రసిద్ధమైన దాక్టర్లకు చూపించాడు కాని ఆ వ్యాది ఇసుమంతైనా తగ్గలేదు. ఇక ప్రాణం మీద ఆశ వదులుకొని " ఓ భగవంతుడా నీవే నాకిక దిక్కు" అని రాత్రింబవళ్ళూ అతి దీనంగా ప్రార్ధించసాగాడు. అతని ప్రార్ధనలు ఆ సాయికి చేరాయా అన్నట్లుగా ఆ తర్వాత భీమాజి తన అనారోగ్యం వివరాలను సాయి భక్త శిఖామణి నానా చందోర్కర్ కు రాసాడు. అందుకు నానా " అన్ని వ్యాధులకు ఏకైక నివారణ సర్వస్య శరణాగతి చేసి సాయి పాదాలపై పడుటయే" అని సమాధానమిచ్చాడు. అప్పుడు భీమాజీ నానా సలహాపై అధారపడి తన బంధువుల సహాయంతో శిరిడీకి వచ్చి మశిదులో బాబా కాళ్ళపై పడి తన వ్యాధి తగ్గించమని ప్రాధేయపడ్డాడు. ఈ వ్యాధి అతని గత జన్మల ప్రారబ్ధ ఫలితమని, ఆ పాపములను అనుభవించి వాటి నుండి విముక్తి అవ్వడమే సరైన మార్గమని, అందువలన ఈ విషయంలో తాను కలుగజేసుకొనడం లేదని బాబా ఖచ్చితంగా చేప్పేసారు.ఆ మాటలకు హతాశుడైన భీమాజీ తనకు వెరే దిక్కు లేదని, సాయి కల్పించుకోకపోతే ఇక మరణమే శరణ్యమని కన్నీరు మున్నీరుగా సాయిని ప్రార్ధించాడు. అతని పరుశుద్ధమైన ప్రార్ధనకు బాబా హృదయం కరిగింది. అపుడు భీమాజీతో సాయి" ఊరుకో. నీ అతృతలను పారద్రోలుము. నీకష్టముల్లనీ గట్టెక్కే సమయం వచ్చింది. ఎంతటి బాధలునవారైనా తల్లి వంటి ఈ మశీదు మెట్లెక్కితే వారి కష్టములనీ నిష్క్రమించి సంతోషమునకు దారి తీస్తాయి. ఇచ్చటి ఫకీరు మిక్కిలి దయామయుడు. నీ రోగమును తప్పక బాగు చేయును" అని ప్రేమపూర్వక పలుకులను పలికారు. ఆ కమ్మని పలుకులతో భీమాజీకి కొండంత ఊరట కలిగినట్టయ్యింది. అప్పటి వరకూ ప్రతీ అయిదు నిమిషాలకూ రక్తం కక్కుతున్న అతను సాయి సుముఖంలో ఒక్కసారి కూడా రక్తం కక్కలేదు. సాయి వానికి నిన్ను కాపాడుతాను అని దయతో అభయం ఇచ్చినప్పటినుండి భీమాజి జబ్బు నయమవడం ఆరంభించింది. అతనిని భీమాభాయి అను వారి ఇంట వుంచమని సాయి సలహా ఇచ్చారు. ఆ ఇంటికి గాలీ, వెలుతురూ సరిగ్గా వుండక ఏమంత సౌకర్యంగా వుండదు. క్షయ రోగంతో బాధపడు వారికి ఆ ఇల్లు అసలు పనికిరాదు. కాని సాయి వాక్కు బ్రహ్మ వాక్కుతో సమానం. ఆ రాత్రి అతనికి రెండు స్వప్నములు వచ్చాయి. మొదటి స్వప్నములో భీమాజి ఒక పాఠశాల విద్యార్ధిగా వున్నాడు. టీచరు చెప్పిన పద్యములను కంఠస్తం చేయకపోవడం వలన టిచరు గారు అతడిని తీవ్రంగా దెబ్బలు కొట్టారు.రెండవ స్వప్నంలోగుర్తు తెలియని వ్యక్తులు కొందరు భీమాజి చాతిపై పెద్ద బండను వేసి కిందకూ, మీదకు తొక్కడం వలన చాతిలో నొప్పి ఎక్కువగా వచ్చి భీమాజీ తీవ్రమైన బాధను అనుభవించాడు. కలలో పడిన ఈ బాధలతో అతని జబ్బు పూర్తిగా నయమైపోయింది. కొద్ది రోజులలోనే శ్రీ సాయి యొక్క ఊదీ ప్రసాదాలను తీసుకొని ఆనందంగా తన బంధువులతో ఇంటికి తిరిగి వెళ్ళాడు. సాయినాధులు తనకు చేసిన ఈ మేలును మరువక ప్రతీ నెలా శ్రీ సాయి సత్య వ్రతం అనే వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో చేసుకోసాగాడు.

ఈ విధంగా శ్రీ సాయినాధుల తమదైన శైలిలో తన భక్తుని వ్యాధిని తగ్గించి వేసారు.సాయి తాను తన భక్తులకు చేసిన మేలుకు ప్రతిఫలముగా ఏమీ ఆశించేవారు కాదు.వార్కి కావలసింది భక్తులు తాము పొందిన మేలును గుర్తుంచుకొని తనపై అచంచలమైన నమ్మకం కలిగి వుండడమే ! తనకు సర్వస్య శరణాగతి చేసిన భీమాజీ యొక్క కిందటి జన్మలో చేసుకున్న ప్రారబ్ద కర్మలను సైతం తప్పించి,మందులు ఆపరేషన్ లు లేకుండా కేవలం స్వప్నానుభవములతో అతి దుర్లభమైన అతని వ్యాధిని తగ్గించి పరిపూర్ణ ఆరోగ్యవంతుడిని గావించి తదనంతరం సుఖవంతమైన నూతన జీవితం ప్రసాదించిన కరుణా మూర్తి శ్రీ సాయి. సాయి కరుణను, అపారమైన అనుగ్రహమును పొందాలంటే ఆడంబరమైన భజనలు, ఆర్భాటమైన పూజలు, యజ్ఞ యాగాదులు అవసరం లేదు. పరిశుద్ధమైన మనస్సు, ఇచ్చేది, పుచ్చుకునేది ఆ సాయియే అన్న ధృఢమైన నమ్మకం చాలు.
సర్వేజనా సుఖినోభవంతు
సర్వం శ్రీ సాయినాధ పాదారవిందార్పణమస్తు

శ్రీ సాయి నీళ్లతో దీపాలను వెలిగించుట :


గోదావరీ నిదీ పరీవాహక ప్రాంతమైన అహమద్ నగర్ జిల్లాలో ఒక కుగ్రామమైన శిరిడీలో ఒక పాడుబడ్ద మశీదులో స్థిర నివాసమేర్పరుచుకున్న శ్రీ సాయిబాబా నిత్యం తన మశిదులో రాత్రిళ్ళు దీపాలను వెలిగించే వారు. దీపాలని వెలిగించేందుకు అవసరమయిన నూనెను ఆ ఊరులోని షాహుకార్ల వద్ద నుండి యాచించి తెచ్చేవారు.మానవుని హృదయంలో జన్మాంతరాలుగా పేరుకొనిపోయి వున్న అజ్ఞానపు చీకట్లను పటాపంచలు చేసి, వారికి సన్మార్గం చూపేందుకే ఈ దీపాలను వెలిగిస్తున్నానని శ్రీ సాయి తన భక్తులతో తరచుగా చెప్పేవారు. ఆ గ్రామంలో బాలా భాటే అనే ఒక ఆసామికి శ్రీ సాయి యొక్క పద్ధతులు నచ్చేవి కావు, శ్రీ సాయి ఒక పిచ్చి ఫకీరని, చిన్నపాటి క్షుద్ర విద్యలను నేర్చుకొని ప్రజలను మోసం చేస్తున్నాడని భాటే ఆ ఊరి ప్రజలకు చేప్పేవాడు. పైగా మహ్మదీయుడైన సాయి మశీదులో హిందువుల ఆచార పద్ధతిలో దీపాలను వెలిగించడం హిందువుల మత విశ్వాసాలను మంటగలపడమేనని అందరినీ రెచ్చగొట్టసాగాడు. భాటే మాటలను నమ్మినా ఆ ఊరి వర్తకులు ఒకసారి కూడబలుక్కొని శ్రీ సాయికి నూనెను ఇవ్వరాదని నిశ్చయించుకున్నారు.ఆ సాయంత్రం సాయి నూనె కోసం యాచనకు వెళ్ళినప్పుడు వర్తకులందారూ మెము నూనెను ఇవ్వమని ఖచ్చితంగా చెప్పేసారు. శ్రీ సాయి ఇంకెమి బదులివ్వక, 'అల్లా అచ్చా కరెగా" అని వారిని ఆశీర్వదించి ఖాలీ చేతులతో మశీదుకు తిరిగి వెళిపోయారు. ఆ రాత్రి ఆ పిచ్చి ఫకీరు ఇక దీపాలను ఎలా వెలిగిస్తాడో చూద్దామని భాటేతొ కలిసి వర్తకులందరూ మశిదుకు వెళ్ళి దూరంగా దాక్కోని జరిగే తతంగాన్నంతటినీ వేడుకగా చూడసాగారు. రాత్రి అయ్యాక, శ్రీ సాయి కొద్దిపాటి నూనె చుక్కలున్న ఆ తంబిరేలు డబ్బాలో నీళ్ళను పోసి, ఆ నీటినంతటినీ తాగేసి తిరిగి ఆ డబ్బాలోకి వొంపేసారు. ఈ విధంగా నూనె చుక్కలతో కలిసిన ఆ నీళ్లను తన నోటితో పావనం చేసాక ఆ నీటిని ప్రమిదలలో పోసి వెలిగించగా ఆశ్చర్యాలలో కెల్లా ఆశ్చర్యంగా ప్రమిదలన్నీ మరింత ఎక్కువ కాంతితో తెల్లవార్లూ అద్భుతంగా వెలిగాయి.ఈ వింతను చూసిన ఆ వర్తకుల అజ్ఞానం నశించింది.శ్రీ సాయి సామాన్యుడు కాదని, ఒక గొప్ప యోగియని వారికి అప్పుడు అవగతం అయ్యింది. శ్రీ సాయి సాక్షాత్ భగవత్స్వరూపుడు కాకపోతే తన శక్తితో నీళ్ళను నూనెగా మార్చివెయగలుగుతారా ?సాధారణ యోగులకు ఇది సాధ్యమా ?పశ్చాతాపంతో వర్తకులందారూ శ్రీ సాయి పాదాలపై పడి క్షమించమని వేడుకున్నారు. దయామయుడైన సాయి ఆ వర్తకులను క్షమించి అప్పుడు ఒక అపూర్వమైన బోధ చేసారు" నాయనలారా ! అసత్యమంటే ఆ భగవంతునికి గిట్టదు.ఎల్లఫ్ఫుడూ సత్యాన్నే అంటి పెట్టుకొని వుంటే అది మనల్ని తప్పక రక్షిస్తుంది.ఇతరులను బాధ పెట్టి వేడుక చూడాలని ఎన్నడూ ప్రయత్నించవద్దు.ఇతరులకు పంచి ఇచ్చిన ఐశ్వర్యం వంద రెట్లు అయ్యి తిరిగి వచ్చినట్లే ఇతరులను మనము పెట్టి బాధలు వెయ్యింతలై మన వద్దకే తిరిగి వస్తాయి. ఎన్నడూ చెప్పుడు మాటలను విన్నవద్దు.అవి మనల్ని అధోగతి పాలు చేస్తాయి, మనకు ఏం కావాలన్నా, ఏం తెలుసుకోవాలన్నా ఆ భవవంతుడినే అడిగి తెలుసుకోవాలి"


పరిశుద్ధ పరబ్రహ్మ అవతారమైన శ్రీ సాయినాధుని అమృత పలుకులను మనసారా వంటపట్టించుకున్న ఆ వర్తకులందరూ సాయి ఆశీర్వాదములను తీసుకొని సంతోషంగా తమ తమ ఇళ్ళకు తిరిగి వెళ్ళారు.

Guru Pournima 2013 Celebrations at Sai Sansthan, Shirdi

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

World's Largest 116ft Shirdi Sai Baba Statue at Sri Sai Baba Mandir, Repur, Kakinada. East Godavari Dist.

116' 0" feet Viswavirat Sri Shiridi Sai Baba Statue Constructed At Repur Village (Kakinada)


This is the worlds largest Saibaba Statue